YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 1 December 2012

ఏ చట్టం లేకుండానే వైఎస్ ఎన్నో చేశారు...

అన్ని రకాలుగా సమస్యల్లో చిక్కుకున్న కాంగ్రెస్ ఊపిరాడని స్థితిలో ఉంది 
మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా ‘సబ్‌ప్లాన్’ బిల్లు తెచ్చారు 
రాజ్యాంగ భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ఎందుకు కృషి చేయదు?
‘సబ్‌ప్లాన్’పై ప్రధానికి సోనియా లేఖ రాసినా కేంద్రం చట్టం చేయలేదేం? 
సంకల్పబలం ఉండాలి కానీ.. చట్టాలు ప్రధానం కాదని వైఎస్ చూపారు 
ఏ చట్టం లేకుండానే దళిత, గిరిజనుల అభివృద్ధికి అనేక పథకాలు తెచ్చారు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం మంచిదే అయినా.. ఎన్నికలకు ఏడాది ముందు హడావుడిగా తీసుకురావటం వెనుక కాంగ్రెస్ పార్టీ స్వార్థప్రయోజనమే తప్ప.. దళితులు, గిరిజనుల మేలు ఆశించి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మ విమర్శించారు. అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఊపిరాడని స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తే ఆ వర్గాలు తమవైపు వస్తాయన్న ఆశతోనే అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిందని ధ్వజమెత్తారు. యూపీఏకి, జాతీయ సలహా మండలికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ.. సబ్‌ప్లాన్‌పై ప్రధానమంత్రికి లేఖ రాసి ఏడాదైనా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదని విజయమ్మ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రాజ్యాంగపరమైన భరోసా ఏదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సబ్‌ప్లాన్‌కు రాజ్యాంగ భరోసా కల్పించేందుకు ఎందుకు కృషి చేయటం లేదని నిలదీశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే.. ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుందని విరుచుకుపడ్డారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏ చట్టాలు లేకుండానే దళితులు, గిరిజనుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు చేపట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేస్తే తప్ప వారికి మేలు జరగదనే స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. దళితుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేయాలన్న సంకల్పం ఉండాలే కానీ.. చట్టాలు ప్రధానం కాదని, వైఎస్ దానిని ఆచరణలో చేసి చూపించారని ఆమె పేర్కొన్నారు. సబ్‌ప్లాన్ బిల్లుపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో విజయమ్మ మాట్లాడుతూ.. విద్యుత్, ఆర్‌టీసీ, వంట గ్యాస్, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసి ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం.. పేదలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులపై పడుతున్న భారాన్ని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఏ చట్టం లేకుండానే వైఎస్ ఎన్నో చేశారు... 

ఏ చట్టం లేకుండానే దివంగత వైఎస్సార్ విద్య, వైద్యం, ఆహారం, గూడు, ఉపాధి కార్యక్రమాలను అమలు చేశారని విజయమ్మ గుర్తుచేశారు. దళితులు, గిరిజనులు పారిశ్రామికవేత్తలు కావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల్లో ప్లాట్లు రిజర్వ్ చేయటం, వ్యాట్‌లో యాభై శాతం రీయింబర్స్ చేయటం, ఒక రూపాయికే యూనిట్ విద్యుత్ సరఫరా, పెట్టుబడుల్లో ఎస్సీలకు 35 శాతం సబ్సిడీ కల్పించటం, మహిళా పారిశ్రామిక వేత్తలకు 40 శాతం సబ్సిడీ ఇవ్వటం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో పథకాలు అమలు చేశారని, కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా సంతృప్త స్థాయిలో పనులు చేసేలా బడ్జెట్‌కు రూపకల్పన చేశారని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌కు దళితులు రూ. 1,120 కోట్లు బకాయి పడితే రాజశేఖరరెడ్డి రద్దు చేసి ఆదుకున్నారని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా వైఎస్ ఎస్సీలకు 14.26 శాతం, ఎస్టీలకు 8 శాతం నిధులు బడ్జెట్‌లో కేటాయించి, ఖర్చు చేయించారని విజయమ్మ చెప్పారు. చంద్రబాబు కేవలం 3.09 శాతం నిధులు కేటాయించారని గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పేదలకు రేషన్ బియ్యం కోటా పెంపు, రైతాంగానికి ఏడు నుంచి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని.. ఈ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని తప్పుపట్టారు. 

వ్యయ వర్గీకరణ ఎలా చేస్తారు? 

ఈ ప్రభుత్వం ప్రజలపై మోయలేని ఆర్థిక భారం మోపుతూ ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పనిచేస్తోందే తప్ప.. వారిని కనికరించటం లేదన్నారు. సబ్సిడీ సిలిండర్లను ఆరుకు కుదించారని విమర్శించారు. ‘‘మూడేళ్లలో కొత్తగా ఇళ్లు, భూములు, పరిశ్రమలు ఇచ్చారా..? పెన్షన్ 200 నుంచి 500 చేశారా..? వికలాంగులకు పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచారా? మెస్‌చార్జీలు పెంచారా..? ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నారా..?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దళితులు, గిరిజనులు వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని.. ఇలా చట్టాలు తేవటం కేవలం సంతృప్తిపరచటానికే పనికివస్తాయని.. వాటి అమలులో చిత్తశుద్ధి కావాలని సూచించారు. ఈ బిల్లు తేవటం మంచిదే అయినా.. ఇందులో వ్యయ వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దళిత, గిరిజనుల అభ్యున్నతిపై చంద్రబాబు పాలనకు కొనసాగింపుగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. దళితులు అన్ని వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలన్నట్లు కాకుండా అనుసూచిత కులాల్లో అభివృద్ధి సాధించాలనే విధంగా పేర్కొన్నారని తెలిపారు. 

sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!