YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 27 November 2012

పాదయాత్రకు.. పథకాలకూ...తెలంగాణలోనే శ్రీకారం

తెలంగాణపై ప్రేమ లేకపోతే వైఎస్ ఇవన్నీ ఎందుకు చేస్తారు కేసీఆర్ గారూ?
అందరూ సాధ్యం కాదన్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ను కట్టాలని వైఎస్ సంకల్పించారు
ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 7 జిల్లాల్లో 16లక్షల ఎకరాలకు నీరొస్తుంది..
డీకే అరుణ ఈ ప్రాంత ప్రజలకు మంచి నీరు కూడా అందించలేకున్నారు
కేసీఆర్, టీఆర్‌ఎస్‌కు ప్రజా సమస్యలు పట్టడం లేదు
వైఎస్ పేరును ఉచ్చరించే అర్హత కాంగ్రెస్ వాళ్లకు లేదు
అవిశ్వాసం పెట్టమంటే చంద్రబాబు విమర్శలతో సరిపెడుతున్నారు
గద్వాల బహిరంగ సభకు జన ప్రభంజనం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 41, కిలోమీటర్లు: 554

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలంగాణ అంటే ప్రేమ లేదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ కుమార్తె షర్మిల అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘వైఎస్సార్‌తన పాదయాత్రను సైతం తెలంగాణ నుంచే మొదలుపెట్టారు. రూ.2 కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, పావలా వ డ్డీ ఇలా నాన్న ఏ పథకమైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారు. ఈ ప్రాంతంపై ప్రేమే లేకపోతే ఇవంతా ఎందుకు చేస్తారు?’’ అని ప్రశ్నించారు. ‘‘అంతెందుకు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యారు కదా.. వారిలో ఒక్కరంటే ఒక్కరైనా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కట్టే సాహసం చేశారా? కొంతమంది సీఎంలు ఇది అసాధ్యం అని పక్కనపెడితే, ఇంకొంత మంది సీఎంలు ఇది చాలా కష్టమైన పని అని వదిలేశారు. కానీ తెలంగాణ కోసం దాన్ని కట్టి తీరాలని వైఎస్ సంకల్పించారు. 

అధికారుల్లో ఉత్సాహం నింపేందుకు వాళ్లను చైనాకు తీసుకొని వెళ్లారు. అక్కడ నిర్మించిన త్రీగోర్జెస్ ప్రాజెక్టును వాళ్లకు చూపించి చైనా వాళ్లు కట్టగా లేనిది మనం ప్రాణహిత- చేవెళ్లను ఎందుకు కట్టలేమని చెప్పి దేశంలోనే పెద్ద ఎత్తిపోతల పథకానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఎంతగానో ప్రయత్నించారు. వైఎస్సార్‌కు తెలంగాణ మీద ప్రేమే లేకుంటే ఏడు తెలంగాణ జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టును కట్టాలనుకునేవారా?’’ అని ఆమె.. కేసీఆర్‌ను నిలదీశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 41వ రోజు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో సాగింది. గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు వల్ల నేతన్నల ఆత్మహత్యలు

చంద్రబాబు హయాంలో వందలాది మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం ఇచ్చారని, సబ్సిడీలతో ఆదుకున్నారని షర్మిల చెప్పారు. చేనేత సొసైటీల రుణాలు మాఫీ చేయడం కోసం వైఎస్సార్ రూ.312 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయలేదని విమర్శించారు. వైఎస్ మరణించాక బతుకే భారంగా ప్రజలు బతుకుతున్నారని షర్మిల అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టే బలం చంద్రబాబుకు ఉన్నా.. ఆయన ఆ పని చేయకుండా విమర్శలతో సరిపెడుతున్నారన్నారు. 

మీరు బాగుంటే చాలా?: ‘‘ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డీకే అరుణ మంత్రి అయ్యారు. మంత్రిని అడుగుతున్నా.. మీరు మాత్రమే చక్కగా ఉంటే సరిపోదండీ.. మీ నియోజకవర్గ ప్రజలు బాగున్నారా? లేరా? అని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా?’’ అని షర్మిల ప్రశ్నించారు. తాను దారి వెంట వస్తుంటే ప్రజలంతా తాగు నీళ్లకు ఇబ్బందిగా ఉందమ్మా అని చెప్తున్నారని, తాగు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఇది మీకు అవమానం కాదా? అని అన్నారు. పదవిని కాపాడుకునేందుకు పెట్టిన శ్రద్ధలో సగం ప్రజల మీద పెడితే ప్రజలకు సమస్యలే ఉండవన్నారు.

కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు ప్రజల సమస్యలు పట్టవు

‘‘మీ సిట్టింగ్ ఎంపీ(కేసీఆర్)కిగాని, టీఆర్‌ఎస్ పార్టీకి గాని ప్రజా సమస్యలు పట్టనే పట్టవు. పైగా వైఎస్‌కు తెలంగాణపై ప్రేమ లేదని కేసీఆర్ అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టింది రూ.700 కోట్లు. కానీ వైఎస్సార్ ఖర్చు పెట్టింది రూ.25,000 కోట్లు. ప్రస్తుతప్రభుత్వం ఖర్చు చేసింది రూ.7,000 కోట్లు. ఈ ముగ్గురిలో తెలంగాణ ప్రాంతమంటే ఎవరికి ప్రేమ ఉంది కేసీఆర్ గారూ?’’ అని షర్మిల ప్రశ్నించారు. రాజశేఖరరెడ్డి జగనన్నకు ఓబులాపురం మైన్స్ ఇచ్చారని, తనకేమో ఖమ్మంలోని బయ్యారం మైన్స్ ఇచ్చారని కేసీఆర్ అంటున్నారని, ఓబులాపురం, బయ్యారంలలో తమకు వాటాలు లేవని నిరూపిస్తే.. చిన్నవాళ్లమైనా తమ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పే సంస్కారం కేసీఆర్‌కు ఉందా? అని షర్మిల ప్రశ్నించారు. ‘‘మీకో బిడ్డ ఉంది కేసీఆర్ గారు. మీ బిడ్డ మీద ఎవరైనా అభాండాలు, నిందలు వేస్తే మీరు ఊరుకుంటారా? మరి మా మీద ఎందుకు నిందలు వేస్తున్నారు?’’ అని అన్నారు.

వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే వేడుక చూశారు

‘‘రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారు. రెండు సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ కనీస కృతజ్ఞత లేకుండా ఇదే కాంగ్రెస్ పార్టీ వారు వైఎస్సార్‌ను దోషిగా చూపేందుకు యత్నిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీలు, ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు.. వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే వేడుక చూసినట్లు చూశారే తప్ప ఒక్కరికి అంటే ఒక్కరికైనా చీమ కుట్టినట్టైనా లేదు’’ అని షర్మిల ఘాటుగా విమర్శించారు. పైగా ఇప్పుడు వాళ్లే తాము వైఎస్సార్ అభిమానులమని చెప్పుకొంటున్నారని, అలా చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని అన్నారు. ‘‘నిజాయతీ ఉంటే అభిమానం అనేది గుండెల్లోంచి పుట్టాలి. వీళ్లకు కనీసం వైఎస్సార్ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు’’ అని మండిపడ్డారు. షర్మిల 41వరోజు మంగళవారం పాదయాత్రను ఉదయం బూడిదపాడు నుంచి ప్రారంభించారు. పెద్దపల్లి, పాల్వాయి మీదుగా రాత్రి 6 గంటకు గద్వాల పట్టణానికి చేరారు. గద్వాల సభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. అక్కడి నుంచి సంగంబండచెరువు వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మంగళవారం 14.90 కి.మీ. మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తంగా 554 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

బిల్లు రాలేదు.. ఇల్లు పూర్తి కాలేదు

ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో చేసేది లేక ఓ లబ్ధిదారుడు ఆ ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేసుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి గ్రామం మీదుగా మంగళవారం పాదయాత్ర చేసిన షర్మిలకు అక్కడ పలువురు మహిళలు తమ సమస్యలను చెప్పుకున్నారు. ‘‘మా గ్రామానికి చెందిన తెలుగు వెంకటన్నకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. దీంతో అప్పులు చేసి గోడల వరకు ఇల్లు కట్టుకున్నాడు. అయితే అధికారులు ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఇంటినిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ నిర్మాణం మధ్యలోనే ఆపేసి బతుకుదెరువు కోసం వలసపోయాడు’’ అని వారు చెప్పారు. స్పందించిన షర్మిల ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి ఆదుకుంటాడని హామీ ఇచ్చారు.

నేతల సంఘీభావం: షర్మిలకు సంఘీభావంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నేతలు మైసూరారెడ్డి, కొండా సురేఖ, కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వి. బాలమణెమ్మ, వాసిరెడ్డి పద్మ, సంకినేని వెంకటేశ్వరరావు, లక్ష్మీపార్వతి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, గౌరు వెంకట్‌రెడ్డి, తలశిల రఘురాం, కాపు భారతి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, నాగర్‌దొడ్డి వెంకటరాముడు మంగళవారం యాత్రలో పాల్గొన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!