YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 28 June 2012

వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎందుకున్నారంటూ బూతులు తిట్టడమే కాకుండా, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రై వర్ కేసునూ.....

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసి కొందరు పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన నేతలు రవీంద్ర నాయక్, కె.కె.మహేందర్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, వెల్లాల రామ్మోహన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు ముందు, తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరును బాజిరెడ్డి గోవర్ధన్ ఎండగట్టారు. 

‘‘రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది క్రియాశీల కార్యకర్తలను మే 27న అప్పటి ఏసీపీ రామచంద్రరావు 30 మంది పోలీసులతో దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నప్పటికీ వారు ప్రవర్తించిన తీరు చాలా అమానుషంగా ఉంది. ఏసీపీ 9 మంది కార్యకర్తల బట్టలూడదీసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎందుకున్నారంటూ బూతులు తిట్టడమే కాకుండా, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన డ్రై వర్ కేసునూ వారిపై మోపారు. కానీ బస్సు ప్రమాదానికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు సంబంధంలేదని ఐపీఎస్ అధికారి విజయ్‌రావు బహిర్గతం చేసినప్పటికీ ఏసీపీ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ నేతలను అకారణంగా రిమాండ్‌కు పంపించారు’’ అని దుయ్యబట్టారు. 

ఏసీపీ రామచంద్రరావు లాంటి వ్యక్తుల వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. అంతేకాదు ‘‘ఎక్కడో ఎల్బీనగర్‌లో బస్సులు దగ్ధం అయితే సనత్‌నగర్‌లో ఉండే సేవాదళం నగర కన్వీనర్ వెల్లాల రామ్మోహన్‌కు ముడిపెట్టారు. లీటర్ పెట్రోల్‌తో వంద బస్సుల దగ ్ధం అంటూ నమ్మశక్యంగా లేని విధంగా కట్టుకథ అల్లారు. స్వయంగా సైబరాబాద్ కమిషనర్ రంగంలోకి దిగి రామ్మోహన్‌ను చిత్రహింసలకు గురిచేసి పొంతన లేని విధంగా వాంగ్మూలం చెప్పించుకొని ‘యూట్యూబ్’లో పెట్టించారు. రామ్మోహన్‌ను మియాపూర్ వద్ద అరెస్టు చేశామని ప్రెస్‌మీట్‌లో చెప్పి, రిమాండ్ రిపోర్టులో మాత్రం ఇంట్లో అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఇలా పోలీసులు పొంతనలేని విధంగా ప్రవర్తిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారు’’ అని బాజిరెడ్డి ధ్వజమెత్తారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసులు చేసిన అక్రమ అరెస్టు, వేధింపులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను అశ్రయిస్తామన్నారు. నిబంధనలు తుంగలో తొక్కిన పోలీసులను కోర్టులకు ఈడుస్తామని గోవర్ధన్ చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!