YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 30 August 2012

సీఐడీ దర్యాప్తు అవసరమా?

* ప్రాథమిక ఆధారాలను చూస్తే సీఐడీ వంటి సంస్థ దర్యాప్తు చేయాల్సిన కేసు కాదు
* కాల్‌లిస్ట్ పొందటమనేది పెద్ద నేరమేమీ కాదు.. నేరమని ఐటీ చట్టంలో ఎక్కడా లేదు
* కాల్‌లిస్టు బహిర్గతమైనంత మాత్రాన నిబద్ధత కలిగిన అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినదు
* తన హక్కులకు భంగం వాటిల్లితే సీబీఐ జేడీ పరువు నష్టం దావా వేయవచ్చు
* ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ కాల్‌లిస్ట్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న ఇద్దరితో పాటు, ఆయన సహాధ్యాయి చంద్రబాల కేసులో ఒకరికి హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ పొందిన వారిలో నాచారం సీఐ శ్రీనివాసరావు, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి హనుమంతరావు, మిక్ ఎలక్ట్రానిక్స్ ఎండీ ఎం.రమణరావులు ఉన్నారు. వీరందరూ సెప్టెంబర్ 13 లోపు ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. లొంగిపోయిన తరువాత ఒక్కొక్కరు పది వేల రూపాయల పూచీకత్తులు సమర్పించాలని, దీని ఆధారంగా వారికి బెయిల్ మంజూరు చేయాలని కింది కోర్టును ఆదేశించారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ఉత్తర్వులు జారీ చేశారు.

కాల్‌లిస్ట్ వ్యవహారంలో కింది కోర్టు తమకు ముందస్తు బెయిల్ తిరస్కరించటంతో వారు కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను గురువారం జస్టిస్ గోవిందరాజులు విచారించారు. మొదట పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తరువాత పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ వంటి ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థకు జాయింట్ డెరైక్టర్‌గా ఉన్న వి.వి.లక్ష్మీనారాయణ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. కాల్‌లిస్ట్‌ను బహిర్గతం చేయటం ద్వారా లక్ష్మీనారాయణ వంటి అధికారులు నైతిక స్థైర్యం కోల్పోతారని, అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో ఆయన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిందని పీపీ వివరించారు. అందువల్లే ఈ కేసు విచారణను సీఐడీ చేపట్టిందని తెలిపారు. 

ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘కాల్‌లిస్ట్‌ను బహిర్గతం చేసి, దాని ఆధారంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం వల్ల నిబద్ధత కలిగిన అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని నేను భావించడం లేదు. అతని వ్యక్తిగత హక్కులకు కొంత మేర భంగం కలిగి ఉండొచ్చు. అయితే అందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించిన వారిపై లక్ష్మీనారాయణ పరువునష్టం దావా దాఖలు చేసుకోవచ్చు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఈ కేసు సీఐడీ వంటి సంస్థ దర్యాప్తు చేయాల్సినంతది మాత్రం కాదు. ఇంతకంటే తీవ్రమైన కేసులున్నాయి. ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసులూ ఉన్నాయి. 

వాటన్నింటినీ పక్కన పెట్టి సీఐడీ ఇటువంటి కేసులో దర్యాప్తు చేస్తుండటం సరికాదు. పోలీసు విభాగంలో సీఐడీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇటువంటి కేసులను దర్యాప్తు చేయడం ద్వారా దాని విలువను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సందర్భంలో నాకు ఓ పాత సామెత గుర్తుకొస్తోంది. గతంలో కొత్వాల్ (పోలీస్) ఎక్కడంటే కుక్కను వెతకడానికి వెళ్లాడట..! ప్రస్తుత కేసులో కూడా సీఐడీ పరిస్థితి అలానే ఉంది. కాల్‌లిస్ట్ పొందడమనేది పెద్ద నేరమేమీ కాదు. ఐటీ చట్టం అమలులోకి రావడం వల్ల కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కాల్‌లిస్ట్ పొందడం నేరమని ఎక్కడా లేదు’ అని వ్యాఖ్యానించారు. 

‘పిటిషనర్లు దర్యాప్తుకు పూర్తిగా సహకరించారని వారి తరఫు సీనియర్ న్యాయవాదులు చెప్తున్నారు. దర్యాప్తు కూడా పూర్తయింది. కేవలం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుంచి నివేదిక మాత్రమే రావాల్సింది. పిటిషనర్లు సాక్ష్యాలను తారుమారు చేస్తారనే భయాందోళనలు ఎవరికీ లేవు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నా’ అని జస్టిస్ గోవిందరాజులు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!