YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Saturday, 2 June 2012

సీబీఐ గత 9 నెలలుగా నన్ను గమనిస్తూనే ఉంది. ఏ రోజు ఎక్కడ ఏ సాక్షిని ప్రభావితం చేశానో సీబీఐని చెప్పమనండి. ఏ సాక్ష్యాలను తారుమారు చేశానో చెప్పమనండి.

సీబీఐ కోర్టు ఉత్తర్వుల కొట్టివేత.. నేటి నుంచి ఐదు రోజుల కస్టడీ
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకే విచారణ
ఇద్దరు న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలి
తిరిగి రిమాండ్‌కు తరలించాలి.. సీబీఐకి హైకోర్టు స్పష్టీకరణ
మధ్యంతర బెయిల్ జగన్ అడగలేదు.. అందుకే ఇవ్వలేదు: న్యాయమూర్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. జగన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించింది. జూన్ 3వ తేదీ నుంచి 7 వరకు ఐదు రోజుల పాటు జగన్‌ను ప్రశ్నించేందుకు సీబీఐకి హైకోర్టు అనుమతినిచ్చింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే ఆయనను విచారించాలని చెప్పింది. ఆడిటర్ విజయసాయిరెడ్డిని కస్టడీకి అప్పగించే విషయంలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విధించిన షరతులన్నీ జగన్‌కు వర్తిస్తాయని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ శనివారం మధ్యాహ్నం ఈ మేరకు తీర్పు వెలువరించారు. తన అరెస్టును అక్రమమని ప్రకటించాలని, సీఆర్పీసీ సెక్షన్ 309 కింద తనను రిమాండ్‌కు పంపుతూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో జగన్ వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఆయనను తమ కస్టడీకి అప్పగించేందుకు నిరాకరిస్తూ, రిమాండ్‌కు పంపుతూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ కూడా మరో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. 

ఈ నాలుగు వ్యాజ్యాలను విచారించిన జస్టిస్ చంద్రకుమార్, శనివారం ఉమ్మడి తీర్పును వెలువరించారు. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తున్నట్టు, జగన్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు పేర్కొన్నారు. జగన్ మధ్యంతర బెయిల్ గురించి ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాని గురించి న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ కోసం జగన్ ఎలాంటి పిటిషనూ దాఖలు చేయలేదని గుర్తు చేశారు. ‘‘కె.ఎ.పాల్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కోరారు. ఈ కేసులో జగన్ అలాంటి అభ్యర్థన చేయలేదు’’ అని తెలిపారు. జగన్‌ను కస్టడీకి ఎందుకు అప్పగించాల్సి వస్తుందో అందుకు కారణాలను కూడా న్యాయమూర్తి తన తీర్పులో వివరించారు. ‘‘సీఆర్పీసీ సెక్షన్ 167 కింద కస్టడీ కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, సెక్షన్ 167 (2) కింద జగన్‌ను ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్‌కు పంపి ఉండాల్సింది. అలాకాకుండా సెక్షన్ 309 కింద ఆయనను రిమాండ్‌కు పంపడం సరికాదు. ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాను’’ అని తీర్పులో స్పష్టం చేశారు. జగన్ రిమాండ్‌ను సీఆర్పీసీ సెక్షన్ 167 (2)గా పరిగణిస్తున్నట్టు తెలిపారు

ఇవీ షరతులు...
విజయసాయిరెడ్డి కస్టడీ విషయంలో ప్రత్యేక కోర్టు విధించిన షరతులన్నీ జగన్‌కు వర్తిస్తాయని హైకోర్టు శనివారం నాటి తన తీర్పులో తెలిపింది.
ఊ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలి
ఊ విచారణ అనంతరం తిరిగి రిమాండ్‌కు తీసుకెళ్లాలి
ఊ విచారణ ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జరగాలి

ఇదీ జగన్ వాదన..
ఈ కేసులో గత ఆగస్టు 17 నుంచీ దర్యాప్తు చేస్తున్న సీబీఐ, మొన్నటి వరకూ నన్ను పిలిపించనే లేదు. కనీసం ఒక్కసారి కూడా నోటీసులివ్వలేదు.
ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోకుండా నిరోధించేందుకే సీబీఐ నన్ను అరెస్టు చేసింది
తాము సమన్లు జారీ చేసినందున సీబీఐ అరెస్టు చేయబోదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. అయినా సీబీఐ అధికారులు నన్ను అరెస్టు చేశారు
అరెస్టుకు ముందు నన్ను దాదాపు 30 గంటల పాటు సీబీఐ విచారించింది. విచారణకు పూర్తిగా సహకరించా. తెలిసిన వాటికన్నీ సమాధానాలు చెప్పా. తెలియకుంటే తెలియదనే చెప్పా.
అరెస్టు తరువాత నన్ను కోర్టులో ప్రవేశపెట్టి, ఎంపీ హోదాలో నేను సాక్షులను ప్రభావితం చేస్తానని, సాక్ష్యాలను తారుమారు చేస్తానని సీబీఐ చెప్పింది. సీబీఐ గత 9 నెలలుగా నన్ను గమనిస్తూనే ఉంది. ఏ రోజు ఎక్కడ ఏ సాక్షిని ప్రభావితం చేశానో సీబీఐని చెప్పమనండి. ఏ సాక్ష్యాలను తారుమారు చేశానో చెప్పమనండి. ఆధారాలు చూపకుండా సీబీఐ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోంది.

సీబీఐ ఇప్పటికే ఈ కేసులో మొత్తం మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. అంటే మొత్తం ఆధారాలన్నీ వారి వద్దే పదిలంగా ఉన్నాయి. అలాంటప్పుడు సాక్ష్యాలను ఎలా తారుమారు చేయగలనని సీబీఐ చెబుతుంది? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు.
సీబీఐ కోర్టు కూడా ఈ వాదనతో ఏకీభవించి నన్ను రిమాండ్‌కు పంపింది. సీబీఐ చేస్తున్నవి ఆరోపణలేనని తెలిసి కూడా కోర్టు నాకు రిమాండ్ విధించింది. ఆరోపణల ఆధారంగా రిమాండ్‌కు పంపడం సరికాదని సుప్రీంకోర్టు ఎన్నో కేసుల్లో స్పష్టంగా చెప్పింది. అయినా సీబీఐ కోర్టు పట్టించుకోలేదు.
విచారణలో నేను వారికి కావాల్సిన విధంగా వివరాలు చెప్పలేదు కాబట్టే సీబీఐ నన్ను కస్టడీకి అడుగుతోంది. అడిగిన వాటికి సమాధానం తెలియనప్పుడు చట్టప్రకారం మౌనంగా ఉండే హక్కు నాకుంది. ఆ కారణంగా నేను విచారణకు సహకరించడం లేదనడం సరికాదు.

నా కంపెనీల వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డికి తెలుసని చెప్పా. అది తప్పని సీబీఐ అంటోంది. నాకు వ్యతిరేకంగా నేనే చెప్పాలని ఒత్తిడి తెస్తోంది. ఇది చట్ట వ్యతిరేకం. ఈ విషయం వారికీ తెలుసు. అయినా నా నుంచి తనకు కావాల్సిన విధంగా సమాధానాలు ఆశిస్తోంది.

ఒకవేళ సీబీఐ అసలు ఉద్దేశం నన్ను ప్రశ్నించడమే అయితే, వారు ఆ పనిని జైలులో కూడా చేయవచ్చు. జైలులో ప్రశ్నిస్తే ఏమిటి, దిల్‌కుశలో ప్రశ్నిస్తే ఏమిటి? సీబీఐ ఎందుకు కస్టడీకి ఎందుకు పట్టుపడుతోంది?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!