కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడైన వడ్డేపల్లి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రజల అభిమాన నేత అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని తప్పుడు కేసులతో వేధిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కూకట్‌పల్లిలో తన అనుచరులు, అభిమానులు, స్నేహితులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తమైపోయిందని, పార్టీ పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, తన అనుచరుల అభిప్రాయం మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న తనకు పీజేఆర్, అనంతరం వైఎస్ రాష్ట్రస్థాయిలో గౌరవమిచ్చారని, చైర్మన్ పదవి, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని చెప్పారు. వైఎస్ ప్రోత్సాహంతోనే రాజకీయంగా ఎదిగానన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టపడ్డవారికి కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇచ్చారని, తనను పార్టీకి దూరం చేసే విధంగా నాయకులు వ్యవహరించారని తెలి పారు. అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన వైఎస్‌ను ప్రజలు మరువలేకపోతున్నారని, ఆ పథకాలన్నీ దేశవ్యాప్తంగా కీర్తిగడించాయని చెప్పారు. ఈ పథకాలను నీరుగారుస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనన్నారు. తనతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment