YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 30 May 2012

క్యుములోనింబస్ మేఘాలు లేవంట.. పైలట్‌దే తప్పంట..ఇది ఎంతవరకూ న్యాయం?

* నా బిడ్డ ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టారు? 
* వైఎస్ మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి 
* మూడు నెలలు పక్కన పెట్టిన చాపర్ తెచ్చారంట 
* క్యుములోనింబస్ మేఘాలు లేవంట.. పైలట్‌దే తప్పంట..ఇది ఎంతవరకూ న్యాయం?

శ్రీకాకుళం/విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘‘ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికే ఈ ఎన్నికలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. నా కడుపులోని బాధ.. జగన్‌బాబుకు జరుగుతున్న అన్యాయం.. రాజశేఖరరెడ్డి గారి మీద కుట్ర.. మా కుటుంబాన్ని పెడుతున్న ఇబ్బందులు.. అన్నీ మీరు గమనిస్తున్నారు. మీరందరూ విజ్ఞులు, సరైన న్యాయ నిర్ణేతలు. నా బిడ్డ ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టారు అని అడుగుతున్నాను. ప్రభుత్వాన్ని అడిగాను. మీరు కూడా నా పక్షాన అడుగుతారని ప్రజా కోర్టుకు వచ్చాను. మీరు తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ ప్రేమాభిమానాల ముందు ఈ కుట్రలు, కుతంత్రాలు పనిచేయవని నిరూపించాలి. కుళ్లు రాజకీయాలకు కడిగేయాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. 

‘‘ఇవి ధర్మానికీ, న్యాయానికి జరుగుతున్న ఎన్నికలు.. రాజకీయాలను మార్చే ఎన్నికలివి. రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకునేందుకు కృషిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించండి. రైతుల పక్షాన, ప్రజా సంక్షేమం పక్షాన నిలిచి పదవులను త్యాగం చేసిన 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించండి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి’’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ ప్రచార బాధ్యతను అనివార్య పరిస్థితుల్లో భుజానికెత్తుకున్న విజయమ్మ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నరసన్నపేటలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. బుధవారం రాత్రి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పట్టణంలోనూ కిక్కిరిసిన జనసముదాయాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. విజయమ్మ ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... 

వైఎస్ పోయిన తర్వాత జరుగుతున్నదేమిటి?
‘‘వైఎస్‌ఆర్‌ను ప్రేమించే హృదయాలకు, జగన్‌ను అభిమానించే వారందరికీ కృతజ్ఞతలు. జగన్ బాబును మీ బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా, మనవడిగా ఆదరిస్తున్నారు. మీ ప్రేమ మరవలేనిది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. శ్రీకాకుళం ప్రజలు చాలా మంచివారని వైఎస్‌ఆర్ చెప్పేవారు. ఇక్కడికొచ్చినప్పుడు ఆయన చేసిన పాదయాత్రే గుర్తుకొచ్చింది. అప్పుడు నేను కూడా ఇక్కడికొచ్చాను. రాజమండ్రిలో 51 డిగ్రీల ఎండ తాకిడికి అస్వస్థతకు గురైనప్పుడు పాదయాత్ర వద్దని రాజశేఖరరెడ్డికి చెప్పాను. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే వారి వద్దకు వెళ్లి ఓదార్చాలని చెప్పారు. ఆ రోజు వైఎస్‌చెప్పింది తప్పుకాదని ఇప్పుడు తెలుస్తోంది. మీ ప్రేమ ఎంతో గొప్పదని తెలుసు. దాని ముందు ఏదీ నిలబడదు.

ఇప్పుడు జగన్‌బాబును జైల్లో పెట్టారు...
కానీ అప్పుడు విచారణ లాగానే ఇప్పుడు కూడా జగన్‌బాబును జైల్లో పెట్టారు. నా బిడ్డను ఏం చేస్తారో నాకు అర్థం కావటం లేదు. రాజశేఖరరెడ్డి గారి మీద మీరు చూపించే ప్రేమను తట్టుకోలేక అలా చేయగలిగారా? ఈ మూడు సంవత్సరాలుగా మీరు జగన్‌బాబును చూస్తున్నారు. ఆయన తప్పు చేసేవాడిలాగా కనిపిస్తున్నాడా? సీబీఐ ఎంక్వయిరీలు వేసి.. ఆయనను ఇరికించాలని 9 నెలలుగా ప్రయత్నిస్తున్నారు. 9 నెలలుగా ఒక్క ఆధారం కూడా వాళ్లు చూపలేకపోతున్నారు. 9 నెలలుగా చూపలేనిది.. ఇప్పుడు 15 రోజుల్లో ఎందుకు హడావుడిగా జగన్‌ను దూరం చేశారు? ప్రజల మధ్య ఉండకుండా చేయటం తప్పితే నాకేం కారణం కనిపిం చటం లేదు. ఆ రోజు భర్తను పోగొట్టుకున్నా...ఈ రోజు జగన్‌ను జైల్లో పెట్టారు. విచారణలో తేడా లేదు. 

ఈ నెల 28న హాజరు కావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. కానీ 25న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ముందస్తు బెయిల్‌కు వెళ్లడం జరిగింది. ‘అరెస్టు అయ్యే అవకాశం లేదు.. విచారణకు హాజరు కావచ్చ’ని జడ్జిగారు అన్నారు. చట్టంపై గౌరవంతో జగన్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. రోజుకు 9గంటల చొప్పున 3రోజులు విచారణ జరిపారు. ప్రతి ప్రశ్నకు జగన్ సమాధానమిచ్చారు. అయినా 27న అరెస్టు చేశారు. అన్యాయంగా అరెస్టు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పాం. జగన్ కూడా కోర్టులో చెప్పుకున్నారు. ‘నేనేం తప్పు చేయలేదు.. పార్టీ అధ్యక్షుడిగా ఉప ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించుకోవలసిన బాధ్యత ఉంది. ఎన్నికలైన తర్వాత మీ ముందు ఎన్ని గం టలైనా హాజరవుతా’నని చెప్పారు. కానీ న్యాయం జరగలేదు. 

వైఎస్‌ను రోల్‌మోడల్ అని ప్రధాని, సోనియాలే అన్నారు.. 
ఢిల్లీ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగారైతేనేమి, సోనియాగాంధీ గారైతేనేమి రాజశేఖరరెడ్డి గారిని రోల్‌మోడల్‌గా తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా తీసుకోవాలని చెప్పిన సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి. మన రాష్ట్రం ఆయన హయాంలో అభివృద్ధి అయినంతగా ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ కాలేదు. ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క రూపాయి కూడా పన్ను పెంచని ప్రభుత్వం ఏదైనా ఉందీ అంటే భారత దేశ చరిత్రలో అది రాజశేఖరరెడ్డి ప్రభుత్వమే. రాజశేఖరరెడ్డి గారు వచ్చాక.. మొదటి సంవత్సరం బడ్జెట్ రూ. 40 వేల కోట్లయితే.. ఐదో సంవత్సరం బడ్జెట్ లక్షా నాలుగు వేల కోట్లకు తీసుకెళ్లారు. ఈ సంక్షేమ పథకాలు నడపగలిగారు. మరి ఇప్పుడు లక్షా 40 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఏం చేస్తున్నారు? ఆయన సంక్షేమ పథకాలు ఎందుకు మరుగునపడుతున్నాయి? రాజశేఖరరెడ్డి గారిని మరిచిపోవాలని చేస్తున్నారా? అని మనమందరం ప్రభుత్వాన్ని అడగాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. 

అంత మంచి చేసిన ఆయనను ఎలా మనకు దూరం చేశారో నాకు అర్థం కావటం లేదు. నా ప్రశ్నకు ఎప్పుడూ జవాబు దొరక లేదు. నేను దేవుడ్ని కూడా చాలా సార్లు అడిగాను. దేవా ఎందుకు దేవా ఎందుకిలా జరిగింది అని. కానీ నా ప్రశ్నకు జవాబు దొరకటం లేదు. ఇప్పుడు జగన్‌ను జైలులో పెట్టినందుకు నేను మీ ముందుకు వచ్చాను. ప్రజాకోర్టులో నా బిడ్డకు న్యాయం చేయమని అడగటానికొచ్చాను. నేనిక్కడకు వచ్చేముందు జగన్‌బాబు వద్దకు వెళ్లి ప్రజల వద్దకెళ్లి ఏం చెప్పమంటావు బాబూ అని అడిగా. ‘నేను ధైర్యంగా ఉన్నాను. నమ్మకంగా ఉన్నాను. ఏ తప్పూ చేయలేదు. ప్రజ లకు ధైర్యంగా ఉండమని చెప్పమ్మా అన్నాడు. ఈ కుట్రలు, కుతంత్రాలు ఏవీ ప్రజల ప్రేమ ముందు నిలబడవ’ని చెప్పమన్నాడు. ఆ మాట చెప్పటానికి నేను మీ ముందు నిల్చున్నా. 

రాజశేఖరరెడ్డి మరణంపై చాలా అనుమానాలున్నాయి... 
‘‘రాజశేఖరరెడ్డి గారు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ బాధ్యత తీసుకున్నారు. గెలిచినా, ఓడినా తనదే బాధ్యత అని పని చేశారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఆ రోజు రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరటంలో ఆయన ఉద్దేశం.. ప్రభుత్వ పథకాలు ఎవరికి అందడం లేదో తెలుసుకోవాలనే.. అంతలోనే ఆయన మరణం.. ఆయన మరణంపై చాలా అనుమానాలున్నాయి. సామాన్య ప్రజానీకానికి ఉన్న అనుమానాలు నాక్కూడా ఉన్నాయి. అది జరిగిన రోజు.. జగన్‌బాబును అడిగా. ‘ఇలా ఎందుకు జరిగింది? ఎవరైనా ఏమైనా చేసుంటారా నాన్నను? మనం కనుక్కోలేమా?’ అని అడిగాను. 

‘అమ్మా! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బయటకు తీసుకురావాలి అని అనుకుంటే తప్ప ఇవి బయటకు రావమ్మా’ అని చెప్పాడు. నేను అడిగిన దానికి కొందరు పెద్దలు జవాబు చెప్తున్నారు.. విచారణలో దోషం లేదు.. అది ప్రమాదమేనని చెప్తున్నారు. కానీ మాకు అలా అనిపించటం లేదు. ఆ రోజు 3 నెలలు పక్కన పెట్టిన చాపర్‌ను తెచ్చారు. ఆ రోజు రాజశేఖరరెడ్డి గారు కూడా అడిగారంట.. ఈ చాపర్ తెచ్చారేమిటని. మనం మామూలుగా కారులో వెళ్లినా అందులో దారి చూపే మ్యాప్‌లు ఉంటాయి. కానీ చాపర్ ఎటుపోతుందో చెప్పే పరికరం లేదంట. ఒక్క మ్యాప్ కూడా లేదంట. 

ఆ బ్లాక్ బాక్స్‌లో ఎలాంటి వాయిస్ వినిపించ లేదట. రెండున్నర గంటలకు సరిపడే ఇంధనం చాపర్‌లో ఉందట. దానితో చాపర్‌ను ఒకే ప్రాంతంలో నిలబెట్ట వచ్చంట. మరి వాతావరణం అంతగా బాగోలేనప్పుడు అలా ఎందుకు నిలబెట్టుకోలేదు? ఇప్పుడు విచారణలో వారు చెప్పేదేమంటే.. ‘క్యుములోనింబస్ మేఘాలు కూడా అంతగా లేవు.. పైలట్‌దే తప్పు...’ అని ఇప్పుడు చెప్తున్నారు. ఇది ఎంతవరకూ న్యాయం? ఎంత వరకూ మనం నమ్ముదాం? నేను నమ్మలేదు ఆ రోజు నుంచీ కూడా. ‘ఇది ఎలా జరిగిందమ్మా.. సార్‌ను ఏదో చేశారు’ అని చాలా మంది నాతో అన్నారు కూడా.’’

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!