YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 20 June 2012

చీమ తల - నాయకుల మెదడు


పిసిసి బొత్స గారూ ఏంటండి ఉప ఎన్నికల్లో ఇలా జరిగింది. రెండు సీట్లకే పరిమితం అయ్యారు? అని ప్రశ్నిస్తే, ఎండల వల్ల ఓడిపోయాం అని చల్లగా చెప్పారు. బాబుగారి పాలనలో ఐదారేళ్లపాటు వర్షాలు లేక వానదేవుడి వల్ల ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎండల వేడికి ఓడిపోయామని చెబితే నమ్మాలి మరి. బొత్స మాటలపై టీవీలో చర్చ నిర్వహిస్తే, టీవీ ప్రేక్షకుడొకరు ఫోన్ చేసి అలాగా అయితే వర్షాల్లో ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం 18 సీట్లు గెలిచేవారా ? అని ఎకసెక్కాలాడాడు.
మరొకాయనేమో! జగన్ అరెస్టు వల్ల సానుభూతితో గెలిచాడని టీవీలో నేతలు మాట్లాడుతుంటే, ఐతే బాబు తన కోర్టు కేసుల నుండి స్టే తెచ్చుకోవడం ఎందుకు, అధికారంలో ఉన్నప్పుడు తన వాళ్ల కోసం చేసినవన్నీ సిబిఐకి చెప్పి అరెస్టయి మొత్తం 294 సీట్లు గెలవ వచ్చు కదా? అని సలహా ఇచ్చారు.
కిరణ్ కుమార్‌రెడ్డి సంతోషంగా స్వీట్లు పంచుతున్నారు. ఏం సార్ ఎందుకు ఓడిపోయారు? అంటే ఓడిపోవడం ఏమిటి? రెండు సీట్లు గెలిచాం అని అనువాదం అవసరం లేని తెలుగులో చెప్పాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే టేబుల్‌పైన 30 రోజుల్లో తెలుగు పుస్తకం కనిపించింది. సరే చెప్పండి అంటే? మా పై మాకూ, హై కమాండ్‌కు, మీకు, మా అభ్యర్థులకు ఎవరికీ నమ్మకం లేకపోయినా నర్సాపురం, రామచంద్రాపురం తెలుగు తమ్ముళ్లకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే వాళ్లు మద్దతిచ్చారు, మా వాళ్లు గెలిచారు అని చెప్పుకొచ్చారు. ఆ రెండు కాదండి మిగిలిన వాటి సంగతి చెప్పండి ? అని అడిగితే ఎవరో ఒకరు గెలిపించాలి కానీ ఓడించడానికి మాత్రం మా శక్తి మాకు సరిపోతుందని నవ్వాడు. ఏ విషయంపైనైనా అంకెలతో సహా చక్కగా విశే్లషించి చెప్పే చంద్రబాబు వద్దకు స్పష్టంగా చెబుతాడని వెళితే….
టేబుల్ నిండా ఫైళ్లు ఉన్నాయి. వాటిని పక్కకు జరిపి చూస్తే చంద్రబాబు కనిపించారు. ఏంటిసార్ సెక్రటేరియట్‌లో ఒక్క ఫైల్ కూడా కదలడం లేదట కిరణ్ కుమార్ మొత్తం ఫైళ్లు మీకే పంపిస్తున్నట్టున్నారు? అని జోకేస్తే, ఇవి మా పార్టీకి సంబంధించిన ఫైళ్లు అని చిన్నబుచ్చుకున్నారు. ఓహో మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరి వివరాలు ఉన్నట్టున్నాయి. రాష్ట్రం కాదు ఒక్క నియోజక వర్గంవే మా వద్ద పూర్తి వివరాలు ఉంటాయి. చదువుతా వినండి అని ఇంటి నంబర్ 1-2.12 తింగరి వీధి, ఓటరు పేరు నాలేశ్వర్ వయసు 50. ఎత్తు 5.5 అడుగులు, బరువు 65 కేజీలు, పలానా కులం. వారానికి ఒకసారి భార్యాభర్తలు సినిమాకు వెళతారు. మహేష్‌బాబు, ఇలియానా అభిమాని. తాగి వస్తే భార్యను చితగ్గొడతాడు, తాగకుండా వచ్చినప్పుడు భార్య చితగ్గొడుతుంది. 1980లో పెళ్లి….
సార్ … ఆగండి సార్ ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలిసిపోయింది. ఇక చాలు. మీ వద్ద అవసరమైన సమాచారం కన్నా అనవసర సమాచారం ఎక్కువగా ఉంటుంది. అంకెలను నమ్ముకుని బోర్లా పడుతున్నారు. మీ వద్ద రాష్ట్ర ప్రజల జీవిత చరిత్ర ఉంది కానీ ప్రజలేమనుకుంటున్నారో మీకు తెలియదు..
సరే మేధావి గారు ఎన్నికల ఫలితాల పై మీరేమంటారు ?
ప్రజల్లో నిజాయితీ, మంచితనం లోపించింది. ప్రజలంతా అవినీతి పరులయ్యారు ?
డబ్బులు అన్ని పార్టీల వాళ్ళు పంచారని వార్తలు వచ్చాయి కదా ?
నేను అదే చెబుతున్నాను. ప్రజలు ఒక పార్టీ కి ఓటు వేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఇతర పార్టీ వారి నుంచి డబ్బు తీసుకోవడం తప్పు కదా
మా సామాజిక వర్గాన్ని గెలిపించని ఈ ప్రజలన్నా, వీళ్ళ తీర్పు నాకు కంపరమేస్తోంది ? అయితే నేను ఆశావాదిని 2014 లో మా సామాజిక వర్గం విజయం సాదిస్తుంది . కుల రహిత సమాజాన్ని నిర్మిస్తుంది .
http://amruthamathanam.blogspot.in/

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!