YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 26 August 2012

హెరిటేజ్ డెయిరీ..పాల ఉత్పత్తిదారులకు ఇటు వినియోగదారులకూ శఠగోపం

పాల ప్యాకెట్‌కు ‘హెరిటేజ్’ చిల్లు
అర లీటరు  పాల ప్యాకెట్‌లో ఉన్నది 496 మిల్లీ లీటర్లే
ఇలా రోజుకు 15 వేల లీటర్లకు అదనంగా డబ్బులు
ఈ లెక్కన ఏటా ఉత్తినే రూ. 19 కోట్ల ఆదాయం
హెరిటేజ్ పాలలో వెన్న కూడా 36% పాలకే పరిమితం
ధరల్లో మాత్రం మార్కెట్‌లో అందరికంటే ఎక్కువ 
రిలయన్స్ పాలలో మోతాదు కన్నా ఎక్కువ ‘కొలిఫాం’ 
రాష్ట్ర మిల్క్ కమిషనరేట్ తాజా పరీక్షల్లో నిర్ధారణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ డెయిరీ.. అటు పాల ఉత్పత్తిదారులకు ఇటు వినియోగదారులకూ శఠగోపం పెడుతూ సొమ్ము చేసుకుంటోంది. పెరుగుతున్న పశుగ్రాసం, దాణా, కరెంటు, మందుల ఖర్చలను భరించి కష్టపడి పాడి పశువులను పెంచి పాలను ఉత్పత్తి చేస్తున్న రైతులకు కొత్త వెన్న శాతం విధానం పేరుతో సేకరణ ధరల్లో ఒకవైపు కోతలు వేస్తోంది. మరోవైపు.. మార్కెట్‌లో అందరికన్నా అధిక ధరకు అమ్మే తమ పాల ప్యాకెట్లలో ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన పరిమాణం కన్నా తక్కువగా పాలను ప్యాకింగ్ చేసి వినియోగదారుల జేబుకూ చిల్లు పెడుతోంది. 

దీంతోపాటు ఖర్చులు తగ్గించుకునేందు నాణ్యతను కూడా పక్కనపెడుతున్నట్లు ప్రభుత్వ నాణ్యత పరీక్షల్లో తేలింది. మిల్క్ కమిషనర్ హోదాలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ) ప్రతి మూడు నెలలకు ఒకసారి రాష్ట్రంలోని ముఖ్యమైన డెయిరీల పాల నాణ్యతను పరీక్షిస్తుంది. తాజాగా ఆగస్టు 9న ఉదయం 14 డెయిరీల పాల ప్యాకెట్లను మార్కెట్‌లో సేకరించి 21 రకాల పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో హెరిటేజ్ డెయిరీ చిలక్కొట్టుడు వ్యవహారం బట్టబయలైంది. హెరిటేజ్ ప్రతి రోజూ సగటున 15 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. అర లీటరు ప్యాకెట్లలో 500 మిల్లీ లీటర్లకు బదులుగా 496 మిల్లీ లీటర్లే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇది కొన్నిసార్లు అర లీటరుకు 494 మిల్లీ లీటర్లు మాత్రమే ఉంటోంది. ఇలా తక్కువ ప్యాకింగ్ చేసే పరిమాణం అర లీటరుకు సగటున 5 మిల్లీ లీటర్లు ఉన్నట్లు లెక్క కట్టినా మొత్తంగా చూస్తే ప్రతి రోజూ 15 వేల లీటర్లు ఉంటోంది. 

అంటే పాలు లేకుండానే ప్రతి రోజు 15 వేల లీటర్లకు వినియోగదారుల నుంచి హెరిటేజ్ డబ్బులు వసూలు చేస్తోంది. వినియోగదారులు ఎక్కువగా వినియోగించే టోన్డ్ రకం పాలను మిగిలిన డెయిరీల కంటే ఎక్కువ ధరకు హెరిటేజ్ లీటరు రూ. 36 కు విక్రయిస్తోంది. ఈ లెక్కన ప్రతి రోజూ 15 వేల లీటర్లకు 5.40 లక్షల రూపాయలు హెరిటేజ్ అప్పనంగా దండుకుంటోంది. ఈ మొత్తం నెలకు రూ. 1.62 కోట్లయితే ఏడాదికి రూ. 19.44 కోట్లు ఉంటోంది. పాల కమిషనరేట్ కేవలం పాల ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను మాత్రమే పరీక్షించింది. నెయ్యి, వెన్న, పెరుగు, మజ్జిగ, ఇతర పాల ఉత్పత్తులను పరిక్షిస్తే ఇంకెన్ని సంగతులు బయటపడేవో మరి! 
కొందరికే వెన్న...: డెయిరీలో మార్కెటింగ్ చేసే పాలల్లో వెన్న శాతం ఆధారంగా ధరలు ఉంటాయి. ఎక్కువగా వినియోగించే టోన్డ్ రకం పాలలో మూడు శాతం వెన్న ఉంటుంది. లీటరు, అర లీటరు పాలలో సగటున చూస్తే ఇందులో తేడా ఉండదు. పాలను వేడి చేస్తే వెన్న అనేది మీగడ రూపంలో పైన అట్టుకడుతుంది. పాలు పిండినప్పుడు అంతటా విస్తరించి ఉండే వెన్న గంట తర్వాత కేవలం 10 శాతం ప్రాంతంలోనే ఉంటుంది. ఇలా పరిమిత ప్రాంతంలో ఉన్న వెన్నను మొత్తం పాలల్లో విస్తరించేందుకు డెయిరీ పరిశ్రమల్లో వెంట్రుక మందంలో ఉండే ట్యూబ్‌ల ద్వారా అధిక ఒత్తిడితో పాలను ప్రాసెసింగ్ చేస్తారు. విద్యుత్తు ఎక్కువగా వినియోగమయ్యే ఈ ప్రక్రియ బాగా ఖర్చుతో కూడుకున్న పని కావటంతో తక్కువగా ప్రాసెస్ చేస్తున్నారు. వెన్న ఎంత ప్రాంతంలో విస్తరించిందో తెలుసుకునేందుకు నిజో ఇండెక్స్ పరీక్ష చేస్తారు. ప్రమాణాల ప్రకారం నిజో ఇండెక్స్ 90 శాతం ఉండాలి. హెరిటేజ్ పాలల్లో మాత్రం ఇది కేవలం 36 శాతం మాత్రమే ఉందని పరీక్షలో తేలింది. అలాగే ప్రాసెస్ చేసిన పాలు సాధారణ వాతావరణంలో గరిష్టంగా ఐదు గంటల వరకు పాడవకుండా ఉండాలి. మిథిలిన్ బ్లూ రిడక్షన్ టెస్ట్(ఎంబీఆర్‌టీ)తో దీన్ని నిర్ధారిస్తారు. ఈ పరీక్షలో హెరిటేజ్ పాలు నాలుగున్నర గంటలే ఉన్నాయి. 

ధరల్లో ఎక్కువే... 

రైతులు డెయిరీలకు పోసే పాల ధరలకు అడ్డంగా కోతలు వేసిన హెరిటేజ్ డెయిరీ.. వినియోగదారులకు విక్రయించే విషయంలో మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పాల కమిషనరేట్ పరిగణనలోకి తీసుకున్నవి 14 డెయిరీలు కాగా.. హైదరాబాద్‌లో 10 డెయిరీలు లీటరు టోన్డ్ పాలను రూ. 34కు విక్రయిస్తున్నాయి. ఏపీ డెయిరీ ‘విజయ’ పాల ధర రూ. 32 ఉంది. హెరిటేజ్ టోన్డ్ పాల ధర మాత్రం అన్ని డెయిరీల కంటే ఎక్కువగా లీటరు రూ. 36 ఉంది. హైదరాబాద్ పాతనగరంలో పాలను విక్రయించే రెండు డెయిరీల ధర ఇంతే ఉన్నా మార్కెట్‌లో వీటి వాటా తక్కువగానే ఉంది. 

రిలయన్స్‌లో కొలిఫాం...

దేశంలోనే పెద్ద సంస్థగా పేరొందిన రిలయన్స్ సంస్థకు చెందిన డెయిరీ పాలలో ప్రమాదకరమైన కొలిఫాం బ్యాక్టీరియా మోతాదు కన్నా ఎక్కువగా ఉన్నట్లు తాజా పరీక్షల్లో తేలింది. వెన్న శాతం విస్తరించే విషయంలోనూ రిలయన్స్ పాలు కూడా హెరిటేజ్‌లాగే ఉంది. ఏపీ డెయిరీ గత మేలో నిర్వహించిన పరీక్షలో అర లీటరు రియలన్స్ పాల ప్యాకెట్లలోనూ 494 మిల్లీ లీటర్లే ఉన్నాయి. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!