YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 30 June 2012

రాష్ట్రం నుంచి ప్రయాణించే పలు రైళ్ల వేళలు ఆదివారం నుంచి మారనున్నాయి.

నేటి నుంచి కొత్త రైల్వే టైమ్‌టేబుల్
దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులోకి 25 కొత్త రైళ్లు
జూలై 6న దురంతో ప్రారంభం
ద.మ.రైల్వే జీఎం వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రం నుంచి ప్రయాణించే పలు రైళ్ల వేళలు ఆదివారం నుంచి మారనున్నాయి. కొన్ని రైళ్లను పొడిగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దశలవారీగా 25 కొత్త రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ జీఎన్ అస్తానా ఈ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్రలతో కూడిన సదరన్ జోన్ రైల్వే టైమ్ టేబుల్‌ను శనివారం రైల్ నిలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైళ్ల వేళల్లో మార్పులు, కొన్ని రైళ్ల పొడిగింపు, నంబర్ల మార్పు, వేగం పెరగనున్న రైళ్లు తదితర అంశాలను వివరించారు. కొత్త రైల్వే టైమ్‌టేబుల్ ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. గత ఏడాది ప్రకటించిన సికింద్రాబాద్-విశాఖ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ జూలై 6వ తేదీన ప్రారంభమవుతుందని అస్తానా తెలిపారు. తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్‌లలో వరల్డ్‌క్లాస్ ప్రమాణాల అభివృద్ధి ఇప్పట్లో లేనట్టేనని పరోక్షంగా చెప్పారు. తగినంత భూమి లభించకపోవడం, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాల వల్ల ఈ స్టేషన్ల అభివృద్ధి జాప్యమవుతోందని చెప్పారు. 

త్వరితగతిన కొత్త రైళ్లు...

గత సంవత్సరానికి భిన్నంగా ఈ ఏడాది వీలైనంత తొందరగా కొత్త రైళ్లను అందుబాటులోకి తేవాలని ఆకాంక్షిస్తున్నట్లు జీఎం చెప్పారు. జూలై 3వ తేదీన తిరుపతి - మున్నార్గుడి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవుతుందని, ఇది వారానికి 3 సార్లు తిరుగుతుందన్నారు. జూలైలోనే సికింద్రాబాద్ - బెల్లంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ - దర్బంగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభమవుతాయన్నారు. కొత్త రైళ్లలో 15 ఎక్స్‌ప్రెస్‌లు దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. మరో 9 ఎక్స్‌ప్రెస్/మెయిల్ సర్వీసులు దక్షిణ మధ్య రైల్వే మీదుగా రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ఇవి కాకుండా ఎర్రగుంట్ల-నోసమ్/నంగనాపల్లి మధ్య ఒక ప్యాసింజర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. షాలిమార్-చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా 3వ తేదీనే అందుబాటులోకి వస్తుంది.

నేటి నుంచి 4 రైళ్ల వేళల్లో మార్పులు

హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (17429) సాయంత్రం 5.25 గంటలకు బదులు మధ్యాహ్నం 3.35 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు బదులు 6.40 గంటలకే తిరుపతి చేరుకుంటుంది.
సికింద్రాబాద్-తిరుపతి (12732) ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 7 గంటలకు బదులు 8.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బదులు 10.35కు తిరుపతికి చేరుకుంటుంది.

తిరుపతి-కొల్హాపూర్ హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రాత్రి 8.30కు బదులు 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం (పాత టైమ్ ప్రకారమే) 4.35 గంటలకు కొల్హాపూర్ చేరుతుంది.

నాందేడ్-గంగానగర్ ఎక్స్‌ప్రెస్ రాత్రి 11.30కు బదులు ఉదయం 11 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరి రెండోరోజు ఉదయం 10.55 గంటలకు బదులు రాత్రి 10-40కి గంగానగర్ చేరుకుంటుంది.

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతున్న గుంతకల్-సికింద్రాబాద్ ప్యాసింజర్ ఇక నుంచి కాచిగూడ నుంచి రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్-బోధన్ ప్యాసింజర్‌ను కూడా కాచిగూడకు పరిమితం చేశారు.

స్వల్పంగా సమయాలు మారిన రైళ్లు (ఈ వేళలు కూడా ఆదివారం నుంచే అమల్లోకి వస్తాయి)
పుణే-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.40 గంటలకు బదులు మధ్యాహ్నం 2.55కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది.

ముంబై-సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 2.15కు బదులు 2.30కు సికింద్రాబాద్ చేరుతుంది.

కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ సాయంత్రం 4.10కి బదులు 3.30కే కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ-కర్నూల్ పాసింజర్ సాయంత్రం 6 గంటలకు బదులు 5.35కు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది.

డోన్-గుంటూరు ప్యాసింజర్ ఉదయం 5.30కు బదులు 6.30కు డోన్ నుంచి బయల్దేరుతుంది. ఇది మధ్యాహ్నం 2.40కి బదులు 3.20కి గుంటూరుకు చేరుతుంది.

రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్ రాత్రి 8.45కు బదులు 9.25కు రేపల్లెలో బయల్దేరుతుంది. ఉదయం 5.05 గంటలకు బదులు 7.55కు సికింద్రాబాద్ చేరుతుంది.

గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ సాయంత్రం 6.05కు బదులు 6.30కు గుంటూరులో బయల్దేరుతుంది. సాయంత్రం 7.10కి బదులు 7.35కు విజయవాడ చేరుతుంది.

త్వరలో ఈ రైళ్ల వేళలు మారతాయి

షాలిమార్ - సికింద్రాబాద్ (22849) ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి షాలిమార్‌లో బుధవారం బయల్దేరి గురువారం సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సెప్టెంబర్ 21 నుంచి సికింద్రాబాద్‌లో ఆదివారానికి బదులు శుక్రవారం బయల్దేరి శనివారం షాలిమార్ చేరుకుంటుంది.

విల్లుపురం-ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సోమవారానికి బదులు మంగళవారం విల్లుపురంలో బయల్దేరుతుంది. ఆగస్టు 21వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ రైలు ఖరగ్‌పూర్‌లో బుధవారానికి బదులు గురువారం బయల్దేరుతుంది.

ఢిల్లీ సరాయ్ రోహిల్లా - యశ్వంత్‌పూర్ (12214) దురంతో ఎక్స్‌ప్రెస్ బుధవారానికి బదులు సోమవారం ఢిల్లీలో బయల్దేరుతుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!