YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 26 June 2012

సంగ్మాకు అవమానం

దేశ అత్యున్నత పీఠానికి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీఏ కూటమి తన అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ప్రకటించగా, అరడజనుమంది ఎంపీలు మాత్రమే ఉన్న అన్నా డీఎంకే, బీజేడీలు లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మాను ఎంపికచేసి ఆయనకు విపక్ష ఎన్‌డీఏ కూటమి మద్దతు కూడగట్టడంలో కూడా సఫలమయ్యారు. యూపీఏకున్న సంఖ్యాబలంరీత్యా చూసినా, ఎస్‌పీ, బీఎస్‌పీ, సీపీఎంవంటి పక్షాల మద్దతురీత్యా చూసినా ప్రణబ్ ఎన్నిక లాంఛనప్రాయమే. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా, అవి ఎలా ఉండబోతున్నాయో ముందే తేటతెల్లమవుతున్నా ఏ పదవికైనా పోటీపడటం అనేది ప్రజాస్వామిక సంప్రదాయం. 

భిన్నాభిప్రాయాల ఘర్షణతోనే ప్రజాస్వామ్యం సుసంపన్నం అవుతుంది. గెలుపు ఖాయమని నిండైన విశ్వాసంతో ఉన్నప్పటికీ ప్రణబ్ వివిధ రాష్ట్రాలను సందర్శించి ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిసి తనకు మద్దతునీయాలని కోరబోతున్నారు. తన అభ్యర్థిత్వం ఈసరికే ఖరారైంది గనుక సంగ్మా కొంచెం ముందుగానే ప్రచార రంగంలో నిలిచారు. పోటీలో ఉన్నవారందరితోనూ ఒకేలా వ్యవహరించటం, వారందరికీ సమానావకాశాలు లభించేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. తమ పార్టీనుంచి పోటీచేస్తున్న వారికి లేదా గెలుస్తారని భావించిన వారికి నీరాజనాలు పట్టడం, అవతలిపక్షాన్ని చిన్నచూపు చూడటం అధికారంలో ఉన్నవారికి తగనిపని. 

కానీ, విపక్షాల అభ్యర్థిగా పోటీలో ఉన్న పీఏ సంగ్మాతో రాష్ట్ర ప్రభుత్వం మొరటుగా వ్యవహరించిన తీరు అన్ని విలువలనూ, సంప్రదాయాలనూ కాలరాసేలా ఉంది. ఈ చర్య ద్వారా ప్రభుత్వం ఎలాంటి సందేశం పంపించదలుచుకున్నదో అంతుపట్టకుండా ఉంది. కొన్నిరోజులక్రితం తమ రాజకీయ ప్రత్యర్థి, వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించడం లోనూ, ఆ తర్వాత జరిగిన పరిణామాలలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలిపై జాతీయ మీడియా తీవ్రంగా విమర్శించినా వాటి తీరుతెన్నులు ఏమాత్రం మారలేదని తాజా ఘటన నిరూపిస్తోంది. 

పీఏ సంగ్మా ఏదో సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఆయన దాదాపు మూడున్నర దశాబ్దాలనుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా ఆయన ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. పైగా, ఈ దేశంలో అన్నివిధాలా వివక్షను ఎదుర్కొంటున్న గిరిజన వర్గాలకు చెందిన నాయకుడు. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీచేస్తూ, అన్ని రాష్ట్రాలనూ సందర్శిస్తూ ఇక్కడికి వస్తే మన ఏలికలకు కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కొరవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న అభ్యర్ధి ఒకరు పదిరోజుల ముందుగా అపాయింట్‌మెంట్ ఖరారుచేసుకుని 17 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్న ఒక రాజకీయ పార్టీ అధినేతను కలవడానికొస్తే మనం ఇలా ప్రవర్తించవచ్చా అనే కనీస ఆత్మ విమర్శ కూడా దానికి కరువైంది. 

తమ నిర్వాకం వెల్లడై అందరూ చీవాట్లు పెట్టాకైనా చేసిన పొరపాటును ఒప్పుకొని, తప్పయిందని చెప్పివుంటే ఉన్నంతలో గౌరవంగా ఉండేది. కానీ, తనకు ఆమాత్రం హుందాతనం కూడా లేదని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు నిరూపించుకుంది. సంగ్మాకు జగన్ మోహన్‌రెడ్డితో ములాఖత్ నిరాకరించడానికి అనధికారికంగా చెప్పిన సంజాయిషీ సర్కారు తోలుమందం తత్వాన్ని వెల్లడిస్తోంది. ఆయన వచ్చిన సమయానికి జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ విచారణలో ఉన్నారని ఒకసారి, జైల్లో రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదు గనుకే ఇవ్వలేదని మరోసారి చెప్పిన జవాబులు జగన్‌పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చెబుతోంది. సంగ్మాను అవమానపరచాలన్న ధోరణిని వెల్లడిస్తోంది. 

మరి ఇదే జైలుకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వచ్చి, జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి యూపీఏ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీకి మద్దతునీయమని చెప్పినప్పుడు ఈ అభ్యంతరాలేమయ్యాయని సంగ్మా అడుగుతున్న ప్రశ్నకు ప్రభుత్వం ఏం జవాబిస్తుంది?

జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి నుంచీ సక్రమంగా వ్యవహరించడంలేదని, అవి రెండూ సీబీఐని రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ‘జగన్ మా పార్టీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి ఇచ్చేవాళ్లం. ఏదో ఒకనాడు ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం. బయటకు వెళ్లడంతో ఏమైంది... ఇప్పుడు జైలుపాలయ్యాడు’ అని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలో చేసిన ప్రసంగమే వారి కుట్రలను బయట పెట్టింది. 

జడ్ క్యాటగిరీ భద్రత ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని సాధారణ వ్యానులో కోర్టుకు తీసుకెళ్లడం లాంటి ఘటనలు ఈ కుట్ర కోణాన్ని మరింత బలపరిచేవిగానే ఉన్నాయి. వీటన్నిటినీ చూసే ఈమధ్య జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అయినప్పటికీ, పాలకుల్లో ఇసుమంతైనా మార్పు రాలేదని సంగ్మా వ్యవహారం తెలియజెబుతోంది. జగన్‌మోహన్‌రెడ్డిని కలవడానికి తొలుత వెళ్లిన సంగ్మాను మరికొన్ని గంటల తర్వాత రావాలని చెప్పడం, రెండోసారి వెళ్లబోతుండగా ‘మీది రాజకీయ కలయిక గనుక ఈరోజు ములాఖత్ సాధ్యం కాద’ని ఫోన్‌లో చెప్పడం ఎవరి ఆదేశాల మేరకు జరిగిందో, అలా చెప్పినవారికి అందువల్ల చేకూరే ప్రయోజనమేమిటో ఊహకు అందని విషయమేమీ కాదు. అధికారం ప్రజలనుంచి సమకూరడం కాక, పైవారి దయాదాక్షిణ్యాలమీద లభించినప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఒంటబట్టవు. తమ నిర్వాకంవల్ల వ్యవస్థలు ధ్వంసమవుతున్నా వారికి పట్టదు. రాష్ట్రంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరును జనం ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. దేశ ప్రజలందరూ చూస్తూనే గమనిస్తూనే ఉన్నారు. తానేం చేసినా చెల్లుతుందనుకుని 34 ఏళ్లక్రితం ఇందిరాగాంధీ ఇలాంటి పోకడలకే పోయినప్పుడు ప్రజలు తిరుగులేనివిధంగా బుద్ధిచెప్పారు. వర్తమానాన్ని గమనించలేనంతగా కళ్లు పొరలు కమ్మినా, కనీసం చరిత్రనైనా తిరగేస్తే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో దొరుకుతాయి. పాలకులు దీన్ని గ్రహించుకుంటే అది వారికే క్షేమదాయకం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!