ధూపం వేస్తే పాపం పోతుం దా? దీపం పేరు చెబితే చీకటి పోతుందా? ‘నారా’వారు నోరు విప్పితే నాలుగు దిక్కులూ స్పం దిస్తాయా?! ‘తెలుగుదేశం’ పార్టీ నాయకత్వానికి అలా స్పందించే దశ, తాహతు ఒక క్రియాశీల ప్రతిపక్షంగా ఇక ఎంతమాత్రం లేదని రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మరోమాటకు తావులేకుండా ప్రజలు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు! ప్రజాభిమానాన్ని అమితంగా చూరగొన్న మహానటుడు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్‌పార్టీ ‘తరకటబురకట’ రాజకీయాలకు స్వస్తిచెప్పించి, ఢిల్లీ దాకా రాష్ట్రం పరువును మంటకలిపిన కాంగ్రెస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలన్న తలంపుతో ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించి అతి స్వల్ప కాలంలోనే అధికారాన్ని చేపట్టాడు. కాని ఆ తరువాత ఎన్టీఆర్‌కు ఉత్తరాధికారిగా గద్దెనెక్కిన చంద్రబాబు కుట్రదారుడని తెలుసుకోడానికి రాష్ట్ర ప్రజలకు ఎక్కువ కాలం పట్టలేదు. మామ ఎన్టీఆర్‌ను గద్దెదింపడానికి బాబు పన్నిన ‘వైస్రాయ్ కుట్ర’ తాను అధికారం చేపట్టడంతో ఆగిపోలేదు. బాబు వెన్నుపోటు రాజకీయాలతో తీవ్ర మనోవేదనకు లోనైన ఎన్టీఆర్ ఆకస్మిక మరణానికి గుర య్యే దాకా కొనసాగుతూనే వచ్చింది. కుట్ర ద్వారా అందివచ్చిన అధికారాన్ని కాపాడుకోడానికి న్యాయ, శాసన వ్యవస్థలను ప్రలోభాలకు గురిచేయడం, అప్పటికీ లొంగని వారిని ‘అన్యమార్గాల’ ద్వారా లోబరచుకోవడం అన్న విద్యను పకడ్బందీగా కొనసాగించిన ఘనత బాబుకే సొంతం!
చివరికి ఈ కుట్ర రాజకీయం 2004 ఎన్నికల్లోనూ, 2009 ఎన్నికల్లోనూ ‘తెలుగుదేశం’ పార్టీని ఓటమి పరంపర వైపునకు నెట్టేదాకా కూడా కొనసాగింది! ‘కాంగ్రెస్ తాను’లోని మనిషిగా, అవకాశవాద రాజకీయంలో భాగంగా ‘దేశం’ పార్టీలోకి చొచ్చుకొచ్చిన చంద్రబాబు, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని ఉప ఎన్నికల్లో ఓడించే పేరుతో ‘దేశం’ పార్టీని శత్రుపక్షంగా భావిస్తూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో చేతులు కలపడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది! ‘బాబుని ఎందుకు తీసుకొచ్చి ఎన్టీఆర్‌కు పరిచయం చేశానా’ అని గతంలో అనేక సందర్భాల్లో గల్లా అరుణకుమారి తండ్రి సుప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు, సాహితీవేత్త అయిన రాజగోపాల నాయుడు ఎంతగానో బాధపడ్డారు. అయితే చంద్రబాబు ఒరిజినల్‌గా కాంగ్రెస్ మనిషే కాబట్టి ఆ సంబంధాలు ‘దేశం’ నాయకుడుగా ఉన్నా కొనసాగుతూనే ఉన్నాయని, అవి మారవనీ ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి! అటు బాబును నమ్ముకున్న కాంగ్రెస్, ఇటు కాంగ్రెస్‌ను నమ్ముకున్న బాబు ‘దేశం’ రెండూ జంటగా తాజా ఉప ఎన్నికల్లో కుప్పకూలిపోయాయి!
వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆరేళ్ల హయాం లో, ఆయనకున్న పరిధుల్లో ప్రవేశపెట్టిన అనేక ప్రజాహిత పథకాలతో ప్రత్యక్షంగా ప్రయోజనం పొందిన ప్రజాబాహుళ్యం అచంచలమైన విశ్వాసంతో, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వలోని వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికలు జరిగిన 18 శాసనసభ నియోజకవర్గాల్లో 15 స్థానాలను, ఒక పార్లమెంటు సీటును ఘనంగా కట్టబెట్టింది.
ఆ పార్టీకి వచ్చిన స్థానాలుగానీ, భారీ సంఖ్యలో పోలైన ఓట్లుగానీ పరిశీలిస్తే వైఎస్సార్ పార్టీ పట్ల ప్రజాభిమానం ఏ స్థాయిలో ఉందో శత్రువు కూడా కాదనలేని బండ సత్యం! అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి, జగన్ అరెస్టు వల్ల వచ్చిన ‘సానుభూతి’ మాత్రమే కారణమని కొందరు కాంగ్రెస్ వాదులు, ‘దేశం’ నాయకుడు చంద్రబాబూ అడ్డగోలుగా వాదిస్తున్నారు! మరొక కారణం చెప్పడానికి మనసొప్పక అలా సరిపెట్టుకోవలసి వచ్చిందని వారికీ తెలుసు! ఆత్మ విమర్శ, ఆత్మపరిశీలన కొందరికి నచ్చదు. భయం కూడా! ఇప్పుడే కాదు, 2004లో తమ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ‘దేశం’ నాయకుడు ఇలాగే ప్రవర్తించాడు! ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఘోరమైన పరాజయానికి కారణాలు వెతుక్కోడంలో కూడా మళ్లీ అదే తప్పు చేస్తూ పార్టీని మోసగిస్తూ రాబోయే 2014 ఎన్నికల గురించి భ్రమల్లో తేలుతున్నాడు!
అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఓటమికి దారితీసిన కారణాలను పునఃపరిశలించుకోవాలనీ, ‘ఘోరపరాజయాల’కు ఎవరు బాధ్యులో తెలుసుకోవాలన్న ఆలోచనలో పడింది. ‘2014 ఎన్నికలలో పార్టీ విజయావకాశాల్ని పెంచుకోవడాని’కి ఇప్పటి ‘కళంకిత మంత్రుల’ను తొలగించాలని ఆలోచిస్తోంది! కానీ, కాంగ్రెస్ అలవాటులో పొరపాటుగా ఎప్పుడూ చేసే పని- తన విధాన తప్పిదాలకు, ప్రత్యర్థులపైన కక్షసాధింపు రాజకీయాలతో ఎవరో ఒకరిని బలిగొనడం. బహుశా ఈ సారి కూడా అదే జరగవచ్చు! ఎందుకంటే- ఇండియాను ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక ‘సంస్కరణల’కు తాకట్టు పెట్టింది కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే.
ఆ సంస్కరణల్లో భాగంగా, అంతకు ముందున్న గుత్త పెట్టుబడుల నియంత్రణకు రూపొందించిన చట్టాల్ని ఘోరంగా సడలించి, ప్రభుత్వరంగ సంస్థల్ని క్రమంగా దెబ్బతీసే విధానాన్ని చేపట్టింది. ఆ విధానానికి అనుగుణంగా దేశవాళీ పారిశ్రామిక ప్రగతికి అడ్డు తగిలే బహుళజాతి గుత్త కంపెనీలను, విదేశీ మదుపు సంస్థలను, విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులనూ ఆహ్వానిస్తూ ద్వారాలు బాహాటంగా తెరిచింది కూడా ‘ఢిల్లీ పెద్దలే’. నియంత్రణ చట్టం స్థానే కార్పొరేట్‌రంగ ప్రయోజనాల కోసం ‘కాంపిటీషన్ కమిషన్’ను ఏర్పాటు చేశారు. ఈ విధానం ఆసరాగానే 75 ప్రభుత్వరంగ సంస్థలలో విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులకు అనుకూలంగా ప్రభుత్వం తన వాటాలను గణనీయంగా కోత పెట్టింది! చివరికి ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కేవలం గుడ్లు అప్పగించి పని చేసే ఒక బ్రోకర్‌గా మాత్రమే ఉండిపోవాలి (ఫెసిలిటేటర్)గాని కార్పొరేట్‌రంగం ‘ప్రగతి’ని అడ్డుకొనే చర్యలు తీసుకోకూడదని శాసించిందీ కాంగ్రెస్ అధినాయకత్వమే!
ఈ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాన్ని అమలుజరపడం కోసం భారీ ఎత్తున చేపట్టినవే ప్రత్యేక ఆర్థిక మండళ్ల నిర్మాణం, ప్రైవేట్ కంపెనీలకు భారీ ఎత్తున భూముల సేకరణ, కేటాయింపులూ. అలా వేలాది ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తూ పేద, మధ్య తరగతి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని దెబ్బతీయడం, అటవీ చట్టాలను మార్చి గిరిజన భూముల్ని బలవంతంగా స్వాధీనపరచుకోవడం వగైరా ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టిందీ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వమే! ఆ ‘ఆదేశాల’ ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్ ప్రభుత్వం నడుచుకున్నది. వైఎస్ సొంత నిర్ణయాలు ఏవైనా ఉన్నాయంటే అవి కేవలం పేద సాదల కనీస ప్రయోజనాల్ని కాపాడే కొన్ని స్వతంత్ర పథకాలు అమలు జరపడం మాత్రమే! మరి వైఎస్ చనిపోయిన తరువాత అవే కార్యక్రమాలను ఎందుకు కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్రంలోని కిరణ్ సర్కారూ నిరసిస్తున్నట్టు? కేంద్ర విధానాలకు అనుగుణంగానే ‘సెజ్’లు, భూముల ఆక్రమణలు, కార్పొరేట్ కారిడార్‌లూ జరిగితే తప్పు కేంద్రానిదా, నాటి వైఎస్ ప్రభుత్వానిదా? ఈ విధాన నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యాపారవేత్తగా వైఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆ తప్పిదాలకు ఎలా బాధ్యుడు?
జగన్‌ను సాధించడం ద్వారా, జగన్ రాజకీయ భవిష్యత్తును తుంచడం కోసం కాంగ్రెస్ నాయకత్వం పాటుపడుతోందన్న అభిప్రాయం జనం మనస్సుల్లో గత రెండేళ్లుగా నాటుకుపోయింది కనుకనే ఉప ఎన్నికల్లో ఆయన పార్టీని ప్రజలు ఆదరించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అంతర్మధనం ప్రారంభమైంది. కాంగ్రెస్ టీడీపీలకు పోలైన ఓట్లన్నింటినీ కలిపినా, వైఎస్సార్ పార్టీ ఒక్క దానికి పడిన మొత్తం ఓట్లకు బరాబరి కాలేకపోవడం అధికార పక్షాన్నీ, ప్రధాన ప్రతిపక్షాన్నీ ప్రజలు ఏ మాత్రం నమ్మడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది! ఈ పరిస్థితుల్లో కనీసం కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు తీసుకొని, పార్టీ పునర్నిర్మాణం గురించి ఆలోచిస్తున్నదిగాని, ‘తెలుగుదేశం’ నాయకుడు చంద్రబాబులో అది ఏ కోశానా కనిపించడం లేదు. కసి, ఉక్రోషంతో వైఎస్సార్ పార్టీ విజయం ‘కేవలం సానుభూతి కెరటం’ మాత్రమేనని జనాన్ని నమ్మించడానికి తాపత్రయపడుతున్నాడే తప్ప, ఆత్మవిమర్శకు పూనుకోవడం లేదు. పైగా జగన్ పట్ల ద్వేషంతో కాంగ్రెస్‌కు ‘దేశం’ పార్టీని ఆచరణలో అనుబంధ రాజకీయపక్షంగా మారుస్తున్నాడు!
నిజానికి జగన్ మీదకి వైఎస్ ప్రభుత్వ నిర్ణయాల చాటున ఆరోపణల ఆయుధాలను సంధించడానికి గల పునాదులన్నీ చంద్రబాబు హయాంలోనివే. బాబు అవినీతికర ఒప్పందాల ద్వారా రాష్ట్రం మీద రుద్దిన ఎమ్మార్, ఐఎంజీ, ఎల్ అండ్ టీ వ్యాపార సంస్థల్లోనే వాటి మూలాలు ఉన్నాయన్న బండ సత్యాన్ని మరవరాదు. ఆమాటకొస్తే ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలను తు.చ. తప్పకుండా అమలుపరచడానికి పూర్తి స్థాయిలో నడుం బిగించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలో చంద్రబాబేనంటే అతిశయోక్తి కాదు! హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలను తెచ్చిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని బాబు పలికే ప్రగల్భాల వెనక మాధాపూర్-కొండాపూర్ ప్రాంతంలో హైటెక్ టవర్ రావడానికి రెండేళ్ల ముందే చడీచప్పుడూ లేకుండా 500 ఎకరాలు కారుచౌక బేరానికి కొనుగోలు చేసి, ‘బినామీ’ల ద్వారా దాని ధరవరల్ని స్పెక్యులేషన్‌పైన విపరీతంగా పెంచుకున్న ఘనుడు కూడా చంద్రబాబే! అలా ఒక ‘సినీ నటుడు’ మాధ్యమంగా మాధాపూర్-కొండాపూర్‌లలో ‘జయభేరి’ మోగించుకోవడం కోసమే ‘హైటెక్‌టవర్’ ఎత్తు ఎత్తాడు! రెండు ఎకరాల వాడు రెండువేల కోట్లకు పడగలెత్తగలిగాడంటే ఇలాంటి ‘ముదనష్టపు’ సంపాదన వల్లనేనని తెలిసిపోవడం లేదూ?!
‘గురువింద గింజ’ తన కిందనున్న నలుపు ఎరగదు! అలాగే వైఎస్సార్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉన్న విజయమ్మను పట్టుకుని ‘నీ పెంపకం సరిలేకపోబట్టే, జగన్ అలా తయారయ్యాడ’ని మర్యాద హద్దులు కూడా చెరిపి నిందించడానికి బాబు సాహసించి అభాసుపాలయ్యాడు! ఎందుకంటే, చంద్రబాబు పెంపకం అంత ‘గొప్ప’ది కాబట్టే- ఇంట్లో పెట్టిన కొన్ని లక్షల రూపాయల్ని ఏ కొడుకు ఏ పని మనిషికి ఎందుకోసం ఎలా దోచిపెడితే, అందులో కొంత డబ్బును తిరిగి పోలీసుల సాయంతో రహస్యంగా ఎలా రాబట్టుకుని తిరిగి ఇంటికి చేర్చుకురావలసి వచ్చిందో బాబుకు మాత్రమే తెలిసిన ‘గుట్టు’ అయి ఉంటుంది! దీనికి సంబంధించిన తతంగానికి నేటి ‘కేర్’ ఆస్పత్రిగా ఉన్న ఆ నాటి ‘భాస్కర ప్యాలెస్’ హోటల్ కేంద్ర స్థానమయిందని ఆ నాటి పోలీసు వర్గాల్లో ఒక సంచలనం.
అధికారం చేతిలో ఉన్నప్పుడు సత్యం కూడా బయటకు రాకుండా అణగారిపోతుంది! అప్పుడూ, ఇప్పుడూ జరుగుతున్నది ఇదే! అందువల్ల బిడ్డలకు విద్యాబుద్ధులు, నడవడికల గురించి ఎవరూ చంద్రబాబు లాంటి వారి నుంచి నేర్చుకోవలసిన అవసరం ఉండదు, రాదు కూడా! ఎందుకంటే, చంద్రబాబే అన్నట్టుగా తనపై రకరకాల ఆరోపణలతో ముందుకొచ్చిన కోలా కృష్ణమోహన్ ఒక ‘మోసగాడ’ని తెలిసి కూడా పార్టీ కోసం ఆ ‘చీట్’ నుంచే రూ.10 లక్షలు ఎలా అప్పణంగా ‘విరాళం’గా స్వీకరించగలిగాడో తెలియదు! ఆ డొనేషన్ సంగతి కోలా వెల్లడించేదాకా, రాష్ట్ర ప్రజలకు తెలియకుండా జాగ్రత్తవహించడం కూడా మోసమే గదా! కాని, తన ‘హెరిటేజ్’ సంస్థ బోర్డులోకి ఒక డెరైక్టర్‌గా చంద్రబాబు రిక్రూట్ చేసుకున్న నటుడు మోహన్‌బాబును ‘మోసగించి’నందుకు (ఈ మాట మోహన్‌బాబుదే), రాష్ట్ర హైకోర్టులో చంద్రబాబుపైన అదే మోహన్‌బాబు ‘చీటింగ్’ కేసు వేశాడా లేదా? ‘నీవు షూటింగ్ పనుల మీద ఊళ్లు తిరుగుతావు కాబట్టి బోర్డు మీటింగ్‌లో ఆమోదించే నిర్ణయాలకు నీ సంతకం కూడా అవసరమవుతుంది గనుక తెల్లకాగితాలపై సంతకాలు చేసి వెళ్లు’ అంటే, అలాగేనని అమాయకంగా నమ్మిన మోహన్‌బాబు ఖాళీ పేపర్లపైన సంతకాలు చేశాడా లేదా? తీరా ఆ సంతకాలున్న తెల్లకాగితాలను చంద్రబాబు దేనికి వాడాడు? మోహన్‌బాబే బోర్డులో డెరైక్టర్ పదవికి రాజీనామా చేసినట్టుగా చూపడం కోసం! అలా డెరైక్టర్‌గా మోహన్‌బాబును వదిలించుకున్నాడు! అందుకు మోహన్‌బాబు చంద్రబాబుపైన హైకోర్టులో చీటింగ్ కేసు దాఖలు చేయాల్సి వచ్చింది! ఈ విషయాలు ఆ కేసు నోటీస్‌లో నుంచి స్థూలంగా ఉదహరించినవే!
అయితే తరువాత ఒకానొక సందర్భంలో ఇరువురు ‘బాబులు’ ఎక్కడో, ఎలాగో, ఎందుకో రాజీపడిన ఫలితంగా ఆ కేసును మోహన్‌బాబు ఉపసంహరించుకున్నాడు. అది వేరే సంగతి. అందువల్ల ‘చీటింగ్’ విషయంలో అటు కోలా కృష్ణమోహన్ అయినా, ఇటు చంద్రబాబు అయినా ఉభయతారక పద్ధతిలోనే వ్యవహరించారని మనం భావించాలి! ఇంతకూ చెప్పవచ్చేదేమంటే చంద్రబాబు హుందాగల నాయకత్వం అందించగల రాజకీయ నాయకుడు కాదనీ, రాజనీతిజ్ఞత, నిజాయతీ కొరవడిన వ్యక్తికి ‘దేశం’ పార్టీ పగ్గాలు అప్పగించి, నియంతృత్వ ధోరణిని పార్టీలో పెరగనివ్వడం పార్టీకే చేటనీ, నిజాయతీ కొంతైనా మిగుల్చుకున్న ఆ పార్టీలోని నాయకులు ఇప్పటికైనా గుర్తించడం అవసరం.
రాజనీతిజ్ఞత కొరవడిన ఏ నాయకుడూ ప్రజాదరణ పొందలేడు. రోజు రోజుకీ సంయమనం కోల్పోతున్న అధినాయకుడిని మార్చుకుంటేనే, పార్టీలోకి యువతరం దూసుకువస్తేనే ‘దేశం’ పార్టీకి మనుగడ ఉంటుందని ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు గుర్తించాల్సిన సమయం వచ్చింది. ‘నేనూ, నా కోడీ లేకపోతే లోకానికి తెల్లవారదన్న’ ముసిలి కబుర్లకు కాలం చెల్లిపోయిన రోజులివి! 2004 ఎన్నికలకు కొలది మాసాల ముందుగా (2003 మే 29-30) ‘ఆంధ్రప్రభ’ ప్రధాన సంపాదకునిగా ‘దేశం పార్టీ ప్రతినిధుల ఆలోచన కోసం’ అని ఆనాడు నేను రాసిన సీరియల్ సంపాదకీయంలో పేర్కొన్న మాటల్ని మరొక్కసారి ఇక్కడ ఉదహరించడం సబబుగా ఉంటుందని భావిస్తున్నాను-
‘‘అధికారం అవినీతిని పెంచుతుంది. సంపూర్ణాధికారం పాలకుడిని పూర్తిగా అవినీతిపాల్జేస్తుందన్నాడు లార్డ్ యాక్డన్. కాని జాన్ రోచీ అనే ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త అధికారం కోల్పోతామన్న భయమూ, అధికారం కోల్పోయే ఘడియలు సమీపిస్తున్నాయన్న ఆందోళన కూడా ఆబకొద్దీ పాలకుడిని నిలువెల్లా అవినీతి వైపు నడిపిస్తుందన్నాడు... ‘దేశం’ పార్టీ సభ్యులూ, క్రియాశీల కార్యకర్తలూ ఇప్పటికైనా తమ పుట్టె మునిగిపోకముందే కళ్లు తెరిచి ఆలోచించి తమ నాయకుడిని (చంద్రబాబు) సవరించడానికి ప్రయత్నించాలి. ప్రజల దృష్టిలో రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టిన విద్రోహులుగా నమోదు కావొద్దు’’!
ఆ నాడు నేను చేసిన ఈ హెచ్చరిక విలువ నిన్నటి, నేటి, రేపటి పాలకులందరికీ తెలిసి రాగలదని నమ్ముతున్నాను. రాశీ చక్రగతిలోని చంద్రుడు కుంగిపోతే వెన్నెల నిలవదు, కాని ఈ ‘చంద్రుడు’ సన్యసిస్తే ‘తెలుగుదేశం’ పార్టీకి నిలిచేది పండు వెన్నెలే! విలువలు లేని పాలకులు మనకొద్దు! సరిగా నడవలేని వాడికి, నడిపించలేని వాడికీ వందిమాగధులు నాలుగు పక్కలా సమకూర్చే ‘సవారి’ పండుగ కాదు, పరమ దండుగ! జన్యుకణాల మార్పిడి ద్వారా జన్యులోపాల్ని (డీఎన్‌ఏ) సవరించడానికి జన్యు శాస్త్రజ్ఞులు ఎంతగా ప్రయత్నిస్తున్నా కొందరిలో ఆ మార్పు సాధ్యపడకపోవచ్చునేమో!
No comments:
Post a Comment