జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తోంది అందుకే: బాజిరెడ్డి గోవర్ధన్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ డైరెక్షన్‌లోనే సీబీఐ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి బెయిలు రాకుండా రకరకాల ఎత్తుగడలతో అడ్డుపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి నిరాకరించడమే కాక జగన్‌ను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించిన తరువాత బాజిరెడ్డి స్పందిస్తూ దర్యాప్తు సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను నిరాకరించడం అంటే సీబీఐ హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు సాక్ష్యాలనూ, పత్రాలనూ సమర్పించిందనే వెల్లడవుతోందని వ్యాఖ్యానించారు. ఇదంతా జగన్‌ను ఉప ఎన్నికల ప్రచారంలో తిరక్కుండా చేయాలనే కుట్రతోనే జరిగిందని ఆయన విమర్శించారు. ‘ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇన్నాళ్లుగా జగన్‌ను విచారించలేదు. 28వ తేదీన సీబీఐ కోర్టుకు హాజరవడానికి కొద్ది రోజులు ముందుగా విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసి మూడు రోజుల పాటు గంటల తరబడి విచారణ పేరుతో కాలాన్ని వృథా చేశారు.
కోర్టుకు హాజరుకావడానికి 12 గంటల ముందు అరెస్టు చేశారు. దీంతోనే సీబీఐ చేస్తున్న రాజకీయం ఏమిటో ఆ సంస్థను ఎవరు నడిపిస్తున్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఓదార్పు యాత్రకు అనుమతించనందుకు జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి కాంగ్రెస్‌ను వీడిన తరువాతనే అధిష్టానం కక్ష సాధింపు ప్రారంభమైంది. మాజీ మంత్రి శంకర్రావు పిటిషన్ వేస్తే టీడీపీ నేతలు ఇంప్లీడ్ కావడం, ఆ తరువాత జరుగుతున్న పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా చూస్తే కేవలం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారనేది అర్థం అవుతోంది. 26 జీవోల జారీ అక్రమమా సక్రమమా.. అనే విషయంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదంటేనే దీని వెనుక ఉన్న దుర్మార్గం ఏమిటో తెలిసి పోతోంది. కేవలం జగన్‌ను ఉచ్చులో బిగించడానికే ఇదంతా జరిగింది. మంత్రి మోపిదేవి వెంకటరమణారావును అరెస్టు చేసింది కూడా కేవలం జగన్‌ను అరెస్టు చేయడానికేనని అర్థం అవుతోంది’ అని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేసి 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలను తన్నుకు పోవాలని కాంగ్రెస్ పన్నిన కుట్రను భగ్నం చేయాలని బాజిరెడ్డి.. ప్రజలకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కూడా కోరారు. జగన్ ఏ తప్పూ చేయలేదనీ ఆయనపై ఉన్న కేసులన్నీ త్వరలో మబ్బుల మాదిరిగా వీడిపోతాయని, ప్రజల ఆశీస్సులతో ఆయన బయటకు వస్తారని బాజిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment