YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 2 June 2012

దారి తప్పిన ఈనాడు

 ఉషోదయా లెక్కలన్నీ ఊకదంపుడే 
* ఎన్‌డీటీవీ, జీ న్యూస్, టీవీ-18 సహా దేనికీ లేని విలువ మీ చానళ్లకెలా వచ్చింది? 
* అసలు రూ.6,676 కోట్ల వాల్యుయేషన్ ఎలా ఇచ్చారు?
* వివాదాల్లోని ఆస్తులు పోను దాని పేరిట ఉన్నవేంటి?
* భూములు, యంత్రాలు కూడా ఇతర పేర్లతోనేగా ఉన్నాయి!
* మరి ఉషోదయాకు అంత విలువెలా దక్కింది?
* పన్ను, తరుగుదలకు ముందు లాభాన్ని లెక్కలోకి తీసుకుంటారా?.. 
* అలాగైతే జగతి పబ్లికేషన్స్‌కు తొలి ఏడాది నుంచే లాభాలొచ్చాయి
* సర్క్యులేషన్ సహా ఎక్కడా అంచనాలు తప్పని ‘సాక్షి’ 
* మీ వాల్యుయేషన్‌లో సగం కూడా చెయ్యదా?
* ‘ఈనాడు’ చెప్పిన లాభం ఏ సంవత్సరానిది? 
* ఆర్‌వోసీలో వేరే లెక్కలున్నాయేం?.. 
* ఆర్‌ఓసీకి, మదింపు సంస్థలకు వేర్వేరు వివరాలిచ్చారా?.. 
* పత్రికకు 12 రెట్లు.. టీవీ చానళ్లకు 40 రెట్ల విలువా? ఎందుకలా?
* చంద్రబాబు క్విడ్ ప్రో కో సొమ్ము కంపానీ ద్వారా వచ్చినందుకా?
* రూ.2,600 కోట్లపై నాలుగేళ్లు పైసా లాభం రాకున్నా.. కంపానీ ఊరుకున్నారేం?
* మీ చానళ్లలో ఈటీవీ తెలుగు తప్ప మిగతావేవైనా లాభాల్లో ఉన్నాయా?
* దేనికైనా నంబర్‌వన్ స్థానముందా?.. నిజం చెప్పమంటే హరికథలేల?

ఎవరిని మోసం చేయటానికి ఈ లెక్కలు? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ రాతలు? జనమన్నా, న్యాయ వ్యవస్థ అన్నా, దర్యాప్తు సంస్థలన్నా, ఐటీ విభాగాలన్నా ఎందుకింత చులకన? ఈ వ్యవస్థల్లో మీ మోచేతి నీళ్లు తాగే కొందరు అధికారులుంటే ఉండొచ్చు. అంతమాత్రాన అందరినీ చులకన చేస్తే ఎలా? రామోజీ!! అసలు మీరు వేసిన లెక్కలకు ఏమైనా అర్థముందా? ఆ లెక్కలు చెప్పటం లేదా... మీదెంత దుర్మార్గమో, ఎంతటి అక్రమమో, ఆ నిధులు ఏ బాబు జేబులోంచి వచ్చాయో..? ఇంకా ఎన్నాళ్లు ఎంతమందిని మోసం చేయగలరనుకుంటున్నారు? ఈ లెక్కల్లో దాగున్న కుళ్లు, కుతంత్రం మీకు తెలియదా? పాఠకులకు తెలియదనుకుంటున్నారా? ఇదిగో.. వాళ్లకు తెలిసేలా వివరిస్తున్నాం. కావాలంటే మీరూ చూడండి!!
- సాక్షి ప్రత్యేక ప్రతినిధి 


రామోజీ రాతలు సరేసరి! వాటి సంగతి తరవాత!! ముందు ఆయన వేసిన పట్టిక చూద్దాం. అన్నిటికన్నా ముఖ్యమైనది వాల్యుయేషన్. అంటే ‘ఈనాడు’, ఈటీవీ చానళ్లు, ప్రియా పచ్చళ్లను కలిపి రూ.7,150 కోట్లుగా విలువ కట్టడం. దీన్లో రుణాలు పోను నికర విలువ రూ.6,676 కోట్లుగా తేలటం. అసలు ఎవరిచ్చారు ఇంతటి వాల్యుయేషన్? ఈ సంస్థల పేరిట ఏ ఆస్తులున్నాయని? రామోజీ భూములన్నీ ఆయన కుటుంబం పేరిటో, మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిటో ఉన్నవే. విశాఖ ‘ఈనాడు’ కార్యాలయం లీజు గడువు ముగిసింది. అయినా న్యాయవ్యవస్థపై ‘అపారమైన గౌరవం’ ఉన్న రామోజీ.. దాన్ని యజమానికి అప్పగించకుండా కోర్టుకెక్కటం బహిరంగ రహస్యమే. 

విజయవాడలో తోడల్లుడి నుంచి తీసుకున్న ‘ఈనాడు’ కార్యాలయం లీజు కూడా ముగిసింది. దానిపైనా అదే తరహా ‘న్యాయ పోరాటమే’ చేస్తున్నారు రామోజీ. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఈనాడు కార్యాలయాలన్నీ ఊళ్లకు దూరంగా ఉన్నవే. పెపైచ్చు ‘ఈనాడు’ను ముద్రించే యంత్రాలు సైతం కొన్ని మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరిటే ఉన్నాయి. మరి మీ సంస్థకు అంతటి వాల్యుయేషన్ ఎలా ఇచ్చారు? ఏ కంపెనీని అయినా విలువ కట్టేది ప్రమోటర్లిచ్చే వివరాల ఆధారంగానే కదా? మరి మీరు వాల్యుయేషన్ సంస్థల్ని ఏమని మభ్యపెట్టారు? మీకు పాఠకుల పట్ల గౌరవమే ఉంటే.. మీరు చెప్పే మాటలే నిజమైతే.. మీ లెక్కలే సత్యాలైతే.. ఏ ఆస్తుల్ని బట్టి మీకంత విలువ ఇచ్చారో చెప్పొచ్చుగా? అంతటి విలువైన ఆస్తుల చిట్టా చూస్తే జనం నమ్ముతారు కదా? ఎందుకీ రహస్యాలు? జనహితం.. అక్షర పోరాటం అంటూ హరికథలెందుకు?

ఏడు నెలల్లోనే రూ. 2,300 కోట్ల పెరుగుదలా?

చంద్రబాబు ద్వారా ముకేశ్ అంబానీతో దొడ్డిదారి ఒప్పందం కుదుర్చుకోక ముందు.. బ్లాక్‌స్టోన్ సంస్థ రామోజీ కంపెనీలో వాటా కొనుగోలు చేయాలని భావించినట్టు ‘ఈనాడు’ పేర్కొంది. నిజమే! ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో 26 శాతం వాటా కోసం రూ.1,227 కోట్లు చెల్లిస్తానంటూ అది ముందుకొచ్చింది. ఈ మేరకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి (ఎఫ్‌ఐపీబీ) దరఖాస్తు కూడా చేసింది. అంటే, మొత్తం ఉషోదయాకు అది కట్టిన విలువ రూ.4,858 కోట్లు. కానీ దానికి ఆమోదం లభించలేదు. చిత్రంగా ఆరేడు నెలలు తిరక్కుండానే.. అదే 2007లో, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ చేత ఉషోదయా విలువ కట్టించుకుంది. రూ.7,150 కోట్లుగా అది విలువ కట్టింది. మరి ఈ ఆరేడు నెలల్లోనే ‘ఈనాడు’ ఆస్తులు రూ.2,300 కోట్ల మేరకు ఎలా పెరిగిపోయాయి? రామోజీ ఏం మంత్రం వేశారు? ఆ రహస్యమేమిటో మిగతా వాళ్లకూ కాస్త చెప్పొచ్చుగా?

అడ్డదారి కాదు.. దొడ్డిదారి లాభం!

‘‘అశ్వత్థామ హత ః.. కుంజర’’ అన్న చందాన.. ‘లాభాలు’ అని పెద్ద అక్షరాల్లో రాసి న రామోజీ.. వడ్డీ, పన్నులు, తరుగుదల తీయక ముందు అనే చిన్న షరతు పెట్టారు. అవన్నీ తీసేశాక ఇంకేముంటుంది? అసలేముంది? సంవత్సరాలవారీగా చూస్తే.. ఇవండీ లెక్కలు. ఇవి స్వయంగా రామోజీరావు ఆర్‌ఓసీకి దాఖలు చేసిన పత్రాల్లోనివే. మరిక్కడ రామోజీరావు చెప్పినట్టు ఈనాడు రూ.229 కోట్లు, ఈటీవీ చానళ్లు 106 కోట్లు, ప్రియా ఫుడ్స్ 16 కోట్లు లాభం ఆర్జించినట్టు ఎక్కడుంది? అసలు ఇవి ఏ సంవత్సరం లెక్కలు? 2006 నుంచి 2010 వరకు ఆర్‌ఓసీలో దాఖలు చేసిన లెక్కలతో ఇవి సరిపోలటం లేదెందుకు? అంటే రామోజీ ఆర్‌ఓసీకి ఒక లెక్క.. మదింపు సంస్థలకు మరో లెక్క చెప్పారా? మోసం చేశారా?

పైన చెప్పిన లెక్కల ప్రకారం చూసినప్పుడు 2006-07లో 108 కోట్ల రూపాయల లాభం కళ్లచూసిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్.. ఆ తరవాత 2010 వరకూ ఎన్నడైనా లాభం కళ్లజూసిందా? అసలు తరుగుదల, పన్ను తదితరాలు తీయక ముందు లాభం వచ్చిందన్న ‘ఈనాడు’ సూత్రం ప్రకారమైతే జగతి పబ్లికేషన్స్ సంస్థ తొలి ఏడాది నుంచీ లాభాల్లోనే ఉంది. మరి దీనికేమంటారు? ఎవరిని మభ్య పెట్టడానికి ఈ లెక్కలు? 2007 నుంచి వరుసగా నష్టాలే వస్తున్న ‘ఈనాడు’లో ముకేశ్ అంబానీ ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? ఏ బాబు చేసిన సాయానికి ప్రతిఫలంగా ఆ డబ్బులు రామోజీకి ముట్టాయి? అది కూడా ముకేశ్ అంబానీ ఎందుకు ధైర్యంగా, నేరుగా పెట్టకుండా, తన తైనాతీల ద్వారా గొట్టాం కంపెనీల్ని సృష్టించి మరీ పెట్టుబడి పెట్టారు? అది కదా మీరు చెప్పాల్సింది? అవన్నీ వదిలేసి తప్పుడు లెక్కలతో ఎవరిని నమ్మించాలని?

ఇన్ని రెట్లు... అన్ని రెట్లు... అసలెన్ని రెట్లు?
లాభంపై ‘ఈనాడు’ మదింపు విలువ 12 రెట్లా? అదే ‘ఈటీవీ’కైతే 40 రెట్లా? ప్రియా పచ్చళ్లకేమో 8 రెట్లా? ఇది మదింపు విలువా, లేక మతి తప్పి వేసిన విలువా? అసలు పన్ను, తరుగుదల తదితరాలకు ముందు వచ్చిన లాభాన్ని లాభంగా చూపించటమే ఓ గొప్ప ఐడియా. దాన్ని బట్టి మీ షేరు విలువ దానికి ఎన్ని రెట్లుందో చెప్పటమంటే.. కనీసం టెన్త్ క్లాస్ కూడా పాసవని వ్యక్తి చెబుతున్నట్టుగా లేదూ? సాధారణంగా అయితే పన్ను, తరుగుదల తరవాత వచ్చే నికర లాభాన్ని మాత్రమే లాభంగా చూస్తారు. దాన్ని ఆ సంస్థ జారీ చేసిన మొత్తం షేర్లతో భాగిస్తారు. అప్పుడు వచ్చే మొత్తాన్ని ప్రతి షేరుకు ఆర్జనగా (ఎర్నింగ్స్ పర్ షేర్) లెక్కిస్తారు. షేరు విలువ ఈ ఈపీఎస్ కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటే దాన్ని పీఈ (ప్రైస్/ఎర్నింగ్)గా చెబుతారు. ఈ పీఈ ఎంత తక్కువ ఉంటే షేరు విలువ అంత రీజనబుల్‌గా ఉన్నట్టన్నమాట. కాకపోతే పోటీ ప్రపంచంలో తమకు నచ్చిన కంపెనీ షేరును ఎంత పీఈ ఉన్నా కొనటానికి మదుపరులు వెనకాడరు. ఇది మార్కెట్ సూత్రం.

టీవీ చానళ్లకెందుకు 40 రెట్లు?
ఇక్కడ రామోజీ జవాబు చెప్పాల్సిన అంశం మరొకటుంది. ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో మూడూ భాగమే. ఈ మూడింటినీ విడివిడిగా చూస్తే.. ఉషోదయాకు వస్తున్న మొత్తం ఆదాయంలో 40 శాతం ఈనాడు పత్రిక నుంచి వస్తోంది. 36 శాతం చానళ్ల నుంచి, 24 శాతం పచ్చళ్ల నుంచి వస్తోంది. మరి 40 శాతం ఆదాయాన్ని తెస్తున్న ఈనాడు పత్రికకు రూ.2,750 కోట్ల విలువ కట్టిన రామోజీ.. టీవీ చానళ్లకు రూ.4,250 కోట్లుగా విలువ ఎందుకు కట్టారు? ప్రియా పచ్చళ్లకు రూ.130 కోట్ల విలువే ఎందుకుంది? ప్రియా షేరు విలువ లాభానికి (రామోజీ చెబుతున్న మేరకే) 8 రెట్లుండగా.. అధిక ఆదాయాన్ని తెస్తున్న ‘ఈనాడు’ విలువ 12 రెట్లుండగా.. టీవీ చానెళ్ల విలువ మాత్రం 40 రెట్లు ఎందుకుంది? దీన్లోని మర్మమేంటి? అందుబాటులో ఉన్న వివరాల మేరకు చూస్తే.. రామోజీ తెలివంతా ఇక్కడే కనిపిస్తుంది. ముకేశ్ అంబానీ గొట్టాం కంపెనీలకు రూ.2,600 కోట్లకు ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌లో 40 శాతం వాటాను విక్రయించారు రామోజీ. 

అంటే పత్రిక, చానళ్లు, ప్రియా పచ్చళ్లు.. అన్నిట్లోనూ 40 శాతం వాటా అంబానీకి దక్కినట్టే. కానీ అంతో ఇంతో లాభాలు సంపాదిస్తున్న ‘ఈనాడు’ పత్రికను, పచ్చళ్ల వ్యాపారాన్ని వదులుకోవటానికి రామోజీ సిద్ధంగా లేరు. దాంతో చంద్రబాబు ద్వారా మీట నొక్కారు. అంతే! రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టిన నాలుగేళ్లు వేచి చూసిన తరవాత.. అప్పటివరకూ పైసా వడ్డీ రాకున్నా, నయా పైసా డివిడెండ్ కూడా లేకున్నా ఊరుకున్న నిమేశ్ కంపానీ.. మరో సాహసం చేశారు. తను పెట్టిన పెట్టుబడికి ఆ పుచ్చు చానళ్లలో వాటా చాలని.. పత్రికలోను, పచ్చళ్ల కంపెనీలోను వాటా వదులుకుంటానని ‘ముందుకొచ్చారు’. మరి కంపానీకి ఒరిగిందేమిటి?

- కంపానీకి అప్పటికే ఈనాడు పేపరుతో పాటు, పచ్చళ్లలో, చానళ్లలో 40 శాతం వాటా ఉంది. ఈ మొత్తాన్ని వదులుకున్నందుకు.. అది కూడా రూ.2,600 కోట్లు పెట్టుబడి పెట్టిన నాలుగేళ్ల తరవాత ఆయనకు దక్కిందెంతో తెలుసా?
- ఐదు హిందీ వార్తా చానళ్లలో 100 శాతం వాటా. ఐదు ప్రాంతీయ చానళ్లలో 50 శాతం వాటా. తెలుగు చానళ్లలో 24.5 శాతం వాటా. అంతే!!!

- ఈటీవీ చానళ్లకు వచ్చే ఆదాయంలో 25 శాతం తెలుగు నుంచే వస్తోంది. అలాంటి విభాగంలో కంపానీ వాటా 24.5 శాతమే కావటం గమనార్హం.

- రామోజీ తన చానళ్లకు రూ.4,350 కోట్లుగా విలువ కట్టింది కూడా అందుకే. పత్రికలో, పచ్చళ్ల కంపెనీలో వాటాను ఎవరికీ అమ్మటం లేదు కనక వాటి విలువను కావాలనే కాస్త తక్కువగా వేయించి.. చానళ్లలో వాటాను విక్రయించటం పేరుతో డబ్బులు తెచ్చుకుంటున్నారు కనక వాటికేమో అసాధారణంగా విలువ కట్టేశారు. దానికి చంద్రబాబు సిఫార్సూ తోడవటంతో అంబానీ కూడా ఊకొట్టేశారు. అసలు ఈ దేశంలో ఏ టీవీ సంస్థకైనా ఇంతటి వాల్యుయేషన్ ఉందా?

- దేశంలో న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, లైఫ్ స్టైల్, బిజినెస్ రంగాల్లో దాదాపు 10 చానళ్లను నిర్వహిస్తున్న ఎన్‌డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్) మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం ఎంతో తెలుసా? కేవలం రూ.285 కోట్లు!

- పలు భాషల్లో కేవలం వార్తా చానళ్లు మాత్రమే నడుపుతున్న జీ న్యూస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం రూ.225 కోట్లు. 

- అంతెందుకు? సీఎన్‌బీసీ టీవీ-18, అవాజ్ వంటి బిజినెస్ చానళ్లు.. సీఎన్‌ఎన్
- ఐబీఎన్, ఐబీఎన్18, ఐబీఎన్ లోక్‌మత్ వంటి న్యూస్ చానళ్లు.. కలర్స్, నిక్, ఎంటీవీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లున్న టీవీ-18 సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ కేవలం రూ.655 కోట్లు. మరి ‘ఈటీవీ’కి అంత విలువెలా కట్టారు?

వాటా అమ్మిన సొమ్ము హెచ్‌యూఎఫ్‌లోకి!
మూడున్నర దశాబ్దాలుగా అక్షర యుద్ధం చేస్తున్నామంటూ తెలుగు సినిమా డైలాగులు చెప్పిన ‘ఈనాడు’.. ఉషోదయాలో వాటా అమ్మి రూ.2,600 కోట్లు తెచ్చుకుని మార్గదర్శి డిపాజిటర్లకు చెల్లించామని కూడా పేర్కొంది. కానీ ఆ వాటా ఎవరికి అమ్మారన్నది మాత్రం వెల్లడించలేకపోయింది? తన వాటాదారెవరో చెప్పటానికి అంత సిగ్గెందుకు? తన భాగస్వామి ఎవరో చెప్పటానికి ఉలుకెందుకు?

ఇంకా చిత్రమేంటంటే ఉషోదయా షేర్లను కంపానీకి చెందిన ‘ఈక్వేటర్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్’కు కేటాయించడం ద్వారా రామోజీ తొలి విడత రూ.1,423 కోట్లు రాబట్టుకున్నారు. చట్టబద్ధంగా అయితే ఈ సొమ్ము ఉషోదయా సంస్థలోకి రావాలి. కానీ రామోజీ దాన్ని తన జేబులో వేసుకోవటానికి ఓ ఎత్తు వేశారు. పాత సినిమాలు, ఎండమావులు-అంతరంగాల వంటి సీరియళ్లన్నీ ఉషాకిరణ్ టెలివిజన్ పేరిట ఉన్నాయంటూ.. దాని విలువను రూ.775 కోట్లుగా వాల్యుయేషన్ వేయించారు. దాన్ని ఉషోదయా చేత కొనుగోలు చేయించారు. 

అంతటితో ఊరుకోకుండా.. ఉషాకిరణ్ సంస్థ పోటీగా మరో లైబ్రరీని నిర్వహించకుండా దానికి నాన్ కాంపిటీషన్ ఫీజు కింద రూ.670 కోట్లు చెల్లిం చారు. అంటే మొత్తమ్మీద ఉషోదయాకు వచ్చిన సొమ్మును హెచ్‌యూఎఫ్ చేతిలో ఉన్న ఉషాకిరణ్‌కు మళ్లించారు. అలా తన జేబులో వేసుకుని దాన్ని మార్గదర్శి డిపాజిటర్లకు చెల్లించారు. పనికిరాని సినిమాలు, సీరియళ్లను ఎవరైనా రూ.775 కోట్లిచ్చి కొంటారా? ఉషాకిరణ్‌కు నాన్‌కాంపిటీషన్ ఫీజు కింద రూ.670 కోట్లు చెల్లించటం కరెక్టా? ఇవన్నీ రామోజీకి పట్టవు. ఎదుటి వారికైతే ఎన్నయినా చెబుతారు.

ఆడిటర్లే ముక్కున వేలేసుకుంటున్నారు..
ఈ సాఫ్ట్‌వేర్ లైబ్రరీ విలువ చూసిన రామోజీ ఆడిటర్లు ముక్కున వేలేసుకున్నారు. దానికి అంతటి విలువ ఉంటుందని తాము భావించటం లేదని కామెంట్ కూడా రాశారు. కానీ రామోజీ దానికి ఏమని జవాబిచ్చారో తెలుసా? అది సరైన విలువే అని యాజమాన్యం నమ్ముతోందని!! యాజమాన్యమే నిర్ణయించాలంటే ఆడిటర్లెందుకు? ఇంకా చిత్రమేంటంటే దీనికి అంతటి విలువ చెల్లించడానికి కంపానీ ఒప్పుకున్నా.. కంపానీ ఆడిటర్లు మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ షరామామూలే!! అదీ రామోజీ నీతి.

పదేళ్లపాటు ఇక నష్టాలే..
ఇంకా విశేషమేంటంటే లైబ్రరీ కొనుగోలుకు చెల్లించిన రూ.1,470 కోట్లను టీవీ చానళ్లకు వచ్చే ఆదాయంలో పదేళ్ల పాటు మినహాయిస్తారు. అంటే దీనర్థం.. వచ్చే పదేళ్ల పాటు రామోజీ చానళ్లు పైసా లాభాన్ని కూడా కళ్ల చూసే అవకాశం లేదనేగా? ఇదంతా తెలిసి కూడా కంపానీ ఎందుకు ఒప్పుకున్నట్టు?

రూ.1,800 కోట్ల నష్టాల హెచ్‌యూఎఫ్...
మార్గదర్శి స్కామ్ బయటపడేటప్పటికి రామోజీ హెచ్‌యూఎఫ్ సంచిత నష్టాలు రూ.1,800 కోట్లు. దీన్లో ప్రధానమైనది మార్గదర్శి ఫైనాన్సియర్సే. ఈనాడుకైనా, ఫిలింసిటీకైనా, టీవీ ఛానెళ్లకైనా నిధులు ప్రవహించింది దీన్నుంచే. చట్టాల్ని చట్టుబండలు చేసి అక్రమంగా సేకరించిన ఈ నిధులతోనే రామోజీ అడ్డదార్లో ఎదిగారు. అది బయటపడి, డిపాజిటర్ల సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వచ్చేసరికి తన సియామీ కవల చంద్రబాబు ద్వారా మరో అక్రమానికి దిగారు. ఇదీ రహదారి కథ.

ఈ దేశంలో ఇప్పటిదాకా వెలుగు చూసిన కుంభకోణాల్లోకెల్లా ఇదే అత్యంత తీవ్రమైన కుంభకోణమని అనిపించడం లేదా? ఎందుకంటే కంపానీ అయినా, అంబానీ అయినా రామోజీకి చదివించుకున్న డబ్బు.. పైసా పైసా దాచుకుని షేర్లు కొనుక్కున్న ఇన్వెస్టర్ల సొమ్మే. ఈ వ్యవహారంలో నష్టపోయింది వారే! లిస్టెడ్ కంపెనీలో ఇంత కుంభకోణం జరిగినా సెబీ వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు మిన్నకున్నాయి? ఇన్వెస్టర్ల సొమ్ము గొట్టాల మార్గంలో వచ్చినందుకు రామోజీని ఎందుకు ప్రశ్నించటం లేదు? ఇవన్నీ కాలం మాత్రమే సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలు.

2 comments:

  1. Eenadu is not at all a News Paper to be read by wise people, because it contains the matter of his master RAMOJI RAO the great. If it talks about the welfare of the common man, it can be read by all of us. If we don't eliminate bad News Papers,our state and the country, sure, are going to be ruined.

    ReplyDelete
  2. Ramoji Rao has become dearest to the present INC. So they like to ruin the country with the help of other people of similar intentions. Such people are plenty in our state AP.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!