విశాఖపట్నం, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి బాసటగా నిలిచారు. ఆ కుటుంబంపై కక్ష సాధింపులకు నిరసనగా ఇప్పటికే ఏలూరు, బొబ్బిలి ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, సుజయకృష్ణ రంగారావులు తమ సంఘీభావాన్ని తెలిపారు. వీరిలో రంగారావు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించారు. తాజాగా విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలు కూడా వీరికి జతకలిశారు. గురువారం పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసి వారు తమ మద్దతు తెలియజేశారు.
తన సతీమణి మహాలక్ష్మితో సహా వచ్చిన చంద్రశేఖరరెడ్డి.. కోటవురట్ల సభను ముగించుకుని వస్తున్న విజయమ్మను ఎస్.రాయవరం మండలం దార్లపూడి సమీపంలో కలుసుకుని తాము అండగా ఉంటామని చెప్పారు. అనంతరం విజయమ్మ కాన్వాయ్ పెద గుమ్ములూరు గ్రామంలోకి ప్రవేశించే సమయానికి పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి, బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు ఎదురేగి వచ్చారు. జయమణి కూడా వైఎస్సార్ కుటుంబానికి తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు.
రెండ్రోజుల్లో నిర్ణయం: ద్వారంపూడి
‘వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఎమ్మెల్యే అయ్యాను. ఇన్నాళ్లూ ఆ కుటుంబంపై జరుగుతున్న కక్ష సాధింపులను ఓర్చుకున్నాం. జగన్‌ను జైలుకు పంపడంతో మనసుకు చాలా బాధ కలిగింది. కష్టాల్లో వున్న జగన్‌కు మద్దతు తెలపడం బాధ్యతగా భావిస్తున్నాను. వైఎస్ కుటుంబానికి అండగా వుండాలని సంఘీభావం తెలపడానికి వచ్చాం. రెండ్రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై వారి నిర్ణయాన్ని శిరసా వహిస్తా’
కక్ష సాధింపు చర్యలపై ఆవేదన చెందుతున్నా: జయమణి
‘వైఎస్ నాకు టికెటిచ్చారు. ఆయన వల్లే గెలిచాను. ఆయనంటే మాకెంతో గౌరవం, అభిమానం. వైఎస్ కుటుంబంపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు సాటి మహిళగా ఆవేదన చెందుతున్నాను. వైఎస్ సతీమణి విజయమ్మకు సంఘీభావం తెలపడానికి ఇక్కడకు వచ్చాను.’
మరింత మంది ఎమ్మెల్యేలు వస్తారు: రంగారావు
‘వైఎస్ జగన్ అరెస్టు కక్ష సాధింపు అన్న భావన చాలా మంది ఎమ్మెల్యేల్లో ఉంది. కొందరు బయటకు వచ్చారు. మరికొందరు బయట పడకుండా మనసులో ఆవేదన చెందుతున్నారు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు జగన్‌కు సంఘీభావం తెలపడానికి సిద్ధంగా వున్నారు’.
No comments:
Post a Comment