YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 30 May 2012

వైఎస్ విజయమ్మ రోడ్‌షోలకు ఉప్పెనలా తరలివచ్చిన జనం

* వైఎస్ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ కుట్రలకు నిరసనగా పోటెత్తిన అభిమానం
* ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. మీకు మేమున్నామని ధైర్యం చెప్పిన నరసన్నపేట, పాయకరావుపేట ప్రజలు
* తొలిసారిగా ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి దిగినా కాంగ్రెస్, టీడీపీ కుట్రలను సూటిగా ఎండగట్టిన విజయమ్మ
* వైఎస్సార్ కాంగ్రెస్‌తోనే సంక్షేమ రాజ్యం సాధ్యమని భరోసా
* రాష్ట్ర రాజకీయాల్ని మార్చాలని ప్రజలకు పిలుపు
* మీ రాజన్న బిడ్డను.. జగనన్న చెల్లెల్ని అంటూ ఆకట్టుకున్న షర్మిల

శ్రీకాకుళం, విశాఖపట్నం, న్యూస్‌లైన్ ప్రతినిధులు: నరసన్నపేట, పాయకరావుపేట.. బుధవారం ఈ రెండు నియోజకవర్గాల ప్రజలూ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపారు. జనమే నా గమనమంటూ రేయింబవళ్లూ ఎండనక, వాననక ప్రజల మధ్యే తిరుగుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ జనమంతా ఉప్పెనలా వీధుల్లోకి పోటెత్తారు. ప్రజలు అభిమానించే భర్త హఠాన్మరణం.. ఫిక్సింగ్ కుట్రలతో తనయుడి దిగ్బంధం.. ఆ బాధలన్నీ దిగమింగుకుని ప్రజల ముందుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మకు నరసన్నపేట, పాయకరావుపేట ప్రజలు బ్రహ్మరథం పట్టి.. కాంగ్రెస్, తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలను నిట్టనిలువునా ఎండగట్టారు. 

తొమ్మిది నెలలుగా దర్యాప్తు జరుగుతున్నా ఏనాడూ పిలిచి విచారించని సీబీఐ.. ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను విచారణకు పిలవడం.. మరుసటి రోజు ఆయన కోర్టులో హాజరుకావాల్సి ఉన్నా అరెస్టు చేయడం.. ఆయన్ను ఎన్నికల ప్రచారానికి దూరం చేయడానికేనన్న విషయం తమకు తెలుసని నినదించారు. కుయుక్తులు, కుతంత్రాలతో ఉప ఎన్నికలను ఏకపక్షంగా జరిపించేసుకోవాలన్న అధికారపక్ష ఎత్తుగడలకు.. కుమ్మక్కు రాజకీయాలతో ఓట్లు దండుకోవాలనుకున్న ప్రధాన ప్రతిపక్షానికీ కనువిప్పు కలిగించేలా కదం తొక్కారు. కనుచూపు మేర నేల కనిపించని రీతిలో తరలివచ్చిన జన ప్రవాహాన్ని చూసి.. అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం గుండెల్లో వణుకు మొదలైంది.

విశాఖలో ఘన స్వాగతం
రైతుల కోసం పదవులు వదులుకున్న వైఎస్ అభిమాన నేతల గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్న తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధంతో ఆ బాధ్యతను వైఎస్ విజయమ్మ తీసుకున్నారు. కుమార్తె షర్మిల తోడు రాగా, అశేష ప్రజలు వెన్నంటి నిలవగా తొలిసారి ఆమె ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టారు. తొలుత శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట రోడ్‌షోలో పాల్గొనేందుకు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వందలాది బైకులతో హోరెత్తించారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున దారి పొడవునా నిలిచి స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ఎత్తున జనం తరలిరాగా ఎన్ ఏడీ కూడలిలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి విజయమ్మ, షర్మిల పూల మాలలు వేసి నివాళులర్పించారు. షర్మిల తన తండ్రి విగ్రహాన్ని తాకుతూ, బుగ్గలు నిమురుతూ ముద్దుపెట్టుకోవడం జనాలను కంటతడి పెట్టించింది. ఇక్కడి నుంచి ఇద్దరూ రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయలుదేరారు.

దారి పొడవునా.. బారులు తీరి
నరసన్నపేట నియోజకవర్గ ముఖద్వారమైన మడపాం వద్దకు ఉదయం 11.35 గంటలకు చేరుకున్న విజయమ్మకు వేలాదిమంది ప్రజలు, పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. జాతీయ రహదారికి ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. మడపాంలోనే విజయమ్మ ప్రచార రథాన్ని అధిరోహించి రోడ్‌షో ప్రారంభించారు. కుమార్తె షర్మిలతో కలసి ఆమె వాహనంపైభాగానికి చేరుకోగానే హర్షధ్వానాలతో ఆ ప్రాం తం మార్మోగిపోయింది. మడపాం నుంచి పది కి.మీ. దూరంలోనే ఉన్న నరసన్నపేటకు చేరుకోవడానికి గంటన్నరకుపైగా సమ యం పట్టిందంటే రోడ్‌షోకు ఏ స్థాయిలో జనం తరలివచ్చా రో అర్థమవుతుంది. 

దారి పొడవునా భారీ సంఖ్యలో జనం బారులు తీరి తమ ఆత్మీయ నేతను తనివితీరా చూశారు. మేడలు, మిద్దెలపై వేలాదిగా చేరి జయజయ ధ్వానాలు చేశారు. చుట్టూ ఎటు చూసినా జనం తప్ప మరేమీ కనిపించని అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక విజయమ్మ నరసన్నపేటలో అడుగుపెట్టే సమయానికి ఎదురుగా జనసముద్రం కనిపించింది. అప్పటికే మధ్యాహ్నం ఒంటిగంట దాటినప్పటికీ ఏ ఒక్కరూ వెనుదిరగలేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా తరలివచ్చారు. సభ ముగిసిన తరువాత నరసన్నపేట నుంచి పోలాకి మండలం మబగాం వరకు పది కిలోమీటర్ల పొడవునా ఇదే దృశ్యం కనిపించింది. చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ విజయమ్మ రోడ్‌షో కొనసాగించారు.

వేధింపులను కళ్లకు కట్టి
ప్రభుత్వ దుర్నీతిని విజయమ్మ తన ప్రచారంలో సూటిగా ఎండగట్టారు. జగన్‌ను వేధిస్తున్న తీరును ప్రజల కళ్లకు కట్టారు. ఉప ఎన్నికల తో దుష్ట రాజకీయాలను తుదముట్టించాల్సిన ఆవశ్యకతను చాటారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంతగా తపిస్తోందో వివరించారు. పార్టీ శ్రేణుల్లో మనోస్థైర్యాన్ని నింపారు. ఒక్క మాటలో చెప్పాలంటే సీబీఐని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుట్రను ఒక్క దెబ్బతో ఛేదించారు. 

పాయకరావుపేటలోనూ అదే జనహోరు
నరసన్నపేటలో రోడ్‌షో ముగించుకుని సాయంత్రానికల్లా విశాఖజిల్లా పాయకరావుపేట చేరుకోవాల్సిన విజయమ్మ.. దారిపొడవునా పోటెత్తిన ప్రజాభిమానం కారణంగా రాత్రి 8 గంటలకుగాని చేరుకోలేకపోయారు. నరసన్నపేట దృశ్యమే పాయకరావుపేటలోనూ పునరావృతమైంది. అప్పటికే మూడు గంటల నుంచి కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్న వేలాది మంది తల్లీ కూతుళ్ల రాకతో తన్మయత్వానికి లోనయ్యారు. 

పాయకరావుపేట చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో వీధుల్లోకొచ్చి.. వైఎస్ విజయమ్మకు, ఆమె కుమార్తె షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గతంలో దివంగత మహానేత రాజశేఖరరెడ్డి, ఇటీవల జగన్ పాయకరావుపేట పర్యటనలకు వచ్చినప్పుడూ మంచి ఆదరణే లభించింది. అయితే అంతకు మించి అనూహ్యంగా బుధవారం విజయమ్మ సభకు అశేష జనవాహని తరలివచ్చి.. జగన్‌మోహన్‌రెడ్డిపై జరుగుతున్న కుట్రలను ఎండగట్టింది. జనతరంగంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇలా వచ్చిన జనంతో సభా వేదిక ఇటు కిలోమీటరు, అటు కిలోమీటరు పొడవునా కిక్కిరిసిపోయింది. 

నేడు కోట ఉరట్ల..తర్వాత రామచంద్రపురం
పాయకరావుపేట సభ అనంతరం విజయమ్మ కోట ఉరట్ల మండలం బి.కె.పల్లి వె ళ్లారు. అక్కడ రాత్రి బస చేశారు. గురువారం ఉదయం అదే మండలంలో ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం రామచంద్రపురం బయల్దేరి వెళ్తారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!