YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 19 June 2012

రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఎందుకు తాపత్రయపడుతున్నారు

కిరణ్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు
వారి తరఫున పోరాడాల్సిన చంద్రబాబు సర్కారుకు అండగా నిలుస్తున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు తాపత్రయ పడుతున్నారో, అసలు కిరణ్ సర్కారును పరిరక్షించాలనే బాధ్యతను ఆయన భుజ స్కంధాలపై ఎందుకు వేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఖరిని తూర్పారబట్టారు. 

ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తరువాత కొన్ని పత్రికలకు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తమకు ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ ం లేదని, ఎవరో చెబితే అవిశ్వాస తీర్మానం పెట్టబోమని చెప్పడం ఆయన దౌర్భాగ్య స్థితికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల తర్వాత నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వ ం మెజారిటీ అత్తెసరుకు పడిపోయిన తరుణంలో దాన్నొక సువర్ణావకాశంగా తీసుకుని చంద్రబాబు ప్రజా వ్యతిరేక సర్కారును ఎందుకు ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ‘‘ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందంటూ బాబు అసలు ఒక్క సారైనా ఘాటుగా విమర్శించారా! అదే మరొక సందర్భంలోనైతే ఒంటి కాలి మీద లేచి ఉండేవారు కదా’’ అని పద్మ నిలదీశారు. అవిశ్వాసం పెట్టనని, ప్రభుత్వం దానంతట అదే పడిపోతే నిలబెట్టనని సన్నాయి నొక్కులు నొక్కుతున్న చంద్రబాబు.. అసలు ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టకుండా సర్కారు ఎలా పడిపోతుందో చెప్పాలని ఆమె సూటిగా ప్రశ్నించారు.

బాబు ఎలాగూ గెలవరనే..

అవిశ్వాసం పేరు ఎత్తితేనే బాబుకు వెన్నులో వణుకు పుడుతోందని, మధ్యంతర ఎన్నికలొస్తే తాను ఎలాగూ గెలవననే భావనతో కిరణ్ సర్కారు పడిపోకుండా చూసుకుంటున్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ‘రైతులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కిరణ్ సర్కారుపై ప్రజలు విసిగిపోయారు. అసలు రాష్ట్రంలో పాలన అంటూ ఒకటుందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు బాబు ఎందుకు ఆరాట పడుతున్నారు?’ అని నిప్పులు చెరిగారు. ప్రతిపక్షం అంటే అధికారపక్షంతో లాలూచీ పడటం, ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం, ప్రభుత్వాన్ని కాపాడటానికి రహస్య ఒప్పందం చేసుకోవడమేనని బాబు కొత్త భాష్యం చెబుతున్నారని ఆమె దుయ్యబట్టారు.

నిర్దోషిని వేధిస్తున్న మీరంతా నేరస్తులే..

చంద్రబాబు ఎంత సేపూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు సానుభూతితో గెలిచారనే అబద్ధపు ప్రచారం చేయడానికే చూస్తున్నారని పద్మ అన్నారు. ‘‘జగన్‌పై ప్రజల్లో సానుభూతి వచ్చిందంటే ఆయనపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారనేది నిజమైనట్లే కదా! ఒక నిర్దోషిని మీరంతా వేధిస్తున్నారంటే మీరంతా నేరస్తులైనట్లే కదా?’’ అని ఆమె ప్రశ్నించారు. విజయమ్మ తన ఎన్నికల ప్రచారంలో కన్నీరు కార్చారని అబద్ధపు ప్రచారం చేయడాన్ని పద్మ తీవ్రంగా ఖండించారు. జగన్‌ను అరెస్టు చేసినపుడు విజయమ్మ కంట తడి పెట్టారేమోగానీ ఆ తరువాత 12 రోజుల ప్రచారంలో ఎక్కడా ఆమె కన్నీళ్లు పెట్టిన సందర్భమే లేదని, టీవీలు చూసిన వారికి ఈ విషయం తెలుసునని వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రజలు విస్పష్టంగా తమ వైఖరిని ఎన్నికల్లో వెల్లడిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు గందరగోళంలో ఉన్నారని బాబు చెప్పడం తప్పని, అసలు ఆయనే గందరగోళంలో ఉన్నారని విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!