YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 29 November 2012

టీడీపీకి కాంగ్రెస్ సర్కారు నజరానా

*ఎస్‌ఆర్ మినరల్స్‌కు ఓబుళాపురం గనులు కట్టబెట్టే యత్నం
*వైఎస్సార్‌సీపీ నేతలు శోభ, గుర్నాథరెడ్డి, శ్రీనివాసులు ధ్వజం
*టీడీపీ-కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు మరో నిదర్శనం
*టీడీపీ నేత కేశవ్‌కు ఎస్‌ఆర్ యజమాని అతి సన్నిహితుడు
*ఓఎంసీకి వైఎస్ చేసిన కేటాయింపులపై రాజకీయం చేసి..
*ఇప్పుడు అస్మదీయులకు లీజు ఇప్పించుకుంటున్న బాబు
*ఏపీఎండీసీని తప్పించి ఎస్‌ఆర్‌కు అప్పజెప్పేందుకు సర్కారు యత్నం
*దరఖాస్తు తిరస్కరిస్తామంటూ ఏపీఎండీసీకి షోకాజ్ 
*అటవీ అనుమతులు తెచ్చుకోలేదంటూ సాకు
*నిజానికి వాటిని ఇప్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే

హైదరాబాద్, న్యూస్‌లైన్: అనంతపురం జిల్లా ఓబుళాపురంలో మేలురకం ఇనుప ఖనిజ నిల్వలున్న 45 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ను కాదని, టీడీపీ అస్మదీయునికి చెందిన సంస్థకు అక్రమంగా కట్టబెట్టేందుకు కిరణ్ సర్కారు రంగం సిద్ధం చేసిన వైనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి ఇవ్వాలని 2004లో వైఎస్ ప్రభుత్వం నిర్ణయించిన ఈ గనులను, అందుకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థకు లీజు ఇవ్వబోతోందంటూ ఎండగట్టింది. ఇందుకోసం ఏకంగా ఏపీఎండీసీ దరఖాస్తునే తిరస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది. టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇది పరాకాష్ట అంటూ వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, బి.గుర్నాథరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. 

ఏపీఎండీసీకి ఇవ్వాల్సిన ఓబుళాపురం గనులను ప్రభుత్వం కుంటిసాకులతో ప్రైవేటు సంస్థకు కట్టబెట్టజూస్తోందంటూ వారు మండిపడ్డారు. అందులో భాగంగా... మైనింగ్‌కు అటవీ శాఖ అనుమతి తెచ్చుకోవడంలో నిర్లక్ష్యం చూపినందున మీ దరఖాస్తును ఎందుకు తిరస్కరించరాదో వివరణ ఇవ్వండంటూ ఏపీఎండీసీకి ప్రభుత్వం షోకాజు నోటీసు జారీ చేసిందని వారు చెప్పారు. దాని కాపీని కూడా మీడియాకు ప్రదర్శించారు. ‘‘విశాఖ స్టీలు ప్లాంటుకు ఇనుము సరఫరా చేస్తామన్న షరతుతో టీడీపీకి అతి సన్నిహితుడైన వ్యక్తికి చెందిన ఎస్‌ఆర్ మినరల్స్ అనే ప్రైవేటు సంస్థకు లీజును కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆ నోటీసులోనే ప్రభుత్వం పేర్కొంది! నిజానికి ఏపీఎండీసీ ద్వారానే ఖనిజాన్ని నేరుగా విశాఖ ప్లాంటుకు సరఫరా చేయించవచ్చు. లేదంటే విశాఖ ప్లాంటుకే మైనింగ్ లీజును ఇవ్వవచ్చు. కానీ వీటన్నింటినీ కాదని టీడీపీ సన్నిహితుని సంస్థకే కట్టబెట్టజూడటంలో తెర వెనక పెద్ద తతంగమే జరుగుతోంది’’ అని నేతలు ఆరోపించారు. 

‘‘వైఎస్‌ఆర్ జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ముందుకొచ్చిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి నాటి వైఎస్ సర్కారు చట్టబద్ధంగా ఓబుళాపురంలో లోగ్రేడ్ ఇనుప ఖనిజ మైనింగ్ లీజు కేటాయిస్తే, దాన్ని రద్దు చేసేదాకా బాబు నానా యాగీ చేశారు. ఏ తప్పూ లేకపోయినా.. ఏదో జరిగిపోయిందంటూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు... వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని గల్లీ నుంచి ఢిల్లీ దాకా గోబెల్స్ ప్రచారం చేశారు. తద్వారా బ్రాహ్మణి కర్మాగారం అర్ధాంతరంగా ఆగేలా చేశారు. మరిప్పుడు మైనింగ్ లీజును ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు కిరణ్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలపై బాబు మాట్లాడటం లేదెందుకని?’’ అంటూ ప్రశ్నించారు. 

అప్పట్లో వైఎస్‌కు వ్యతిరేకంగా వార్తలు గుప్పించిన మీడియా కూడా ఇప్పుడు ఎందుకు కళ్లు మూసుకుందంటూ నిలదీశారు. అంతేగాక ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, ఎమ్మార్ కేసులను విచారిస్తున్న సీబీఐ.. ఆ రెండు ఉదంతాల్లోనూ ప్రథమ ముద్దాయి అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రమేయాన్ని విచారించకపోవడానికి కూడా కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందమే కారణమని ఆరోపించారు. మీడియాకు శోభా నాగిరెడ్డి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి...

అధికారులే ఆశ్చర్యపోతున్నారు!
*ఓబుళాపురం ఇనుప గనులను వివాదాల కేంద్రంగా మార్చి, వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో అతి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ రాకను అడ్డుకున్న కాంగ్రెస్-టీడీపీ.. ఇప్పుడు అక్కడే అతి విలువైన ఇనుప ఖనిజ నిల్వలను ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థను కాదని టీడీపీ నేతల అస్మదీయులకు ఓబుళాపురం మైనింగ్ లీజు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అర్హత లేని సంస్థకు అనుచిత ప్రయోజనం కల్పించేందుకు వీలుగా అర్థం లేని షరతులను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ పెద్దల నిర్వాకం చూసి ఏపీఎండీసీ అధికారులే నివ్వెరపోతున్నారు. 

*ఓఎంసీకి లీజు కేటాయించడంలో వైఎస్ సర్కారు పక్షపాతం చూపిందంటూ గోబెల్స్‌ను మించి ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే ప్రాంతంలో తన పార్టీ సానుభూతిపరుని ముందుంచి, తాను కాంగ్రెస్‌తో లాలూచీ పడిన వైనం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతాయని తెలిసి కూడా కుమ్మక్కు పార్టీలు రెండూ పట్టించుకోవడం లేదు! ఇనుప ఖనిజాన్ని ఏపీఎండీసీతో తవ్వించి విక్రయించి ప్రభుత్వాదాయాన్ని పెంచకుండా ఓఎంసీకి ఎందుకు లీజుకిచ్చారంటూ వైఎస్ సర్కారుపై ఇష్టానికి మాట్లాడిన బాబు.. ఏపీఎండీసీకి ఇవ్వాలని వైఎస్సే నిర్ణయించిన గనులను అస్మదీయునికి కట్టబెట్టేందుకు కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డారు.

*వైఎస్ మరణానంతరం టీడీపీతో కుమ్మక్కైన కాంగ్రెస్ పెద్దలు.. టీడీపీ నేతలు, వారి అనుచరులకు లబ్ధి చేకూర్చడంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే... ఓబుళాపురం ప్రాంతంలో అత్యంత విలువైన ఇనుప ఖనిజ నిల్వలున్న 45 ఎకరాలను ఏపీఎండీసీని కాదని టీడీపీకి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తికి చెందిన ఎస్‌ఆర్ మినరల్స్‌కు అక్రమంగా కట్టబెట్టేందుకు కిరణ్ సర్కారు పావులు కదుపుతోంది. ఇది గతంలో వైఎస్ సర్కారు ఏపీఎండీసీకి మైనింగ్ లీజు నిర్ణయించిన హైగ్రేడ్ ఇనుప ఖనిజమున్న 25 హెక్టార్లలోనిదే! వాటిలో ఏకంగా 18 హెక్టార్ల (45 ఎకరాలు)ను ఎస్‌ఆర్ మినరల్స్‌కు కట్టబెడుతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నేతే మంత్రాంగం చేశారు.

*ఎస్‌ఆర్ మినరల్స్ మేనేజింగ్ పార్టనర్ సురేంద్రబాబు అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు సన్నిహితుడు. చంద్రబాబు తన ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను అనంతపురం జిల్లాలో ప్రారంభించిన సందర్భంగా ఆయన భారీగా విరాళం ఇచ్చినట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అలాంటి వ్యక్తికి చెందిన సంస్థకు లీజు కేటాయించే ప్రయత్నం తాజాగా కాంగ్రెస్- టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం. కిరణ్ సర్కారు ప్రజల నడ్డి విరిచేలా నిత్యావసరాల ధరలు, ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీల వంటివాటన్నింటినీ పెంచిందని, అన్ని విధాలా విఫలమైన ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా పాలించే అర్హత లేదని, దాన్ని గద్దె దించాల్సిందేనని బహిరంగ వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న చంద్రబాబు.. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. కాంగ్రెస్‌తో ఉన్న చీకటి ఒప్పందాలే అందుకు కారణం.

*టీడీపీ నేత జీఎన్ నాయుడుకు హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెడుతూ రోశయ్య సర్కారు జీవో ఇచ్చింది. ఇప్పుడు కిరణ్ సర్కారు కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తికి ఓబుళాపురం గనులు కట్టబెట్టేందుకు ఏకంగా ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించేందుకే సిద్ధమవుతోదంటే.. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు ఒప్పందం ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

*అనంతపురం జిల్లా ఓబుళాపురంలో ఓఎంసీకి మొదట మైనింగ్ లీజును బదలాయించింది చంద్రబాబు సర్కారే. కానీ తర్వాత వైఎస్‌ఆర్ (నాటి కడప) జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు ముందుకొచ్చిన ఓఎంసీకి వైఎస్ సర్కారు చట్టబద్ధంగా లోగ్రేడ్ ఇనుప ఖనిజ మైనింగ్ లీజు కేటాయిస్తే దాన్ని రద్దు చేసేదాకా బాబు నానా యాగీ చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటైతే సీమలో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవి. అది రాకపోవడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి బాబు యాగీయే కారణం.

*వైఎస్ తనయుడు జగన్‌ను దెబ్బ తీయడమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలు, సీబీఐ విచారణల పేరుతో పారిశ్రామిక వేత్తలపై సాగుతున్న వేధింపులతో రాష్ట్ర పారిశ్రామిక రంగమే అధోగతి బాట పట్టింది. దీనంతటికీ కారణమైన కాంగ్రెస్-టీడీపీ అపవిత్ర కూటమి... ఇప్పుడు ఓ ప్రైవేటు సంస్థకు మేలు చేసేందుకు ఏపీఎండీసీ ప్రయోజనాలనే కాలరాసేందుకు నడుంకట్టింది!

నివ్వెరపోయిన ఏపీఎండీసీ
*ఏపీఎండీసీ దరఖాస్తును పక్కన పెట్టి, ఎస్‌ఆర్ మినరల్స్‌కు మైనింగ్ లీజు ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు ముఖ్య నేత మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి దాసరి శ్రీనివాసులు చర్యలు కూడా చేపట్టారు. అటవీ శాఖ అనుమతులు తెచ్చుకోవడంలో శ్రద్ధ చూపనందున మీ దరఖాస్తును ఎందుకు తిరస్కరించరాదో వివరణ ఇవ్వండంటూ ఏపీఎండీసీకి ఆగస్టు 6న ఏకంగా షోకాజ్ నోటీసిచ్చారు. నిజానికి అటవీ శాఖ అనుమతులివ్వాల్సింది ప్రభుత్వమే. ఏపీఎండీసీ ప్రభుత్వ రంగ సంస్థ గనుక అటవీ అనుమతులిప్పించేందుకు చొరవ తీసుకోవాల్సిన సర్కారు, అలా చేయకుండా దరఖాస్తును తిరస్కరించేందుకు రంగం సిద్ధం చేస్తుండటం వెనక రహస్యం ప్రైవేటు సంస్థకు కట్టబెట్టాలన్నదే! ప్రభుత్వ షోకాజ్ నోటీసు చూసి ఏపీఎండీసీ అధికారులే నివ్వెరపోయారంటే.. పరిస్థితి ఎంత దారుణమో అర్థమవుతోంది.

ఏపీఎండీసీకి తిరస్కరించినా.. ఎస్‌ఆర్‌కెలా వస్తుంది?
*ఒకవేళ ప్రభుత్వం ఏపీఎండీసీ దరఖాస్తును తిరస్కరించినా, ఓబుళాపురం గనులను ఎస్‌ఆర్ మినరల్స్‌కు లీజుకివ్వడానికి వీలు కాదు. ‘ముందు దరఖాస్తు చేసిన సంస్థకు ముందు’ నిబంధన ప్రాతిపదికన చూసినా, సంస్థ అర్హతలు, సామర్థ్యం ఆధారంగా చూసినా ఈ లీజు ఎస్‌ఆర్‌కు దక్కే అవకాశమే లేదు. ఎందుకంటే కేంద్రం ఆదేశాల ప్రకారం చూస్తే ఈ లీజు కోసం దానికంటే ముందు మరో 8 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఖనిజ నిల్వల మైనింగ్ లీజుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చాక వచ్చిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన ప్రకారం చూసినా ఎస్‌ఆర్ మినరల్స్ కంటే ముందు మూడు దరఖాస్తులు వచ్చాయి.

యూపీఏ చేతిలో బాబు పీక!
ఎమ్మార్, ఓఎంసీ కేసులపై ఇప్పటికే సీబీఐ విచారణ సాగుతోంది. వాటిలో చంద్రబాబు పాత్ర సుస్పష్టం. ఆయన పీక యూపీఏ సర్కారు చేతిలో ఉంది. బాబు తోక జాడిస్తే సీబీఐ ఉచ్చులో పడాల్సి వస్తుంది. ఆయనను కూడా కేంద్రం విచారణ పరిధిలోకి చేర్చుతుంది. ఈ విషయం బాబుకు తెలుసు. ఆ భయంతోనే... తనను సీబీఐ విచారణ పరిధిలోకి చేర్చకుండా స్వయంగా వెళ్లి చిదంబరంతో మంతనాలు జరిపారాయన. సీబీఐ చూపు పడకుండా ఉండాలంటే పాపం బాబు లోపాయికారీగా కాంగ్రెస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించక తప్పదు!

ఏపీఎండీసీ లేఖ రాసినా...
ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై తక్షణమే స్పందించిన ఏపీఎండీసీ అధికారులు, తమ సంస్థకే 25 హెక్టార్ల మైనింగ్ లీజు ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలో సంసిద్ధత వ్యక్తం చేస్తూ పంపిన లేఖతో పాటు, తర్వాత సంస్థ అధికారులు ప్రభుత్వంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలతో వివరణ ఇచ్చారు. ‘వాస్తవంగా మేం అటవీ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. అవి రాకపోవడం వెనుక సంస్థ అశ్రద్ధ ఏమీ లేదు. మైనింగ్ లీజు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మైనింగ్ శాఖ లేఖ పంపితేనే అటవీ శాఖ అనుమతులిస్తుంది. ఇదీ ప్రొసీజర్! ఈ మేరకు కూడా మేం లేఖ రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. అసలు ఇప్పటి వరకూ మేమెన్ని లేఖలు రాసినా ప్రభుత్వమే అప్రూవ్డ్ మైనింగ్ ప్లాన్ కూడా అడగలేదు. ప్రభుత్వం సహకరిస్తే ఇప్పటికైనా మేం త్వరగా అనుమతులు తెచ్చుకుంటాం. ఈ లీజును మైనింగ్ కేటాయించే యోచనను విరమించుకుని ఏపీఎండీసీకి ఇచ్చే విషయాన్ని సానుకూల దక్పథంతో పరిశీలించండి’ అంటూ నెల కిందటే ప్రభుత్వానికి వివరణాత్మకంగా ఏపీఎండీసీ అధికారులు లేఖ కూడా పంపారు. అయినా ఇప్పటిదాకా దానికి సమాధానమే లేదు.

‘విశాఖ’కే ఇవ్వొచ్చుగా!
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఇనుప ఖనిజాన్ని విక్రయించాలన్న షరతుతో ఓబుళాపురం మైనింగ్ లీజు కోసం ఎస్‌ఆర్ మినరల్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరం! అదే నిబంధనతో ఏపీఎండీసీకే లీజు ఎందుకివ్వద్దో ప్రభుత్వం చెప్పడం లేదు. అదీ కాకపోతే నేరుగా స్టీల్ ప్లాంటుకే లీజు ఇవ్వొచ్చుగా! దీనికీ సమాధానం లేదు. రెండు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రాయదుర్గంలో అతి తక్కువ పెట్టుబడితో ఇనుప ఖనిజ శుద్ధి (బెనిఫికేషన్) ప్లాంటు ఏర్పాటుకు ఎస్‌ఆర్ సిద్ధంగా ఉన్నందున దానికే లీజుకివ్వాలని భావిస్తున్నామంటున్న ప్రభుత్వ వాదనలోనూ పస లేదు. ఇప్పటికే అక్కడ మైనింగ్ లీజుకోసం ఎస్‌ఆర్ కంటే ముందు దరఖాస్తు చేసుకున్న జె.కె. స్టీల్ కార్పొరేషన్‌కు, శాతవాహన ఇస్పాత్ నిగం లిమిటెడ్‌కూ ఫ్యాక్టరీలున్నాయి. ఉక్కు కార్మాగారాలున్న సంస్థలను కాదని, కేవలం ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం పెడతామన్న సంస్థకు లీజు ఇవ్వాలని ప్రతిపాదించడం, పైగా అందుకోసం ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థ దరఖాస్తునే తిరస్కరించాలని దాదాపుగా నిర్ణయించడం అన్యాయం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!