30% తక్కువగా రుణ మొత్తాల ఖరారు
ఎకరా వరి పెట్టుబడి ఖర్చు రూ.31 వేలు
సాంకేతిక కమిటీ ఖరారు చేసింది
రూ.22 వేలు మాత్రమే
మిగతా పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులే దిక్కు
నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం
హైదరాబాద్, న్యూస్‌లైన్: కరువు లేకుంటే వరదలు...ఏది వచ్చినా రైతులు పెట్టుబడి పూర్తిగా నష్టపోతున్నారు. ప్రతి ఏటా ఇలాంటి ఏదో ఒక విపత్తుతో ప్రస్తుతం వ్యవసాయం జూదంగా మారిపోయింది. మరోవైపు సాగు సజావుగా సాగినా.. భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయంతో ఏ పంటలోనూ ఏమీ మిగిలే పరిస్థితి లేదు. పొంతనలేని కనీస మద్దతు ధరలతో (ఎంఎస్‌పీ) సగటు దిగుబడి వచ్చినా లాభం ఉండటం లేదు. ఇక దిగుబడి కాస్త తగ్గినా, ఎప్పటిలాగే ఎంఎస్‌పీ లభించకున్నా ఈ నష్టం రెట్టింపవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చులకు సమానంగా బ్యాంకుల నుంచి పంట రుణాలు అందేలా సహకరించాల్సిన ప్రభుత్వమే రైతులకు తీవ్ర నష్టం చేస్తోంది. తామే నిర్ధారించిన పెట్టుబడి ఖర్చులకు సమానంగా కూడా రుణ మొత్తాల (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)ను ఖరారు చేయలేదు. బ్యాంకులు మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వం నిర్ధారించిన మొత్తం కంటే తక్కువగా పంట రుణాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఇలా పెట్టుబడి ఖర్చులకు సమానంగా బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీ సీజనులో పంటల వారీగా ఇచ్చే రుణ మొత్తాలను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఇటీవలే ఖరారు చేసింది. పలు ప్రధాన పంటలకయ్యే పెట్టుబడి ఖర్చులను పరిశీలిస్తే.. ఈ రుణ మొత్తాలు 30 శాతం తక్కువగా ఉండడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన పంటలకే తక్కువ!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) మొత్తం 16 వ్యవసాయ పంటలకు ఇచ్చే రుణ మొత్తాలను ఖరారు చేసింది. ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, చెరకు పంట సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చుతో పోల్చితే కమిటీ ఖరారు చేసిన రుణ మొత్తం చాలా తక్కువగా ఉంది. ఎకరా విస్తీర్ణంలో వరి పంట సాగుకు రూ.31,440 ఖర్చు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారికంగా నిర్ధారించింది. అయితే ఈ పంట సాగుకు రైతులకు రూ.22 వేల రుణం ఇస్తే సరిపోతోందని ఎస్‌ఎల్‌టీసీ ఖరారు చేసింది. అంటే ఈ రుణం తీసుకున్న వరి రైతులు తప్పనిసరిగా అవసరమైన మరో రూ.9,440 కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయక తప్పదు. అలాగే మొక్కజొన్న రైతులకు కూడా ఎకరాకు రూ.9,648 తక్కువగా రుణం వస్తోంది. చెరకు రైతులకు అయితే ఏకంగా రూ.16,667 తక్కువ రుణం ఖరారు చేశారు. పత్తి, వేరుశనగ, కంది పంటల సాగు రైతులకు ఇచ్చే రుణాల తీరూ ఇలాగే ఉంది.
వాణిజ్య పంటలకు లేదు...
రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంటలకు ప్రభుత్వం అసలు రుణ మొత్తాలనే ఖరారు చేయడం లేదు. సగటున 13 లక్షల ఎకరాల్లో సాగు చేసే మిరప, పసుపు, ఉల్లి, జనుము పంటలకు సర్కారు రుణ మొత్తాలను ఖరారు చేయకపోవడంతో బ్యాంకులు ఈ పంటల రైతులను అసలు దగ్గరికే రానివ్వడం లేదు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండో ప్రధాన పంట సోయాబీన్‌కు సైతం రుణ మొత్తాన్ని ఖరారు చేయడం లేదు. పెసలు, మినుములు, నువ్వులు, జొన్నలు, రాగులు వంటి పంటలకు సర్కారు రుణ మొత్తాన్ని ఖరారు చేస్తున్నా.. బ్యాంకులు మాత్రం ఈ పంటలకు రుణాలు ఇస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. మంగళవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం ఈ అంశాలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
No comments:
Post a Comment