కోర్టుల్లో ఉపన్యాసాలు చెప్పొద్దు
తీవ్రమైన నేరానికి మీ నిర్వచనం ఏమిటి?
రూ. 26 కోట్లు తీవ్ర నేరమైతే.. వంద కోట్లు, లక్ష కోట్ల మాటేమిటి?
కోనేరు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. తీర్పు వాయిదా
హైదరాబాద్, న్యూస్‌లైన్:
బెయిల్ పిటిషన్లు ఎవరు దాఖలు చేసినా తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, వారికి బెయిల్ ఇవ్వొద్దని వాదిస్తున్న సీబీఐకి హైకోర్టు మంగళవారం సూటిగా పలు ప్రశ్నలు సంధించింది. వ్యక్తులు ఆర్థిక నేరానికి పాల్పడితే వారికి ఎంత కాలం బెయిల్ ఇవ్వొద్దంటారని సీబీఐ దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. వారిని ఎంత కాలం జైలులో ఉంచుతారని నిలదీసింది. ప్రతీసారీ ‘తీవ్రమైన నేరం.. తీవ్రమైన నేరం’ అంటూ పేర్కొనటాన్ని కూడా ప్రశ్నించింది. అసలు తీవ్రమైన నేరానికి మీరు చెప్పే నిర్వచనం ఏమిటంటూ హైకోర్టు నిలదీసింది. కోర్టుల్లో ఉపన్యాసాలు చెప్పొద్దని సూచించింది.
ఎమ్మార్ కేసులో తనకు బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోనేరు ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని జస్టిస్ సముద్రాల గోవిందరాజులు మంగళవారం విచారించారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే... కేసు పూర్వాపరాల జోలికి వెళ్లొద్దని, బెయిల్ అంశానికి మాత్రమే వాదనలను పరిమితం చేయాలని సీబీఐ న్యాయవాది కేశవరావుకు న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అనంతరం కోనేరు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎమ్మార్ కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని చెప్పారు. చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత బెయిల్ పొందేందుకు నిందితుడికి హక్కు ఉంటుందని, కాని ఈ కేసులో దీన్ని సీబీఐ కాలరాస్తోందని వివరించారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రసక్తే లేదని, కోనేరు ప్రసాద్ సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించారన్నారు. తరువాత సీబీఐ న్యాయవాది కేశవరావు వాదిస్తూ.. కోనేరు ప్రసాద్ తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడ్డారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. కోనేరు ప్రసాద్ వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.26 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. స్టైలిష్ హోమ్స్ తుమ్మల రంగారావు గురించి ప్రశ్నించారు. ‘రంగారావు ఎవరు? ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఏమిటి?’ అని ఆరా తీశారు. దీనిపై కేశవరావు స్పందించి ఎమ్మార్ వ్యవహారంలో తుమ్మల రంగారావు పాత్ర గురించి వివరించారు. ప్లాట్లు, విల్లాల విక్రయంలో కోనేరు ప్రసాద్ కీలక పాత్ర పోషించారని, కోట్ల రూపాయలను కుమారుడి ఖాతాల్లోకి మళ్లించారని తెలిపారు. కోనేరు ప్రసాద్‌కు బెయిల్ ఇస్తే సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేస్తూ ‘కోనేరును బెయిల్‌పై విడుదల చేస్తే సమాజంపై పడే ప్రభావం ఏమిటి?’ అని కేశవరావును ప్రశ్నించారు.
‘మీరు కోనేరు ప్రసాద్ వల్ల ఖజానాకు రూ.26 కోట్ల నష్టం కలిగిందని చెబుతున్నారు. దీన్ని తీవ్రమైన నేరం అంటారా..? మరి ఇది తీవ్రమైన నేరం అయితే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.లక్ష కోట్ల మాటేమిటి..? దీన్ని ఏమంటారు..? దాన్ని తీవ్రమైన నేరం అనాలి?.. అసలు తీవ్రమైన నేరానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి..? వ్యక్తులు ఆర్థిక నేరానికి పాల్పడితే ఎంత కాలం బెయిల్ ఇవ్వొద్దంటారు?.. వారిని ఎంత కాలం జైలులో ఉంచుతారు?’ అంటూ కేశవరావును న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయమూర్తి సంధించిన సూటి ప్రశ్నలకు కేశవరావు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తరువాత కేశవరావు కేసు లోతుల్లోకి వెళ్లి ఏదో చెప్పటానికి ప్రయత్నించగా న్యాయమూర్తి వారిస్తూ... కోర్టుల్లో ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కోనేరు బెయిల్ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
No comments:
Post a Comment