YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 28 June 2012

సీబీఐ తీరు సిగ్గుచేటు


ఇదేం దర్యాప్తు.. ఇలాగేనా దర్యాప్తు సాగేది..?
విధి నిర్వహణలో సీబీఐ దారుణంగా విఫలమైంది
సీబీఐ పీపీలు నిజాలు దాచి కోర్టులను మోసగిస్తున్నారు
జగన్ అరెస్టును సీబీఐ ఏ విధంగానూ సమర్ధించుకోజాలదు
సొంతగా దర్యాప్తు చేయాలే తప్ప.. జగన్ చెప్పే దాన్నిబట్టి చేస్తారా?
బెయిలిస్తే జగన్ సాక్షులను బెదిరిస్తారు: సీబీఐ న్యాయవాది అశోక్‌భాన్
బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి జూలై 4న తీర్పు
నిజమే.. జగన్ వద్ద అధికారం లేదు
మీ చేతిలో ఉంది గనుకే సీబీఐని రిమోట్‌తో ఆడిస్తున్నారు
మీ నాటకాలను జనమంతా చూస్తున్నారు 
భవిష్యత్తెలా ఉంటుందో చూడండి: జెఠ్మలానీ

‘‘నిజమే.. జగన్‌కు అసెంబ్లీలో ఉన్నది తక్కువ బలమే. ఆయన పార్టీ ఉప ఎన్నికల్లో 15 సీట్లు గెలిచింది. ఆయన వద్ద ఇప్పుడు అధికారం కూడా లేదు. మీ (కేంద్రం) వద్దే ఉంది. అందుకే సీబీఐని రిమోట్ కంట్రోల్‌తో ఆడించినట్టు ఆడిస్తున్నారు. మీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. జగన్ విషయంలో భవిష్యత్తెలా ఉంటుందో ఓసారి చూడండి. ప్రజలకన్నీ స్పష్టంగా తెలుసు’’ - హైకోర్టులో జెఠ్మలానీ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ నిజాయతీగా వ్యవహరించడం లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని, సిగ్గుతో తలదించుకునేలా సాగుతోందని వివరించారు. దర్యాప్తు పేరుతో సీబీఐ చేస్తున్నదంతా తప్పని, అవసరం లేని అంశాలన్నింటిలో దర్యాప్తు చేస్తోందని తెలిపారు. జగన్ పిటిషన్‌పై బుధవారం మొదలైన వాదనలు న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు ఎదుట గురువారం కూడా కొనసాగాయి. జగన్ తరఫున రాంజెఠ్మలానీ, సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్ వాదించారు. 

సీబీఐ తీర్పులిచ్చేస్తోంది..

దర్యాప్తు చేసి, తదుపరి ప్రక్రియను న్యాయస్థానాలకు వదిలిపెట్టాల్సిన సీబీఐ అధికారులు, అందుకు విరుద్ధంగా తామే తీర్పులిచ్చేస్తూ నిందితులను ముందుగానే శిక్షించేస్తున్నారని రాంజెఠ్మలానీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తు పేరుతో వ్యక్తుల స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని తెలిపారు. ‘‘సీబీఐ దర్యాప్తు మొత్తం మోసం. అది తన విధి నిర్వహణలో దారుణంగా విఫలమైంది. ఇది నేను చెబుతున్నది కాదు. ఓ కేసులో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. సాక్షులను జగన్ బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అందుకే అరెస్టు చేస్తున్నామని సీబీఐ చెప్పింది. కానీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైన 2011 ఆగస్టు 17 నుంచి 2012 జగన్‌ను అరెస్టు చేసిన మే 27 దాకా సీబీఐకి ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? ఆ సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్ బయట ఉంటే రాజకీయంగా ఎదుర్కోవడం సాధ్యం కాదు కాబట్టి ఢిల్లీ ఆదేశాల మేరకు సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది’’ అన్నారు. పైగా అరెస్ట్ సమయంలో జగన్ ఎంపీ హోదాను అధికారులు సాకుగా చూపారంటూ రాంజెఠ్మలానీ ఎద్దేవా చేశారు. సీబీఐ ఇచ్చిన అరెస్టు మెమో మొత్తం తప్పులతడకని, అందులోని విషయాలన్నీ అవాస్తవాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘వాస్తవాలు తెలుసుకునేందుకు విచారణకు పిలుస్తున్నామని జగన్‌కు చెప్పిన సీబీఐ అధికారులు, తరువాత అరెస్టు చేశారు. ఇది మోసగించడమే అవుతుంది. అరెస్టును జగన్ ముందే ఊహించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను ఫలానా అంశంపై విచారణకు పిలిపించామని అప్పుడు సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పలేదు. ఇది న్యాయస్థానాన్ని మోసం చేయడమే. సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాస్తవాలను దాచిపెడుతూ న్యాయస్థానాన్ని పదేపదే మోసం చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. సీబీఐ చర్యలు అమాయకులను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయి’’ అని ఆయన కోర్టుకు నివేదించారు.

ఒక్క మంచి ప్రశ్నయినా అడిగారా?

విచారణకు జగన్ సహకరించలేదని, పొంతన లేని సమాధానాలు చెప్పారని అంటున్న సీబీఐ అధికారులు అసలు విచారణలో జగన్‌ను ఒక్క మంచి ప్రశ్నైనా అడిగారా అని రాంజెఠ్మలానీ ప్రశ్నించారు. జగన్ సరిగా సమాధానాలివ్వడం లేదని చెప్పేందుకు అసలు సీబీఐకున్న అర్హతేమిటంటూ నిలదీశారు. సీబీఐ సొంతగా దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకోవాలే తప్ప, జగన్ చెప్పేదాన్ని బట్టి దర్యాప్తు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ‘దర్యాప్తు అంటే ఇదేనా? దర్యాప్తు సాగే తీరు ఇదేనా?’ అని సీబీఐని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు సిగ్గుతో తలదించుకునేలా ఉందని పునరుద్ఘాటించారు. తాము చెప్పినట్టు విని, తమకు సహకరించిన వారిని సీబీఐ అధికారులు ఈ కేసులో సాక్షులుగా చూపుతున్నారని, అలా వినని వారిని మాత్రం దోషులుగా చూపుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఒక్క సాక్ష్యమూ చూపలేదే?!

జగన్ సాక్షులను బెదిరించే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందంటున్న సీబీఐ అధికారులు, అందుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క సాక్ష్యాన్ని కూడా ఇప్పటిదాకా ఏ కోర్టు ముందూ ఉంచలేదని రాంజెఠ్మలానీ వివరించారు. ఈ విషయంలో సీబీఐ అధికారులు ప్రతిసారీ కోర్టు ముందు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని నివేదించారు. ‘‘సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలాలిచ్చేందుకు సాక్షులు ముందుకు రావడం లేదని సీబీఐ చెబుతోంది. కానీ నిజానికి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే 164 కింద వాంగ్మూలమిచ్చే విషయంలో సీబీఐ నోటీసులకు స్పందించలేదు. దాన్ని జగన్‌కు ముడిపెట్టడం ఎంత వరకు సమంజసం? దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా చెప్పుకునే సీబీఐ దర్యాప్తు తీరు ఎలా ఉందో ఓసారి చూడండి’’ అని ఈ సందర్భంగా న్యాయమూర్తిని జెఠ్మలానీ కోరారు. ‘సీబీఐలో మంచి అధికారులున్నారు. అదే సమయంలో చెడ్డవారూ ఉన్నారు. వారివల్లే మంచి అధికారులకు తగిన గుర్తింపు రాకుండా పోతోంది. జగన్ అరెస్టుకు సీబీఐ చెప్పిన కారణాలు స్పష్టంగా లేవు. వాటి ఆధారంగా జగన్ అరెస్టును సమర్థించుకోజాలదు. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ పార్టీ అధ్యక్షుడిగా తనకు నచ్చిన అభ్యర్థికి ఓటేయాలని ప్రచారం చేసుకునే హక్కు జగన్‌కుంది. రాజ్యాంగం ప్రసాదించిన ఆ హక్కును గౌరవిస్తూ ఆయనకు బెయిలివ్వాలి’’ అని కోర్టును కోరారు.
అసాధారణ పరిస్థితుల్లోనే బెయిల్ నిరాకరణ..

దర్యాప్తు జరుగుతోంది గనుక బెయిలివ్వరాదని సీబీఐ కోరడం సరికాదని రాంజెఠ్మలానీ గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని పలు తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. ‘‘బెయిలిచ్చే విషయంలో చట్టం స్పష్టంగా ఉంది. నిందితులకు బెయిలివ్వడమనేది నిబంధన. దాని నిరాకరణ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చేసేది’’ అని అన్నారు. ‘‘దాదాపు 10 నెలలుగా దర్యాప్తు చేస్తున్నారు. మూడు చార్జిషీట్లు వేశారు. విదేశాలకు కూడా వెళ్లారు. లెటర్ ఆఫ్ రెగొటరీ ద్వారా విదేశాల నుంచి సమాచారమూ కోరారు. కానీ ఆ దేశాలు ఎప్పటికీ సమాధానమివ్వవు. దాన్ని అడ్డం పెట్టుకుని దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. నిందితులకు బెయిలివ్వొద్దని సీబీఐ వాదిస్తోంది. ఇదెంతమాత్రమూ సమంజసం కాదు’’ అని ఆయన వివరించారు.

జగన్ పలుకుబడి వల్లే సాక్షులు ముందుకు రావట్లేదు: సీబీఐ న్యాయవాది

అంతకుముందు సీబీఐ తరఫున అశోక్ భాన్ వాదనలు వినిపించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చగా అవి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఒకేసారి జరిగిందన్నారు. ఇదంతా క్విడ్ ప్రొ కోలో భాగమేనని ఆయన వివరించారు. ‘‘జగన్‌కున్న పలుకుబడి వల్ల సాక్ష్యమిచ్చేందుకు సాక్షులు ముందుకు రావడం లేదన్నారు. జగన్‌కు బెయిలిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలున్నాయి. దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ దశలో జగన్‌కు బెయిలివ్వరాదు’’ అని భాన్ కోర్టును కోరారు. ఈ సమయంలో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లేందుకు ఆయన పలుమార్లు ప్రయత్నించగా న్యాయమూర్తి అడ్డుకున్నారు. ‘పూర్వాపరాల్లోకి వెళ్లొద్దు. ఎందుకు బెయిల్ ఇవ్వరాదనే విషయానికి మాత్రమే వాదనలను పరిమితం చేయాలి’’ అని స్పష్టం చేశారు. జూలై 4న తీర్పు వెలువరిస్తానని ప్రకటించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!