YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 30 June 2012

ఎగువ రాష్ట్రాల కరుణ ఉంటేనే మన రిజర్వాయర్లు నిండేది

* నారుమళ్లలో తడి లేదు.. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు.. రైతుల్లో ఆశ లేదు 
* వర్షాలున్నప్పుడే నీరివ్వని కర్ణాటక.. వర్షాభావ పరిస్థితుల్లో చుక్క విదల్చడం అనుమానమే
* ఇప్పటి నుంచి భారీగా కుండపోత వర్షాలు కురిస్తే 15 రోజుల్లో ఆలమట్టి నిండే అవకాశం
* ఆలమట్టి నుంచి నారాయణపూర్, జూరాల ద్వారా శ్రీశైలానికి చేరడానికి మరో 10 రోజులు
* భారీ స్థాయిలో వరద నీరు వచ్చినా శ్రీశైలం నిండటానికి కనీసం 20 రోజులు
* శ్రీశైలం నుంచి భారీగా నీరు, అంతర్గత వరదలు వస్తేనే సాగర్ నుంచి పది రోజుల్లో నీరు
* అంటే.. ఇప్పటి నుంచి భారీ వర్షాలు కురిసి, కర్ణాటక కనికరిస్తే నెలన్నరకు సాగు నీరొస్తుంది
* ఇప్పటికే వర్షాలు లేక సాగు విస్తీర్ణంలో 4 లక్షల హెక్టార్లు తగ్గింది..
* వేసిన పంటలకూ అందని సాగు నీరు.. నారుమళ్ల దశలోనే ఎండిపోతున్న వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: నింగి నుంచి చుక్క రాలడంలేదు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులవుతున్నా వర్షాలు లేవు. పొలం తడవక రైతులు విలవిల్లాడుతున్నారు. వేసిన విత్తనాలు మట్టిలో కలిసిపోయాయి. చుక్క నీరొచ్చే దారిలేదు. రాష్ట్రంలోని పంట పొలాలను సస్యశ్యామలం చేసే రిజర్వాయర్లన్నీ అడుగంటాయి. వీటిలోకి నీరు రావాలంటే వరుస వర్షాలు కురవడంతోపాటు ఎగువ రాష్ట్రమైన కర్ణాటక దయతలచాలి. ఓ పక్క పంటల సీజను మొదలైనా, నారుమళ్లకూ నీరు లేదు. ఎగువ రాష్ట్రంలోనూ వర్షాభావం కారణంగా అక్కడి ప్రాజెక్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడే నీటి విడుదలకు ఇబ్బంది పెడుతున్న కర్ణాటక.. ఈ వర్షాభావ పరిస్థితుల్లో కరుణిస్తుందన్నది అనుమానమే. ముందుగా అక్కడి రిజర్వాయర్లన్నీ నిండి, ఆ రాష్ట్రం అవసరాలు తీరిన తర్వాతే.. అదీ ఎక్కువ నీరుంటే తప్ప మనకు చుక్క విదల్చదు. అప్పటివరకు మనకు సాగు నీరు అందదు. దీనికి చాలా సమయం పడుతుంది. ఈలోగా తమ గతేమిటన్న ఆందోళన రైతుల్లో నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రాజెక్టుల్లోకి నీరు రావాలంటే భారీ వర్షాలే ఆధారం.

ఖాళీగా రిజర్వాయర్లు 
రాష్ర్టంలోని రిజర్వాయర్లన్నీ ఇప్పటికే ఖాళీ అయ్యాయి. గత ఏడాది రెండో సీజన్‌లో వర్షాలు కురవకపోవడంతో వీటిలో నీరు అడుగంటింది. ఎగువ రాష్ర్టంలోని ఆలమట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లతో పాటు మన రాష్ర్టంలోని జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌లలో నీరు లేదు. ఆలమట్టిలో గత ఏడాది ఈ సమయంలో 55 టిఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 15 టీఎంసీలు మాత్రమే ఉంది. నాగార్జున సాగర్‌లో గత ఏడాది ఈ సమయానికి 314 టీఎంసీలు నీరు ఉండగా ప్రస్తుతం 133 టీఎంసీలే ఉంది. గత ఏడాది ఇప్పటికే కృష్ణా నదిలోకి రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం మొదలయింది. ఈ ఏడాది ఇప్పటివరకు చుక్క నీరు రావడంలేదు. దీంతో వరి సాగు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా డెల్టా ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే నీటి కొరత కారణంగా నారుమళ్లకు మాత్రం కొద్దిపాటి నీరు విడుదల చేయాలని నిర్ణయించారు.

వర్షాలు లేక ఎండుతున్న పంటలు 
ఈ ఏడాది రుతుపవనాలు మొదలై నెల కావస్తున్నా, ఇప్పటికీ సరైన వర్షాలు కురవడంలేదు. సుమారు 20 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 77 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. కృష్ణా, గుంటూరు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతమే నెలకొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం, నె ల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కురిసిన వర్షాలు కూడా పంటలకు ఏమాత్రం అనువుగా లేవు. సరిపడినంత వర్షం లేకపోవడంతో వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. 

సాధారణంగా రాష్ట్రంలో ఈ సమయానికి 16 లక్షల హెక్టార్లలో (40 లక్షల ఎకరాలు) పంటలు సాగులోకి వస్తాయి. అయితే, ఇప్పటివరకు 12 లక్షల హెక్టార్ల (30 లక్షల ఎకరాల) విస్తీర్ణంలో మాత్రమే సాగవుతున్నాయి. అంటే 4 లక్షల హెక్టార్ల (10 లక్షల ఎకరాల) విస్తీర్ణం పడిపోయింది. ముఖ్యంగా వరి, జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి పంటలపై వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ సమయానికి 2.25 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కావాల్సి ఉండగా 80 వేల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. రాయలసీమలో వర్షాధారంగా వేరుశనగ పంట విస్తారంగా వేస్తారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 19 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం ఈ జిల్లాలో వేసిన వేరుశనగ పంట విస్తీర్ణం 37 వేల ఎకరాలు మాత్రమే. దీన్నిబట్టే పరిస్థితి తీవ్రతను అంచనా వేయవచ్చు. 

తెలంగాణ జిల్లాల్లో వర్షాధారంగా పత్తి పంట ఎక్కువ సాగు చేస్తారు. ఇప్పటికే 6.54 లక్షల హెక్టార్ల (16 లక్షల ఎకరాలు)లో పత్తి వేశారు. విత్తనాలు నాటిన తర్వాత వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో మొలకెత్తలేదు. మొలిచిన ప్రాంతాల్లో కూడా ఎండిపోయే ప్రమాదం నెలకొంది. బీటీ పత్తి విత్తనాల కొరత కారణంగా రైతులు ఎక్కువ ధర చెల్లించి బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేశారు. దుక్కిలోనే ఎరువులూ వేశారు. వర్షాలు లేకపోవడంతో ఈ పెట్టుబడి అంతా వృథా అవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఎకరం పత్తి పంట సాగుకు అయ్యే ఖర్చు రూ.25 వేలు. దీనిప్రకారం చూస్తే వర్షాభావం వల్ల పత్తి రైతులకు సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రంలో మిగతా పంటలదీ ఇదే దుస్థితి.

కర్ణాటకపై ఒత్తిడి పెంచాలి.. పరిష్కారమిదే..
భారీ వర్షాలు కురిసి, ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండి, వాటి అవసరాలు తీరిన తర్వాత వరద నీరు ఉంటే మనకు వదులుతున్నారు. ఈ నీరు వచ్చేసరికి రాష్ట్రంలో పంటలు దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కూడా ఆలమట్టి డ్యాం నిండిన తర్వాతే దిగువకు నీటిని విడుదల చేస్తామని కర్ణాటక పట్టుపడితే.. మనకు పెద్ద దెబ్బే. ఈ సమస్యకు పరిష్కారమేమిటి? వర్షాలు వచ్చి ప్రాజెక్టుల్లోకి వరద నీరు రావడం మొదలైన వెంటనే ఎగువ ప్రాజెక్టుల నుంచి మన రాష్ట్ర వాటా నీటిని విడుదల చేయడం. ఇందుకోసం కర్ణాటకపై ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది. 

ఈ విషయంపైనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందునుంచీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఎగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి చేరే నీటిలో మనకు రావాల్సిన వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ విధానం అమలులోకి వస్తే మన వాటా నీరు ఎప్పటికప్పుడు మనకు అందుతుంది. దీనివల్ల రాష్ట్రంలోని పంటలకు సకాలంలో నీరందుతుంది. అయితే, ఈ విధానం సాధనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నం లేకపోవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతినే దుస్థితి నెలకొంటోంది.

మన రిజర్వాయర్లు నిండాలంటే...
కృష్ణా బేసిన్‌లో సుమారు వెయ్యి టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం గల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పూర్తిస్థాయిలో నిండాలంటే వరుసగా కుండపోత వర్షాలు కురవాలి. సుమారు 11 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం 24 గంటలపాటు ప్రాజెక్టులోకి వస్తేఒక్క టీఎంసీ నీరు చేరుతుంది. అంటే ఒక రోజుపాటు లక్షా పది వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటే 10 టీఎంసీలు వస్తుంది. ఇలా మూడు నెలలపాటు వరద నీరు వ స్తే తప్ప అన్ని ప్రాజెక్టులూ నిండవు. నెల రోజుల్లో ఇవి నిండాలంటే రోజుకు 3 నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదవ్వాలి. 

ఈ స్థాయి వరద రావాలంటే ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా మన రాష్ర్టంలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవాల్సి ఉంటుంది. 2009 స్థాయిలో భారీ వరదలు వస్తే రిజర్వాయర్లు పది రోజుల్లో నిండుతాయని అధికారులు చెబుతున్నారు. 2009 అక్టోబరు మొదటి వారంలో రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 20 నుంచి 22 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దాంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయితే.., ప్రస్తుతం ఇందులో సగం వరద అంటే 10 లక్షల క్యూసెక్కులు పది రోజులపాటు వస్తే రిజర్వాయర్లు నిండటానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అధికారులతో మంత్రి కన్నా సమీక్ష 
ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ వర్షాలు రావడం ఆలస్యమైనప్పటికీ.. అందుకు తగిన ప్రత్యామ్నాయ పంటల సాగుకు వీలుగా కంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఆయన వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి, కమిషనర్ కె.మధుసూదనరావు, ఏపీ సీడ్స్ ఎండీ సుధాకర్‌రావులతో సమీక్ష జరిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం విత్తనాలను కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించారు. 

ఆలమట్టి నిండితే నెలన్నరకు పంటలకు నీరు!
కర్ణాటకలోని ఆలమట్టి డ్యాం పూర్తిగా నిండి, ఆ రాష్ట్రం మనకు నీరు వదిలితే ఆ తర్వాత పంట పొలాలకు నీరందడానికి కనీసం నెలన్నర పడుతుంది. ఆలమట్టి జలాశయం నిల్వ సామర్ధ్యం 123 టీఎంసీలు. అయితే, కర్ణాటక రాష్ట్రం ఈ రిజర్వాయర్ పూర్తిగా నిండితే తప్ప కిందకు నీరు వదలదు. ప్రస్తుతం ఆలమట్టి డ్యాంలో 15.243 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. ఇది డెడ్ స్టోరేజి స్థాయికంటే రెండు టీఎంసీలు తక్కువ. అంటే ఈ డ్యాంలో నీరు లేనట్టే లెక్క. ప్రస్తుతం కర్ణాటకలోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడంలేదు. ఇప్పటి నుంచయినా భారీగా కుండపోత వర్షాలు కురిస్తే ఆలమట్టి నిండటానికి దాదాపు 15 రోజులు పడుతుంది. అది నిండిన తర్వాత కిందికి వదిలిన నీరు ఒక రోజుకు నారాయణపూర్‌కు చేరుతుంది. 

నారాయణపూర్ సామర్ధ్యం 37.64 టీఎంసీలు. ఆలమట్టి నుంచి నీరు ఎక్కువగా వదిలితే నారాయణపూర్ నుంచి వెంటనే నీరు వదిలేస్తారు. అక్కడి నుంచి జూరాలకు వస్తుంది. జూరాల సామర్ధ్యం 11.94 టీఎంసీలే అయినందున అక్కడా నీరు నిల్వ ఉండదు. జూరాల నుంచి శ్రీశైలానికి నీరు రావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ సామర్థ్యం 263.63 టీఎంసీలు. భారీ స్థాయిలో వరద నీరు వచ్చినా శ్రీశైలం నిండటానికి కనీసం 20 రోజులు పడుతుంది. 

శ్రీశైలం నుంచి నీటిని వదిలితే నాగార్జున సాగర్‌కు 24 గంటల్లో చేరుతుంది. శ్రీశైలం నుంచి భారీ మొత్తంలో నీటిని వదలడంతోపాటు పరీవాహక ప్రాంతం నుంచి వరద నీరు వస్తే సాగర్ నుంచి వారం పది రోజుల్లో నీటిని సాగర్ కాలువలతోపాటు, కృష్ణా బ్యారేజీకి వదిలే అవకాశాలుంటాయని అంచనా. అంటే.. ఇప్పటి నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిస్తే, కనీసం మరో 45 రోజలకుగాని రాష్ట్రంలోని పంట పొలాలకు నీరు వచ్చే అవకాశాలుండవు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!