YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 29 June 2012

కొన్ని సాగునీటి ప్రాజెక్టుల రద్దుకు యోచన

మధ్యంతర మదింపు పేరిట మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
వైఎస్ మరణానంతరం అనేక ప్రాజెక్టులను పక్కనబెట్టిన ప్రభుత్వం
తాజాగా జీవో నంబర్ 1ను అమలు చేసే యత్నం
రద్దు జాబితాలో దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, 
కంతనపల్లి ప్రాజెక్టులు!

హైదరాబాద్, న్యూస్‌లైన్: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో కొన్నింటిని రద్దు చేసే దిశలో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే నిర్మాణాలపై నిరాసక్త వైఖరిని అవలంబిస్తోన్న సర్కార్... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల మధ్యంతర మదింపు పేరిట మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేశ్‌లు సభ్యులుగా ఉన్నారు. 

జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 86 ప్రాజెక్టులను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మొత్తం సుమారు 20 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించారు. వైఎస్ మరణానంతరం ప్రాజెక్టులను పట్టించుకునేవారే కరువయ్యారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాధాన్యత పేరిట ప్రాజెక్టులను విభజించారు. దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వంటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఆయా ప్రాజెక్టుల నిర్మాణ దశలపై మధ్యంతర నివేదికను అందించాలని ఆదేశించారు. అందులో భాగంగా గతంలో జీవో నంబర్-1 పేరిట ఉత్తర్వులను జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఇప్పటికీ నిర్మాణాలను మొదలు పెట్టని ప్రాజెక్టులను రద్దు చేయాల్సి ఉంటుంది. అలాగే మధ్యలోనే పనులు నిలిచిపోయిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలా ? లేక నిలుపుదల చేయాలా ? అనే విషయంపై అధికారులు స్పష్టమైన నివేదికలను అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైఖరి నేపథ్యంలో ప్రాజెక్టుల పనులను కొనసాగించడానికి కాంట్రాక్టర్లుకూడా వెనుకంజ వేస్తున్నారు. 

ముఖ్యంగా ధరలు భారీగా పెరిగినందున పాత ధరలతో తాము పనులను చేయలేకపోతున్నామని చెప్తున్నారు. పెరిగిన ధరలను వర్తింపజేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు పనులను చేయబోమని కూడా స్పష్టం చేశారు. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ప్రాజెక్టుల నిర్మాణ దశలపై ఈ మంత్రుల కమిటీ మధ్యంతర మదింపు నివేదికను ఇవ్వనుంది. అలాగే జీవో నంబర్-1ను కూడా పరిగణనలోకి తీసుకుని తగు సూచనలను చేయనుంది. గతంలో అధికారుల నుంచి నివేదిక కోరిన ప్రభుత్వం.. తాజాగా దీనిపై కేబినెట్ కమిటీని వేయడం కొన్ని ప్రాజెక్టుల రద్దుకే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దు చేయబోయే ప్రాజెక్టుల్లో దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కంతనపల్లి వంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చివరిదశలో ఉన్న ప్రాజెక్టులపైనా చిన్నచూపు

ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాల కోసం సుమారు రూ.70 వేల కోట్లు వ్యయం చేశారు. చాలా ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి. మూడు నాలుగు వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తే...7 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 15 ప్రాజెక్టులను పాక్షికంగా వెంటనే పూర్తి చేయడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుంది. ఇందులో నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, ఎల్లంపల్లి, దేవాదుల, మత్తడివాగు వంటి తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే...వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. కొద్ది మొత్తంలో ఖర్చు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయినా వాటి విషయంలోనూ ఎలాంటి చర్యల్నీ తీసుకోవడం లేదు. పైగా ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

1 comment:

  1. Soon after the death of THE GREAT YSR; the INC, it seems, took a firm decision to ruin the state. This is a part of it as a commencement. They don't leave, before the whole state is brought stand still, like that of earlier one before YSR. They want nothing but power for ruining.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!