YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 26 June 2012

జర్నలిస్టుపై కేసు నమోదును ఖండించిన సంఘాలు



హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి సీనియర్ కరస్పాండెంట్ కె. యాదగిరిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. అధికార రహస్యాల చట్టం ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. ‘‘జర్నలిస్టులు తమ వృత్తి నిర్వహణలో భాగంగా పత్రికా విలేకరులు వార్త రాసేందుకు, సమాచారాన్ని సేకరించేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆ సమాచారాన్ని వార్త కోసం లేదా వేరే ప్రయోజనం కోసం వాడారా అన్నది గమనించాల్సిన ప్రధాన అంశం. వృత్తి బాధ్యతల్లో భాగంగా యాదగిరిరెడ్డి చేసిన పనిపై నేరపూరిత కుట్ర నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాచార హక్కు తెచ్చిన చరిత్ర కలిగిన యూపీఏ ప్రభుత్వం ఇలాంటి చర్యలు జరపటం అన్యాయం. ఆ చట్టం వచ్చిన తర్వాత అధికార రహస్యాలకు అర్థమే లేదు. కానీ యాదగిరిరెడ్డిపై పెట్టిన కేసులో అధికార రహస్యాల చట్టాన్ని వాడారు. 18మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న ఒక పార్టీకి అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడిపై నేరారోపణ జరిగి దానిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. ఆ దర్యాప్తుపై ఆ పార్టీ నేతలు దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని, దర్యాప్తు అధికారి తీరుపై ఆరోపణలు చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సాక్షి పత్రిక, టెలివిజన్ ఖాతాలు స్తంభింపచేయాలనే ఆదేశాలతో సీబీఐ వ్యవహరించిన తీరును అంతా చూశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు సైతం ఆపివేసింది. ఆ వ్యవహారాలపై పాత్రికేయులంతా ఆందోళన చేశారు. ఆ కక్షసాధింపునకు కొనసాగింపుగా కేసులు పెట్టడం గర్హనీయం. వికీలీక్స్‌తో ప్రభుత్వ రహస్యాలను బట్టబయలు చేసిన జూలియన్ అసాంజేపై సైతం నేరారోపణ చేయడమే కాకుండా అరెస్టు యత్నం చేశారు. దేశంలోనూ ‘తెహల్కా’ బయటపెట్టిన అంశాల నేపథ్యంలో ఆ పత్రికను ఇబ్బందులు పెట్టడమే కాకుండా దాని పాత్రికేయులను అరెస్టు చేశారు. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్ గోడలు దాటుకొని అక్కడి రహస్యాలు బయట ప్రపంచానికి వెల్లడించిన ఒక చానల్‌ను అంతా ప్రశంసించాం. పై చర్యలన్నీ వృత్తిలో భాగమే. పాత్రికేయుడిగా సమాచారం సేకరించడాన్ని అడ్డుకున్నా... ఆ క్రమంలో కేసులు పెట్టినా సహించేది లేదు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని తెలిపారు.

అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే
‘‘సీబీఐ జేడీ కాల్ లిస్టును వెలుగులోకి తీసుకొచ్చారన్న అభియోగంతో ‘సాక్షి’ జర్నలిస్టుపై కేసు నమోదు చేయడం సమంజసం కాదు. అధికార రహస్యాల పేరుతో తమ అవినీతి, అక్రమాలను ప్రభుత్వ పాలకులు కప్పి పుచ్చుకోవడానికి ఆ అధికార రహస్యాల చట్టం ఉపయోగపడుతోంది. బ్రిటిష్ హయాంలో రూపొందించిన చట్టాన్ని ఈ ప్రభుత్వాలు స్వాతంత్య్రం వచ్చాక కూడా అమలు చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్న పక్షాలే అధికారంలోకి వచ్చాక.. ఆ చట్టాన్ని రక్షించడానికి పూనుకుంటున్నాయి. తెహల్కా జర్నలిస్టులు.. రక్షణ శాఖ కుంభకోణం బయటపెట్టారు. రాష్ట్రంలో అధికారపక్షం.. అధికార రహస్యాల పేరుతో ఆ జర్నలిస్టులను వేధిస్తోంది’’
-కె. శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ

కేసు ఎత్తివేయాలి 
సమాచార విస్ఫోటనం చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాలం చెల్లిన చట్టాల కింద కేసుల్ని నమోదు చేసి జర్నలిస్టుల్ని వేధించాలని చూడడం అన్యాయం, అక్రమం. అధికార రహస్యాలను చట్టవిరుద్ధంగా సంపాదించారనే సాకుతో సాక్షి దినపత్రిక సీనియర్ పాత్రికేయుడు కె.యాదగిరిరెడ్డిపై పోలీసులు కేసు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసును తక్షణమే ఎత్తివేయాలి. రాజకీయ లక్ష్యాలు, తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీడియాపై అక్రమ కేసుల్ని బనాయించడం తగదు.
-హష్మీ, ఆంజనేయులు, ఏపీడబ్ల్యూజేఎఫ్‌అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!