YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 30 May 2012

నిబంధనల మేరకే వసతులు కల్పించండి. జైలు అధికారులకు సూచించిన జగన్

నిబంధనల మేరకే వసతులు కల్పించండి
జైలు అధికారులకు సూచించిన జగన్
రెండోరోజు జగన్‌తో వైఎస్ భారతి భేటీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో రెండు రోజులుగా తీవ్రమైన వేడిగాలిలోనే గడుపుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు జగన్‌కు ఫ్యాను ఉన్న గదిని కేటాయించారు. అయితే తీవ్ర వడగాలుల నేపథ్యంలో ఫ్యాను గాలి కూడా వేడెక్కడంతో భరించలేనంత ఉక్కపోతలోనే ఆయన నిద్రిస్తున్నారు. బుధవారం ఉదయం ఆయన అల్పాహారానికి బదులు పాలు తీసుకున్నారు. జైలు అధికారులిచ్చిన పత్రికలను చదివారు. మధ్యాహ్నం అన్నం, కూర, రసంతో భోజనం చేశారు. కాగా జైలు నిబంధనలకు తాను అతీతుడను కాదని, నిబంధనలకు అనుగుణంగానే వసతి, సౌకర్యాలు కల్పించాలని జగన్‌మోహన్‌రెడ్డి జైలు అధికారులను కోరినట్లు తెలిసింది. మరోవైపు జగన్‌ను ఆయన సతీమణి వైఎస్ భారతి బుధవారం చంచల్‌గూడ జైలులో కలిశారు. ఉదయం 11.30 గంటలకు ఆడిటర్ విజయసాయిరెడ్డితో కలిసి ఆమె లోపలికి వెళ్లారు.

కొద్దిసేపు మాట్లాడారు. జగన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే జైలులో ఆయన భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన భారతిని మాట్లాడాలంటూ మీడియా ప్రతినిధులు చుట్టూమూగారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో ఆమె ముందుకు అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా మీడియా ప్రతినిధులు, వీడియోగ్రాఫర్లు దారివ్వకపోవడంతో తిరిగి ఆమెను జైలులోపలికి పంపించారు. అనంతరం అదనపు బలగాలను రప్పించి పోలీసు వలయం ఏర్పాటు చేసి అతి కష్టంమీద కారెక్కించారు. 

మీడియా ప్రతినిధుల తీరుపట్ల పోలీసు అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం 11 గంటలకు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, 12.10 గంటలకు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ దత్తు రామచంద్రారావు తదితరులు జగన్‌ను కలిశారు.

కూలర్ కథనాలు.. రామోజీ రాజకీయాలకు నిదర్శనం: నల్లపురెడ్డి
ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరెంటు లేని పల్లెల్లో ప్రజల మధ్య పడుకుని ఇంతకంటే కఠోరమైన రాత్రులు గడిపారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చెప్పారు. జగన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌కు కూలర్ వసతి కల్పిస్తారని కథనం రావడం రామోజీరావు తెరవెనుక రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. సోనియాగాంధీ దర్శకత్వంతోనే జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి జైల్లో పెట్టిందని ఆరోపించారు. ఉప ఎన్నికల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతాయని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!