న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రైతు సంక్షేమాన్ని విస్మరించిన సర్కారు తీరును నిరసిస్తూ, అన్నదాతకు అండగా నిలుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇన్‌పుట్ సబ్సిడీని తక్షణమే పంపిణీ చేయాలని, నాణ్యమైన విత్తనాలను అందించాలని, వాతావరణ బీమా స్థానంలో సవరించిన పంటల బీమా పథకాన్ని వేరుశనగ పంటకు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
కొన్నిచోట్ల మానవహారంగా ఏర్పడి రైతు సమస్యలపై ఎలుగెత్తారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి ర్యాలీలు నిర్వహించారు. విశాఖనగరంలో కలెక్టరేట్ ఎదుట మూడుగంటల పాటు ధర్నా చేపట్టారు. పాయకరావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతులు ఎరువుల బస్తాలతో ఆందోళనలో పాల్గొన్నారు.పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో జరిగిన రైతు ధర్నాలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కలెక్టరేట్ వద్ద మూడుగంటల పాటుధర్నా సాగింది. అనంతరం పార్టీనేతలు అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్న కలెక్టరేట్ సమావేశపు హాలులోకి వెళ్లగా, ఉన్నతాధికారులు ఎవరూ ఈ సమావేశంలో లేరు. కలెక్టర్, జేసీతో పాటు వ్యవసాయ శాఖ జేడీ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రజావాణికి గైర్హాజరవ్వడాన్ని నిరసిస్తూ ఆ సమావేశపు హాలులోనే కొద్దిసేపు బైఠాయించారు. కృష్ణాడెల్టాకు సాగునీటిని విడుదల చేసే వరకూ ఉద్యమిస్తామని నేతలు ప్రకటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎడాపెడా విద్యుత్ కోతల వల్ల ఎండి న వేరుశనగ పంటతో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ అనిత రాజేంద్రకు వినతిపత్రం సమర్పించారు. మాచర్లలో పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో సత్తెనపల్లి తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, పులివెందులలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో రైతులు రోడ్డుపై గంటన్నరసేపు బైఠాయించారు. అనంతపురంలో కలెక్టర్ వి.దుర్గాదాస్‌కు రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు రోజా నాయకత్వంలో భారీ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా విజయపురం మండలం ఇల్లత్తూరుకు చెందిన దాదాపు 300 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారుు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీధర్నాలు చేపట్టారు. వేములవాడలో 250 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. బాన్సువాడలో బోధన్ - హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో డిచ్‌పల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ముట్టడించారు. సంగారెడ్డిలో ధర్నా చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో రాస్తారోకో చేపట్టిన అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న వైఎస్ విగ్రహానికి వినతి పత్రం అందించి క్షీరాభిషేకం చేశారు.
No comments:
Post a Comment