YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 19 June 2012

అసాధారణ పరిణామాలకు మమ్మల్ని నిందించొద్దు. ప్రభుత్వ మనుగడపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ వ్యాఖ్య

జైల్లో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఒవైసీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం 2014 వరకు కొనసాగాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, అయితే ఈ మధ్యలో ఏదైనా ‘అసాధారణ పరిణామాలు’ చోటు చేసుకుంటే తమను నిందించవద్దని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం ఒవైసీ కలిశారు. ఉదయం 10.50 నిమిషాల సమయంలో ఆయన జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. దాదాపు అరగంటకుపైగా వీరిరువురూ భేటీ అయ్యారు. జగన్‌ను కలిసిన అనంతరం ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ తన సహచరుడు, మిత్రుడయిన జగన్‌ను చాలా కాలం తర్వాత కలిశానని, సమస్యల్లో ఉన్న ఆయనకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నానని చెప్పారు. ‘‘గతంలో ఉప ఎన్నికలతో పాటు సీబీఐ కస్టడీ ఉండడం వల్ల కలవడం కుదరలేదు. ఇప్పుడు చాలాకాలం తర్వాత ఆయన్ను కలిశాను. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని కోరాను. మతతత్వ ఆలోచనలున్న ఎన్డీయే కూటమివైపు వెళ్లవద్దని కోరాను’’ అని ఒవైసీ చెప్పారు. ‘‘నా విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. నేను గానీ, మా పార్టీగానీ ఎప్పుడో ఏదో జరుగుతుందని ఊహిం చేవాళ్లం కాదు. ఈ ప్రభుత్వం 2014 వరకు కొనసాగాలని ప్రజలు తీర్పిచ్చారు. ఈ మధ్యలో ఏదైనా అసాధారణ పరిణామాలు జరిగితే దానికి నన్ను నిందించవద్దు’’ అని అన్నారు.

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు, వైఎస్ వివేకా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. వైఎస్ వివేకానందరెడ్డి కూడా జగన్‌ను ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. జగన్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, భూమా నాగిరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కుడిపూడి చిట్టబ్బాయి, రెహమాన్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!