YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 27 November 2012

పదవుల కన్నా పరువే ముఖ్యం

కాంగ్రెస్‌తో టీడీపీ అన్ని రకాలుగా కుమ్మక్కయింది
ఇటీవల ఉప ఎన్నికల్లో అది స్పష్టంగా బయటపడింది
ఆయనతోపాటు పార్టీలో చేరిన తనయుడు వెంకటరమణ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘రాజకీయాల్లో ఎంత గొప్ప పదవులు అధిష్టించినా పరువు, మర్యాద లేకపోతే అది వ్యర్థం. అలాగే నాయకుడనే వాడికి విశ్వసనీయత కూడా చాలా అవసరం’’ అని తెలుగుదేశం పార్టీ మాజీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పరువు, మర్యాద కాపాడుకోవడానికే తాను టీడీపీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఉమ్మారెడ్డితో పాటు ఆయన పెద్ద కుమారుడు వెంకటరమణ కూడా పార్టీలో చేరారు. వారిరువురికి విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు ఉమ్మారెడ్డి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైల్లో ములాఖత్ ద్వారా కలుసుకున్నారు. 

జైలు వద్ద, తరువాత విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాక ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీని వదలడానికి కారణాలను వివరించారు. ‘‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ లక్ష్యాలు ఇప్పుడు టీడీపీలో పూర్తిగా కొరవడ్డాయి. ఏ కాంగ్రెస్‌కైతే వ్యతిరేకంగా టీడీపీ ఏర్పడిందో ప్రస్తుత నాయకత్వం అదే పార్టీకి దగ్గరవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలుకొని ఇటీవల జరిగిన ఉప ఎన్నికల దాకా అన్నింటా కాంగ్రెస్‌తో కుమ్మక్కై పనిచేస్తోంది. నెల్లూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఓట్లను ప్రత్యక్షంగా కాంగ్రెస్ అభ్యర్థికి బదలాయించారు’’ అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీల మధ్య క్విడ్ ప్రో కో జరుగుతోందని, ఇటీవల ఉప ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా రుజువైందని చెప్పారు. ‘రామచంద్రాపురం, నర్సాపురం ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కోల్పోయి కాంగ్రెస్‌కు ఓట్లు వేయించింది. ప్రత్తిపాడు, మాచర్లలో టీడీపీకి కాంగ్రెస్ సహకరించాలని రెండు పార్టీల నేతలు ఒప్పందం కుదుర్చుకున్నారు. గుంటూరు జిల్లాలో వారి వ్యూహం బెడిసికొట్టింది’’ అని ఆయన వివరించారు. టీడీపీ అనుసరిస్తున్న వైఖరి నచ్చకే2011 ఫిబ్రవరి 19 నుంచి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

టీడీపీ ప్రచారంలో వాస్తవంలేదు: ప్రజాభిప్రాయం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన తనపై టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని ఉమ్మారెడ్డి అన్నారు. గతంలో పి.వి.నర్సింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో టీడీపీకి చెందిన ఆరుగురు ఎంపీలు కాంగ్రెస్‌లోకి వెళ్లినా తాను నీతి నియమాలకు కట్టుబడి పార్టీలోనే కొనసాగానన్నారు. అంతేకాదు అప్పుడు చాలా మందికి ఫోన్లు చేసి పార్టీ నుంచి వెళ్లకుండా చూశానని వెల్లడించారు. ‘‘టీడీపీకి మానసికంగా దూరమయ్యాక మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించా. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో నాటుకుపోయాయి. ఎవరెంత దుష్ర్పచారం చేసినా ప్రజలు మళ్లీ వైఎస్ పాలననే కోరుకుంటున్నారు. అది జగన్ వల్లే సాధ్యమవుతుందని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!