YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 26 August 2012

వైఎస్ కళ్లలోకి చూడగలరా?

మరణించిన వైఎస్ జవాబు చెప్పుకోలేరనే అలా మాట్లాడుతున్నారు 
కథలు అల్లించి ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు 
నాడు వైఎస్ కేబినెట్ భేటీల్లో మంత్రులు ఎందుకు మాట్లాడలేదు?
ఆ 26 జీవోలూ సక్రమమా అక్రమమా అని ఈ సర్కారు తేల్చదెందుకు? 
సక్రమం అంటే జగన్‌కు మేలు, అక్రమం అంటే సర్కారుకు చేటు అనే కదా! 
వైఎస్ మరణించిన తర్వాత మూడేళ్లుగా పాలన అస్తవ్యస్తంగా మారింది 
వర్షాల్లేవు, విత్తనాల్లేవు, కరెంటు లేదు.. ఎవరూ సంతోషంగా లేరు 
సర్కారు మొద్దునిద్ర వదిలేలా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి
రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో ప్రారంభమైన ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమంలో విజయమ్మ పిలుపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని విమర్శిస్తున్న మంత్రులు.. వైఎస్ సజీవంగా వచ్చి వారి ఎదుట నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ప్రశ్నించారు. మరణించిన వైఎస్ తిరిగి వచ్చి జవాబు చెప్పుకోలేరు కనుక ఆయన మీద చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినా జగన్‌ను జైలుకు పంపినా వైఎస్ ఫొటో లేకుండా చేసినా ఏమీ మాట్లాడని మంత్రులు.. ఇపుడు వైఎస్‌ను ఉద్దేశించి తలో రకంగా మాట్లాడుతున్నారని బాధపడ్డారు. 

‘‘ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. రకరకాల కథలు అల్లిస్తూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఒక మంత్రి అంటున్నారు.. ఆయనకు కనుక పోలీసు ప్రొటెక్షన్ ఇస్తే వైఎస్ హయాంలో జరిగినవన్నీ చెబుతారట! ఇంకొక మంత్రి అంటున్నారు.. తనను క్యాంపు ఆఫీసుకు పిలిపించి తనతో సంతకం చేయించారని! ఇంకొకరైతే తాను హాస్పిటల్‌లో ఉంటే అక్కడికి ఫైలు పంపించి సంతకాలు తీసుకున్నారని చెప్తున్నారు! ఇంకొకరేమో కేబినెట్ నిర్ణయాలన్నీ సమష్టిగా చేసినవేనని.. అందులో ఏమీ లేదు గానీ తెర వెనుక ఏదో బాగోతం నడిచిందని.. అది వారికి తెలియనే తెలియదని అంటున్నారు! ఇంకొకరైతే కేబినెట్ సమావేశాల్లో ఓ రకమైన చర్చ జరిపారనీ ఫైల్లో మాత్రం మరో విధంగా ఉందని అంటున్నారు. ఇంకొకాయన రాజశేఖరరెడ్డిగారు చాలా పవర్ ఫుల్ అని.. ఆయన ముందర ఏమీ మాట్లాడలేక పోయామని చెప్తున్నారు!’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో ఆదివారం ‘గడపగడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. 

ఈ మంత్రులు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? 

ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి నాలుగు సార్లే మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తోందని.. అదే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నెలకు రెండు సార్లు కేబినెట్ సమావేశాలు జరిగేవని గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో సంక్షేమ పథకాలు, జలయజ్ఞం వంటి అంశాలతో వైఎస్ అధికారులను పరుగులు పెట్టించేవారని పేర్కొన్నారు. అలాంటపుడు మంత్రులు ఈ విషయాలపై ఎందుకు ప్రశ్నించలేకపోయారని ఆమె నిలదీశారు. ‘‘ఆ రోజు ఈ మంత్రులు కేబినెట్‌లో ఎందుకు మాట్లాడలేక పోయారు? ఏం చేస్తా ఉన్నారు? ఏం చూస్తా ఉన్నారో వారికే తెలియాలి. అపుడు ఏమీ మాట్లాడని వారు ఇపుడిలా మాట్లాడతుంటే మనసుకు చాలా కష్టం కలుగుతోంది. భాధ అనిపిస్తోంది. వైఎస్ సజీవంగా వచ్చి వారి ముందర నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా వీరు చూడగలరా?’’ అని ఆమె ప్రశ్నించారు. 

ఆ జీవోలు సక్రమమా.. అక్రమమా.. చెప్పరేం?: అసలు అప్పట్లో జారీ అయిన 26 జీవోలు సక్రమమా, అక్రమమా అనేది ప్రభుత్వం ఇంత వరకూ చెప్పటం లేదని విజయమ్మ ప్రస్తావించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని గుర్తుచేశారు. ‘‘జీవోలు సక్రమమని చెప్తే జగన్‌మోహన్‌రెడ్డికి మేలు జరుగుతుంది. అక్రమమని చెప్తే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది.. అందుకే సమాధానం చెప్పటం లేదు’’ అని ఆమె కుండబద్దలు కొట్టారు. ‘‘అసలు జగన్‌కు ఏం సంబంధం..? ఆయన అపుడేమైనా ఎమ్మెల్యేనా? ఎంపీగా ఉన్నారా? మంత్రిగా పనిచేశారా? లేక అధికారిగా ఏమైనా ఉన్నారా?’’ అని ఆమె నిలదీశారు. జగన్‌ను విచారణ కోసమని పిలిచి సీబీఐ అన్యాయంగా జైల్లో పెట్టి ఇప్పటికి 90 రోజులైందని ఆమె ఆవేదనగా చెప్పారు. జగన్‌బాబును టార్గెట్ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు కోర్టుల్లో కేసులు వేసిన దరిమిలా జీవోల విషయమై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి ఉంటే మంత్రులకు ఈ దుర్గతి పట్టి ఉండేదే కాదన్నా రు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ కుమ్మక్కయి వైఎస్‌నూ జగన్‌నూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో తిట్టటమే పనిగా పెట్టుకున్నాయని విజయమ్మ విమర్శించారు.

వైఎస్ తర్వాత పాలన అస్తవ్యస్తం...: వైఎస్ ప్రజల మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత మూడేళ్లుగా పరిపాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడటం లేదనీ పడినా విత్తనాలు లభించడం లేదనీ ఎరువుల ధరలు 300 శాతం పెరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ పేర్కొన్నారు. ఇక కరెంటు విషయానికి వస్తే ప్రభుత్వమే గ్రామాల్లో 12 గంటలు కోత అని అధికారికంగా ప్రకటించిందనీ దాంతో రెండు మూడు గంటలు కూడా సరఫరా కావడం లేదన్నారు. దారుణమైన పరిస్థితి కారణంగా ఒక్క పులివెందులలోనే 500 కోట్ల రూపాయల మేరకు చీనీ తోటలకు నష్టం వాటిల్లిందని.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరెంత నష్టం జరిగిందోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు వారానికి మూడు రోజులు విద్యుత్ కోత విధించిన కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయని.. 20 లక్షల మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఏ వర్గమూ సంతోషంగా లేదు.. : ప్రస్తుతప్రభుత్వ పాలనలో ప్రజల్లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని విజయమ్మ పేర్కొన్నారు. ‘‘ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మారింది.. ఫీజుల రీయింబర్స్‌మెంటు పథకం ఉంటుందో లేదో తెలియదు... 2009 ఎన్నికల్లో వైఎస్ ఇచ్చింది రెండు హామీలే! ఒక్కొక్కరికి ఇపుడిస్తున్న నాలుగు కేజీల బియ్యం నుంచి ఆరు కేజీలు ఇస్తామని.. వ్యవసాయానికి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు విద్యుత్ సరఫరా చేస్తామని.. చెప్పారు. ఈ రెండు హామీలనూ ప్రస్తుత ప్రభుత్వం విస్మరించింది’’ అని దుయ్యబట్టారు. 

ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి..: వైఎస్ పాలించిన ఐదేళ్ల మూడు నెలల కాలం సువర్ణయుగమని.. మళ్లీ అలాంటి పాలన తెచ్చుకునేందుకు పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపటానికి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని.. ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకునే వరకూ కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాదని.. ఇది మానవతావాద పార్టీ అని ఆమె స్పష్టంచేశారు. వైఎస్ ఏ విధంగానైతే సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చూసి ముందుకు తీసుకెళ్లారో తమ పార్టీ కూడా అదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ సభలో విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఆయన అనుచరులతో సహా చేరారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, రోజా, రాజ్‌సింగ్‌ఠాకూర్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, బి.జనక్‌ప్రసాద్, పుత్తా ప్రతాపరెడ్డి, కొల్లి నిర్మలాకుమారి, ఎం.మారెప్ప, డి.రవీంద్రనాయక్ సహా పలువురు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!