YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 26 August 2012

నీరా‘జనం’

జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ ప్రారంభం
భారీగా తరలివచ్చిన ప్రజలు 
నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం
విజయమ్మ ఉపన్యాసానికి అడుగడుగునా చప్పట్ల జోరు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత హరివర్ధన్‌రెడ్డి


రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా జనప్రవాహం ఆగలేదు... ఆ సభ ఛాయలకు వెళ్తే మీకు పట్టాలు దక్కవ్, ఇందిరమ్మ ఇళ్లు అందవ్, మీ బస్తీల్లో అభివృద్ధిపనులకు దిక్కుండదు.. ఇలాంటి బెదిరింపులకు వెరవలేదు... ‘మహానేత వైఎస్సార్ అమర్హ్రే... జననేత జగనన్న జిందాబాద్’ నినాదాలు పిక్కటిల్లేసరికి ఉరుకులుపరుగులతో వచ్చి చేరారు... అప్పటి వరకు బోసిపోయినట్టు కనిపించిన సభా ప్రాంగణం చూస్తుండగానే కిటకిటలాడిపోయింది... నినాదాలతో హోరెత్తించారు... చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు.

ఇది ఆదివారం సాయంత్రం మేడ్చల్ నియోజకవర్గం జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ ైవె ఎస్‌ఆర్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వచ్చిన సందర్భంగా నిర్వహించిన బహిరంగసభ వద్ద కనిపించిన దృశ్యం. మేడ్చల్ నియోజకవర్గంలో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పట్టుకోల్పోతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా బలపడుతోంది. ఈ తరుణంలో జిల్లాలో ‘గడపగడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ఇదే నియోజకవర్గంపరిధిలోని జవహర్‌నగర్‌ను పార్టీ ఎంపిక చేసింది. ఇటీవల సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా నిర్వహించిన ధర్నాలో పాల్గొనేందుకు విజయమ్మ వెళ్లిన సందర్భంలో... మేడ్చల్ నియోజకవర్గ వాసులు ప్రధాన రహదారి పొడవునా ఆమెకు ఘనస్వాగతం పలికారు. 

ఆ సందర్భంలో వారి అభిమానానికి తీవ్రంగా స్పందిం చిన విజయమ్మ వీలైనే ఆ నియోజకవర్గంలో పర్యటించాలని భావించారు. కాకతాళీయంగా ‘గడపగడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ కార్యక్రమా న్ని ప్రారంభించేందుకు ఆమె జవహర్‌నగర్‌కు వచ్చారు. ఆ ప్రాంతవాసలు అపూర్వస్వాగతంతో రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటిచెప్పారు. దారిపొడవునా నిలబడి ఆమెకు స్వాగతం పలకటంతోపాటు స్వచ్ఛందంగా వేల సంఖ్యలో తరలివచ్చి సభా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభ ఆద్యంతం వారు అలాగే నిలబడి చప్పట్లు, నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీతోపాటు, టీఆర్‌ఎస్ నేతలు అడ్డంకులు సృష్టించేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు స్వచ్ఛందంగా తిప్పికొట్టారు. 

మూడు రోజుల కుట్ర.. 
జవహర్‌నగర్‌లో ‘గడపగడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైఎస్‌ఆర్ సీపీ దాదాపు పది రోజుల క్రితమే నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ నేతలు హడావుడికి సిద్ధమయ్యారు. స్థానికంగా ఆ పార్టీ నేత, వైఎస్ అభిమాని ఇటీవల ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని నాలుగురోజుల క్రితం ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని ఆహ్వానించి ఈ తంతు జరిపించారు. స్థానికంగా పార్టీ బలహీనపడుతోందని ఆయనతో మొరపెట్టుకున్నారు. నష్టనివారణలో భాగంగా ఎమ్మెల్యే వేల సంఖ్యలో స్థానిక ప్రజలను తీసుకెళ్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ చేయించారు. ఈ సందర్భంగా జవహర్‌నగర్‌కు ముఖ్యమంత్రి భారీఎత్తున హామీలను కూడా గుప్పించారు. ఇంతవరకు పరిస్థితి బాగానే ఉందని భావించిన కాంగ్రెస్ నేతలకు విజయమ్మ పాల్గొనే బహిరంగసభ ఏర్పాట్లతో మళ్లీ కలవరం మొదలైంది. పరిస్థితిని చూస్తుంటే సభకు జనం భారీగా వచ్చే అవకాశం ఉందని గుర్తించి మూడు రోజుల క్రితం కుట్రలకు తెరదీశారు. ఆ బహిరంగసభకు వెళ్లే వారికి ప్రభుత్వపరంగా వచ్చే లబ్ధి అందదంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎవరెవరు సభకు హాజరవుతున్నారో సులభంగా గుర్తిస్తామని కూడా బెదిరించారు. దీంతో సభ వెలవెలబోవటం ఖాయమని భావించారు. సాయంత్రం ఐదు గంటల వేళ సభ ప్రారంభం కావటానికి ముందు అక్కడి పరిస్థితి చూసి తమ కుట్ర పనిచేసిందని వారు సంబరపడ్డారు. కానీ సరిగ్గా విజయమ్మ జవహర్‌నగర్‌లోకి ప్రవేశించగానే పరిస్థితి మారిపోయింది. కేవలం మూడంటే మూడు నిమిషాల్లోనే జరిగిన మార్పుతో కాంగ్రెస్ నేతలు కంగుతినాల్సి వచ్చింది. ఆమె నేరుగా అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి సభా ప్రాంగణానికి వచ్చేలోపు వేలాదిగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఖాళీగా కనిపించిన ఆ ప్రాంగణం ఒక్కసారిగా నిండిపోవటమే కాకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిల నినాదాలతో మారుమోగేసరికి... అప్పటి వరకు ఆ చుట్టుపక్కల మకాంపెట్టిన కాంగ్రెస్ నేతలు మాయమైపోయారు. 

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన హరివర్ధన్‌రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత, జీహెచ్‌ఎంసీ పరిధిలోని హబ్సిగూడకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ హరివర్దన్‌రెడ్డి అనుచరుల జయజయధ్వానాల మధ్య విజయమ్మ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌రాజశేఖరరెడ్డి వీరవిధేయుడైన హరివర్ధన్‌రెడ్డి... వైఎస్ జగన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు తీరుతో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తుదకు అనుచరులతో చర్చించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ‘గ డపగడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జవహర్‌నగర్‌కు విజయమ్మ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక మీదుగా ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయనను పార్టీ కండువా కప్పి విజయమ్మ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసిగిపోయినందున ఇక జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో పనిచేస్తానని ఈ సందర్భంగా హరివర్ధన్‌రెడ్డి అన్నారు. 

వైఎస్ విగ్రహం వద్దకు వెళ్లనీయకుండా..
ఇటీవలే ఆవిష్కరించిన వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి విజయమ్మ పుష్పాంజలి ఘటించాల్సి ఉంది. కానీ దీన్ని భగ్నం చేసే కుట్రలో భాగంగా కాంగ్రెస్ నేతలు విగ్రహం వద్ద కంకర, సిమెంట్ కలిపి గందరగోళంగా గుమ్మరించి అడ్డంకులు సృష్టించారు. అక్కడికి వెళ్తే ఇబ్బంది కలిగే పరిస్థితి కల్పించటంతో విజయమ్మ దూరం నుంచే మహానేతకు ప్రణామం చేసి ముందుకుసాగారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!