YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 26 August 2012

దళిత, గిరిజనులకు ప్రత్యేక బడ్జెట్

ఎన్ని కమిటీలు, నివేదికలు ఇచ్చినా ఫలితముండదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాధారణ, రైల్వే బడ్జెట్ మాదిరిగా రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఆ విధంగా చేస్తేనే ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లబ్ధిచేకూరుతుందని.. లేదంటే ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని నివేదికలు ఇచ్చినా ఫలితముండదని స్పష్టంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర పాలక మండలి సభ్యులు జూపూడి ప్రభాకర్‌రావు, మూలింటి మారెప్ప, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు, పార్టీ నేత ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ కమిషనర్ మేరుగ నాగార్జునలు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నోడల్ ఏజెన్సీని బుట్టదాఖలు చేశారు... 

గత 30 ఏళ్లుగా ఎన్ని కమిటీలు నివేదికలు రూపొందించినా అవేవీ దళిత, గిరిజనుల అభివృద్ధికి తోడ్పడలేదని జూపూడి పేర్కొన్నారు. ప్రణాళికా సంఘం సూచనల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని దుయ్యబట్టారు. దళిత, గిరిజనుల నిధులు పక్కదారి పట్టవద్దనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అయితే దాన్ని ఆచరణరూపంలోకి తెచ్చే సమయంలోనే దురదృష్టవశాత్తు ఆయన మరణించారని పేర్కొన్నారు. సబ్‌ప్లాన్ నిధులపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిపార్సుల్లో లోపాలున్నాయని జూపూడి విమర్శించారు. ఉపసంఘం అందజేసిన నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే అందుకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ నివేదికలో ఎక్కడా పొందుపర్చకపోవటం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక బడ్జెట్ ప్రకటించాలని, ఇప్పటి దాకా దారిమళ్లిన 23 వేల కోట్ల రూపాయలను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఖర్చు చేయాలన్నారు. 

భూపంపిణీ ఏమైంది?: దళితులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారనే అసూయతో దాన్ని నిలువరించేందుకు సీఎం కిరణ్ మోసపూరిత ప్రయత్నాలు చేస్తున్నారని మారెప్ప విమర్శించారు. దళితులపట్ల సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వారంలోగా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి విస్తృత చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. దళితులు వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని దివంగత వైఎస్ ఆకాంక్షించి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 5 కోట్లు దాకా మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. దాదాపు ఐదు లక్షల మంది దళితులకు వైఎస్ ఏడు లక్షల ఎకరాల భూమి అందజేశారని వెల్లడించారు. అయితే ఆయన రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పాలకులు మాత్రం వాటికి పూర్తిగా తిలోదకాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేకపోయారన్నారు. రాష్ట్రంలో మళ్లీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే దళితుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మారెప్ప అభిప్రాయపడ్డారు. 

దళితులకు గృహ నిర్మాణాలు ఎక్కడ?: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితులు ఆర్థికాభివృద్ధి సాధించారని నల్లా సూర్యప్రకాష్‌రావు పేర్కొన్నారు. గృహనిర్మాణాల విషయంలో వైఎస్ దళితులకు దాదాపు 18 లక్షల ఇళ్లు కేటాయించారని వివరించారు. వైఎస్ మరణించి మూడేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా భూపంపిణీ చేయలేదని వివరించారు. సీఎం కిరణ్ దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని సూర్యప్రకాష్‌రావు మండిపడ్డారు. దళితుల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌కు మించి మరొకటిలేదని నాగార్జున పేర్కొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!