YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 27 June 2012

డబ్బు పాయె.. బినామీలు మిగిలె

వికటించిన సర్కారు మద్యం పాలసీ
గతేడాది టెండర్ల ద్వారా రూ.3450 కోట్ల ఆదాయం
ఇప్పుడు లాటరీ పద్ధతిలో వచ్చింది రూ.1700 కోట్లే
సగం ఆదాయం తగ్గినా బినామీలు యథాతథం
గుదిబండగా మారిన 893 దుకాణాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కొత్త మద్యం విధానం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది. సర్కారు ఉదాసీనతతో డబ్బు పోయింది కానీ బినామీల రాజ్యం మాత్రం పోలేదు. ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం 60 శాతం మంది బినామీలే వచ్చినట్లు తేలింది. గత ఓపెన్ టెండర్ విధానంలో రెండేళ్లకు కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6,900 కోట్ల ఆదాయం వచ్చింది.(ఏడాదికి రూ.3450 కోట్లు) ఈఏడాది లాటరీ పద్ధతి అమల్లోకి తేవడం ద్వారా రూ.900కోట్లు తగ్గినా రూ.2,500 కోట్ల ఆదాయం రావచ్చని మొదట రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా గంపగుత్తగా జనాభాను బట్టిదుకాణాలకు లెసైన్స్ ఫీజు నిర్ణయించడంతో అసలుకే మోసం వచ్చింది. ఖజానాకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే గ్రేటర్‌లోని దుకాణాలను, కార్పొరేషన్ పరిధిలోని దుకాణాలను తీసుకోవడానికి వ్యాపారులు ముందుకు రాలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 893 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా పడలేదు. దీంతో అనుకున్న దానికంటే మరో రూ.700 కోట్ల ఆదాయం తగ్గింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం రూ.1750 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.


వీటికి ఎవరూ రారంట!
లెసైన్స్ ఫీజు భారంతో ఎవరూ తీసుకోకుండా ఎక్సైజ్ శాఖకు గుదిబండలా మారిన మద్యం దుకాణాలను వదిలించుకునేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వీటి కోసం రీ నోటిఫికేషన్ వేసినప్పటికీ దరఖాస్తు చేసుకునేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువే. రూ.64 లక్షల కేటగిరీలో ఒక్క దరఖాస్తు కూడ పడకుండా మిగిలిపోయిన 692 దుకాణాలలో కేవలం 300 నుంచి 350 దుకాణాలు రీ నోటిఫికేషన్ ద్వారా పోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.1.4 కోట్ల క్యాటగిరీలో దరఖాస్తులు పడని దుకాణాలు 199 ఉన్నాయి. మొత్తం కలిసి 550 వరకు దుకాణాలు మళ్లీ మిగిలిపోయే అవకాశం ఉంది. ఇక్కడి దుకాణాలలో పెట్టుబడులు పెడితే గిట్టుబాటు కాదనే ఆలోచనతో లెసైన్స్‌లు తీసుకోవడానికి వ్యాపారులు భయపడుతున్నారు. 


కొన్ని ఏపీబీసీఎల్‌కు... మరికొన్ని డిస్టిలరీలకు..
ఈ నేపథ్యంలో గుదిబండలుగా మారిన దుకాణాలలో కొన్నింటిని ఆంధ్రప్రదేశ్ బ్రూవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్)కు, మరికొన్ని దుకాణాలను డిస్టిలరీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎవరూ కూడా లెసైన్స్ తీసుకోని దుకాణాలను ఏపీబీసీఎల్ ద్వారా నడిపిస్తామని మద్యం పాలసీలో పేర్కొన్నప్పటికీ ఆచరణలో అదిసాధ్యం కాదని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇన్ని దుకాణాలను నడిపించేంత సిబ్బంది ఏపీబీసీఎల్‌కు అందుబాటులో లేదు. కనీసం 100 నుంచి 150 దుకాణాలనైనా ఏపీబీసీఎల్ ద్వారా నడపాలని ఆలోచన చేస్తున్నారు. ఒక్కో దుకాణానికి కనీసం ఒక సూపర్‌వైజర్, ఒక క్యాషియయర్, ఇద్దరు సేల్స్‌మెన్లు కావాలి. ఈ లెక్కన 150 దుకాణాలకు 600 మంది ఉద్యోగులు అవసరం. కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను తీసుకుంటే.. లిక్కర్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుకు భద్రత ఉండదని ఎక్సైజ్ శాఖలో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇతర ప్రభుత్వ శాఖలలోని అదనపు సిబ్బందిని డెప్యూటేషన్‌పై తీసుకోవాలని ఎక్సైజ్ కమిషనర్ సమీర్ శర్మ నిర్ణయించారు. మిగిలిన దుకాణాలను ఏపీబీసీఎల్ ద్వారానే డిస్టలరీలకు అప్పగించేందుకు కసరత్తు నడుస్తోంది.

టెండర్.. వండర్
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రాష్ట్రంలో మద్యం టెండర్ల ప్రక్రి య నేపథ్యంలో పలు ఆసక్తికర విశేషాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 320 షాపులకు 5,967 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.25వేలు వంతున రూ 14.92 కోట్లు ఆదాయం సమకూరింది.
ఖమ్మంలోని ఒక మద్యం షాపునకు గుడ్‌విల్ కోసం రూ.కోటి, ఇన్నోవా కారు ఇస్తామని పాత సిండికేట్‌దారులు ముందుకొచ్చారు.
నెల్లూరు జిల్లాలో మద్యం షాపుల లాటరీ తెల్లవారుజామున 5 గంటలకు ముగిసింది.
నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డి పేట లోని ఓ షాపునకు ఓ కాంగ్రెస్ నేత తన బంధుమిత్రులు 50 మందితో దరఖాస్తు చేయించినా వారిని వరించని అదృష్టం ఒకే ఒక దరఖాస్తు చేసుకున్న వారిని వరించింది.
వరంగల్ జిల్లాలో 300 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అదృష్టం వరించింది కేవలం 12మందినే.
శ్రీకాకుళం జిల్లా రణస్ధలానికి చెందిన ఓ సంఘసేవకుడు గతంలో మాదిరిగానే పలు దుకాణాలను కైవసం చేసుకున్నారు.
గత ఆబ్కారీ సంవత్సరంలో రూ .2.19 కోట్లు పలికిన తిరుపతిలోని తికమక వైన్స్ లెసైన్సు ఈసారి ఏడాదికి రూ .46 లక్షలకే దక్కింది. ఈ షాపు కోసం రూ.40 నుంచి 50 లక్షల గుడ్‌విల్ రాయబారం జరుగుతోంది. భక్తుల తాకిడి అధికంగా ఉండే బోయకొండలోని మద్యం దుకాణానికి గతేడాది రూ 1.36 కోట్ల ధర పలుకగా, ఈసారి రూ.32.5 లక్షలకే దుకాణం దక్కింది.
పలమనేరులో సిండికేట్ల ఆశలకు గండికొడుతూ సహకార శాఖలోని సూపర్‌బజార్ మద్యం వ్యాపారంలోకి దిగి ఒక షాపు దక్కించుకుంది. సహకార సూపర్ బజార్ మద్యం వ్యాపారంలోకి దిగడం బహుశా రాష్ట్రంలో ఇదే ప్రథమమని అధికారులు అంటున్నారు.
విజయనగరం జిల్లాలో మద్యం సిండికేట్లు మళ్లీ పాత పథకాన్నే అమలు చేసి తమ వద్ద పనిచేసేవారి పేరిట దుకాణాలను దక్కించుకున్నారు. సాలూరు నియోజకవర్గం మక్కువలోని ఓ దుకాణాన్ని బొత్స రామకృష్ణ దక్కించుకున్నారు. ఈయన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు వద్ద పని చేస్తున్నాడు.
ఆలుమగలకు లక్కీచాన్స్: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు వాగె లక్ష్మిదేవి, వాగె వెంకటేశ్వరరావులకు డ్రాలో చెరో షాపు దక్కాయి.
మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో డిగ్రీ విద్యా ర్థి టి. రామకృష్ణ, ఇంటర్ విద్యార్ధి పూనెం రామకృష్ణ, బిఇడి విద్యార్థిని శశిరేఖ, ఇంటర్ విద్యార్థిని రాధిక మద్యంషాపులు దక్కించుకున్నారు.

ఆగ్రహించినగృహలక్ష్ములు
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఆబ్కారీ విధానంపై మహిళామణులంతా ఆగ్రహోదగ్రులవుతున్నారు. బారులు తీరనున్న బార్లు తమ కాపురాల్లో చిచ్చు పెడతాయంటూ చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ, గృహలక్ష్మి మ్యాక్స్ సొసైటీలు విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన నిలువెత్తు ఫ్లెక్సీ అందర్నీ ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తోంది.
- న్యూస్‌లైన్, విశాఖపట్నం

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!