దక్షిణాదిన ఆవిర్భవిస్తున్న నూతన రాజకీయ ధృవతార జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆదేశానుసారం సీబీఐ విరుచుకుపడటంతో అనూహ్యమైన రీతిలో ఆయన ప్రాభ వం దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. ఇప్పటికే శిథిల మవుతున్న ఆ పార్టీకి అనతి కాలంలో మరో ఉపద్రవం ముంచుకు రాబోతున్నది.వైఎస్సార్ మరణానంతరం, కాంగ్రెస్ ఆయన పేరుప్రతిష్టలను రూపుమాపాలనే ప్రయత్నంలో ఆ పథకాలనన్నింటినీ నీరుగార్చింది. వ్యక్తి ఆధిక్యతకు విరుద్ధంగా పార్టీ ఆధిక్యతను నెలకొల్పాలని కాంగ్రెస్ కోరుకుంది. కానీ అది ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశంగా మారింది కూడా. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు పార్టీలో అధిష్టానాన్ని... అంటే సోనియాగాంధీని మించిన ప్రాంతీయ నేత ఎవరూ ఉండటానికి వీల్లేదు.‘బంతిని ఎంతగట్టిగా నేలకేసి కొడితే అంతే వేగంగా పైకి లేస్తుంది.’ కొడుకు ైవె ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండగా దృఢంగా నిలిచిన వైఎస్ విజయమ్మ పలికిన పలుకులివి. మే 28న సీబీఐ స్పెషల్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఏ పుల్లయ్య జగన్‌ను జూన్ 11 వరకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. తీర్పు తదుపరి జగన్ ప్రశాంతంగానూ, స్థిమితంగానూ కనిపించారు. మునుపెన్నడూ ఎరుగని పటిష్ట భద్రతా ఏర్పాట్లతో మే 28 తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ నగరం ఒక కోటలాగా మారిపోయింది. నగరమంతా 144వ సెక్షన్‌ను విధించారు. కానీ సాయంత్రం 5.30 గంటలకల్లా సిటీ కోర్టు ఆవరణలో ఆ నిషేధాజ్ఞలు ఆవిరయిపోయాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, కోర్టు సిబ్బంది కలగలసిపోయి మరీ జగన్‌కు సమీపించాలని, ఆయనతో కరచాలనం చేయాలని, కనీసం తాకనైనా తాకాలని తొక్కిసలాడారు. జైలుకు తరలిస్తున్నప్పుడు కూడా ఒక్క క్షణమైనా ఆయన నవ్వు చెదిరింది లేదు. దివంగతులైన తన తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారంటూ సీబీఐ మోపిన అభియోగాలను పట్టించుకున్నవాళ్లుగానీ, నమ్మినవాళ్లుగానీ అక్కడ ఎవరూ లేరు. జగన్‌పై ఆగ్రహాన్ని రగల్చడానికి బదులుగా కాంగ్రెస్ ఎత్తుగడ దానికే బెడిసికొట్టింది. తనకొక వరంగా పరిణమించగలగిన వ్యక్తిని ఒకే ఒక్క ఎత్తుతో అది బద్ధశత్రువుగా మార్చుకుంది.
జగన్‌ను దెబ్బతీయడానికి కాంగ్రెస్ పార్టీ సీబీఐని ప్రయోగించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2007లో ములాయంసింగ్‌యాదవ్‌పైనా, 2003లో తాజ్ కారిడార్ కేసులో మాయావతిపైనా కూడా అది అలాగే సీబీఐని ప్రయోగించింది. కానీ ఒక్క జగన్ విషయంలోనే దాని చర్యకు ప్రతిచర్య ఎదురైంది. సీబీఐని ప్రయోగించడం జగన్‌కు వరంగా పరిణమించింది. 18 శాసనసభ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి జూన్ 12న జరగనున్న కీలకమైన ఉప ఎన్నికలలో మొత్తం అన్ని స్థానాలను ఆయనే గెలుచుకునేలా ఉన్నారు. ఇందులో 16 శాసససభ స్థానాలు కాంగ్రెస్‌వే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పతనం అంచులకు చేరుతోంది.
జగన్ అరెస్టయ్యాక అప్పుడే బొబ్బిలి ఎంఎల్‌ఏ ఎస్‌కే రంగారావు కాంగ్రెస్‌ను వీడారు. మే 30న రాజీనామా చేస్తూ ఆయన తాను వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన, పార్వతీపురం ఎంఎల్‌ఏ సువారపు జయమణి, కురుపాం ఎంఎల్‌ఏ టీవీవీటీ జనార్దన్‌లను కూడా తన బాటనే పట్టాలని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సొంత జిల్లా విజయనగరంలోనే ఎంఎల్‌ఏలను నిలబెట్టుకోవడం రోజురోజుకూ కష్టమవుతోంది.
హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్‌ఆర్ మరణించినప్పటి నుంచి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, జగన్‌కు మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. వేచి ఉండాలని సోనియా భావించారు. రాజకీయ ఎత్తుగడలు మొదలు కావడంతోనే సీబీఐ కూడా రంగప్రవేశం చేసింది. జగన్ ఏమేం చేశారని ఇప్పుడు ఆరోపిస్తున్నారో వాటిని వైఎస్‌ఆర్ చేసినప్పుడు సీబీఐ దర్యాప్తును చేపట్టలేదు. కాంగ్రెస్ అలవాటు ప్రకారమే తన హస్తం కనబడకుండానే పని కానిచ్చేయాలని ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం పరిధిలోకి తెచ్చింది.
జగన్ ఆస్తులపై సీబీఐ విచారణను కోరుతూ కాంగ్రెస్ ఎంఎల్‌ఏ పీ శంకరరావు 2011 ఆగస్టు 21న ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. ఆ తర్వాత 10 రోజులకు ఆయన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి అయ్యారు. ఏపీ హైకోర్టు 2011 ఆగస్టు 10న జగన్ ఆస్తుల కేసులో దర్యాప్తును చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఉప ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరాక, మే 25న మొట్టమొదటిసారిగా సీబీఐ జగన్‌ను విచారణకు పిలిచింది. ప్రచారాన్ని ఆపక తప్పని పరిస్థితిని ఆయనకు కల్పించింది. అదే రోజు జగన్ అరెస్టు జరుగుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నా సీబీఐ వేచి చూసింది. ‘మే 28న జగన్ ఎలాగూ సీబీఐ న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి ఉంది. జగన్ కోర్టుకు హాజరయ్యేలోగా ఆయనను అరెస్టు చేయకపోవచ్చ’ని సీబీఐలోని అత్యున్నత వర్గాలు ‘ఇండియా టు డే’కు తెలిపాయి.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు పక్కనే ఉన్న దిల్‌కుష గెస్ట్‌హౌస్‌లో సీబీఐ జగన్‌ను ప్రశ్నిస్తుండగా ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులామ్ నబీ అజాద్, రాష్ట్ర ఉప ఎన్నికల ఇన్‌చార్జి వాయలార్ రవి, కేంద్ర సహాయ మంత్రి వీ నారాయణస్వామి, కేబినెట్ కార్యదర్శి ఏకే సేథ్‌ల మధ్య ముమ్మరంగా చర్చలు సాగాయి. ఆ తదుపరి, మే 27 ఉదయమూ, ఆ తర్వాతా అజాద్ సోనియాతో భేటీ అయ్యారు. జగన్ అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
జగన్‌ను ప్రచారానికి దూరం చేసి నష్టాలను తగ్గించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తద్వారా దానికి కాసింత ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. కానీ, ఇంతలోనే ‘ప్రజా న్యాయస్థానమే జగన్‌కు న్యాయం చేస్తుంది’ అంటూ జగన్ తల్లి, పులివెందుల ఎంఎల్‌ఏ విజయమ్మ ప్రచారానికి దిగారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి మరింతగా దిగజారిపోయేట్టుంది. యూపీఏ-1కి 29 లోక్‌సభ సీట్లను, యూపీఏ-2కి 33 సీట్లను అందించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైనది. పైగా దక్షిణాదిలో తనకు తానుగా అధికారం నెరుపుతున్న రాష్ట్రం అదొక్కటే. అందుకే కాంగ్రెస్‌కు ఇది జీవన్మరణ పోరాటం. ‘చాలా నియోజకవర్గాల్లో పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంద’ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే స్వయంగా అన్నారు. క్యాడర్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు వైఎస్సార్‌సీపీ పక్షాన చేరిపోయారని, ఈ ధోరణిని అరికట్టడానికి సమయం పడుతుందని అంగీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 12న జరుగనున్న ఉప ఎన్నికలు 1983 సార్వత్రిక ఎన్నికలంతటి కీలకమైనవి. ఆ ఎన్నికలలోనే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బలీయమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించింది. జగన్, ఎన్టీ రామారావుకు దీటుగా నిలవగలడా? 2014 సాధారణ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్, టీడీపీలు రెండింటి ఓట్లను గణనీయంగా తన వేపుకు మరల్చుకోగలుగుతుందా? జగన్ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని భావిస్తున్న సామాజిక వర్గాలు వైఎస్సార్‌సీపీ వెనుక బలంగా సంఘటితమయ్యాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు కూడా ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అయితే జగన్ అరెస్టు తటస్థ ఓటర్లను... ప్రత్యేకించి అవినీతిని ఎన్నికల అంశంగా భావించే మధ్యతరగతి ఓటర్లను ఆ పార్టీకి దూరం చేసింది.
గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అది, జగన్ జనాకర్షణను మించి మరీ ఓటర్లను ప్రభావితం చేస్తోంది. ఆ ఓట్లన్నీ టీడీపీ, వైస్సార్‌సీపీల మధ్య చీలుతాయి. ‘యుడోఫడ్ స్ట్రేటజీస్’ డెరైక్టర్ తేజా నర్రా అన్నట్టు ‘‘ప్రధాన ప్రతిపక్షంగా మసకబారిపోతున్న టీడీపీపై 2014 ఎన్నికలు తీవ్ర పర్యవసానాలను కలుగజేస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004-2009 కాలాన్ని ప్రజలు వైఎస్సార్‌తో ముడిపడినదిగానే చూస్తున్నారు. ఆ ప్రభుత్వం వల్ల జరిగిన మంచికంతటికీ ఆయనే కారణమని, ఆ తర్వాత నడుస్తున్నది కాంగ్రెస్ పాలన అని భావిస్తున్నారు’’.
టీడీపీ ఎంఎల్‌ఏలు ఐదుగురు రాజీనామాలు చేసి, ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. అయితే వారిలో ఒకరు స్వతంత్రులుగానూ, మరొకరు వెఎస్సార్‌సీపీ తరఫున, ముగ్గురు టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. మే 31న టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ టిక్కెట్టుపై మరోమారు పోటీ చేసేది లేనేలేదని నూజివీడు ఎంఎల్‌ఏ సీ రామకోటయ్య ప్రకటించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవమని కూడా ఆయన అన్నారు. రామకోటయ్య ఇప్పుడు తన భవిష్యత్తును తేల్చుకోనున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తాను తీవ్ర సంకటాన్ని ఎదుర్కొంటున్నానని తెలుసు. ‘‘జగన్‌ను జైలుకు పంపాలన్న కోరిక నాకేమీ లేదు. కాకపోతే కొల్లగొట్టిన ప్రజాధనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదల సంక్షేమానికి వ్యయం చేయాలని కోరుకుంటున్నాను. వైఎస్సార్ పాలనలో జరిగిన అవినీతిని టీడీపీ బట్టబయలు చేసింది. ఆయనపై చర్య తీసుకోవాలని ప్రధానిని కోరింది. కానీ, యూపీఏ, కాంగ్రెస్‌లు యథావిధిగా సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయి’’ అని నాయుడు అన్నారు.
సీబీఐ జగన్‌ను అరెస్టు చేయడంలో కాంగ్రెస్ పాత్రేమీ లేదని ముఖ్యమంత్రి గట్టిగా చెబుతున్నారు. ‘జగన్, తన అరెస్టును ఉపయోగించుకొని సానుభూతిని రేకెత్తింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ అరెస్టుకు, మాకు ఎలాంటి సంబంధమూ లేదు’ అన్నారాయన. అయితే, వైఎస్సార్ పేరు ప్రతిష్టలను ప్రత్యేకించి విజయవంతమైన ఆయన అభివృద్ధి కార్యక్రమాలను, పేదరిక నిర్మూలనా పథకాలను ఒక క్రమపద్ధతిలో కాంగ్రెస్ ఎందుకు రూపుమాపాలని ప్రయత్నిస్తోందనే ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం లేదు.
జగన్ వ్యతిరేక పోరాటంలో అనుకోని విధంగా తాము సమిధలు కావడం పట్ల కాంగ్రెస్ నేతలు కొందరిలో రోజురోజుకీ ఆందోళన పెరిగిపోతోంది. సీబీఐ జగన్‌ను ప్రశ్నించడానికి పిలిచిన రోజుకు ఒక్క రోజు ముందే ఎక్సైజు మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టవడం వారికి దిగ్భ్రాంతిని కలుగజేసింది. వాడరేవు- నిజాం పట్నం ఓడ రేవు... పారిశ్రామిక కారిడర్ (వాన్‌పిక్) ఒప్పందాలకు అనుమతిని ఇవ్వడానికి సంబంధించిన ఆరోపణలపై మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసింది. మే 24న ముఖ్యమంత్రికి పంపిన రాజీనామా లేఖలో మోపిదేవి, ఆనాటి సీఎం వైఎస్సార్ ఆదేశాలను పాటించడం మాత్రమే తాను చేశానని, ఆయన కార్యాలయంలోనే ఫైలుపై సంతకం చేశానని, ఆ ఫైలును తన కార్యాలయానికి పంపింది కూడా లేదని పేర్కొన్నారు.
ఏదిఏమైనా అనుమతులు సంపాదించాలని ప్రయత్నిస్తున్న కంపెనీలకు అనుకూలంగా వైఎస్సార్ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు, పలువురు ప్రభుత్వాధికారులు ప్రభుత్వ ఆదేశాలను జారీ చేశారని, అందుకు బదులుగా, ఆ కంపెనీలు క్విడ్ ప్రో కోగా జగన్ సంస్థలలో పెట్టుబడులను పెట్టడానికి సిద్ధపడ్డారని సీబీఐ ఒక వాదాన్ని రూపొందించింది. ‘అవినీతికి పాల్పడ్డవారెవరినీ వదిలేది లేదు. ఏపీ హైకోర్టు ఆదేశానుసారం సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు సరిగ్గా అదే చేస్తోంది’ అని కాంగ్రెస్ విధేయుడైన ఎంపీ మధుయాష్కీ అభిప్రాయపడ్డారు.
జగన్‌పై రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ‘‘జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక కాంగ్రెస్ ఆయనపై సీబీఐని ప్రయోగిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ ఇలా సీబీఐ వంటి సంస్థలను వాడుకోవడానికి వీల్లేకుండా వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించాలి’’ అని ఒకప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు.
2011, ఏప్రిల్‌లో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా లోక్‌సభ ఉపఎన్నికల్లో జగన్‌పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ, సీబీఐ జగన్‌ను విచారించడానికి పిలిచేసరికి మైసూరా వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో వైఎస్సార్‌ను ఒక విలన్‌గా చిత్రీకరిస్తోంది. కానీ జగన్‌కు ఆయన నుంచి సంక్రమించిన రాజకీయ వారసత్వాన్ని ఎదిరించి నిలవడం మాత్రం దాని వల్ల కావడం లేదు. ‘
‘వైఎస్సార్ ఒక అద్భుతమైన నాయకుడు. ఆయన పేదలకు గృహవసతి, ఆహారం, ఆరోగ్య భద్రతలను కల్పించడానికి పలు పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలవల్ల 80 లక్షల మంది ప్రజలు లబ్ధిని పొందారు. ‘ఇందిర ప్రభ’ పేరిట ఆయన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును, నీటిని అందించారు. 28 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు లభించింది’’ అని డీఏ సోమయాజులు తెలిపారు. వైఎస్సార్‌కు ఆయన ఆర్థిక సలహాదారుగా ఉండేవారు.
నేడు ఆయన జగన్ ఆంతరంగికుల్లో ఒకరు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకంద్వారా 11 లక్షల మంది ప్రజలు రాష్ట్రంలోని అత్యుత్తమమైన ఆసుపత్రుల వైద్య సేవలను అందుకున్నారని ఆయన వివరించారు. వైఎస్సార్ మరణానంతరం, కాంగ్రెస్ ఆయన పేరుప్రతిష్టలను రూపుమాపాలనే ప్రయత్నంలో ఆ పథకాలనన్నింటినీ నీరుగార్చింది. వ్యక్తి ఆధిక్యతకు విరుద్ధంగా పార్టీ ఆధిక్యతను నెలకొల్పాలని కాంగ్రెస్ కోరుకుంది. కానీ అది ప్రతికూల ఫలితాలకు దారితీసింది. ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశంగా మారింది కూడా. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు పార్టీలో అధిష్టానాన్ని... అంటే సోనియాగాంధీని మించిన ప్రాంతీయ నేత ఎవరూ ఉండటానికి వీల్లేదు.
జగన్ తన తండ్రికి ఉన్న మంచిపేరును ఆధారం చేసుకొని బలాన్ని పెంపొందింపచేసుకోవడంలో గొప్ప నేర్పును ప్రదర్శించారు. తొలుత ఓదార్పు యాత్రను ప్రారంభించినప్పడు ఆయన ప్రజల సానుభూతి ప్రాతిపదికగా జనాకర్షణశక్తిని పెంచుకున్నారు. ప్రజలు ఆయనను తమ ‘రక్షకుని’ కుమారునిగా చూశారు. కాంగ్రెస్, జగన్‌తో వ్యవహరించిన తీరు దానికి తోడయింది.
2009 నుంచి అజాద్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. కానీ రాష్ట్ర వ్యవహారాలపై మాత్రం ఆయనకు ఎన్నడూ పట్టు లభించలేదు. కొన్ని కాంగ్రెస్ పోస్టర్లలో ఇంకా వైఎస్సార్ ఫొటోలు ఉండటం చూసిన వాయలార్ రవి వాటిని వెంటనే తొలగించేలా చేశారు. ప్రజల మధ్య తిరగడం ప్రారంభించి, రాజకీయాల్లోని కష్టనష్టాలను ఎదుర్కోవడం మొదలయ్యాకే జగన్ ప్రజలకు ప్రేమాస్పదుడైన వ్యక్తిగా అవతరించారు. వైఎస్సార్ విధేయులైన పలువురు మాజీ కాంగ్రెస్ నేతలకు మొదట్లో జగన్ శక్త్తిసామర్థ్యాల పట్ల భరోసా ఉండేది కాదు.
వైఎస్సార్ మరణానంతరం ఆరు నెలలకు తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక కన్నుమూసిన వారి కుటుం బాలను కలుసుకోవడానికి జగన్ ఓదార్పు యాత్రను చేపట్టారు. ఆ యాత్రలో ఆయన ప్రదర్శించిన సహనాన్ని, నిబద్ధతను చూశాక వాళ్లకు జగన్ నాయకత్వ లక్షణాలపై గురి కుదిరింది. ఆ ఓదార్పు యాత్రలోనే ఆయన తన గుండె ధైర్యాన్ని నిరూపించుకునారు. 13 జిల్లాలలో 17,430 కిలోమీటర్ల దూరాన్ని 265 రోజుల పాటు ప్రయాణించిన జగన్ 5,152 గ్రామాలను, 114 పట్టణాలను సందర్శించారు. 700 కుటుంబాలను కలుసుకున్నారు.
జగన్ కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా మే 17న ‘ఇండియా టు డే’ ఆయనకు ప్రజల నుంచి లభిస్తున్న అఖండ ప్రజా స్పందనను కళ్లారా చూసింది. వైఎస్సార్, జగన్‌ల చిత్తరువులున్న మినీ బస్సు గ్రామాలలోంచి మెలికలు తిరుగుతూ పోతుంటే... కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని దారికి ఇరువేపులా ఉన్న ఇళ్లు, భవనాలపై ప్రజలు గుమిగూడి వేచి ఉన్నారు. జగన్‌కు నేడు అలవాటుగా మారిన పూర్తి చేతుల చొక్కాతో, బూడిద రంగు ప్యాంటు ధరించి మండే ఎండలకు కమిలిపోయి ఉన్నారు. ఆయన ప్రతి గ్రామంలోనూ ఆగి, పిల్లలను ముద్దాడారు, వృద్ధులను కౌగలించుకున్నారు. అత్యంత బలమైన జనాకర్షణ శక్తిని గలిగిన జగన్ తమను తాకడంతోనే మహిళలు, వృద్ధులు, యువకులు ఆనంద భాష్పాలు రాల్చారు. మగవాళ్లు ఆయనతో మాట్లాడాలని, పెద్దలు ఆశీర్వదించాలని తాపత్రయపడ్డారు. చిన్నవాళ్లు ఆయనను ‘అన్నా’ అని పిలిచారు.
మాటలకు తడుములాడుకునే ఒకప్పటి వ్యాపారవేత్త జగన్ తన ప్రసంగాలకు నాటకీయతను జోడిస్తూ ఉత్తేజకరమైన ఉపన్యాసకునిగా పరివర్తన చెందారు. ఏదైనా ఒక అంశాన్ని చెప్పేటప్పుడు ఆయన కుడిచేతిని అలా గాలిలో ఊపుతూ గుమిగూడిన ప్రజల చూపుల్లో చూపులను కలిపేవారు. కడప జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ దర్శనమిచ్చే వైఎస్సార్ విగ్రహాలను దాటి మెల్లగా సాగుతున్నప్పుడు చేయి ఊపేవారు. తన తండ్రి పథకాలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చేవారు. హఠాత్తుగా ఎదిగిన నేతగా ఉన్న స్థితి నుంచి నేడాయన, ఐతిహాసిక పురుషునిగా గుర్తింపు పొందిన ఎన్టీ రామారావుతో పోల్చదగిన ప్రజానాయకునిగా మార్పు చెందారు.
అభిమానం, వల్లమాలిన మోజుగా మారి దినదినం ఇనుమడిస్తున్న జగన్ జనాకర్షణశక్తి, దివంగతులైన తన భర్తను గుర్తుకు తెస్తోందని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. మే 26న సీబీఐ విచారణకు వెళ్లడానికి ముందు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసం ముందు గుమిగూడిన వందలాది మందిలో ఆమె కూడా ఉన్నారు. ‘జగన్ ముఖ్యమంత్రి అవుతారు, ఎన్టీఆర్ కంటే కూడా పెద్ద స్టార్ అవుతారు’ అని లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ ఇంట్లో ఆదరపూర్వకమైన ఆతిథేయ పాత్రను నిర్వహిస్తున్న ఆయన భార్య భారతి, సాక్షి గ్రూపునకు చైర్‌పర్సన్. ‘ఆయనలోని శక్తే మాకందరికీ సోకింది, అదే మమ్మల్ని నడిపిస్తోంది’ అని ఆమె అన్నారు.
ఒక ఫొటో కావాలని అడగగానే ఆమె వెనుకకు పోయి నిలిచి ‘మీరు సారు ఫొటోలు తీసుకోవచ్చు’ అన్నారు. జగన్ చెల్లెలు షర్మిళ, బావమరిది అనిల్‌కుమార్‌లు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. పార్టీ నాయకులు, మిత్రులు, బంధువులు అందరినీ విచారణకు వెళ్లే ముందు తప్పనిసరిగా కలుసుకోవాలని ఆయన అనుకున్నారు.‘కాంగ్రెస్ జగన్‌పై ప్రతీకారాన్ని తీర్చుకుంటోందనేది స్పష్టమే. మాకు ఆయనపై నమ్మకం ఉంది. ఆయన మరింత బలవంతులుగా తిరిగివస్తారని తెలుసు’ అని తెలుగు సినిమా నటి రోజా అన్నారు. కాంగ్రెస్ కక్ష సాధింపు రాజకీయాలు ఒక నవీన ఇతిహాసాన్ని సృష్టించాయి. ఏపీ అంటే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు పెట్టని కోట అనే భావన ఇప్పుడిక కేవలం మిథ్యగా మారబోతోంది. ఏదిఏమైనా జూన్ 12న ఈ చిక్కుముడి విడిపోయే ప్రక్రియ ఆరంభమవడం తథ్యం. 1998లో కాంగ్రెస్‌కు లోక్‌సభలో 140 సీట్లు ఉన్నప్పుడు సోనియాగాంధీ ఆ పార్టీకి అధ్యక్షురాలయ్యారు.
కాంగ్రెస్ పార్టీకి వరుసగా పడుతున్న చిన్న చిన్న తూట్ల పరంపరలో ఏపీలో ఇప్పుడిక పెద్ద గండి పడనుంది. పార్టీ నిర్మాణం కుప్ప కూలిపోతోంది. గత 26 ఏళ్లలో మొట్టమొదటిసారిగా హిమాచల్‌ప్రదేశ్ మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడం కూడా దానికి దిగ్భ్రాతికరంగానే ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సోనియా పార్టీకి 1998 కంటే తక్కువ స్థానాలే దక్కుతాయా?
‘(‘ఇండియా టుడే’ సౌజన్యంతో...)ఇండియా టుడే’ 2012 జూన్ 11 సంచిక ‘ది ప్రైస్ ఆఫ్ వెండెట్టా’ శీర్షికతో ప్రచురించిన కవర్ పేజీ కథనాన్ని ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. ఈ విశేష కథనం రచయితలు ‘భావన విజ్ అరోరా, అమర్‌నాథ్ కె. మీనన్
No comments:
Post a Comment