YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 30 May 2012

పాలకుల ‘చేతి’లో పనిముట్టు!

‘‘పని చేతగాని వాడు తన చేతగాని తనా నికి పనిముట్లను నిందిస్తాడు. యువకు లుగా ఉద్యోగంలో చేరిన నాటి నుంచీ మాకిచ్చే శిక్షణలో నేర్పింది ఏమిటంటే... ఎవరో ఒకరిని బలిగొంటూవుండాలి. కాబట్టి బలిపశువుల కోసం వెతుకుతుం డటం మాకు నిత్యకృత్యం! మేం చేసే తప్పులను, ఘోరాలను, దురదృష్టకర ఘట్టాలను వాటితో సంబంధం లేని వాళ్ల పైకి, అమాయకులపైకి నెట్టడం. ఇదే మాకిచ్చే శిక్షణ సారాంశం’’.
-ఒక విశ్రాంత పోలీసు అధికారి ఉవాచ

‘నలచంపువు’లో ఓ శ్లోకం ఉంది. దానర్థం - ‘విశ్వాన్నంతా భరించే భూమికే పర్వతాల భారం తెలుస్తుంది’’!
అలాగే పన్నులనూ, తన్నులనూ భరించే ప్రజాబాహుళ్యానికే రాజ్యపాలనా విధానాల, ప్రభుత్వ అకృత్యాల, ఆగడాల భారం తెలు స్తుంది! పాలకుడికి ప్రతికూలంగా ఉండే వారెప్పుడూ సుఖంగా ఉండలేరట! అందుకే, భృత్యులు, వందిమాగధులు, డూడూ బస వన్నలు లేకుండా పాలకులూ, పాలకులు లేకుండా భృత్యులూ మనుగడ సాగించలేరు! అన్నట్టు కొలది రోజులనాడే (12-5-2012), దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐకి 1998 దాకా డెరైక్టర్‌గా పనిచేసి విశ్రాంత ఉన్నతాధికారిగా ఉన్న జోగీందర్‌సింగ్ తన అనుభవాలను నెమరువేసుకుంటూ సీబీఐ పనితీరుపై ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తిగొలిపే అంశాలు బయటపెట్టారు. ‘‘సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ప్రధానమంత్రి కార్యాలయం, లేదా హోంశాఖ చెప్పినట్టు చేయాలి. కానీ ఆ సలహాల్లో కూడా నిలకడ ఉండదు. సీబీఐ తరచు నిందలపాలవడానికి ఇదో కారణం. సీబీఐపై అనేకానేక ఆరోపణలు వెల్లువెత్తు తున్న దృష్ట్యా ఆ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి విధిగా ఉండాలి...’’ అన్నది ఆ ఇంటర్వ్యూ సారాంశం.


జోగీందర్‌సింగ్ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ప్రధాన సంచాలకుడుగా పనిచేసి ఉన్నందున, ఆయన అభిప్రాయాల్ని తేలిగ్గా ఎవరూ కొట్టివేయడానికి లేదు. ఎందుకంటే, ఆయన చేసిన ఫిర్యాదుల్లో ఎక్కువ పాళ్లు స్వానుభవం నుంచి రూపుదిద్దుకున్నవే. నిజానికి అత్యంత శక్తిసామర్థ్యాలు గలవారే ఈ సంస్థలోకి రిక్రూట్ అవుతుంటారు. కానీ ఈ సంస్థ కేంద్ర విజిలెన్స్ కమిషన్ లాగా, కేంద్ర ఎన్నికల సంఘం లాగా స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ కాదు. స్వతంత్రంగా దర్యాప్తు చేసి నిర్భయంగా తన విచారణ ఫలితాల్ని వెల్లడించగల స్వేచ్ఛ ఉన్న సంస్థ కూడా కాదు. అందుకే అనేక సందర్భాల్లో శక్తియుక్తులు, విచక్షణాజ్ఞానం గల ఉన్నతాధికారులు ఉండి కూడా ప్రయోజనం ఉండటం లేదు. 

కేంద్ర పాలనా పగ్గాలు ఏ రాజకీయపక్షం లేదా ఏ సంకీర్ణ ప్రభుత్వం చేతుల్లో ఉంటాయో, ఆ రాజకీయపక్షం స్వార్థ ప్రయోజనాలను కాపాడే సంస్థగా సీబీఐ పావు కావలసివస్తోంది. మొన్నటి బీజేపీ-ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం గానీ, నేటి కాంగ్రెస్-యూపీఏ సంకీర్ణ సర్కార్ గానీ ఇందుకు మినహాయింపు కాదు! ఉభయపక్షాలూ ఆ సంస్థను రాజకీయ స్వప్రయోజనాల కోసమే కాక, ప్రత్యర్థులను పట్టిపల్లార్చే నేర మనస్తత్వంతో ప్రతిపక్ష నాయకుల విజయావ కాశాల్ని దెబ్బతీయడం కోసం కూడా వాడుకున్నాయి. 
అది 1998. ఢిల్లీలో జోగీందర్‌సింగ్‌ను కలుసుకుని పది నిమిషాలు ముచ్చ టించే అవకాశం నాకు కలిగింది. కేంద్రపాలకులు సీబీఐని వాడుకునే తీరుపై కొంత చర్చ జరిగింది. అప్పటికి కొద్ది మాసాల ముందు ఆయన రిటైర్ అయ్యారు. అదే సందర్భంలో బీజేపీ హయాంలో ‘పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదదాడి’ గురించిన పూర్వాపరాల ప్రస్తావన కూడా వచ్చింది.

అది వేరే గాథ అనుకోండి! బీజేపీ హయాంలో అదొక సిగ్గుచేటైన సంఘటన. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తలెత్తిన ‘జైన్-హవాలా’ కేసులో సీబీఐ విచారణ తీరును పసికట్టిన సుప్రీంకోర్టు, సీబీఐ కేంద్ర పాల కులకు కాకుండా తనకు బాధ్యత వహించాలని ఆదేశించవలసి వచ్చింది. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టడం కోసమే ఆనాడు సుప్రీంకోర్టు ఆ విధంగా ఆదే శించిందన్నది సుస్పష్టం. రాజ్యాంగం ప్రసాదించిన ‘న్యాయస్థానాల స్వతంత్ర ప్రతిపత్తి’ని దెబ్బతీసే విధంగా పాలనావ్యవస్థ రాజ్యాంగ పరిధుల్ని అతిక్రమిం చి తరచూ జోక్యం చేసుకోడానికి పాల్పడిన ఘట్టాలు కోకొల్లలుగా ఉన్నాయి. 

1975 నాటి ఎమర్జెన్సీ పాలనతో ప్రారంభమైన ఈ ‘చీకటి తప్పు’ల పర్వం ఏదో ఒక రూపంలో ఈ రోజుకీ కొనసాగుతూనే ఉంది. దేశ సంపదను దేశీయ, విదేశీ బడా గుత్తవర్గాలు, బహుళజాతి సంస్థలూ కలిసికట్టుగా దోచుకుపోతుంటే సీబీఐని రంగంలోకి దింపి పాలకపక్షాలు ఎందుకు దేశ ఆర్థికవ్యవస్థను సంరక్షిం చుకోవడం లేదు? ఓట్ల-సీట్ల కొనుగోళ్ల కోసమో, లేదా పార్లమెంటులోనో, శాసనసభల్లోనో ఎదురయ్యే ఏ అవిశ్వాస తీర్మాన భారాన్ని దించుకోడానికో పాలక పక్షాలు సీబీఐ, ఏసీబీ, సిట్ వంటి విచారణ సంస్థలను రంగంలోకి దింపుతున్నాయన్నది దాచేస్తే దాగని సత్యం. అభియోగాలను, విచారణక్రమా న్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా తిప్పుకోడానికి పాలక వర్గాలు ప్రయ త్నిస్తున్నందుననే అనేక ఘట్టాలలో సీబీఐ విచారణ సంస్థ పరువు బజారున పడవలసి వస్తోంది.


ఈ మాట నిజం కాకపోతే - సీబీఐకి పన్నెండేళ్ల క్రితమే అప్పగించిన బోఫోర్స్ శతఘు్నల కొనుగోలు కుంభకోణం ఈ క్షణం దాకా ఒక కొలిక్కి రాకుం డా ఉండేది కాదు. ఈ కుంభకోణంలో సుమారు రూ.67 కోట్లు లంచంగా పుచ్చు కున్నది మన దేశంలో తిష్టవేసిన ఇటలీ వ్యాపారి అట్టావియో కత్రోచీ అని నాటి స్వీడన్ పోలీసు శాఖ అధిపతి స్టెన్ లిండ్‌స్ట్రామ్ తేల్చిచెప్పాడు. రాజీవ్ కుటుం బానికి సన్నిహితుడే అయినా, ఆ ముడుపులు రాజీవ్‌కు ముట్టకుండా కత్రోచీకి ముట్టాయని పాత్రికేయురాలు చిత్రా సుబ్రహ్మణ్యానికి లిండ్‌స్ట్రామ్ వెల్లడిం చడం అందరికీ తెలిసిందే! కాని కత్రోచీని అరెస్టు చేసి, విచారించకపోగా, అర్ధాంతరంగా అర్ధరాత్రిపూట ఢిల్లీ నుంచి విమానంలో దేశ సరిహద్దుల్ని దాటిం చడం దేశ ప్రజలు ఇంకా మరవలేదు. సీబీఐ నేరగాళ్లను వెంటాడే క్రమంలో విదేశీ ప్రభుత్వాలకు పంపించే ‘లెటర్ రొగేటరీ’ పత్రాలన్నీ నాలుక గీసుకోడా నికి కూడా పనికిరాకుండా పోవడానికి కారణం - ప్రతిఫలాపేక్ష (క్విడ్ ప్రో కో) కొద్దీ రాజకీయ లబ్ధి కోసం పాలక పక్షాలు విచారణ సంస్థల చేతులూ, కాళ్లూ ఆడకుండా చేయడమే! 

అంతేగాదు, సీబీఐ ప్రతిపత్తిని మసకబార్చడంలో యూపీఏ సంకీర్ణ ప్రభు త్వం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల విషయంలో అనుసరించిన పద్ధతులు ఎంత ఏహ్యమైనవో ఒకటి రెండు ఉదాహరణలు కనువిప్పు కలిగిస్తాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నచోట కేంద్రప్రభుత్వం పార్లమెంటులో తమ సంఖ్యా బలానికి కలిగే ఇబ్బందిని బట్టి ఆయా ముఖ్యమంత్రులను లొంగదీసుకోడానికి ప్రయ త్నించడం ఇటీవల ఒక ఆనవాయితీగా మారింది. ఇందుకోసం సీబీఐని ధారా ళంగా వినియోగించుకోవడమూ జరుగుతూవస్తోంది. ఇందుకు తొలి ఉదా హరణ - పీవీ నరసింహారావు మంత్రివర్గం విశ్వాస తీర్మానం పార్లమెంటు నుంచి పొందవలసి వచ్చినప్పుడు జార్ఖండ్ ముక్తిమోర్చా లాంటి ప్రతిపక్ష సభ్యుల్ని ‘క్విడ్ ప్రో కో’ (లాభ లబ్ధి సూత్రం)గా సంత పశువుల్లా కొనుగోలు చేయడం! అదే పద్ధతిని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయంసింగ్‌ను యూపీలో లొంగదీసుకోవడానికి 2005లో అతని కుటుంబానికి ఉండవలసిన దానికన్నా ‘ఎక్కువ విలువైన ఆస్తులున్నా’యన్న అభియోగాన్ని మోపి కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.

కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం 2007-2008లో భారతదేశ రక్షణ ప్రయోజనాలకు విరుద్ధమైన అణుశక్తి వినియోగపు ఒప్పం దాన్ని అమెరికాతో కుదుర్చుకున్న సందర్భంగా పార్లమెంటు నుంచి ఆమోద ముద్ర పొందవలసివచ్చింది. అప్పుడు వామపక్షాలు సహా అందుకు అభ్యం తరం తెలపడంతో పరువు కోసం సమాజ్‌వాదీ పార్టీకి ఉన్న 21 మంది పార్ల మెంటు సభ్యుల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరమయ్యాయి. ఇందుకు ముదరాగా ములాయం కుటుంబంపై ‘అసాధారణ ఆస్తుల’కు సంబంధించి పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోడానికి సీబీఐకి కాంగ్రెస్ ఆదేశాలిచ్చింది. ములాయం కుటుంబ ఆస్తులపై అసలు ప్రజావ్యాజ్యం పిటిషన్ తొలిసారిగా వేసినవాడు విశ్వనాథ చతుర్వేది. 

తన అధికార ‘అవసరాల’ కోసం వ్యాజ్యాన్ని ఉపసంహ రించుకోవాలని తన వద్దకు ఇద్దరు సీనియర్ మంత్రులను కాంగ్రెస్ పంపించిం దని చతుర్వేది ప్రకటించడం బహిరంగ రహస్యమే! కానీ తీరా కాంగ్రెస్ ములాయంను లోబరచుకోడానికి వేసిన ఎత్తుగడలో భాగంగా చతుర్వేది పిటిషన్‌ను ముందు వాడుకుంది! ఈ బాగోతంలో నిన్నటి సొలిసిటర్ జనరల్, నేటి భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ వాహనవతి కూడా పాలు పంచుకోవడం పాలనావ్యవస్థ దిగజారుడు తనానికి నిదర్శనం! 

ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలపైన 2008లో సీబీఐ ములాయం కుటుంబానికి ఊరట కల్పించి ఉండకపోతే, ములాయంసింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ ఈ రోజున యూపీ ముఖ్యమంత్రి కాగలిగి ఉండేవాడే కాదు! బహుశా అందుకనే సుప్రీంకోర్టు ప్రసిద్ధ సీనియర్ న్యాయవాది అయిన కేటీఎస్ తులసి ‘ఈ పని చేయడం ద్వారా సీబీఐ తన సొంత ప్రతిష్టకే చెరపరాని చేటు తెచ్చుకుంది’ అని వ్యాఖ్యానించవలసి వచ్చింది! అంతేగాదు, ‘ఒక ఉన్నత దర్యాప్తు సంస్థ ఒక పార్టీ కుడికి జరగాలో, ఎడమకు జరగాలో నిర్ణయించజా లదు’ అని వ్యాఖ్యానించాడు. 

అంతేగాదు, చివరికి సీబీఐ తన అభియోగాన్ని సుప్రీంకోర్టు నుంచి ఉపసంహరించుకునే సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య అటు ప్రభుత్వానికీ, ఇటు సీబీఐకీ తలవంపులు తెచ్చేదిగా ఉంది. ‘‘కేంద్రం ఆదేశాల మీదనే సీబీఐ ఇలా ప్రవర్తిస్తోంది. ఈ ప్రవర్తన చాలా అసాధారణం, అత్యంత ఆశ్చర్యకరం’’ అని సుప్రీం కోర్టు అన్నది. అలాగే నిన్నగాక మొన్న కరుణానిధి కూతురు కనిమొళి, డీఎంకే నాయకుడు మాజీ మంత్రి రాజా ‘2జీ’ కేసుల నుంచి బెయి ల్‌పై ఎలా విడుదలయ్యారు? ‘క్విడ్ ప్రో కో’ వల్లనే? ఎలా? జూలైలో రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్-యూపీఏ అభ్యర్థికి డీఎంకే సభ్యుల ఓట్లు కావాలి! అందుకే వారి విడుదలకు ముందు కరుణానిధితో విందుగుడుపులు పూర్తయ్యాయి!

కేంద్ర ప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం 2012, మార్చిలోగా గత మూడేళ్ల కాలంలో సీబీఐ రిజిస్టర్ చేసిన అవినీతి కేసులు 1,450. కాని వీటిలో ఎన్ని ‘క్విడ్ ప్రో కో’ సంతానమో, ఎన్ని నిజమైనవో, ఎన్నింటికి శిక్షలు పడ్డాయో మాత్రం వివరణ లేదు! ‘దొరికితే పట్టుకు న్నామ’న్నట్టుగా 2జీ స్కామును బయట పెట్టింది పత్రికలూ, కాగ్ మాత్రమే. ఆ తర్వాతగాని సీబీఐ రంగంలోకి దిగలేదు! అలాగే తరచుగా సీబీఐ కోర్టులు కూడా సీబీఐ పెట్టే అభియోగాల సామంజ స్యాన్ని గుచ్చిగుచ్చి అడగడానికి కారణం కూడా ప్రభుత్వాల ఆదేశాలకు సీబీఐ లోబడి ఉంటున్నందువల్లనే! కనుకనే బోఫోర్స్ దళారీలను సీబీఐ ఎంత పట్టుకోగలిగిందో, 1 లక్షా 70 వేల కోట్ల రూపాయల 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని కూడా అంతే పట్టుకుని ప్రభుత్వ బొక్కసానికి చేరుస్తుందని మనం నమ్మాలి! ఇక తాజా ఉదాహరణ ఆరుషీ కేసు. ఈ కేసు నడుస్తున్న తీరును కనిపెట్టిన సుప్రీంకోర్టు, కింది మేజిస్ట్రేట్ కోర్టును, సీబీఐ కోర్టునూ అనేక ప్రశ్నలు వేయాల్సి వచ్చింది! రాష్ట్ర హైకోర్టులోనూ ‘సాక్షి’ కేసుల్లో ఇలాంటి ప్రశ్నలనే సీబీఐ కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన వలసివస్తోంది. బెయిళ్ల కోసం నిందితులు పెట్టుకున్న దరఖాస్తుల విషయంలోనూ, ‘సాక్షి’ ఉద్యోగులకు సంబంధించిన సంస్థ నిర్వహణ ఖర్చుల తాలూకు ఖాతాలను స్తంభింపచేసిన విషయంలోనూ సీబీఐ అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవలసివచ్చింది.

ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలు రోజుకి కేవలం తల ఒక్కింటికి 20 రూపాయల మీద బతుకులీడుస్తూ, మరో 10 శాతం మంది కటిక దారిద్య్రానికి కొంచం పైన అంతంత మాత్రంగా జీవితాలు గడుపుతున్నప్పుడు, జీవచ్ఛవా లుగా ఈసురోమంటూ ఉన్న ఈ ప్రజాబాహుళ్యంతో ఎలాంటి సౌభాగ్యవం తమైన భారతదేశాన్ని నిర్మించాలని దేశ పాలకులు, విధాన నిర్ణేతలూ అనుకుంటున్నారో... తబిశీల్లు తీసి సీబీఐ ప్రజలకు నివేదిస్తే ప్రజల దీవెనలకు ఆ సంస్థ అధికారులు అర్హులవుతారు. 100 మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఎలా, ఏ ముదనష్టం ఆధారంగా, ఏ కాయకష్టం ఆధారంగా గత 60 ఏళ్లలో మహా కోటీశ్వరులయ్యారో ఏనాడైనా సీబీఐ మెడలు చాచి ఆరాలు తీసిందా? ప్రజల బొక్కసానికి జమపడవలసిన వేల కోట్ల రూపాయల సొమ్ములో ఎంత జమపడుతుందో ఆరా తీశారా? ఈ దేశంలో 389 కంపెనీలు ప్రభుత్వ బ్యాం కుల నుంచి రుణాలు తీసుకుని మొండి బకాయిలుగా తిరిగిరాని సొమ్ముగా లెక్క తేలిన 2 లక్షల కోట్ల రూపాయలను అధికారాన్ని ఉపయోగించి రాబట్టగలి గారా? రక్షణ రంగంలో 2000 సంవత్సరం నుంచి యుద్ధ సామగ్రి, పరికరాల కొనుగోళ్ల పేరిట సాగుతూ వచ్చిన వేల కోట్ల రూపాయల దోపిడీని ఎందుకు అరికట్టలేకపోయారు? సైనికుల శవపేటికల పేరిట కోట్లు కాజేసిన రాజకీయ రాబందులను ఎంత మందిని కొరత వేశారో సీబీఐ చెప్పగలదా? బ్యాంకుల నుంచి బడా పారిశ్రామికవేత్తలు తీసుకుని, తిరిగి చెల్లించని బకాయిలు 2010లో రూ.13,235 కోట్లు కాగా, అవి 2011 నాటికి సుమారు రూ.20,000 కోట్లకు ఎగబాకడానికి కారకులెవరో నిగ్గు తేల్చడానికి ఏనాడైనా కేంద్ర పాలకులు సీబీఐ సేవలను వినియోగించారా? జాతీయస్థాయి ఆరోగ్యనిధి కింద ఉత్తరప్రదేశ్ ఆరోగ్య నిధికి సంక్రమించిన రూ.8,000 కోట్ల నిధి ఏ గంగలో కలిసిందో సీబీఐ తేల్చగలిగిందా? 

అన్నట్టు ఇంతకూ స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న రూ.24 లక్షల కోట్ల భారతీయ బడాబాబుల నల్లధనాన్ని తీసుకురావడానికి సీబీఐని కేంద్ర పాల కులు ఎందుకు వినియోగించుకోలేకపోయారో చెప్పగలరా? మన దేశంలో పన్నుల భారీ ఎగవేతదార్లయిన మోతుబరులంతా మారిషస్‌లోనో, మాల్దీవు ల్లోనో వేల కోట్ల రూపాయలను మదుపు చేసుకుంటూంటే మన ‘ప్రజాస్వామ్య ప్రభుత్వం’ దాని దర్యాప్తు సంస్థలూ ఏం చేస్తున్నట్టు? అటూ ఇటూ కూడా రాయితీల పేరుతో పన్ను ఎగవేతలకు పెట్టింది పేరైన ‘డేగ’లను ఎంత మందిని పట్టుకుని కొరత వేయగలిగారు? ప్రపంచంలో పన్ను ఎగవేతదార్లకు తల, మొలా దాచుకుంటూ పన్నులు కట్టనక్కరలేకుండా ఉన్న 77 రాయితీ కేంద్రాలు ఉన్నప్పుడు విస్తారమైన దర్యాప్తు సంస్థలను చేతుల్లో ఉంచుకుని కూడా దేశ ప్రజల త్యాగాలపై జలగల్లా బతకనేర్చిన మోతుబరుల గుట్టు మట్టులను రట్టుచేయడంలో ఎందుకు పాలకులు విఫలమవుతున్నారో సమాధానం చెప్ప గలగాలి! స్వాతంత్య్రానంతరం విదేశాలకు తరలిపోయిన సొమ్ము 462 బిలి యన్ డాలర్లు అని 2010 నవంబర్‌లో ‘గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ రిపోర్టు’ వెల్లడించింది! ఈ సొమ్మును రాబట్టడానికి సీబీఐని కేంద్రం ఎందుకు విని యోగించడం లేదు? దేశంలో చెలామణిలో ఉన్న నల్లధనం, దేశ జాతీ యోత్ప త్తుల మొత్తం విలువలో 50 శాతం ఉండగా ఇందులో రూ.2.8 లక్షల కోట్లు విదేశాలకు తరలిందని పరిశోధనాసంస్థలు వెల్లడించినా సీబీఐని ఎందుకు రంగంలోకి దించలేదు? 
మనకు నియంతలు వద్దు కాని నియంత్రణ వ్యవస్థ కావాలి. వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేయాలంటే - దేశ ఆర్థిక నవనాడులను పరిరక్షించగల ఆర్థిక గూఢచారిత్వ శాఖ, పన్నులశాఖ, ఉన్నత దర్యాప్తు సంస్థలూ ఏకోన్ముఖంగా స్వతంత్ర సంస్థలుగా, కేవలం న్యాయస్థానాలకు మాత్రమే జవాబుదారీగా ఉండే సంస్థలుగా మనగలగాలి. 

1 comment:

  1. For the CBI and the Government like this; these articles of GOLD are nothing but waste papers. We can make a common man better; but not these stubborn people.
    Any Government should be always work minded like YSR. They should always plan for several "JALAYAGNAMS' in the country, instead of wasting public money like water irresponsibly. But for them the waste politics of street fight type are sweeter.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!