YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 30 November 2012

చట్టబద్ధంగా బెయిల్‌కు అర్హుడిని

సుప్రీం ఉత్తర్వులను సీబీఐ కోర్టు తప్పుగా అర్థం చేసుకుంది
సెక్షన్ 167(2) విషయాన్ని అసలు సుప్రీంకోర్టు చెప్పనేలేదు
అయినా సీబీఐ కోర్టు సుప్రీం ఉత్తర్వులను కారణంగా చూపింది
నిర్దేశించిన గడువులోపు సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయలేదు
కాబట్టే నేను సెక్షన్ 167(2) కింద బెయిల్ కోరుతున్నా
అది నాకు చట్టం ప్రసాదించిన రాజ్యాంగపరమైన హక్కు
పిటిషన్‌పై సోమవారం విచారణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: తనకు బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. చట్ట ప్రకారం తనకు నేరశిక్షాస్మృతి(సీఆర్‌పీసీ) సెక్షన్ 167(2) ప్రకారం రావాల్సిన బెయిల్‌ను నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేసి, తనకు 167(2) కింద బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి విచారించనున్నారు. 

సీసీ నంబర్ 8లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆర్‌సీ 19(ఎ)కు అన్వయించిందని, ఈ రెండూ కూడా వేర్వేరు కేసులన్న విషయాన్ని ప్రత్యేక న్యాయస్థానం విస్మరించిందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) ప్రకారం ఏదైనా కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, అప్పటి నుంచి 90 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో, ఆ వ్యక్తి బెయిల్ పొందేందుకు అర్హుడని.. దీని ప్రకారం సీబీఐ ఈ మొత్తం కేసులో ఇప్పటి వరకు పూర్తిస్థాయి చార్జిషీట్ చేయలేదని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. 167(2) కింద నిందితునికి బెయిల్ పొందే హక్కు గురించి సుప్రీంకోర్టు ఇప్పటికే పలు స్పష్టమైన తీర్పులనిచ్చిందని, అయితే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన విషయంలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వివరించారు. నిర్దిష్ట కాలపరిమితిలోపు చార్జిషీట్ దాఖలు చేయకుంటే, నిందితుడు ఆటోమేటిక్‌గా బెయిల్ పొందుతాడని సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుల ఆధారంగానే, తాను ప్రత్యేక న్యాయస్థానంలో సెక్షన్ 167(2) కింద చట్టబద్ధమైన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశానని ఆయన వివరించారు. 

‘నా కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, ఆర్‌సీ నంబర్ 19(ఎ)లో సీబీఐ నన్ను ఈ ఏడాది మే 27న అరెస్టు చేసింది. ఇదే వ్యవహారంలో మరో నిందితుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు ఇతర నిందితులను సీబీఐ అరెస్టు చేయలేదు. సీబీఐ అధికారులు వారందరినీ కూడా నిందితులుగా పేర్కొన్నారు. కానీ వారిని అరెస్ట్ చేయలేదు. దీన్ని బట్టి నిందితులను అరెస్టు చేయకుండా, రిమాండ్‌కు తరలించకుండా కూడా దర్యాప్తు కొనసాగించవచ్చే అవకాశం ఉన్నప్పటికీ, నన్ను అరెస్ట్ చేసి, మిగిలిన వారిని మాత్రం సీబీఐ వదిలేసింది. దీన్ని ఏమని భావించాలి. దీని అర్థం ఏమిటి? నా అరెస్టును సవాలు చేస్తూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశా. అయితే హైకోర్టు నా అరెస్ట్‌ను సమర్థించింది. అదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంలో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా సీబీఐ ఇప్పటి వరకు దర్యాప్తు చేయలేదు. అంతేకాక నిర్దేశించిన గడువు లోపు చార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో నాకు సెక్షన్ 167(2) కింద బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు చెప్పినట్లు సీబీఐ చట్టం నిర్దేశించిన కాలంలోపు చార్జిషీటు దాఖలు చేయలేదు కాబట్టే నేను సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ పొందేందుకు అర్హుడిని. అయితే ఈ విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కారణంగా చూపుతూ నాకు బెయిల్ నిరాకరించింది. అందుకే నా చట్టబద్ధ హక్కును సాధించుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాను. దీనికి ముందు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు, దర్యాప్తు పూర్తయిన తరువాత బెయిల్ కోసం రావాలని చెప్పింది. అయితే సీబీఐ ప్రధాన కేసులో 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయలేదు కాబట్టి సెక్షన్ 167(2) విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 

అసలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకే సీబీఐ వక్రభాష్యం చెబుతోంది. దర్యాప్తు పూర్తి చేసే విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి గడువు విధించలేదని సీబీఐ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ మీడియా ముఖంగా చెప్పారు. దీనిని బట్టి సీబీఐకి ఇప్పట్లో దర్యాప్తు పూర్తి చేసే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. ఒక వ్యక్తి తాలూకు హోదాను, స్థాయినీ ఆయనకు వ్యతిరేకంగా ఉపయోగించకూడదు. నేను ఎంపీని కాబట్టి, నాకున్న పలుకుబడితో సాక్ష్యాలు తారుమారు చేయగలనని, సాక్షుల్ని ప్రభావితం చేయగలనని సీబీఐ వాదిస్తోంది. నేను ఎంపీగా ఎన్నికయింది ఇప్పుడు కాదు. ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేనాటికే నేను ఎంపీని. అలాంటిది నన్ను కనీసం విచారణ కూడా చేయకుండా మూడు చార్జిషీట్లు వేసింది. నా పదవి వారి దర్యాప్తునకు ఆటంకమై ఉంటే, వారు మూడు చార్జిషీట్లు దాఖలు చేసేవారా..? సీబీఐ చేస్తున్న అర్థం లేని వాదన ఆధారంగా నాకు బెయిల్ నిరాకరించడం సరికాదు’ అని జగన్‌మోహన్‌రెడ్డి తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!