YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 28 November 2012

తాగునీటి కోసం 4, 5 కిలోమీటర్లు...

అదే హోరు..అదే జోరు.. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నడ్డిగడ్డతో విజయవంతంగా సాగుతోంది. ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. ప్రజల కష్టాలకు పాలకులే కారణమని దుయ్యబట్టారు. షర్మిల జనంతో మమేకమై కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ వారికి అభియమిస్తున్నారు. అధైర్యపడకండి.. ఏడాది ఓపికపడితే జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, అన్ని సమస్యలు తొలగిపోతాయని వారికి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. 

ఏ గ్రామానికి వెళ్లినా తాగునీటి కోసం 4, 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని షర్మిల పేర్కొన్నారు. నడిగడ్డ ప్రాంతంలో 180 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.100 కోట్లు మంజూరు చేసినా ఇప్పటికీ ఆ పథకం అమలు అతీగతీలేకుండా పోయిందన్నారు. మహిళలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలు మంత్రి డీకే అరుణకు అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. 

మహిళగా ఉండి మహిళల ఇబ్బందులు తీర్చలేకపోయిన మంత్రి అరుణ ఒక్క క్షణం కూడా ఆ సీట్లో కూర్చొనే అర్హత లేదని షర్మిల విమర్శించారు. నెట్టెంపాడు పనులు పూర్తిచేయకుండా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభించినా..ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేక పోయారని దుయ్యబట్టారు. ఆ పాపమంతా సర్కారుదేనని ఆమె నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానంలో పాదయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బుధవారం గద్వాల శివారు ప్రాంతం నుంచి నెట్టెంపాడు ప్రాజెక్టు వరకు పాదయాత్ర కొనసాగించారు.

సంగాల చెరువు, గోనుపాడు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా ఏగ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య..మరోవైపు తీవ్ర విద్యుత్ కొరత..పంటకు గిట్టుబాటు ధర లేదు. అప్పుల పాలు కావడం తప్ప ఏమీ మిగలడం లేదు..పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలాలను అమ్మాల్సిన పరిస్థితి...లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ప్రజలు షర్మిల ముందుకొచ్చి కన్నీళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధైర్యపడకండి.. ఏడాది ఓపికపడితే అన్ని సమస్యలు తొలగిపోతాయని షర్మిల వారికి అభయమిచ్చారు. 
నెట్టెంపాడు నుంచి నీరివ్వలేకపోయారు
అనంతరం ధరూరు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల ప్రసంగిస్తూ..25వేల ఎకరాలకే పరిమితం చేసి అపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నెట్టెంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రెండులక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి, రూ.1200 కోట్లు మంజూరుచేసి 75 శాతం పనులు పూర్తిచేసినా మిగిలిన 25 శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందన్నారు. అభివృద్ధి పనులపై ఈ పాలకుల చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు. 

ఫీజురీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చారు
తరతరాల వెనకబాటుతనానికి చదువే ముఖ్యమని భావించిన మహానేత వైఎస్ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చి విద్యార్థులకు ఫీజులు భిక్షం వేసినట్లు ఇస్తున్నారని విమర్శించారు. జగనన్న జైల్లో ఉన్నా ఆయన నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అదేవిధంగా ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అంటూ నిత్యం వైఎస్‌ను గుర్తుచేసుకుంటున్నారన్నారు. 

అదీ విశ్వసనీయత అంటే అని షర్మిల అన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందాల్సిన వైద్యం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు మాత్రం వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు లేదా ఇతర దేశాలకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటూ ప్రజల వైద్యం గురించి పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు అబద్ధపుమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే జగనన్నను ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!