
తిరుపతి,న్యూస్‌లైన్:తిరుపతిని మద్యరహిత నగరంగా ప్రకటించాలంటూ నాలుగు రోజులుగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకుని రుయా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసు బలగాలతో శిబిరం వద్దకు చేరుకున్నారు. కరుణాకరరెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
వారిని కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఆరోగ్యం బాగాలేదని, అర్ధరాత్రి సమయంలో కదిలించవద్దని వాగ్వాదానికి దిగారు. దీక్షాప్రాంగణంలో నాయకులు, కార్యకర్తలు పరిమితసంఖ్యలో ఉన్న సమయంలో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి దీక్షను భగ్నం చేసి, రుయా ఆస్పత్రికి తరలించారు. దీక్ష శిబిరం వద్ద ఉన్న కార్యకర్తలు ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి, సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీనితో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది.
బంద్ ప్రశాంతం
అంతకు ముందు భూమన దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన తిరుపతి బంద్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగురోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బాగా నీరసించారు. బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు తమవంతు ప్రయత్నాలు సాగించారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారనే నెపంతో తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో సహా పలువురు కార్యకర్తలను ఉదయం 8 గంటలకే పోలీసులు అరెస్టు చేసి క్రైం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బంద్‌ను పర్యవేక్షిస్తున్న కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. విద్యాసంస్థలు, బ్యాంకులు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. పలువురు ఉద్యోగులు సైతం దీక్షకు మద్దతు ప్రకటించారు. పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, నాయకుడు ఓవీ.రమణ తదితరులు మోటార్ సైకిళ్లలో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు.
No comments:
Post a Comment