YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 30 November 2012

జవాబు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతారేం?

ఓబుళాపురం గనులను ఏపీఎండీసీకి కేటాయించాలని వైఎస్ నిర్ణయించారు.. అది ఆయన నిబద్ధతకు నిదర్శనం 
ఆ గనులను ఎస్‌ఆర్ మినరల్స్‌కు లీజుకు ఇవ్వాలన్న సర్కారు యత్నాల వెనుక మతలబు ఏమిటి? 
ఇవి కాంగ్రెస్ - టీడీపీ కుమ్మక్కు వ్యవహారాలు కావా? 
ఎస్‌ఆర్ మినరల్స్‌కు అటవీ అనుమతులెలా వచ్చాయి? 
జవాబు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతారేం? 
సీఎం కిరణ్ ధీమా వెనుక చంద్రబాబు భరోసా లేదా?
బాబుపై టీడీపీ నాయకులకే విశ్వాసం లేకుండాపోయింది 
టీడీపీ నేతపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలి ధ్వజం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓబుళాపురం ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు కేటాయించాలని నాటి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సర్కారు నిర్ణయించిన అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజ గనులను ప్రస్తుత ప్రభుత్వం ఎస్‌ఆర్ మినరల్స్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయటం వెనుక కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమంటూ తాము చేసిన ఆరోపణలకు టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సూటిగా సమాధానం ఎందుకు చెప్పరని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. తాము చేసిన ఆరోపణలు అవాస్తవమనో, కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు కాలేదనో, అసలు ఆ వ్యవహారంతో తమకు సంబంధం లేదనో కేశవ్ నేరుగా జవాబు చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడుతూ సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తూ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. శోభానాగిరెడ్డి శుక్రవారం పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, సీజీసీ సభ్యుడు మూలింటి మారెప్పలతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

‘‘దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏపీఎండీసీకి కేటాయించాలని నిర్ణయించిన 25 హెక్టార్ల అత్యంత నాణ్యమైన ఇనుప ఖనిజ గనులను ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ అనుయాయులకు చెందిన ఎస్‌ఆర్ మినరల్స్ అనే ప్రైవేటు సంస్థకు ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. అటవీశాఖ అనుమతులు లేవనే సాకుతో ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించి ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఇవ్వాలని సర్కారు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీఎండీసీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ - టీడీపీ కుమ్మక్కైన ఫలితంగానే జరుగుతోంది. ఎస్‌ఆర్ మినరల్స్ సంస్థ యజమానికి, కేశవ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని కూడా చెప్పాం. దీనిపై స్పందించిన కేశవ్ ఈ విషయాలకు సమాధానం చెప్తారేమోనని మేం భావించాం. ఈ వ్యవహారంతో టీడీపీకి సంబంధం లేదని చెప్తారేమో అనుకున్నాం. కానీ ఆయన ఆ విషయాలేమీ చెప్పకుండా దాటవేసే యత్నం చేశారు. ఏవో సంబంధం లేని విషయాలు చెప్పుకొచ్చారు’’ అని ఆమె విమర్శించారు. 

మౌనమెందుకంటే.. మాట్లాడరేం?: ‘‘ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంలో గాలి జనార్దన్‌రెడ్డికి వైఎస్ దోచి పెట్టారంటూ తనకున్న మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నానా యాగీ చేశారు. అసెంబ్లీలో ఎంతో రాద్ధాంతం చేశారు. లీజు రద్దు చేసే దాకా వదల్లేదు. అలాంటిది ఇపుడు ఎస్‌ఆర్ మినరల్స్ విషయంలో ఎందుకు మౌనం వహించారు? ఎందుకు మాట్లాడటం లేదు? అని మేం ప్రశ్నిస్తే కేశవ్ దానికి సమాధానమే ఇవ్వలేదు’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) 2004లో ఈప్రాంతంలోని 93.5 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం మొదట దరఖాస్తు చేసింది. ఇదే ప్రాంతంలో 25 హెక్టార్ల మైనింగ్ లీజు కోసం తర్వాత ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. మొదట దరఖాస్తు చేసినందున మొత్తం 93.5 హెక్టార్లను వైఎస్ సర్కారు ఓఎంసీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు. అయితే నాడు వైఎస్ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థకు ప్రయోజనం చేయాలన్న లక్ష్యంతోనే ఏపీఎండీసీకి 25 హెక్టార్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన 68.5 హెక్టార్లు మాత్రమే ఓఎంసీకి లీజుకు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ, ప్రయోజనాల పరిరక్షణ పట్ల వైఎస్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ప్రస్తుత ప్రభుత్వం ఈ 25 హెక్టార్లలోని 18 హెక్టార్లు (45 ఎకరాలను) ఏపీఎండీసీకి కాకుండా ప్రైవేటు సంస్థ అయిన ఎస్‌ఆర్ మినరల్స్‌కు కేటాయించేందుకు రంగం సిద్ధం చేయటం వెనుక మతలబు ఏమిటి? అని మేం ప్రశ్నించాం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేశవ్ డొంక తిరుగుడుగా మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు’’ అని ఆమె ధ్వజమెత్తారు. వ్యక్తిగత విషయాలకు వస్తే తామూ చాలా మంది గురించి చెప్పగలమని ఆమె హెచ్చరించారు. అటవీశాఖ నుంచి అనుమతి తెచ్చుకోలేదనే కుంటి సాకుతో ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించి ఎస్‌ఆర్ మినరల్స్‌కు గనులు కేటాయించే ప్రయత్నాలనే తాము ప్రశ్నిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. అసలు ఎస్‌ఆర్ మినరల్స్‌కు అటవీశాఖ అనుమతులు ఎలా వచ్చాయని ఆమె సూటిగా ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పకుండా షర్మిల, విజయమ్మ రోడ్ల మీద తిరుగుతున్నారని ఏవేవో మాట్లాడుతున్న టీడీపీ నేతలకు బాలకృష్ణ, లోకేష్, జూనియర్ ఎన్‌టీఆర్ తిరగటం కనిపించడం లేదా? అని ఆమె నిలదీశారు. 

సూటిగా ఎందుకు సమాధానం చెప్పరు?: ‘‘అసలు ఈ మాటలన్నీ ఎందుకు? ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఈ గనులను లీజుకు ఇవ్వాలని ఏ విధంగా సంకల్పించారు? అని సూటిగా ప్రశ్నిస్తుంటే సమాధానం ఎందుకు చెప్పరు? మేం చేసిన ఆరోపణలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. లీజు ఇవ్వటం లేదంటే ఆ మాట చెప్పాలి.. లేదంటే చర్యలు తీసుకోవాలి.. అది చెప్పకుండా సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు’’ అని శోభ డిమాండ్ చేశారు. కేశవ్ చేసిన ఆరోపణల్లో కొత్తవేమీ లేవని.. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏరోజైతే కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చారో, ఏరోజైతే ఎంపీగా గెలిచారో ఆ రోజు నుంచే ఇవే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘‘తన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టుకుంటే పెట్టుకోండని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అంత ధీమాగా చెబుతున్నారంటే దాని వెనుక చంద్రబాబు ఇచ్చిన భరోసా ఉన్నందువల్లనే కదా?’’ అని శోభ వ్యాఖ్యానించారు. జగన్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయిస్తున్న ప్రభుత్వం.. తాము చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఎందుకు స్పందించదని ఆమె ప్రశ్నించారు. బాబుపై దర్యాప్తు జరపకుండా కాంగ్రెస్ చూస్తోందని ప్రభుత్వం పడిపోకుండా టీడీపీ అధినేత కాపాడుతున్నారని ఇలా పరస్పరం మేలు చేసుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. 

ఎన్‌టీఆర్‌పైనే పోటీచేస్తానని చంద్రబాబు అనలేదా?: తాను టీడీపీలో ఉండగా చంద్రబాబును పొగిడానని చెప్తున్న కేశవ్‌కు వారి పార్టీ అధినేత చంద్రబాబు గతంలో అన్న మాటలు గుర్తుకు రాలేదా? అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. ‘‘బాబు కాంగ్రెస్‌లో ఉన్నపుడు మామ ఎన్‌టీఆర్‌పైనే పోటీ చేస్తానని అనలేదా? ఆ తరువాత టీడీపీలో చేరి ఎన్‌టీఆర్ తనకు దేవుడని చెప్పలేదా? మళ్లీ వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులేయించి వెన్నుపోటు పొడిచి గద్దె దించలేదా? అధికారం పోయాక ఇపుడు మళ్లీ ఎన్‌టీఆరే తమ దేవుడని బాబు అనటం లేదా?’’ అని ఆమె దుయ్యబట్టారు. తన గురించి మాట్లాడే ముందు ఇవే ప్రశ్నలు చంద్రబాబుకు కేశవ్ వేస్తే మంచిదని ఆమె హితవు పలికారు. తాము ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితో పనిచేశామని, పైరవీలు చేసి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తమ నాయకత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది కనుకనే ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారని పేర్కొన్నారు. నిజంగా టీడీపీకి బలం ఉంటే గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీకి తన నియోజకవర్గంలో డిపాజిట్ ఎందుకు పోయిందని ఆమె ప్రశ్నించారు.

బాబుపై టీడీపీ నేతలకే విశ్వాసం లేదు: బాబు పాదయాత్రను చూసి వణుకుపుట్టటం వల్లనే షర్మిల పాదయాత్ర చేపట్టారని కేశవ్ చెప్పటం అసంబద్ధమని ఎవరిని చూస్తే ఎవరికి వణుకు పుడుతోందో పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘‘నిజంగా బాబు యాత్రపై ప్రజలకు విశ్వాసం ఉందో లేదో కాసేపు పక్కనపెట్టండి. టీడీపీ నాయకులకే ఆయనపై విశ్వాసం లేదు. అందుకే బాబు యాత్ర ఓవైపు జరుగుతూ ఉంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్ నేత పార్టీని వీడి వెళ్లిపోయారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి వంటి యువ ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పారు. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, సాధారణ కార్యకర్తలు కూడా పార్టీపై నమ్మకం కోల్పోయి వెళ్లిపోతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘ఇప్పటికి రెండుసార్లు ప్రతిపక్షంలో ఉన్న బాబు మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే ఉంటే ఇలా నేతలు పార్టీ వీడి వెళ్లిపోతారా?’’ అని ఆమె ప్రశ్నించారు. తమ సోదరుడు ఎమ్మెల్సీగా ఎన్నికైనపుడు అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లేదని అలాంటపుడు కాంగ్రెస్‌తో తమకు లాలూచీ ఎలా ఉంటుందని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కావటంతో పాటుగా ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు ఉన్నచోట్ల ఒకరికొకరు మద్దతు నిచ్చుకున్నారని గుర్తుచేశారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!