ఏమీ తేల్చకున్నా వేధింపులు మాత్రం తారస్థాయికి
రాజకీయ ప్రత్యర్థుల పాటకు తగ్గట్టే అరెస్టు.. తరవాత కస్టడీ
కోర్టును సైతం తోసిరాజని ఎన్నికల ముందు సీబీఐ రాజకీయ క్రీడ
క్విడ్ ప్రో కోలో ఒక్క జీవో కూడా నిబంధనలకు విరుద్ధమని తేల్చని సీబీఐ
ప్రభుత్వం నష్టపోయిందని కూడా తేల్చకుండా.. జగన్ లక్ష్యంగా పావులు
ఇన్వెస్టర్లు మోసపోయారంటూ తనకు సంబంధం లేని ఆరోపణలు
ఏ ఇన్వెస్టరూ ఫిర్యాదు చేయకపోయినా తానే వకాల్తా తీసుకున్న దర్యాప్తు సంస్థ
విదేశీ నిధులంటూ రెండున్నరేళ్లుగా పాడుతున్న పాటే మళ్లీ
రాజకీయ దురుద్దేశాలతోనే దర్యాప్తు సాగుతోందంటున్న జాతీయ మీడియా
అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ సైతం తీవ్ర విమర్శలు
చంద్రబాబు, రామోజీ కేసులోనేమో దర్యాప్తు నిలిచేదాకా కదలని సంస్థ
ఇలా చేస్తున్నందుకు మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న జాతీయ మీడియా
ఎందరెన్ని చెబుతున్నా మారని దర్యాప్తు తీరు
దేశంలో ఏ కేసులోనూ మునుపెన్నడూ ఇలా వ్యవహరించని సీబీఐ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘క్విడ్ ప్రో కో’ అంటూ చేసిన ఆరోపణల్లో ఒక్క దాంట్లో సైతం తప్పు జరిగిందని నిరూపించలేదు. ఇన్వెస్టర్లను మోసం చేశారంటూ దర్యాప్తు సంస్థే దర్యాప్తునకు సంబంధం లేని ఆరోపణలు చేస్తోంది తప్ప.. ఒక్క ఇన్వెస్టరు కూడా తాను మోసపోయానని ఫిర్యాదు చేయలేదు. చట్టబద్ధంగా వచ్చిన విదేశీ పెట్టుబడిని అక్రమ సొమ్ముగా చూపించే ప్రయత్నం ఏ మాత్రమూ నిలిచే అవకాశం లేదు. అయినా సరే.. ఏమీ లేని కేసులో సైతం వేధింపుల్ని ఎంతకైనా తీసుకెళ్లగలమని సీబీఐ నిరూపిస్తోంది. తన చర్యను తాను కూడా సమర్థించుకోలేని రీతిలో ఎన్నికలకు 15 రోజుల ముందు జగన్‌ను అరెస్టు చేసిన సీబీఐ.. ఇప్పుడు ఆయన్ను ఐదు రోజుల పాటు విచారించడానికి వీలుగా కస్టడీ సాధించింది.
ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని తెలిసినా, వాటిల్లో ఏ ఒక్కటీ నిజం కాదని తెలిసినా ఈ కేసులో తానేం చేయాలనుకుందో అదే చేస్తూ పోతోంది. ఇప్పటిదాకా చేసిన దర్యాప్తులో తేలినదేమీ లేదని, ముందుగా దోషిని నిర్ధారించేసి, ఆయన దోషమేమిటో ఆ తరవాత తెలుసుకోవాలని భావిస్తున్న తన తీరే సరి కాదని దర్యాప్తు సంస్థకు తెలిసినా.. అది రాజకీయ దురుద్దేశంతో అధికార పార్టీ చేతుల్లో పావులా పని చేస్తోందని జాతీయ స్థాయి నాయకులు, జాతీయ మీడియా సైతం చెబుతున్నా.. సీబీఐ మాత్రం ఏమీ పట్టనట్టుగానే వెళ్తోంది. సీబీఐ రాజకీయ పార్టీల చేతుల్లో పావులా మారిపోయిందని, జగన్‌మోహన్‌రెడ్డిపై సాగిస్తున్న దర్యాప్తులో ఇది స్పష్టంగా కనిపిస్తోందని, ఇవి వేధింపులు తప్ప మరొకటి కాదని అన్నా హజారే బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ సైతం అభిప్రాయపడ్డారంటే దర్యాప్తు సంస్థ రాజకీయ దురుద్దేశాలు ఎంతలా దేశవ్యాప్తమయ్యాయో అర్థం కాక మానదు. ‘‘ఎన్నికలకు 15 రోజులే ఉంది. అవి ముగిశాక మీరెప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతా. సహకరించండి’’ అంటూ జగన్ చేసిన అభ్యర్థనను తిరస్కరించి.. మే 28న ఆయన కోర్టు ముందు హాజరవుతారనగా, కేవలం కొన్ని గంటల ముందు 27వ తేదీ రాత్రి ఆయన్ను అరెస్టు చేసిన తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి.
ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ను దూరం చేయటానికే రాజకీయ బాసుల ఆజ్ఞల మేరకు సీబీఐ ఇలా చేసిందన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ‘‘ఇంకొద్ది రోజుల్లో జగన్ జైలుకు వెళతారు.. ఇక జగన్ పని జైలుపాలే.. నాలుగు రోజుల్లో ఆయన కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుంది’’ అంటూ చంద్రబాబు నాయుడితో సహా టీడీపీ నేతలు; ముఖ్యమంత్రితో పాటు బొత్స, రేణుకా చౌదరి వంటి కాంగ్రెస్ నేతలు అన్నట్టుగానే సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. తాము చెప్పినట్టే అరెస్టవటంతో ఇప్పుడా వర్గాలు కొత్త పల్లవి అందుకుంటున్నాయి. ‘‘బెయిలు రాలేదు. కస్టడీకి అనుమతించారు. ఇక ఇప్పట్లో బయటకు రారు’’ అనే విష ప్రచారానికి నాంది పలుకుతున్నాయి. ‘‘తన ప్రత్యర్థుల్ని తనకు కావాల్సినట్టుగా వెంటాడి వేధించటానికి సీబీఐ ఏమీ రాజకీయ పార్టీ కాదు. అది తన దర్యాప్తు తీరును మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సీబీఐ అన్నది రాష్ట్రంలోని ఒకరిద్దరు అధికారుల సొంత సంస్థ కాదు. సీబీఐ అంటే ఒక వ్యవస్థ. సీబీఐ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం వమ్మయ్యేలా, దానిపై ఉన్న సదభిప్రాయాలు చెరిగి పోయేలా వ్యవహరిస్తుండటం వ్యవస్థకు ఏ మాత్రమూ మంచిది కాదు’’ అని టీవీ చర్చల్లో పాల్గొన్న న్యాయవాదులు ముక్త కంఠంతో చెబుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం కాక మానదు. జగన్‌ను కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఇక, ‘సీబీఐ దర్యాప్తులో ఆ గుట్టు రట్టయింది.. ఈ గుట్టు రట్టయింది’ అంటూ పుంఖానుపుంఖాలుగా విష కథనాల్ని ప్రసారం చేయటానికి ఓ వర్గానికి చెందిన మీడియా ఇప్పటికే సన్నాహాలు చేసిందని, పాత కథనాలన్నిటినీ అది పదేపదే ప్రసారం చేయబోతోందని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం.
‘‘ఇప్పటిదాకా సీబీఐ ఏం తేల్చింది? శంకర్రావు-టీడీపీ నేతల పిటిషన్లలోని అంశాలే ఎఫ్‌ఐఆర్‌లోనూ.. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలే చార్జిషీట్లలోనూ యథాతథంగా పునరావృతమయ్యాయి కదా? ఆ పిటిషన్లోని అంశాలు కూడా అప్పటికే కొన్ని పత్రికలు ప్రచురించిన కథనాలే కదా? మరి ఈ 9 నెలల్లో సీబీఐ తేల్చిందేమిటి?’’ అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లేదు. ఏమీ తేల్చకున్నా పాత కథనాల్నే మళ్లీ మళ్లీ కొత్తవిగా ప్రసారం చేయటానికి అవకాశం కల్పిస్తున్న సీబీఐ ఉద్దేశం, ప్రయత్నమల్లా.. వైఎస్, ఆయన తనయుడు జగన్‌ల ప్రతిష్టను దిగజార్చటమేనన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
ఆది నుంచే రాజకీయ దురుద్దేశాలు..
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల్ని ఓదార్చటానికి జగన్ ఓదార్పు యాత్ర మొదలుపెట్టడం.. కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు పెట్టడంతో పార్టీ నుంచి బయటకు రావటం.. తరవాత 3 రోజులకే ఐటీ నోటీసుల ద్వారా వేధింపులు మొదలు కావటం తెలిసిందే. అప్పటికే ‘సాక్షి’తో పాటు జగన్ సంస్థల్లో పెట్టుబడులపై ఒక వర్గానికి చెందిన మీడియా ఎన్నో ‘కథ’నాలివ్వగా.. దానికి వైఎస్, జగన్ కూడా సమాధానమిస్తూ వచ్చారు. వైఎస్ మరణానంతరం అవే ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చిన నెలన్నరకు.. ఆ లేఖనే కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇంతలో శంకర్రావు మరిన్ని పత్రాలు సమర్పించటం, అవే పత్రాలతో టీడీపీ కూడా ఇంప్లీడ్ కావటం.. వాటిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తుకు, ఆ తరవాత పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించటం.. ఈ మధ్యలోనే లేఖ రాసిన శంకర్రావు మంత్రి కావటం.. అన్నీ నాలుగైదు నెలల వ్యవధిలో జరిగిన పరిణామాలు. రాజకీయ పార్టీల ప్రమేయాన్ని స్పష్టంగా నిరూపించే పరిణామాలు!
సీబీఐ విచారించాల్సిందేమిటి?
అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ప్రస్తుతం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయిన నిస్సార్ అహ్మద్ కక్రూ వెలువరించిన తీర్పేమిటంటే.. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం కొన్ని సంస్థలకు పోర్టులు, సెజ్‌లు, భూములు కేటాయించింది. సిమెంటు కంపెనీలకు లీజులివ్వటంతో పాటు హోటళ్లకు అనుమతులు మంజూరు చేశారు. మినహాయింపులూ ఇచ్చారు. ఈ ప్రయోజనాలు పొందినవారు అందుకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ల చేత పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తున్నాం’’ అని. దీనిపై ఇప్పటికే మూడు చార్జిషీట్లను దాఖలు చేసిన సీబీఐ.. మూడు ఆరోపణల్ని ప్రధానంగా పేర్కొంటోంది. అవి.. క్విడ్ ప్రో కో.. ఇన్వెస్టర్లు మోసపోవటం.. సాక్షిలోకి విదేశాల నుంచి అక్రమ నిధులు వచ్చాయనటం. మరి వీటిలో తేల్చిందేమైనా ఉందా? చూద్దాం..
ఒక్కటీ అక్రమమని తేల్చని క్విడ్ ప్రో కో..
‘క్విడ్ ప్రో కో’ అంటే ఇచ్చిపుచ్చుకోవటం. వైఎస్ హయాంలో పలు సంస్థలకు ప్రాజెక్టులు కట్టబెట్టారని, అందుకు ప్రతిగా అవి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనేది క్విడ్ ప్రో కో ఆరోపణ. ఏ రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా ఇలా ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు వచ్చినపుడు మొదట తేల్చేది ఆ నిర్ణయం తప్పా, కాదా అని. అది తేలాక.. నిజంగా ప్రభుత్వ నిర్ణయంలో దోషముంటే ఆ నిర్ణయాన్ని రద్దు చేయటమో, సవరించటమో చేయాలి. కానీ ప్రభుత్వ నిర్ణయాలకు బాధ్యుడిగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి.. వేధింపుల్ని ఏ స్థాయికైనా తీసుకెళ్లాలని భావించటం బహుశా.. దేశ చరిత్రలో ఇదే ప్రథమమనుకోవాలి. నిజానికి క్విడ్ ప్రో కో ఆరోపణలకు సంబంధించి సీబీఐ చెబుతున్న అంశాల్లో ఒక్క దాన్లోనూ ప్రభుత్వానికి నష్టం జరిగినట్టు తేలలేదు. నష్టం జరగనప్పుడు ఆ నిర్ణయం తప్పుడుదనే ప్రసక్తే ఉండదు. అది సరైన నిర్ణయమైనపుడు క్విడ్ ప్రో కో అనే వాదనే ఉండదు. అంతేగాక.. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అది మంత్రివర్గ ఉమ్మడి నిర్ణయమని ఇప్పటికే న్యాయ నిపుణులతో పాటు గత తీర్పులూ స్పష్టంగా చెబుతున్నాయి. మరి ఉమ్మడి నిర్ణయానికి దురుద్దేశాలు అంటగట్టి.. దానికి అప్పటి ముఖ్యమంత్రిని ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ, ఏ ప్రభుత్వ పదవిలోనూ లేని ఆయన తనయుడు అధికార దుర్వినియోగం చేశారంటూ వేధించటమనేది ప్రతీకారానికి పరాకాష్ట తప్ప మరొకటి కాదని జాతీయ మీడియా సైతం చెబుతోంది. దీనికి కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ‘‘ప్రతీకారానికి మూల్యం’’ పేరిట తాజాగా జాతీయ వారపత్రిక ‘ఇండియా టుడే’ వెలువరించిన ముఖచిత్ర కథనం దీనికి ప్రత్యక్ష నిదర్శనం.
ఇన్వెస్టర్లు మోసపోయారనే వాదన కరెక్టేనా?
జగన్, విజయసాయిరెడ్డి కలిసి జగతి పబ్లికేషన్స్ లాభాలపై తప్పుడు అంచనాలు చెప్పి పలువురి చేత పెట్టుబడులు పెట్టించారనేది సీబీఐ రెండో ప్రధాన ఆరోపణ. రెండో చార్జిషీట్లోని ప్రధానాంశం కూడా ఇదే. ‘‘2008లో టి.ఆర్.కణ్ణన్ అనే వ్యక్తిని విజయసాయిరెడ్డి కలిశారు. జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగారు. ఆయన ఓకే చేశారు. 2010లో కన్నన్ కర్నూలు జిల్లా బనగానపల్లిలో సిమెంట్ ప్లాంట్ పెట్టారు. 2010 ఆగస్టు 19న (రోశయ్య హయాంలో) ఆయనకు లెసైన్సు మంజూరయింది. దుబాయ్ ఎన్నారై మాధవ్ రామచంద్రతో 2008లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. త్వరలో జగతి పబ్లికేషన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతోందని, భారీ లాభాలు వస్తాయని ఆశ పెట్టారు. డెలాయిట్ నివేదిక ప్రతిని ఆయనకు పంపారు. దాంతో ఆయన రూ.19.65 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకా దండమూడి అరుణ్‌కుమార్ కూడా విజయసాయిరెడ్డి మాటలు నమ్మి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు’’ అని సీబీఐ ప్రస్తావించింది. వారికి ఎలాంటి డివిడెండూ రాలేదని, వారి పెట్టుబడిపై వడ్డీ కూడా రాలేదని, వారికి లాభాలపై తప్పుడు సమాచారమిచ్చి పెట్టుబడి పెట్టించారని పేర్కొంది. ఇన్టెస్టర్లకు లాభాలిచ్చి బయటకు పంపే మార్గాన్ని కూడా చూపించలేదని తెలిపింది.
ఇక్కడ గమనించాల్సిందేమిటంటే సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడులనే తప్ప.. ఇన్వెస్టర్లు మోసపోయారా, లేదా అనే అంశాన్ని కాదు. ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టిన వారినైతే క్విడ్ ప్రో కో పెట్టుబడులు పెట్టారని.. ఏ ప్రాజెక్టూ చేపట్టని వారైతే మోసపోయారని పేర్కొంటున్నారన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పెపైచ్చు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి తాము మోసపోయామంటూ ఏ ఇన్వెస్టరూ ఫిర్యాదే చేయలేదు. అయినా పెట్టుబడి పెట్టడమా, మానటమా అన్నది ఇన్వెస్టరుకు-ప్రమోటరుకు సంబంధించిన విషయం. ఇన్వెస్టరు ఫిర్యాదు చేస్తే తప్ప మూడో మనిషికి అవసరం లేని అంశమిది. పెపైచ్చు వారు పెట్టుబడులు పెట్టింది నేరుగానే తప్ప గొట్టం కంపెనీల ద్వారా కాదు. డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టించారన్న, మోసం చేశారని చెబుతున్న సీబీఐ.. అదే నివేదికలో ఉన్న ‘డిస్‌క్లెయిమర్’ గురించి ప్రస్తావించకపోవటమూ కుట్రలో భాగంగానే కనిపిస్తోంది. ఎందుకంటే పెట్టుబడిదారులు ఆ నివేదిక ఆధారంగా ఇన్వెస్ట్ చేసినపుడు దాన్లోని డిస్‌క్లెయిమర్‌ను కూడా చూస్తారన్నది తెలియనిది కాదు.
విదేశీ నిధులకు అనుమతుల్లేవా?
విదేశీ నిధులపైనా సీబీఐ తేల్చిందేమీ లేకపోయినా ఒక వర్గానికి చెందిన మీడియాలో మాత్రం పదేపదే అవే కథనాలు వస్తున్నాయి. నిజానికి ఈ విదేశీ పెట్టుబడులు అనుమతి లేని సంస్థల నుంచి వచ్చినవేమీ కావు. ఈ దేశంలో పలు లిస్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు చేసిన 2ఐ క్యాపిటల్ సండూర్ పవర్‌లోనూ పెట్టుబడి పెట్టింది. ఆ సంస్థకు సెబీ అనుమతి ఉంది. ఆ పెట్టుబడికీ కేంద్ర సంస్థల అనుమతి ఉంది. ఒకవేళ అందులో తేడాలేమైనా ఉంటే కేంద్ర సంస్థలు అనుమతులిస్తాయా? ఎస్‌ఎస్‌కేఐ వంటి సంస్థల వాల్యుయేషన్ నివేదిక చూశాక.. తమ నిబంధనల మేరకు అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థను ఆడిటర్‌గా పెట్టుకున్నాక.. నికితా దేశాయ్ వంటి ప్రముఖులతో డ్యూ డిలిజెన్స్ చేయించాకే 2ఐ క్యాపిటల్ సంస్థ సండూర్‌లో పెట్టుబడి పెట్టింది. ఆ పెట్టుబడితో అప్పులు తీరిపోగా.. మరుసటేడాది నుంచి లాభాలు కూడా రావడంతో వాటిని వివిధ సంస్థల్లో రీ ఇన్వెస్ట్ చేసింది సండూర్ పవర్. ఇక 2010లో జగన్‌పై రాజకీయ వేధింపులు మొదలయ్యాక ఆయన సంస్థల్లోని ఇన్వెస్టర్లకు ఆందోళన కలగడం సహజమే. జరుగుతున్న దాని వెనకున్న రాజకీయాలు, వాస్తవాలు తెలియవు కనక విదేశీ సంస్థల్లో ఆ ఆందోళన ఎక్కువుంటుంది. అందుకే అలాంటి సమయంలో 10 శాతం లాభం చెల్లించి బై బ్యాక్ చేయటానికి సండూర్ ముందుకు రాగా.. 2ఐ సంస్థ సరేనంది. స్టాక్ మార్కెట్ ప్రతికూలంగా ఉన్నప్పుడు.. కంపెనీలపై ఆరోపణలొచ్చినపుడు షేర్ల విలువ భారీగా తగ్గటం.. ఇన్వెస్టర్లు నష్టాల్లో ఎగ్జిట్ కావటం కొత్తేమీ కాదు. అలాంటప్పుడు సండూర్ పవర్ 10 శాతం చెల్లించి మరీ బై బ్యాక్ చేసింది. అది తన సొమ్మే అయితే.. షేరు విలువ పెంచుకోవచ్చన్న ఉద్దేశంతో ఏ రూ.200కో బైబ్యాక్ చేసి ఉండేది కదా? ఈ మాత్రం ఆలోచన దర్యాప్తు సంస్థలకెందుకు రావటం లేదు? పాత ఆరోపణలనే ఆ వర్గం మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వైఎస్, జగన్‌ల పరువుప్రతిష్టల్ని దెబ్బ తీయాలనే ఆలోచన ఎందుకు?
No comments:
Post a Comment