YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 30 November 2012

"ఓబుళాపురం" వెనుక ఒప్పందం ఏమిటి?


http://www.ysrcongress.com/news/news_updates/obulapuram_venuka_oppamdam_emiti_.html

 టీడీపీకి సన్నిహితమైన ఎస్ఆర్ మినరల్స్‌కు ఓబుళాపురం భూముల కేటాయింపు జరగడానికి వెనుక ఉన్నఒప్పందం ఏమిటో బయటపెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ సమాధానం దాటవేసే రీతిలో ఉందని ఆమె విమర్శించారు.  కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనేందుకు ఎస్ఆర్ మినరల్స్‌-ఓబుళాపురం భూముల వ్యవహారం మరో నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. డొంకతిరుగుడు మాటలు మాని భూముల కేటాయింపులోని అసలు ఉద్దేశ్యాలేమిటో బయటపెట్టాలని ఆమె అన్నారు.  టీడీపీతో కుమ్మక్కు కాలేదని చెప్పుకోవాలంటే ప్రభుత్వం ముందు ఎస్ఆర్ మినరల్స్‌కు కేటాయించిన భూములను రద్దు చేసి, వాటిని ఏపీఎండీసీకి మంజూరు చేసి, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు.
 ఆ రోజు  25 హెక్టార్ల భూమిని రాజశేఖర్ రెడ్డిగారి ప్రభుత్వం ఏపీఎండీసీకి ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పుడు కిరణ్ కుమార్ ప్రభుత్వం అందులోని 18 హెక్టార్లను ఎస్ఆర్ మినరల్స్‌కు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించారు. ఎస్ఆర్ మినరల్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ సురేంద్రబాబు టీడీపీ నేతలకు సన్నిహితుడని శోభా నాగిరెడ్డి ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. 

నానా యాగీ చేసిన బాబు!
"ఓబుళాపురం మైనింగ్ విషయంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు నానా యాగీ చేశారు. తనకు వంత పాడే మీడియాను అడ్డం పెట్టుకుని మహానేత వైయస్ నాడు జనార్దనరెడ్డికి దోచిపెట్టారనీ, అక్రమంగా లీజులిచ్చారనీ అవాకులూ చవాకులూ మాట్లాడారు. మరి ఇవాళ నాడు ప్రభుత్వానికి చెందిన ఏపీఎండీసీకి కేటాయించిన భూములను రద్దు చేసి ప్రైవేటు సంస్థ అయిన ఎస్ఆర్ మినరల్స్‌కు కేటాయిస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు. 
ఏపీఎండీసీ 27-10-2004న దరఖాస్తు చేస్తే, ఎస్ఆర్ మినరల్స్‌ దరఖాస్తు చేసింది 12-10-2004న అని ఆమె వివరించారు. 2005 అక్టోబర్ 26న  ఎస్ఆర్ మినరల్స్‌కు ఫారెస్టు క్లియరెన్స్ ఇచ్చారనీ, ఎస్ఆర్ మినరల్స్ అటవీ అనుమతులు తెచ్చుకుంది కాబట్టి, ఏపీఎండీసీకి భూముల కేటాయింపును ఎందుకు రద్దు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఒక షోకాజ్ నోటీసు ఇచ్చిందని ఆమె విమర్శించారు. గనుల లీజు పొందని ఎస్ఆర్ మినరల్స్‌కు అసలు అటవీ అనుమతులు ఎలా ఇచ్చారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీకి అటవీ అనుమతులు ఇప్పించవలసింది ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వమే ఒక ప్రభుత్వ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల ఆమె అభ్యంతరం తెలిపారు.  దీంట్లో ఉన్న"మతలబు" ఏమిటో చెప్పాలని ఆమె నిలదీశారు. ఇది జరిగిన మాట వాస్తవమా కాదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఎస్ఆర్ మినరల్స్‌వాళ్లు తనకు వ్యక్తిగతంగా తనకు సన్నిహితులని పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నారనీ, ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో చెప్పాల్సింది ప్రభుత్వమేననీ శోభా నాగిరెడ్డి అన్నారు. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎస్ఆర్ మినరల్స్‌కు కూడా ఉందన్నారు.
" శ్రీ జగన్మోహన్ రెడ్డిగానికి రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయ్యాయనీ, చంద్రబాబుకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందనీ, దానికి ప్రతిఫలంగా చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారనీ, అలా ఒకరికొకరు మేలు చేసుకుంటున్నారనీ మేం ఆరోపించాం. ఆరోపణలే కాదు, ఉదాహరణలూ రుజువులూ చూపాం. ఎస్ఆర్ మినరల్స్‌కు ఓబుళాపురం భూముల కేటాయింపు అన్నది ఆ కుమ్మక్కులో భాగమే." అని శోభాగారిరెడ్డి వ్యాఖ్యానించారు. రోశయ్య ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని జీఎన్ నాయుడుకు కేటాయించడం దగ్గరి నుంచి ఎంఎల్‌సి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవడం వరకు అన్ని పరిణామాలూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను వెల్లడి చేస్తున్నాయన్నారు. 
కేటాయింపులపై మాట్లాడమంటే వైయస్ఆర్ సీపీ నేతలైన శ్రీమతి విజయమ్మగారు, శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు, శ్రీమతి షర్మిలగారు తదితరులపై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని ఆమె పయ్యావుల కేశవ్‌ తీరు పట్ల అభ్యంతరం తెలిపారు. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, లోకేశ్ కూడా తిరుగుతున్నారన్నారు. 
"టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును నేను పొగిడానన్నారు. మరి చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌పై పోటీ పెడతామన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరాక ఎన్టీఆర్‌ను దేవుడన్నారు. ఆ తర్వాత ఆయనపై చెప్పులేయించారు. మళ్లీ ఇప్పుడు దేవుడంటున్నారు. నేను ఎక్కడ ఉన్నానిజాయితీగానే ఉన్నా. మా నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉండడం వల్లే ఆళ్లగడ్డ నుండి ఏ పార్టీలో ఉన్నా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తూనే వచ్చారు. నేను బయటకు వచ్చాక టీడీపీకి రెండు సార్లు డిపాజిట్లు పోయాయి"అని శోభానాగిరెడ్డి గుర్తు చేశారు.

సోనియా కంటే బాబు భరోసాయే ఎక్కువ!
"ప్రజలు ఐదేళ్ల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం లేదంటూ టీడీపీ నేత ముద్దు కృష్ణమనాయుడు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదంటూ చంద్రబాబుగారు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కంటే ఎక్కువ భరోసా ఇస్తున్నారు." అని ఆమె ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిగారు అవిశ్వాసం పెట్టుకోమంటు న్నారంటే దాని వెనుక ఉన్న ధైర్యం తెలుగుదేశం పార్టీ ఇస్తున్న భరోసానేనని ఆమె అన్నారు.  
చంద్రబాబు పాదయాత్ర మొదలు పెట్టాక ఎందరో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీ మారారని ఆమె గుర్తు చేశారు. టిడిపిలో నాయకత్వంపై ఉన్న విశ్వాసమేమిటో దీన్ని బట్టే తెలుస్తోందన్నారు.  ఉప ఎన్నికలు జరిగితే సగం స్థానాలలో డిపాజిట్లు పోగొట్టుకున్నారని, ఎన్నికలయ్యాక 15 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడారనీ ఆమె గుర్తు చేశారు. వైయస్ఆర్ సీపీ నాయకులు శ్రీ గట్టు రామచంద్రరావు, శ్రీ మూలింటి మారెప్ప కూడా ఈ మీడియా సమావేశంతో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!