YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 26 June 2012

జేడీ కాల్స్‌పై దర్యాప్తు చేయండి. డీజీపీకి విజయమ్మ ఫిర్యాదు

జేడీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
హైకోర్టులో వేసిన పిల్ నుంచి 
కాల్స్ బిల్లింగ్ లిస్ట్ తీసుకున్నాం
జగన్‌పై కుట్ర బయటపడింది
అప్పుడే చంద్రబాల ఉదంతం 
కూడా వెలుగులోకి వచ్చింది
చంద్రబాలను కించపరిచే ఉద్దేశం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలని డీజీపీ వి.దినేశ్‌రెడ్డిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. ఈ మేరకు డీజీపీకి ఆమె ఒక ఫిర్యాదు రాశారు. ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎం.సుచరిత, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం డీజీపీని కలిసి దాన్ని అందజేశారు. అనంతరం ఫిర్యాదు వివరాలను మీడియాకు విడుదల చేశారు. సీబీఐ జేడీ ఒక వర్గం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఫోన్ కాల్ వివరాలపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని ఫిర్యాదులో కోరారు. ‘‘సీబీఐ ఫోన్ కాల్స్‌కు సంబంధించిన మొత్తం అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి. దాంట్లో భాగంగా ఆ కాల్ లిస్టును బయట పెట్టిన సోర్స్‌కు సంబంధించి కూడా దర్యాప్తు జరిపినా అభ్యంతరం లేదు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఒక పారిశ్రామికవేత్త సీబీఐ జేడీ ఫోన్ కాల్ లిస్టును కోర్టుకు సమర్పించారు. ఆ పిటిషన్ ఆధారంగా దాన్ని సేకరించాం’’ అని ఫిర్యాదులో స్పష్టం చేశారు.

పారిశ్రామికవేత్త హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు ఫోన్ కాల్ డేటా వివరాలను కూడా డీజీపీకి అందజేసినట్లు సుచరిత, పద్మ వెల్లడించారు. సదరు ఫోన్ కాల్ డేటాతో పాటు సవివరమైన బిల్లింగ్ లిస్టును కూడా విలేకరులకు వారు అందజేశారు. హైకోర్టు పిటిషన్‌లో తీసుకున్న వివరాలతో పాటు కొందరు వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులు కూడా సమాచారం అందించారన్నారు. ‘‘సీబీఐ జేడీ ఒక మహిళతో అత్యధికసార్లు మాట్లాడినట్టు ఆయన ఫోన్‌కాల్స్ బిల్లింగ్ లిస్టులో గుర్తించాం. జేడీ తన అధికారిక నంబర్ ద్వారా ఆమెతో పలుమార్లు మాట్లాడినట్టు బయటపడింది. అదే మహిళ ఫోన్ నుంచి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు కూడా అనేక కాల్స్ వెళ్లినట్టు తేలింది. దాంతో ఆ మహిళ ఫోన్ కాల్స్ వ్యవహారంలో అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో సీబీఐ జేడీ, చంద్రబాల ఫోన్ కాల్స్‌పై సమగ్ర దర్యాప్తు జరపాలని డీజీపీని కోరాం’’ అని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులెవరూ చంద్రబాలను ఎప్పుడూ కించపరచలేదని వారు స్పష్టం చేశారు. మహిళల పట్ల తమకు గౌరవముందన్నారు.

సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా జేడీ లీకులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైనప్పటి నుంచీ లక్ష్మీనారాయణ ఒక పథకం ప్రకారం దర్యాప్తు వివరాలను సంస్థ మాన్యువల్‌కు విరుద్ధంగా ఒక వర్గం మీడియాకు అందిస్తున్నారని ఫిర్యాదులో విజయమ్మ పేర్కొన్నారు. జగన్‌కు వ్యాపార, రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారికి సమాచారం అందిస్తున్నారు. జేడీ ఇచ్చిన ఆ సమాచారం ఆధారంగా ఒక వ ర్గం మీడియా జగన్‌కు వ్యతిరేకంగా అసత్య వార్తా కథనాలను ప్రచురిస్తోంది, ప్రసారం చేస్తోంది. జగన్‌ను ఓ దుర్మార్గునిగా సమాజం ముందు చిత్రించే కుట్ర ఆ మీడియా ద్వారా జరుగుతోంది. ఆయా మీడియాలే తామేదో స్వయంగా విచారణ జరిపి, శిక్షలు వేశామన్న రీతిలో కుట్రపూరిత వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో కూడా ఒక వర్గం మీడియా ప్రతినిధులతో జేడీ మాట్లాడినట్టు డిటైల్డ్ బిల్లింగ్ లిస్టు ద్వారా బయటపడింది. చంద్రబాలతో పాటు మీడియా యజమానులతో కూడా జేడీ అనేకసార్లు మాట్లాడినట్టు తేలింది. దాంతో జగన్‌పై కుట్రపూరితంగా ఏదో జరుగుతోందనే అనుమానాలొచ్చాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి జగన్‌తో పాటు మా కుటుంబం మొత్తాన్నీ అంతమొందించేలా కుట్ర జరుగుతోంది’’ అంటూ ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. జగన్‌ను భద్రత లేని వాహనంలో జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లడాన్ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ భద్రతకు ముప్పు కలిగించేలా కుట్ర జరుగుతోందన్న అనుమానాలు దీంతో బలపడ్డాయన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అవే అనుమానాలను మీడియా ద్వారా వ్యక్తం చేశారన్నారు. సీబీఐ జేడీ విచారణ తీరు, పలువురు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతున్న తీరును బట్టి దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని సామాన్యులు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రత్యేక న్యాయస్థానం జడ్జితో ఆయన పలుమార్లు రహస్యంగా సమావేశమవడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోందని సుచరిత ఈ సందర్భంగా అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!