YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 27 June 2012

జగన్‌ను అరెస్టు చేసి.. కోర్టును సీబీఐ మోసం చేసింది


హైకోర్టుకు నివేదించిన జెఠ్మలానీ
జగన్ అరెస్టు జరగదని సీబీఐ కోర్టు స్పష్టంగా చెప్పింది
అయినా సీబీఐ అరెస్టు చేసింది.. ఇది కోర్టు ధిక్కారమే
10 నెలలు జగన్ జోలికే వెళ్లలేదు.. కాంగ్రెస్‌పై పోరాడుతున్నందుకే అరెస్టు
అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించి, వెంటనే బెయిలివ్వాలి
జగన్ అరెస్టుకు తాను చూపిన కారణాలు సరికావని సీబీఐకీ తెలుసు
{పజలు జగన్ పక్షమే.. అందుకే ఉప ఎన్నికల్లో పట్టం కట్టారు
సీబీఐ అధికారులు నిజాయతీగా వ్యవహరించడం లేదన్న జెఠ్మలానీ
దర్యాప్తు సాగుతోంది.. బెయిలివ్వొద్దు: సీబీఐ న్యాయవాది

అమాయకపు ఓటర్ల వల్లే జగన్ గెలిచారు
15 సీట్లు వచ్చినంత మాత్రాన సీఎం అయిపోతారా! : సీబీఐ లాయర్
ఇంకెప్పుడూ అలా అనొద్దు: తీవ్రంగా ఆక్షేపించిన న్యాయమూర్తి

అమాయకపు ఓటర్ల కారణంగా జగన్ 15 సీట్లు గెలవగలిగారని విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది అశోక్ భాన్ వ్యాఖ్యానించారు! ‘‘15 అసెంబ్లీ సీట్లు గెలిస్తే వచ్చేదేమీ ఉండదు. ఆ సీట్లతో జగన్ ముఖ్యమంత్రి అయిపోరు’’ అని చెప్పుకొచ్చారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ‘‘ఓటర్లను అమాయకులంటారా..! అలా అనడం సరికాదు. ఇంకెప్పుడూ అలా అనొద్దు..’’ అని న్యాయమూర్తి తీవ్ర స్వరంతో స్పష్టం చేశారు. దాంతో భాన్ వెనక్కు తగ్గారు. 


హైదరాబాద్, న్యూస్‌లైన్:వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ అధికారులు కోర్టును మోసం చేశారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ హైకోర్టుకు నివేదించారు. ‘‘జగన్ అరెస్టు జరగదని సీబీఐ అధికారులు దాఖలు చేసిన కౌంటర్ ఆధారంగానే సీబీఐ కోర్టు చెప్పింది. అయినప్పటికీ వారు ఆయనను అరెస్టు చేశారు. ఇది కోర్టు ధిక్కారమే’’ అంటూ వివరించారు. 

‘‘జగన్ ఉధృతంగా ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో, తమ ముందు హాజరు కావాలంటూ ఆయనకు సీబీఐ అధికారులు నోటీసు జారీ చేశారు. దాంతో సీబీఐ తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నుతోందనే అనుమానంతో సీబీఐ కోర్టులో జగన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారించిన సీబీఐ కోర్టు.. తాము సమన్లు జారీ చేసినందున అరెస్టు జరగదని జగన్‌కు స్పష్టం చేసింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ఆధారంగానే ఆ మేరకు చెప్పింది’’ అంటూ ఆయన గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ అధికారులు నిజాయతీగా వ్యవహరించడం లేదని జెఠ్మలానీ ఆరోపించారు.

‘‘జగన్ అరెస్టు విషయంలో వారికి కుట్రపూరిత, దురుద్దేశాలే గనక లేకుంటే నేరుగా సీబీఐ కోర్టుకు వెళ్లి, ‘జగన్‌ను అరెస్టు చేస్తున్నాం, సమన్లను వెనక్కు తీసుకోండి’ అని కోరేవారు. కానీ సీబీఐ అలా చేయలేదు’’ అని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జగన్ విషయంలో సీబీఐ వైఖరేమిటో దీన్నిబట్టే స్పష్టమైపోయిందన్నారు. ‘‘హైకోర్టు ఆదేశాల మేరకు 2011 ఆగస్టు 17న సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి మే 27వ తేదీ దాకా జగన్‌ను ఏనాడూ పిలిపించడం గానీ, ప్రశ్నించడం గానీ చేయలేదు. దాదాపు పది నెలలుగా అవసరం లేని వ్యక్తితో హఠాత్తుగా ఏం అవసరమొచ్చి అరెస్టు చేశారు?’’ అని ప్రశ్నించారు. 

జగన్‌ను అరెస్టు చేయకుంటే మిన్నువిరిగి మీద పడేదా అంటూ నిలదీశారు. పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. న్యాయమూర్తి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు బుధవారం ఈ వ్యాజ్యాన్ని విచారించారు. జగన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాంజఠ్మలానీ, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్ భాన్ వాదించారు.

తొలుత జెఠ్మలానీ వాదిస్తూ జగన్ విషయంలో సీబీఐ అధికారులు అనురిస్తున్న వైఖరిని ఎండగట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో దురదృష్టకర పరిస్థితుల్లో దుర్మరణం పాలైనప్పటి నుంచి జగన్‌కు కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. ‘‘హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ, ఇప్పటికి మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇంకా కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. దర్యాప్తు చేస్తున్నంత కాలం సీబీఐ అధికారులు ఒక్కసారి కూడా జగన్ జోలికి వెళ్లలేదు. ఆయన కాంగ్రెస్‌ను వీడి సొంతంగా పార్టీ పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీపై రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. ఈ కారణంతో పాటు, జగన్‌కు ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న మద్దతును దృష్టిలో పెట్టుకునే ఆయనను అరెస్టు చేశారు. 

ఇటీవల 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 15 స్థానాలను జగన్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రజలు జగన్ వైపే ఉన్నారని చెప్పేందుకు ఇంతకంటే రుజువేం కావాలి? సీబీఐ నోటీసులను గౌరవిస్తూ మే 25, 26, 27 తేదీల్లో జగన్ సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. విచారణకు పూర్తిగా సహకరించారు. అయినప్పటికీ మే 27 సాయంత్రం ఆయనను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు’’ అని వివరించారు. అరెస్టు జరగదని అంతకు ముందే జగన్‌కు సీబీఐ కోర్టు స్పష్టంగా చెప్పిందని ఆయన మరోసారి హైకోర్టుకు గుర్తు చేశారు. జగన్ అరెస్టుకు సీబీఐ అధికారులు చూపిన కారణాలు ఎంతమాత్రమూ సరైనవి కావని, ఆ విషయం వారికి కూడా తెలుసని అన్నారు. కాబట్టి జగన్ అరెస్టును చట్టవిరుద్ధంగా ప్రకటించి ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. జగన్‌పై పదేపదే మనీ లాండరింగ్ ఆరోపణలు చేస్తున్న సీబీఐ అధికారులు, ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా చూపలేదన్నారు. 

‘‘ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడం ఏమాత్రమూ సరికాదు. సీబీఐ అధికారులు ఇప్పటిదాకా దాఖలు చేసిన కౌంటర్లలో ఒక్కసారి కూడా వారి ఆరోపణలకు ఆధారాలను కోర్టు ముందుంచలేదు. అలాంటి కౌంటర్లను అసలు పరిగణనలోకే తీసుకోరాదు. ఈ విషయాన్ని మీ తీర్పులో స్పష్టంగా రాయాలి’’ అని న్యాయమూర్తిని జెఠ్మలానీ కోరారు.

వాటాల ఊసు సీబీఐకేల?!

వాటా విలువను పెంచి చూపారంటూ జగన్‌పై సీబీఐ చేస్తున్న ఆరోపణలపై జెఠ్మలానీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘‘వ్యాపార సూత్రాల ప్రకారం ఎవరైనా వాటా విలువ పెంచుతారు. వాటిని ఎంతకు కొనాలనేది కొనుగోలుదారు నిర్ణయించుకుంటాడు. ఇందులో సీబీఐకి ఉన్న అభ్యంతరం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ పాత్ర నామమాత్రమన్న విషయం సీబీఐ అధికారులకు కూడా తెలుసు. అయినప్పటికీ వారు అరిగిపోయిన రికార్డులా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. దర్యాప్తు అధికారాల కంటే న్యాయవ్యవస్థ అధికారాలే మిన్న అనే విషయాన్ని సీబీఐ అధికారులు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. వారు చెప్పినట్టే న్యాయస్థానాలు నడుచుకోవాలని భావిస్తున్నారు. 

జగన్‌కు బెయిలిస్తే ఎవరినో ప్రభావితం చేస్తారని చెబుతున్నారు. కానీ పది నెలల కాలంలో ఆయన ఎవరిని ప్రభావితం చేశారో ఒక్కసారి కూడా చెప్పలేదు. వాస్తవానికి సెక్షన్ 161 కింద వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తులు సీబీఐ అధికారుల బలవంతం మీద వాంగ్మూలం ఇచ్చి ఉండవచ్చు. తరవాత వాస్తవాలను తెలుసుకుని, సెక్షన్ 164 కింద వాంగ్మూలమిచ్చేందుకు నిరాకరించి ఉండొచ్చు. ఇందుకు జగన్‌ను బాధ్యుడిని చేయడం ఎంతమాత్రమూ సరికాదు. 

ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ అధికారులు పదేపదే చేస్తున్న వాదన కూడా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం. ఆర్థిక నేరాల కేసులూ మిగతా కేసుల్లాంటివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది’’ అంటూ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అరోపణలు చేయడాన్ని సీబీఐ ఒక అలవాటుగా మార్చుకుందని దుయ్యబట్టారు. అయితే వాటికి ఎలాంటి ఆధారాలనూ చూపకుండా తప్పించుకుంటోందని ఆక్షేపించారు. న్యాయస్థానాలు దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోర్టును కోరారు.

నేడు తదుపరి వాదనలు..

దర్యాప్తు కీలక దశలో ఉన్నందున జగన్‌కు బెయిల్ ఇవ్వొద్దని అశోక్ భాన్ కోర్టును అభ్యర్థించారు. ‘‘జగన్ తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారు. కొన్ని కంపెనీలకు, వ్యక్తులకు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చి.. అందుకు ప్రతిఫలంగా వారి నుంచి తన కంపెనీల్లోకి భారీగా పెట్టుబడులొచ్చేలా చేశారు. తద్వారా ఖజానాకు, ప్రజలకు రూ.43 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది’’ అని చెప్పుకొచ్చారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘నష్టం వాటిల్లింది ఖజానాకా, ప్రజలకా?’ అని ప్రశ్నించారు. 

ఖజానాకేననంటూ చార్జిషీట్‌లోని అంశాలను భాన్ చదివి వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు జగనేనన్నారు. ‘‘దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీ సిమెంట్స్‌లో ఓ ఫ్రాన్స్ కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఆ వివరాలను రాబడుతున్నాం. వాన్‌పిక్ ఉదంతంలోనూ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది’’ అన్నారు. 

మరో రెండు మూడు విషయాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగే అవకాశాలున్నాయని న్యాయమూర్తి ప్రశ్నకు బదులుగా ఆయన చెప్పారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి వాదనలను గురువారం వింటానని న్యాయమూర్తి పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!