YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 31 May 2012

నా బిడ్డ ఏనాడూ సీఎం క్యాంపు ఆఫీసుకు కూడా వెళ్లలేదే

సీబీఐ చెప్పమన్నట్లు చెప్పనందుకు ఈ రోజు అరెస్టు చేశారు..
జగన్ ఎంపీ.. ఆయన దర్యాప్తుపై ప్రభావం చూపుతారు అంటున్నారు
తొమ్మిది నెలలుగా జగన్ ఎంపీ కాదా? ఇంతకాలం లేనిది ఇప్పుడెందుకు?
పాయకరావుపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం

విశాఖపట్నం-ద్రాక్షారామ, న్యూస్‌లైన్ ప్రతినిధులు:‘నా బిడ్డ జగన్‌బాబు ఏం తప్పు చేశాడు? రాజశేఖరరెడ్డి గారు సీఎంగా ఉన్నపుడు పక్కనే ఉన్న ఆయన క్యాంప్ ఆఫీసుకు కూడా జగన్ ఏరోజూ వెళ్లలేదే! కనీసం సెక్యూరిటీలో చూసిన వారున్నారా? జగన్ ఏనాడైనా మంత్రులతోనైనా.. ఆఫీసర్లతోనైనా మాట్లాడాడని చెప్పగలరా? మరెందుకు జగన్‌ను వేధిస్తున్నారని అడుగుతున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్, టీడీపీని నిలదీశారు. ఉప ఎన్నికల ప్రచారం రెండో రోజు గురువారం విజయమ్మ విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్లలో, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. ఆమెతోపాటు ప్రచారంలో జగన్ సోదరి షర్మిల కూడా పాల్గొని ప్రసంగించారు. విజయమ్మ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఇంతకాలం ఎవర్నయినా ప్రభావితం చేశాడా?

జగన్‌బాబుపై తొమ్మిది నెలలుగా సీబీఐ విచారణ జరుగుతున్నా.. వాళ్లు తప్పు చూపడానికి ఒక్క ఆధారమూ లేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు దగ్గరపడే సమయానికి.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు.. దానికంటే ముందే సీబీఐ విచారణకు రమ్మని పిలవడం జరిగాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.. ముందస్తు బెయిల్ ఇవ్వండి అని జగన్ బాబు కోర్టును కోరారు. మిమ్మల్ని అరెస్టు చేసే పరిస్థితులు లేవు.. బెయిల్ అవసరం లేదని జడ్జి కూడా చెప్పారట. దీంతో సీబీఐ విచారణకు హాజరై జగన్‌బాబు వారికి పూర్తి స్థాయిలో సహకరించాడు.. రోజూ 8 నుంచి 10 గంటలపాటు విచారణ చేసినా.. ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన సమాధానం చెప్పారు. అయితే సీబీఐ వాళ్లు చెప్పమన్నట్లు ఆయన చెప్పలేదని.... తమకు సహకరించడం లేదంటూ అరెస్టు చేశారు. ఆయన ఎంపీ.. బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారు.. బెయిల్ కూడా ఇవ్వొద్దు అంటున్నారు. తొమ్మిది నెలలుగా విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఎంపీనే.. ఇంతకాలం తను ఎవర్నయినా ప్రభావితం చేశాడా? మీరే చెప్పండి(ప్రజల్ని ఉద్దేశించి) ఇంతకాలం జగన్ ఓదార్పు యాత్రచేసుకుంటూ మీ మధ్యనే ఉన్నాడు. ఇంతకాలంలో ఎవర్నయినా ఇన్‌ఫ్లూయన్స్ చేశాడా?(లేదు.. లేదు.. అంటూ జన స్పందన). జగన్‌బాబు ఏ తప్పు చేశాడని మీరంతా ఈ ప్రభుత్వాన్నీ, సీబీఐని అడగాల్సిన సమయమొచ్చింది.

ఆయన మరణంపై అన్నీ అనుమానాలే..

వైఎస్ మరణం వెనక చాలా అనుమానాలున్నాయి. సాధారణ ప్రజానీకానికి ఉన్న అనుమానాలే నాకూ ఉన్నాయి. ఆ దుర్ఘటన జరిగిన రోజే నేను జగన్‌బాబును అడిగా.. ‘ఎవరైనా నాన్నను ఏమైనా చేశారా? మనం కనుక్కోలేమా?’ అని అడిగా. ‘అమ్మా మనం అధికారంలో ఉంటే తప్ప మనం ఏ విషయమూ కనుక్కోలేం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా అనుకుంటే తప్ప ఏం జరిగిందో బయటకు రాదమ్మా..’ అని చెప్పాడు. ప్రమాదం జరిగిన తర్వాత ఇంటికొచ్చాక సూరీడు చెప్పాడు.. ‘సార్ కూడా అడిగారమ్మా.. మూడు నాలుగు నెలలుగా పక్కనపెట్టిన ఈ హెలికాప్టర్‌ను ఎందుకు తీసుకొచ్చారని అడిగారమ్మా’ అని చెప్పాడు. 

కారులో ప్రయాణించే వారికి సైతం తామెటుపోతున్నదీ తెలిసే సమాచార వ్యవస్థ అందుబాటులో ఉండగా, ఒక ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఎటు వెళ్లేదీ చూపించే మిషన్ పూర్తిగా చెడిపోయిందంటే ఎలా నమ్మాలి? బ్లాక్ బాక్సులో కేవలం ఏడు నిమిషాల పాటు మాత్రమే సంభాషణలున్నాయి. అవి కూడా పైలట్లు సంభాషించుకున్నవే. వైఎస్ సహా మిగిలిన వారు మాట్లాడిన సంభాషణలు ఏమైనట్టో అర్థం కావడంలేదు. కేవలం తమకు కావాల్సిన సంభాషణలు మాత్రమే ఉంచుకొని మిగిలిన సంభాషణలను తొలగించారన్న అనుమానాలు ఆనాడే కలిగాయి. మొదట ఈ ప్రమాదానికి క్యుములోనింబస్ మేఘాలే కారణమని చెప్పినప్పటికీ చివరకు ఆ సమయంలో అసలా మేఘాలే లేవని అంటున్నారు. కేవలం పైలట్ తప్పిదంవల్లే ప్రమాదం జరిగినట్టుగా తేల్చేశారు. పైగా రెండున్నర గంటల పాటు గాలిలో తిరిగేందుకు సరిపడా ఇంధనం హెలికాప్టర్‌లో ఉన్నప్పటికీ ఎందుకు ఆ ప్రయత్నం పైలట్లు చేయలేద నే దానిపై అనేక అనుమానాలున్నాయి.

నా బిడ్డను ఏం చేస్తారోనని భయంగా ఉంది

ఈ రోజు పెద్దలు చెప్తున్నారు.. వైఎస్ మరణంపై విచారణ బాగానే జరిగింది.. అందులో దోషంలేదు అంటున్నారు. ఇందులో దోషం ఉందని మీకు(ప్రజల్ని ఉద్దేశించి) అనిపించడం లేదా?(ఉందీ.. ఉందీ.. వైఎస్‌ను చంపేశారూ.. అంటూ పెద్ద ఎత్తున జన స్పందన). ఈ అనుమానాలేవీ ఇంతవరకు నివృత్తి చేయలేదు.. ఆ రోజు వైఎస్ మరణంపై జరిగినట్లే ఈ రోజు జగన్‌బాబుపైనా విచారణ జరుగుతోందని నాకు భయంగా ఉంది. ఆ రోజు ఆయన్ను పోగొట్టుకున్నాను.. ఈ రోజు మళ్లీ జగన్‌ను ఏం చేస్తున్నారు వీళ్లు.. ఎందుకు కటకటాల్లో పెట్టాల్సి వచ్చింది? నా బిడ్డ ఏం చేశాడని..? నిజంగా నాకు చాలా భయమేస్తోంది. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుందోనన్న భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఈ రోజు జగన్‌ను జైలుకు పంపే కుట్ర చేశారు. మీ ప్రేమాప్యాయతల ముందు వారి కుట్రలు, కుతంత్రాలు ఏమాత్రం నిలబడవని నిరూపించండి. రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడి తమ పదవులను సైతం వదిలేసుకున్న వైఎస్ అభిమాన నేతల్ని గెలిపించండి.

అన్న బయట ఉంటే ఆ రెండు పార్టీలకూ వణుకే: షర్మిల

తన అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉంటే అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీలకు వణుకు పుడుతుందని, అందువల్లనే ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ఆయనను జైలుకు పంపాయని జగన్ సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. గురువారం పాయకరావుపేట, రామచంద్రపురం ఉప ఎన్నికల ప్రచారంలో తల్లి విజయమ్మతోపాటు ఆమె పాల్గొని ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వైఎస్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేసేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు టీడీపీతో కుమ్మక్కై సీబీఐని ఇష్టమొచ్చినట్టు వాడుకుంటున్నాయని విమర్శించారు. వైఎస్ ఏ తప్పూ చేయలేదని, ఆయన ఆలోచన అంతా పేద ప్రజలు, రైతుల కోసమేనని అన్నారు. 

‘ఏ ప్రాజెక్టు చేపడితే ఎంత మందికి ఉపాధి లభిస్తుంది.. ఏ పథకం ప్రవేశపెడితే ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది’ అనే ఆలోచనలతోనే ప్రాజెక్టులు చేపట్టారని చెప్పారు. రాజన్న పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగలేదని, రైతు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలన్న తలంపుతోనే జలయజ్ఞాన్ని చేపట్టారని గుర్తుచేశారు. చనిపోయిన వైఎస్ తిరిగొచ్చి నిజం చెప్పలేరన్న ధైర్యంతోనే ఆయనను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు, దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ మరణం తరువాత ప్రజల ఆదరణ, ప్రేమలను చూరగొన్న జగన్‌ను సైతం ఏదో విధంగా అణగదొక్కాలన్న ఆలోచనతో తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు మళ్లీ రాజన్న రాజ్యం రావడానికి నాందిపలకాలని కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!