హైదరాబాద్, న్యూస్‌లైన్:యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ త్వరలో చలో హైదరాబాద్ పేరిట రాజధాని ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం నిర్ణయించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశంలో మొదటగా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అదే విధంగా సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జేడీ లక్ష్మీనారాయణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మరో తీర్మానాన్ని ఆమోదించారు.
అనంతరం రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. రాజీవ్ యువకిరణాల పేరిట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి యువతను మోసగించిన విధానంపై సమావేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌రావు, కార్మిక విభాగం కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment