YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 27 August 2012

అసెంబ్లీని సమావేశపర్చాలి :వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం డిమాండ్

ప్రజలను గాలికొదిలేసి ఢిల్లీలో చక్కర్లు
తెలుగువారి ఆత్మగౌరవం అక్కడ తాకట్లు
సీఎం వైఫల్యంవల్లే విద్యుత్, సాగునీటి సమస్యలు 
30 మంది ఎంపీలున్నా సాధించింది శూన్యం
ప్రతిపక్ష పాత్రను విస్మరించిన చంద్రబాబు

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభంతోసహా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని చర్చించడానికి తక్షణమే రాష్ట్ర శాసనసభను సమావేశపర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. అసెంబ్లీలోని కమిటీ హాలులో సోమవారం జరిగిన ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. సమావేశం వివరాలను ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి మీడియాకు వెల్లడిస్తూ శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కోరుతూ తాము మంగళవారం ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను కలుస్తామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఢిల్లీచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని దించాలని కొందరు ప్రయత్నిస్తుంటే... తన పదవిని కాపాడుకోవడానికి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీచుట్టూ తిరుగుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో రెండు లేదా మూడు గంటల కరెంట్ కోత మాత్రమే ఉండేదనీ... ఇప్పుడు కిరణ్ పాలనలో రెండు లేదా మూడు గంటలు మాత్రమే కరెంటు వస్తోందని ఆమె విమర్శించారు. 

సీఎంకు ముందుచూపు లేనందువల్లే విద్యుత్, సాగునీటి సమస్యలు ఎదురయ్యాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజికన్నా తక్కువ స్థాయికి నీళ్లు చేరడానికి కారణం ప్రభుత్వ వైఖరేననీ, చివరకు ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఇప్పటివరకూ స్పష్టత లేని కారణంగా విద్యార్థుల్లో అయోమయం నెలకొందన్నారు. రాష్ట్రం నుంచి 30 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులున్నా మనకు రావాల్సిన విద్యుత్ వాటాగానీ, నిధులు గానీ సాధించుకోవడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు అధికార పక్షంతో కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆమె విమర్శించారు.

గ్యాస్‌కోసం పోరాడిన వైఎస్

కేజీ బేసిన్‌లో రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను ముందుగా రాష్ట్రానికి ఇచ్చిన తరువాతనే ఇతర చోట్లకు తీసుకెళ్లాలని పోరాడిన వ్యక్తి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డే అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్ పాలించిన ఐదేళ్లూ వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ను నిరాఘాటంగా ఇచ్చారని... ఇపుడా పరిస్థితి లేదని చెప్పారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో సంతృప్త స్థాయి ప్రాతిపదికగా రాష్ట్ర ప్రజలకు వైఎస్ లబ్ధి చేకూర్చారనీ... ఇపుడేమో తమకు ఓట్లేసిన వారికే పథకాలు ఇస్తామనే పాత విధానాన్నే మళ్లీ తెస్తున్నారని ఆయన విమర్శించారు.

కొండను తవ్వి చీమను పట్టారు

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన హడావుడిని గొల్ల బాబూరావు విమర్శించారు. వీరు కొండను తవ్వి ఎలుకను కాదు, చీమను పట్టారని ఎద్దేవా చేశారు. దళితులు, బడుగులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన ఉండటంతో వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోందనీ... అందులో భాగంగానే ఉప ప్రణాళిక నిధుల వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చిందని చెప్పారు. ఇవన్నీ దళితుల ఓట్ల కోసం కోస్తున్న కోతలు తప్ప మరేమీ లేదన్నారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, జి.బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బి.గురునాథ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!