చేయని తప్పుకు ఇంకెంత కాలం జైల్లో పెడతారు? దర్యాప్తునకు కాల పరిమితి లేదా? ఎప్పట్లోగా పూర్తవుతుందో సీబీఐ చెప్పాలి సీసీ నంబర్ 8లో దర్యాప్తు పూర్తయినందున బెయిలివ్వండి దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తామో చెప్పలేం: సీబీఐ వాదనలు పూర్తి.. డిసెంబర్ 4న కోర్టు ఉత్తర్వులు హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సక్రమమే అయినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పేమిటి? చేయని తప్పుకు ఇంకా ఎంత కాలం జైల్లో పెడతారు?’’ అని జగన్ తరఫున హైకోర్టు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. తనను రిమాండ్ చేసిన సీసీ నంబర్ 8లో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 437 కింద జగన్ దాఖలు చేసిన సాధారణ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారం విచారించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కీలక వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారెవరూ ఆయన మోసం చేశారని ఫిర్యాదు చేయలేదు. రాజకీయ పలుకుబడి, హోదా కారణంగా జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో గతంలో బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కానీ నిందితునిగా ఉన్న ఓ మంత్రికి మాత్రం ఈ కారణాన్ని వర్తింపజేయలేదు. ఆయనకు సమన్లు మాత్రమే జారీచేశారు’’ అంటూ వాదనలు వినిపించారు. ఎంపీగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి ‘‘సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పింది. దాంతో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఎలాంటి కాల పరిమితీ విధించలేదు. కానీ సీబీఐ తీరు చూస్తుంటే కొన్నేళ్లకు గానీ దర్యాప్తు పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. దర్యాప్తు త్వరగా పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పిన రెండు నెలల తర్వాత మేం బెయిల్ కోసం అడుగుతున్నాం. ఇంకెంత కాలం జగన్ జైల్లో ఉండాలి? ఇదేమీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కాదు. అక్రమాలు జరిగాయని చెబుతున్న సమయంలో జగన్ పబ్లిక్ సర్వెంట్ కూడా కాదు. ప్రభుత్వాధికారులతో కుమ్మక్కై ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు మంత్రిమండలి నిర్ణయాలు, అధికారులు జారీ చేసిన జీవోలు సక్రమమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నిందితునిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులతో పాటు ఇతరులను సీబీఐ కస్టడీలోకి తీసుకోలేదు. జగన్‌ను అరెస్టు చేయకుండా కూడా దర్యాప్తు చేసుకోవచ్చు. కానీ వివక్షపూరితంగానే ఆయనను అరెస్టు చేశారు. పార్లమెంట్ సభ్యునిగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది. అకారణంగా నెలల తరబడి ఆయన్ను జైల్లో పెట్టడం తగదు’’ అని నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జగన్‌ను మాత్రమే జైల్లో పెట్టాలనుకుంటున్నారు: జగన్‌ను మాత్రమే జైల్లో పెట్టాలని సీబీఐ భావిస్తోందని, దర్యాప్తు పేరుతో ఆయనకు బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ‘‘సీసీ నంబర్ 8 కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. మిగతా అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని చెబుతోంది. సీసీ నంబర్ 8లో దర్యాప్తు చేయాల్సిందేమీ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వండి. సీబీఐ దర్యాప్తు పూర్తి చేయడానికి ఇంకెంత సమయం పడుతుంది? అందుకు కాల పరిమితి ఎంత? ఏపీఐఐసీ కేటాయించిన భూముల్ని ప్రభుత్వం ఇంతవరకూ వెనక్కు తీసుకోలేదు. అందులో పొరపాట్లు జరిగి ఉంటే భూ కేటాయింపుల్ని రద్దు చేసి ఉండేది. సాక్షులను ప్రభావితం చేస్తాననడంలో వాస్తవం లేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా ఆ అభిప్రాయాన్ని ప్రస్తావించలేదు. దర్యాప్తునకు ఆయన సహకరిస్తారు. ఎలాంటి షరతులు విధిం చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం. బెయిలివ్వండి’’ అని కోరారు. నేరం రుజువు కానంతవరకు అమాయకులే: నేరం రుజువు కానంత వరకు నిందితులు అమాయకులేనని సుప్రీంకోర్టు పలు తీరుల్లో స్పష్టం చేసిన విషయాన్ని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. ‘‘బెయిల్ నిబంధనలను సంజయ్‌చంద్ర కేసులో ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. బెయిల్ తప్పనిసరి. జైలు అనేది మినహాయింపు. బెయిల్ తిరస్కరించడం వ్యక్తి స్వేచ్ఛను హరించడమే. సీసీ నంబర్ 8లో జగన్ అరెస్టును హైకోర్టు సమర్థించలేదు. అన్ని అంశాల్లో పెండింగ్ దర్యాప్తులో భాగంగానే జగన్‌ను అరెస్టు చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. సీసీ నంబర్ 8లో జగన్‌కు బెయిలివ్వండి. దర్యాప్తు పూర్తయినా ఆయనను జైల్లో ఉంచడం వివక్షాపూరితమే కాక రాజ్యాంగ విరుద్ధం’’ అని ఆయన పేర్కొన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువేమీ విధించలేదని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. ఇది ఆర్థిక నేరమని, ఇందులో దర్యాప్తు కొన్ని నెలల్లో, ఏడాదిలోనే పూర్తి చేసే అవకాశం లేదని అన్నారు. ‘‘జగన్ కేసు దర్యాప్తును ఎప్పట్లోగా పూర్తి చేస్తామో చెప్పలేం. జగన్‌ను వాన్‌పిక్ కేసులోనే అరెస్టు చేశాం. 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేశాం. ఇదేమీ అంత సులువైన కేసు కాదు. పెట్టుబడులకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తుది చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పాం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ పిటిషన్ విచారణార్హం కాదు. కొట్టివేయండి’’ అని కోరారు. source:sakshi |
Friday, 30 November 2012
జగన్ నేరమేంటి?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment