YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 30 November 2012

ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు ...

‘‘జిల్లాలో ఎక్కడికి వెళ్లినా మహిళలు తాగునీటి సమస్యలే చెబుతున్నారు. కనీసం తాగునీటి ఇబ్బందులు తీర్చలేని ఈ ప్రభుత్వం ఉన్నట్టా..చచ్చినట్టా.. జిల్లా రైతాంగం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆత్మకూరు మండలంలో 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు జెన్‌కో ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ నిధులు కేటాయిస్తే ఆ నిధులను కూడా సకాలంలో ఖర్చుచేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది’’ అని షర్మిల ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను ఎండిగడుతూ.. ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు. 

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం మక్తల్ నియోజకవర్గంలోని మూలమళ్ల గ్రామం నుంచి అల్లీపురం వరకు మరో ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న రాజీవ్ భీమా ప్రాజెక్టు నిర్మాణానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవంపోసి 2004 సెప్టెంబర్ 24న మక్తల్ పట్టణంలో మొదటిదశ పనులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దాదాపు రూ.2100 కోట్లు కేటాయించి రూ.1700 కోట్లు ఖర్చుచేసి 85 శాతం పనులు పూర్తిచేస్తే మిగిలిన 15 శాతం పనులను ఈ ప్రభుత్వం మూడేళ్లు గడిచినా పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. 

నాడే రైతే రాజు 
‘యాత్రలో భాగంగా చెన్నయ్య అనే రైతు నా అడుగులో అడుగు వేస్తూ మీ నాన్న కన్న తండ్రి లాంటి వాడమ్మా అన్నారు. ఎందుకన్నా అని అడిగితే మా పరిస్థితి చూడమ్మా.. పొలంలో పత్తి వేశాను. నష్టం వచ్చింది. అయినా తిరిగి మరోసారి పంట వేస్తున్నా. ఏమొస్తుందో ఏమో.. మీ నాన్న ఉన్నప్పుడు అప్పులు తీరి గడ్డనపడ్డాను. ఆయన పోయిన తర్వాత రైతులను ఎవరూ ఆదుకోలేదు. రూ.3 లక్షల అప్పులయ్యాయి’ అంటూ చెబుతున్న ఆ రైతు బాధను వింటుంటే ఓ వైపు సంతోషంగా ఉంది, మరోవైపు బాధగా ఉందని షర్మిల అన్నారు. వైఎస్ హయాంలో రైతు రాజులా బతికాడని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో యాదవ కులస్తులను ఆదుకునేందుకు వైఎస్ సొసైటీలను ఏర్పాటుచేసి ఆర్థిక సహాయం అందిస్తే ప్రస్తుతం వారి ఇబ్బందుల గురించి అడిగేనాథుడే లేరన్నారు. ఆ తరువాత మార్గమధ్యంలో గొర్రెలకాపరులతో మాట్లాడారు. 
పేదలను చదువులకు దూరం చేశారు!
ఈ ప్రభుత్వం ఆదుకోకపోవడంతో కుటుంబ జీవనం గడిచేందుకు పాఠశాలకు వెళ్లే పిల్లలను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రులు కూలిపనులకు తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మరికొందరైతే ప్రభుత్వం చదివిస్తుందనే భరోసా లేకపోవడంతో చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారని అన్నారు. ఇటువంటి ఇబ్బందులను ముందుగానే గుర్తించిన వైఎస్ రాజశేఖరరెడ్డి చదువుకోలేని పేదవిద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలుచేశారని గుర్తుచేశారు. ఈ పథకాన్ని అమలుచేయకుండా పాలకులు పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు.

జగనన్నను ఆశీర్వదించండి
షర్మిల అంతకుముందు మూలమళ్ల గ్రామ శివారులో ఉన్న వలస కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘‘మా ప్రాంతంలో పనులు లేక అయిజ మండలం నుంచి వరికోత పనుల కోసం ఇక్కడికి వచ్చామని’’ మహిళలు తమ కష్టాలను వివరించారు. ‘నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు పూర్తయితే మాకు ఇలా వలస వచ్చి పనులు చేసుకునే పరిస్థితి తప్పుతుందని’ వైఎస్‌ను గుర్తుచేశారు. అనంతరం మూలమళ్ల గ్రామంలో రచ్బబండ కార్యక్రమంలో పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తదితర వాటి అమలు సరిగా లేదని షర్మిల వద్ద పలువురు మహిళలు మొర పెట్టుకున్నారు. రాజన్నరాజ్యం వస్తే అన్ని సమస్యలు తీరుతాయని అందుకు రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకు బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!