YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 29 June 2012

అధికార మదాంధత కాదా ఇది?!



వేలాది మంది ఉపాధిని కొల్లగొట్టే చర్యలు చెల్లవని ప్రకటిస్తూ ‘సాక్షి’ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించినా సీబీఐ ఖాతరు చేయకపోవడం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమే. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పాత్రికేయులు ముక్త కంఠంతో ఖండించి, నిరసన ప్రకటించినా సీబీఐ మూర్ఖంగా అదే ఆలోచనను కొనసాగించడం చూస్తున్నదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసుతో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారి ఇంతగా బరితెగించడం క్షంతవ్యం కాదు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, విలక్షణమైన లిభితపూర్వక రాజ్యాంగం కలిగిన దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఆవిర్భవించిన అనేక వ్యవస్థలను భారత ప్రజానీకం ఎంతో సమున్నతంగా భావించి గౌరవిస్తోంది. అలా రూపొందిన జాతీయస్థాయి అత్యున్నత విచారణ సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలకు గురికావడం విచారకరం. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను గాలికొదిలి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి అడుగులకు మడుగులొత్తడం సీబీఐ అధికారుల దినచర్యగా మారింది.

‘ఆ విషయంలో నేను రెండాకులు ఎక్కువే...’ అన్న చందంగా సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ అన్ని విలువలకు తిలోదకాలిచ్చినట్టు వ్యవహరించడం దిగ్భ్రమ కలిగిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విచారణ జరుపుతున్న క్రమంలో అవధులు దాటిన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహార సరళిని న్యాయకోవిదులే కాక సామాన్య ప్రజలు కూడా ఛీదరించుకుంటున్నారు. అయినా, ఆయన ఇంకా ఆ బాధ్యతల్లో కొనసాగడం అనుచితం!

న్యాయ నియమాలనన్నిటీనీ ఉల్లంఘించి ‘ప్రభు’భక్తితో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఖతం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా విధి నిర్వహణ పేరుతో జేడీ ఊగిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. చట్టం ముందు అందరూ సమానులేనన్నది రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక సూత్రం. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. జగన్ విషయంలో ఈ సూత్రాన్ని పాటించకుండా వివ క్షను ప్రదర్శిస్తూ కక్షపూరితంగా లక్ష్మీనారాయణ విచార ణ పర్వాన్ని కొనసాగించడం విమర్శలకు దారితీస్తోంది.

కాంగ్రెస్ అధిష్టానంతో విబేధించి కొత్త పార్టీ పెట్టడమే జగన్ చేసిన నేరమా? జగన్ పార్టీ వల్ల తమ అధికారానికి ముప్పు ఉందని గ్రహించి, అడ్డదారులుతొక్కైనా అధికారాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ ‘పెద్దలు’, పోయిన అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఏకమై కుట్ర పద్ధతుల్లో హైకోర్టులో ఒకే విధమైన ‘పిల్’ వేశాయి. దానిపై అనేక మతలబులతో కూడిన విచారణ అనంతరం కోర్టు తీర్పును వెలువరిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఆ తీర్పును వెలువరించిన ప్రధాన న్యాయమూర్తికి పదవీ విరమణ అనంతరం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి లభించడం, అనేక విమర్శలకు తావిచ్చిందని హైకోర్టు సీనియర్ న్యాయవాది రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. పిల్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావుకు మంత్రిపదవి లభించింది. మనపాలకులు అనుసరిస్తున్న విలువలు ఎంత పతనావస్థకు చేరుకున్నాయో ఇంతకంటే ఉదాహరణ కావాలా?

కాంగ్రెస్ అధిష్టానం ఎంతగా దిగజారిందంటే, తన విధానాలను ప్రజలకు అనుకూలంగా మార్చుకోవటానికి బదులు సీబీఐని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను అణచివేయడానికి పాల్పడుతోంది. న్యాయ వ్యవస్థలోని కొన్ని శక్తులు కూడా దానికి వంత పాడటం దురదృష్టకరం. చంద్రబాబు అక్రమ ఆస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వ్యాజ్యం వేస్తే, న్యాయమూర్తులకు అందులో రాజకీయ దురుద్దేశం కనిపించడం విశేషం! మరి శంకర్రావు, టీడీపీ నాయకులు జగన్‌పై వ్యాజ్యం వేస్తే అందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు కనిపించకపోవడం కూడా విశేషమే మరి! అందరికీ ఒకే న్యాయమన్న సూత్రాన్ని న్యాయస్థానాలు ఎందుకు పాటించడంలేదన్నది సామాన్యుడికి అర్థంకాని సమస్యగా మారింది.

రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం!

ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఒక పార్టీకి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడూ అయిన జగన్‌మోహన్‌రెడ్డి పట్ల సీబీఐ వ్యవహరిస్తున్న తీరు వ ్యక్తి స్వేచ్ఛను హరించేదిగా ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగాన్ని అతిక్రమించడానికి ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉన్నట్టు సీబీఐ వ్యహరిస్తోంది. పెట్టుబడులు పెట్టకుండా ఒక పత్రికను గానీ, ఒక ఛానల్‌ను గానీ స్థాపించడం సాధ్యమా? ‘సాక్షి’కి ముందు యెల్లో పత్రికలదే రాజ్యం.

వారు రాసిందే వేదం. జగన్ ఓదార్పు యాత్రకు లక్షలాది జనం తరలివస్తే, ఆ యాత్రనంతా యెల్లో పత్రికలు బ్లాక్ అవుట్ చేశాయి. యాజమాన్యాలకు ఇష్టం ఉన్నా, లేకపోయినా ప్రజాదరణ పొందిన అంశాలను వార్తగానైనా వేయాలి. అది పాఠకుల హక్కు. జగన్, విజయమ్మల సభలను బ్లాకవుట్‌లో చూడటానికి అలవాటు పడ్డ ఒక వర్గం పాఠకులు, ఉప ఎన్నికల ఫలితాలతో షాక్ కు గురయ్యారు.‘సాక్షి’ పత్రిక వైఎస్ హయాంలో ప్రారంభమై, తెలుగు ప్రజల అభిమాన పత్రికగా మారింది. ఇప్పుడు దాని పాఠకుల సంఖ్య కోటిన్నరకు పెరిగింది.

దీనితో ఎల్లో పత్రికల అహం దెబ్బతింది. సీబీఐని ఉసిగొల్పి ‘సాక్షి’ పత్రిక బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. వేలాది మంది ఉపాధిని కొల్లగొట్టే చర్యలు చెల్లవని ప్రకటిస్తూ ‘సాక్షి’ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోర్టు స్పష్టమైన తీర్పును వెలువరించినా సీబీఐ ఖాతరు చేయకపోవడం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమే. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పాత్రికేయులు ముక్త కంఠంతో ఖండించి, నిరసన ప్రకటించినా సీబీఐ మూర్ఖంగా అదే ఆలోచనను కొనసాగించడం చూస్తున్నదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వత్తాసుతో ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారి ఇంతగా బరితెగించడం క్షంతవ్యం కాదు. ప్రజాస్వామ్యవ్యవస్థలో పాలకులుకాదు, ప్రజలే సర్వాధికారులన్న ప్రాథమిక జ్ఞానం లేకుండా నడచుకోవడం పాలనా వ్యవస్థకే తలవంపులు తెస్తుంది.

కక్షపూరిత వైఖరి మానాలి!

దేశ అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోందనీ, అది కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలగక తప్పడంలేదన్న నిజాన్ని సీబీఐ మాజీ డెరైక్టర్ జోగీందర్‌సింగ్ ఒక సందర్భంలో బయటపెట్టడం దాని పని తీరుకు అద్దం పడుతోంది. ఈ ప్రకటనను సీబీఐ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఖండించకపోవడం విశేషం.

సీబీఐని హైకోర్టు ఆదేశించింది జగన్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగం మీద విచారించమనే కానీ, కాంగ్రెస్, టీడీపీల తరపున జగన్‌పై రాజకీయ కక్ష సాధింపునకు పూనుకోమని కాదు. వైఎస్ హయాంలోని మంత్రివర్గ నిర్ణయాలను తవ్వితీసి, వాటిలో లేని తప్పులను ఉన్నవిగా చెప్పి కొండంతవిగా చూపి పారిశ్రామికాధిపతులను వేధించడం రాష్ట్ర ప్రయోజనాలకు తీరని విఘాతం కలిగిస్తుంది. ఆ నిర్ణయాల్లో జగన్ ఏ దశలోనూ భాగస్వామి కాదు.

ఇవన్నీ ఇలా ఉండగా ఉప ఎన్నికల ప్రచారం మధ్యలో జగన్‌ను అరెస్టు చేసి నిర్బంధించడంతో ప్రజల్లో కోపోద్రేకాలు పెరిగి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైంది. జేడీ లక్ష్మీనారాయణ ప్రభుభక్తి వికటించి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. జగన్ అరెస్టు తమ కొంప ముంచిందని వయలార్ రవి వాపోయారు. జగన్ అరెస్టుతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి, ఓటర్లను బెదరగొట్టొచ్చన్న సీబీఐ అంచనాలను ప్రజలు చిత్తు చేశారు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే జగన్ కేంద్ర మంత్రి అయ్యేవాడని, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడని గులాం నబీ ఆజాద్ ప్రకటించి అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. 130 ఏళ్ల కాంగ్రెస్‌కు పట్టిన దుర్గతి ఇది! కాంగ్రెస్‌ను వీడితే మంచి వాళ్లకు సైతం ముప్పుతిప్పలు తప్పవన్నమాట!

హద్దు మీరిన జేడీ ప్రవర్తన!

క్రిమినల్ జస్టిస్‌లోని మౌలిక సూత్రాలు లక్ష్మీనారాయణకు తెలియవనుకోలేము. వాటిని బుద్ధి పూర్వకంగానే ఉల్లంఘిస్తున్నాడు. అభియోగాలు మోపినంత మాత్రం చేతనే ఎవరూ దోషికారు. కోర్టు విచారణతోనే అది తేలాలి. ఆరోపణలను రుజువు చేయాల్సిన బాధ్యత, ఆరోపణలకు తెగబడ్డ వారి మీదనే ఉంటుంది. ఎవరితోనైనా బలవంతంగా నేరాన్ని ఒప్పించే ప్రయత్నం మంచి సాంప్రదాయం కాదు. దాన్ని కోర్టులు అంగీకరించవు. సీబీఐ కక్షగట్టి నెలల తరబడి ఒక వ్యక్తిని నిర్బంధించి విచారణ తతంగాన్ని పొడిగిస్తోంది. విజయసాయిరెడ్డిని ఏకంగా 300 గంటలు ఇంటరాగేషన్ చేసి రికార్డు సృష్టించారు. జగన్ నుంచి వారికి తృప్తికరమైన సమాధానాలు రావడంలేదు కాబట్టి, కస్టడీని పొడిగించాలని జేడీ కోర్టును అభ్యర్థించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.

ఎన్నికల ప్రచారానికి పక్షం రోజులు బెయిలు మంజూరు చేయమని జగన్ కోర్టును అభ్యర్థిస్తే, దానికీ అభ్యంతరం చెప్పారు. జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న సాకు చూపారు. విచారణ క్రమంలో తొమ్మిది మాసాలుగా బయట ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేసినట్లు ఆధారాలు చూపగలరా? అని కోర్టు ప్రశ్నిస్తే జేడీ బిక్కముఖం వేశారు. జగన్ దర్యాప్తుకు సహకరించడం లేదని బుకాయిస్తూ, నార్కో ఎనాలసిస్ పరీక్షకు అనుమతించమని కోర్టును అభ్యర్థించడం అమానుషం, అనాగరికం. ఈ పద్ధతి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధమని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా ఇలా అభ్యర్థించడం, రాజ్యాంగ స్ఫూర్తికే భంగకరం. నార్కో పరీక్షలో శరీరంలోని ప్రధాన అవయవాలకు హాని జరుగుతుందన్న విచక్షణ కూడా సీబీఐకి లేకపోవడం విడ్డూరం.

ఎల్లో మీడియాకు ఏకపక్షంగా విచారణకు సంబంధించిన సమాచారాన్ని సీబీఐ లీక్ చేయడం అన్నిటికన్నా పెద్ద నేరం. ఆ సమాచారం ఆ మీడియాలో ముందుగా ప్రచురితం కావడం పెద్ద దుమారంగా మారింది. సీబీఐ జేడీ ఎల్లో మీడియాతో వందల సార్లు ఫోన్ సంభాషణలు జరిపినట్లు ఇటీవల వెల్లడైంది. ఇంత జరుగుతున్నా ఏలినవారితో సహా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ గుడ్లప్పగించి చూస్తూ ఊరకుంటే ప్రజలు క్షమించరని గుర్తించాలి.

‘‘ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో...
ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రీ నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు’’
 అన్న రవీంద్రనాథ్ టాగోర్‌ను ఈ సందర్భంగా గుర్తుచేసుకోక తప్పదు!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!