YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 2 June 2012

‘ఈనాడు’ ప్రధాన కార్యాలయం ఆరంతస్తుల భవనంలో ఉంది. రోడ్డుమీద వెళ్ళే ఎవరికైనా ఆ భవనంలో ఎన్ని అంతస్తులున్నాయో కనిపిస్తూనే ఉంటుంది. అదే మీరు నేరుగా ఈ విషయంలో నిజానిజాలు తేల్చుకోదలచి ఆ పత్రిక సంపాదకుడు రామోజీరావును అడిగితే అయిదు అంతస్తులే అని సమాధానం చెపుతారు


హైదరాబాద్‌లోని ‘ఈనాడు’ ప్రధాన కార్యాలయం ఆరంతస్తుల భవనంలో ఉంది. రోడ్డుమీద వెళ్ళే ఎవరికైనా ఆ భవనంలో ఎన్ని అంతస్తులున్నాయో కనిపిస్తూనే ఉంటుంది. అదే మీరు నేరుగా ఈ విషయంలో నిజానిజాలు తేల్చుకోదలచి ఆ పత్రిక సంపాదకుడు రామోజీరావును అడిగితే అయిదు అంతస్తులే అని సమాధానం చెపుతారు. గతంలో చెప్పారు కూడా! అవునవును అయిదే... ఆరోది లేదని మొదటి పేజీలో సంతకం పెట్టి సంపాదకీయం కూడా రాశారు. మూడున్నర దశాబ్దాలకు పైగా ఇలాంటి అసత్యాలు, కాకి లెక్కలతో నిత్యం ఉషోదయాన ‘ఈనాడు’ పత్రికనిండా కనిపించేది అక్షరాల అచ్చు కాదు- ఆ పత్రిక యాజమాన్యం మెదడులో ఉన్న డ్రైనేజీ రొచ్చు. 

అలాంటి పత్రిక యాజమాన్యం, జగన్‌మోహన్‌రెడ్డి కోర్టులో చేసిన వాదనను ఖండిస్తూ నిన్నటి సంచిక ‘ఈనాడు’ మొదటి పేజీలో, ఆరోపేజీలో తన వ్యాఖ్యను రాసింది. ‘‘ఈనాడుది రహదారి- సాక్షిది అడ్డదారి’’ అంటూ రాసిన ఆ కథ(నం)లో అక్షరాలు, అంకెలు నిజం చెపితే ఒట్టు! సాక్షిలోకి వచ్చిన పెట్టుబడుల ప్రీమియం రూ.350 ఉండటం సక్రమం కాదంటూ సాగుతున్న వాదనలకు వివరణగా, సాక్షి ఆవిర్భావానికి కొద్ది నెలల ముందు ఈనాడు మొత్తం వాల్యుయేషన్‌ను, దాని షేర్ విలువ రూ.5,28,630 ఉండటాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కోర్టులో విన్నవించారు. ఎక్కడ రూ.350... ఎక్కడ రూ.5,28,630? ఇదే అంశాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించినప్పుడు ఈనాడుకు రూ.6,800 కోట్లు వాల్యుయేషన్ ఉన్నప్పుడు... సర్క్యులేషన్ పరంగా దేశంలో ఎనిమిదో స్థానంలో ఉన్న సాక్షి అందులో సగం వాల్యుయేషన్ కూడా ఉండదా? అని నివేదించారు. 

ఈ వాదనతో విభేదించదలచుకున్నప్పుడు ఈనాడు తన పాఠకులకు వివరించాల్సిన అంశాల్లో మొదటిది... ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ వాల్యుయేషన్‌కు ప్రాతిపదిక ఏమిటి? ఆ విలువ కట్టినది ఎవరు? ఆ వాల్యుయేషన్ నివేదికలో ఏముంది? రెండోది- అంత భారీ విలువ, భారీ ప్రీమియం ఏ లెక్కన నిర్ణయించారు? నష్టాల్లో ఉన్న సంస్థకు అంత వాల్యుయేషన్ ఎలా వచ్చింది? మూడోది- అసలు రామోజీ ఈ డబ్బంతా ఎలా సంపాదించారు? నాలుగోది- అడ్డగోలుగా, అక్రమంగా సంపాదించిన ఈ డబ్బు, తద్వారా పుట్టిన సంతానం లాంటి సంస్థలను పెంచి పోషించటానికి మేం ఉన్నాం అంటూ కంపానీలూ అంబానీలూ టీవీ-18 సహా ఎందుకు ముందుకు వచ్చాయి? 

అదీ నిరంతరం నష్టాలకు పేరుబడి, కింది కోర్టులనుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని స్థాయుల్లోనూ భూములు, డిపాజిట్లు, పన్నుల ఎగవేతలకు సంబంధించి వేల కోట్లమేర లయబిలిటీ ఉన్న వ్యక్తికి సంబంధించిన సంస్థల్లో షేర్లను... భారీగా సొమ్ము ముట్టజెప్పి కొనటానికి ఈ బడా పారిశ్రామికవేత్తలు ఎందుకు సాహసించారు? రెండు పేజీల్లో కొనసాగిన ఈనాడు వాదన ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోగా, ఏకపాత్రాభినయంలో డైలాగుల్ని తలపిస్తూ... మాకు ‘జనహితమే పరమావధి’, ‘ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంగలార్చలేదు’, ‘ప్రజా సంక్షేమమే మా లక్ష్యం’, ‘న్యాయస్థానాలను విశ్వసించటం, గౌరవించటం మా విధానం’ అంటూ సంబంధం లేని అంశాలతో రంగస్థల పద్యాలు పాడింది. తన సంస్థకు పెట్టుబడులన్నీ రహదారిలో వచ్చాయని ప్రత్యక్ష దైవాలైన పాఠకుల ముందే జంకూగొంకూ లేకుండా బొంకింది. అదెలాగో వివరించే క్రమంలో పెట్టుబడులకు సంబంధించిన సాంకేతిక అంశాలను, ఈనాడు వాదనలో డొల్లదనాన్ని, అసత్యాలను కింది కథనంలో విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాం. 

వేల కోట్లు ఎలా సంపాదించారు?

ఇక్కడ ప్రాథమికమైన వాస్తవం ఏమిటంటే... కృష్ణా జిల్లాలోని ఓ పల్లెటూరిలో రైతు కుటుంబంలో జన్మించిన రామోజీ నేడు కనీసంగా పదివేల కోట్ల రూపాయలకు పైగా విలువైన వ్యాపార సామ్రాజ్యానికి ఎలా పడగలెత్తారన్నది! నూట యాభై ఏళ్ళకు పైగా చరిత్ర, ఈనాడుకు ఏనాడూ తీసిపోని సర్క్యులేషన్ ఉన్న హిందూ వంటి పత్రికల యాజమాన్యాలు డబ్బు సంపాదనలో ఏమాత్రం ఎదగనప్పుడు... ఒక్కడుగా రామోజీ ఇంత సొమ్ము మూటగట్టుకోవటంలో దేవ రహస్యం ఏమిటన్నది ఎవరికైనా వచ్చి తీరే సందేహం. సాక్షికి సంబంధించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభ పెట్టుబడులు పెడితే, ఈ రాష్ట్రంలోని పత్రికా రంగంలో ఈనాడు, చంద్రబాబు అనుకూల మీడియా దశాబ్దాల పాటు సృష్టించిన అగాథమే సాక్షి సర్క్యులేషన్‌కు, పాఠక ఆదరణకు ప్రధాన ఆధారమైంది. ఆ అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న మీదటే సాక్షిలోకి పెట్టుబడులు వచ్చాయి. 

సాక్షి ఆవిర్భావం అనేకమంది పారిశ్రామికవేత్తల పెట్టుబడుల ఫలితమైతే... విచిత్రంగా, 2007కు మునుపటి వరకు ఎదిగిన ‘ఈనాడు’ గ్రూప్ అన్నది కేవలం రామోజీ జేబు సంస్థ. అప్పటికి రామోజీ గ్రూపులో వాటాల విక్రయం జరగలేదు. అయినా వేల కోట్ల రూపాయల మేరకు స్థలాలూ, ఆస్తులూ అప్పటికే రామోజీ సామ్రాజ్యంగా మేటలు వేశాయి. ఇదెలా సాధ్యం... అన్న మౌలికమైన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రామోజీ ఉన్నట్టుండి అన్నా హజారేను సమర్థించానంటారు. సమాచార హక్కు ఉద్యమాన్ని భుజాలమీద, నెత్తిమీద మోశానంటారు. మా దారి రహదారి అని ఉత్తుత్తిగా తన పత్రికలోనే తన ముఠాతో అచ్చొత్తించుకునే బదులు... రహదారి అయితే తన సంపదల చట్టబద్ధత గురించి ఆయనే వివరణ ఇవ్వొచ్చు. అలాంటిది ఈ 38 సంవత్సరాల చరిత్రలో ఏనాడూ జరగలేదు. 

అదో పార్శ్వమైతే, హమ్మో! ఆయన పెట్టుబడుల గురించి మాట్లాడటమే తప్పు అంటూ టీవీ చర్చల్లో మొదలు అత్యున్నత సభల్లో వరకు గీపెట్టే రంగురంగుల కండువాలు, కుహనా మేధావులు ఈ రాష్ట్రంలో మరో రకం సామాజిక రుగ్మతకు ప్రతినిధులు. నిజానికి రామోజీ ఈ రూ.10,000 కోట్లకు మించిన సామ్రాజ్యాన్ని నిర్మించటానికి ప్రమోటర్‌గా పెట్టిన మొత్తం పెట్టుబడి ఎంతో తెలుసా? అది కేవలం రూ.2 కోట్లు కూడా లేదు. మరి రామోజీ వేల కోట్లు ఎలా సంపాదించారు? రహదారిలోనా- అడ్డదారిలోనా? ఎవరికీ లేని విధంగా రాష్ట్ర రాజధానిలోనే ఏకంగా 2,000 ఎకరాలకు పైగా భూమిని తమ అధీనంలో ఎలా పెట్టుకోగలిగారు? ప్రభుత్వాల మద్దతుతోనా? చట్టం ఆయనకు ప్రత్యేకంగా ఏవైనా అనుమతులు మంజూరు చేసిందా? దశాబ్దాలుగా ఆయన కంపెనీల బ్యాలెన్స్ షీట్‌లు పరిశీలిస్తే, లాభాలన్నవి ఏనాడూ లేని, నష్టాలకు మాత్రమే పేరుమోసిన ఆ సంస్థలకు అంత వాల్యుయేషన్ ఎలా వచ్చింది? 

అక్రమాస్తుల లెక్క తేలాయి!

రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన ముఖ్యాంశమేమిటంటే... జగన్‌మోహన్‌రెడ్డి మీద సాగుతున్న సీబీఐ దర్యాప్తును ‘‘జగన్ అక్రమ ఆస్తుల కేసు’’ అని తెలుగుదేశం అనుకూల మీడియా ఓ పథకం ప్రకారం ప్రచారం చేస్తూ వస్తోంది. ఇంతవరకు ఏ న్యాయస్థానమూ జగన్‌మోహన్‌రెడ్డివి అక్రమ ఆస్తులు అని రూఢి చేసి తీర్పు ఇచ్చినది లేదు. మరోవంక, ఈ రాష్ట్రంలో అక్రమ ఆస్తులు అని తీర్పు రామోజీకి సంబంధించి వెలువడిందన్నది ఇదే సందర్భంగా గమనార్హం. రామోజీ ల్యాండ్ హోల్డింగ్స్ చట్టంలోని 18(2) నిబంధనను ఉల్లంఘించారు. రామోజీ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలన్నింటికీ చట్టబద్ధంగా ఉండాల్సిన భూమికంటే అదనంగా 1,363 ఎకరాలకు పైగా భూమి ఉన్నందువల్ల అది ప్రభుత్వానికి చెందాల్సిందేనని ల్యాండ్ ట్రిబ్యునల్ ఏనాడో తీర్పు ఇచ్చింది. 

దానిమీద రామోజీ స్టే తెచ్చుకోవటంలో సఫలం అయ్యారు. ఆ స్టే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజున ఎందుకు అడగటం లేదన్నది ప్రజల దృష్టికి రావాల్సిన అంశం. అలాగే, పేదల కోసం భూములు పంచుతామని ప్రగల్భాలు పలికే రాజకీయ పార్టీలు ఒకనాడు ముందుకు దూకి... ఆ తరవాత ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్నది ముఖ్యమైన మరో ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ చిట్‌ఫండ్స్ యాక్ట్‌ను ఉల్లంఘించి డిపాజిటర్ల డబ్బును రామోజీ తమ వద్ద ఉంచుకోవటం ఏ రకంగా నేరమో ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్ కనీసం మూడు సందర్భాల్లో గతంలో ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు ఆ ఫిర్యాదులకు ఏ గతి పట్టిందో దేవుడికెరుక.

ఇక రామోజీ నిధులకు మూలాధారమైన మార్గదర్శి ఫైనాన్సియర్స్ వ్యవహారంమీద ఇప్పటికీ న్యాయప్రక్రియ అడుగులు ముందుకు పడటం లేదు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల్లో 45 (ఎస్)ను ఉల్లంఘించి ఆయన వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును డిపాజిట్ల పేరిట వసూలు చేశారు. ఇదే సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ డిపాజిట్ల సేకరణ ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకం అని తెలిసి కూడా రామోజీ కార్యకలాపాలను ఎందుకు చూస్తూ ఊరుకుందన్నది... అదే సమయంలో, చట్టబద్ధమైన ప్రైవేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిటర్లను గందరగోళానికి గురిచేసి ఆ బ్యాంకుల మూసివేతకు, లక్షల మంది డిపాజిటర్ల సొమ్ము తిరిగిరాకపోవటానికి అధికార పార్టీగా తెలుగుదేశం, పత్రికగా ఈనాడు ఎంతమేరకు కారణమన్నది ఆరోజుల్లో పరిణామాలను నిశితంగా గమనించినవారికి ఎరుకే. రామోజీ సంస్థలు ఫిలింసిటీ భూములు కొన్నా... ఆ తరవాత టీవీ ఛానళ్ళు పెట్టినా అదంతా ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా... చట్ట విరుద్ధంగా రామోజీ సేకరించిన డబ్బుతోనే. 

ఆ వేల కోట్ల సంపాదన క్లీన్ మనీ అని, డిపాజిట్లు రామోజీ రహదారిలో సేకరించారని ఏ న్యాయస్థానమైనా ఎలా తీర్పు ఇవ్వగలుగుతుంది? ఇంతకీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? చట్ట విరుద్ధమని తెలిసీ రామోజీ ఏపీ చిట్‌ఫండ్స్ యాక్ట్‌ను ఎలా ఉల్లంఘించగలిగారు? ఇలాంటి పునాదులమీద ఎదిగిన రామోజీ తన పత్రిక మొదటి పేజీలో తమ వ్యాపారం దారి రహదారి అని నిలువుగా, అడ్డంగా రాసుకుంటుంటే... ప్రజలు, పాఠకులు ఔనని తల ఊపుతారని ఎలా భావిస్తున్నారు? ఈ రోజున టీడీపీతో పాటు కాంగ్రెస్‌ను కూడా మేనేజ్ చేయగలిగిన ఆయన, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీబీఐతో ఈ అంశాల మీద దర్యాప్తుకు అంగీకరించకుండా ఎందుకంత హడావుడి పడ్డారు? 

సాక్షి విజయమే అసలు సమస్య

ఇక లోపలి పేజీ కథనంలోకి వెళితే, మార్గదర్శి ఫైనాన్సియర్స్ వ్యవహారంమీద ఏర్పాటైన జస్టిస్.రంగాచారి కమిషన్ వ్యక్తం చేసిన సహేతుక అభ్యంతరాల్నే తూలనాడుతూ... డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించేశాం కదా... అన్నది నిన్నటి ఈనాడు వాదన. ఇదే వాదనను అంగీకరిస్తే, తారా చౌదరి వల్ల కూడా ఎవరికీ ఏ అపకారమూ జరగలేదని... ఉపకారమే జరిగిందని కూడా వాదించవచ్చు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు సంబంధించిన అంశం డిపాజిట్ల సేకరణ చట్ట బద్ధమా, కాదా అన్నది తప్ప... అపకారం, ఉపకారాలకు సంబంధించినది కాదు. 

సాక్షి-పెట్టుబడులకు సంబంధించి రామోజీకైనా, చంద్రబాబుకైనా ఉన్న అసలు సమస్య ఈ పత్రిక నాలుగేళ్ళ పైచిలుకు కాలంలో సాధించిన ఘన విజయం. పత్రిక విజయానికి తోడుగా జగన్‌మోహన్‌రెడ్డి వేరే రాజకీయ పార్టీ ప్రారంభించి సృష్టిస్తున్న జన ప్రభంజనం. ఇప్పుడు ఇవే అధికార కాంగ్రెస్‌కు కూడా సమస్యలుగా మారాయి. న్యాయస్థానాలముందున్న అంశాలను అటుంచితే, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మీడియా, ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం ప్రజల్లో ఎదుగుతుంటే ఇక్కడ అధికారపక్షం-ప్రతిపక్షం ఒకే గొంతుతో మాట్లాడటాన్ని, ఒకే తరహా కుట్రలను అమలు చేయటాన్ని యావత్ రాష్ట్రమూ గమనిస్తోంది. వీటి సమస్య సాక్షి పెట్టుబడులా? సాక్షి అస్తిత్వమా? వీరి సమస్య వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు దక్కుతున్న ప్రజాదరణా... లేక ప్రజా జీవితంలో నైతికత నెలకొల్పే ఉద్యమాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు మద్దతు తీసుకుని ఏమన్నా చేస్తున్నారా? 

నవ్విపోతారు ప్రజలు. ప్రజాస్వామ్యంలో గొప్ప దనం అన్నివేళలా వ్యక్తం కాదు. ప్రస్తుతం పరిస్థితులు సాక్షికో దీని యాజమాన్యానికో ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన అవతలి శిబిరంలో ఒకటై కూర్చున్న కాకులు హంసలైపోవు. ప్రసార సాధనాల్లో ఎక్కువ శాతాన్ని మేనేజ్ చేసి రోజూ అసత్యాలను ఓ పథకం ప్రకారం అచ్చువేసినంత మాత్రాన అవి నిజాలైపోవు. నిజం-జనం సునామీలుగా మారే సందర్భాలు అరుదుగానే వస్తాయి!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!