రాష్ట్ర పెద్దల ఆదేశాలే కారణం
లోగుట్టు బయట పెట్టిన సచివాలయ ఉన్నతాధికార వర్గాలు
రాష్ట్రపతి అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్‌కు అవమానం
అపాయింట్‌మెంట్ తీసుకున్నా అనుమతించని అధికారులు
కాసేపాగి రావాలంటూ పంపి.. తర్వాత వీలే కాదన్న వైనం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిళ్ల వల్లే అడ్డుకున్నారు: సంగ్మా
జగన్‌ను ఒవైసీ కలిస్తే లేని అభ్యంతరం ఇప్పుడెందుకంటూ ప్రశ్న
సర్కారుది కక్షసాధింపు ధోరణే: వైఎస్సార్‌సీపీ
హైదరాబాద్, న్యూస్‌లైన్:చంచల్‌గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖుల ములాఖత్ విషయంలోనూ ప్రభుత్వం ఫక్తు వేధింపు కోణాన్నే ప్రదర్శిస్తోంది. జగన్ జాతీయ స్థాయి నేతగా ఎదుగుతున్న నేపథ్యంలో.. కొందరు ముఖ్యులను ఆయనతో ములాఖత్‌కు అనుమతించవద్దని ప్రభుత్వ పెద్దలు జైలు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మాను కూడా తాజాగా జగన్‌ను కలవనివ్వకుండా అడ్డుకున్నారు. సోమవారం జగన్‌ను కలిసేందుకు ముందస్తు అపాయింట్‌మెంట్‌తో వచ్చినా, ఆయనను జైలు ప్రధాన ద్వారం నుంచే వెనక్కు తిప్పి పంపారు. మూడు దశాబ్దాలకు పైగా ఎంపీగా కొనసాగి, లోక్‌సభ స్పీకర్‌గా కూడా పని చేసిన ప్రముఖుని పట్ల ఈ విషయంలో ప్రభుత్వం కాస్త ఔదార్యం కూడా కనబరచలేదు. ఒక పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అయిన నేతతో ములాఖత్‌ను నిర్దయగా అడ్డుకుంది. దర్యాప్తు సాకుతో జగన్ విషయంలో తొలి నుంచీ కక్షసాధింపు ధోరణినే అనుసరిస్తున్న సర్కారు, చివరికి ఇలాంటి విషయాన్ని కూడా ఫక్తు రాజకీయ కోణం నుంచే చూసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబట్టారు. సంగ్మా కూడా దీన్ని అవమానంగా భావించారు. ‘కాసేపటి తర్వాత రావాలని జైలు అధికారులు ముందుగా చెప్పారు. వారు చెప్పిన సమయానికి నేను తిరిగి జైలుకు బయల్దేరాక ఫోన్ చేసి, మీది రాజకీయ కలయిక గనుక అసలు ములాఖతే వీలు పడదన్నారు’ అని ఆయన తెలిపారు. జైలర్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఈ మేరకు ఆదేశాలిచ్చినట్టు స్పష్టంగా కనబడుతోందనన్నారు. సంగ్మాను అనుమతించకపోవడానికి చంచల్‌గూడ జైలు అధికారులు అధికారికంగా ఏ కారణమూ చెప్పలేదు. జగన్ ఆ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో ఉండటం వల్లే అనుమతించలేదని అనధికారికంగా చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే సంగ్మా ములాఖత్‌ను అడ్డుకున్నారని పేరు చెప్పేందుకు ఇష్టపడని సచివాలయ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరడానికి సంగ్మా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. జగన్‌ను కలుసుకోవడానికి తన కుమారుడు, శాసనసభ్యుడు జేమ్స్ సంగ్మాతో కలిసి సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలు వద్దకు వచ్చారు. ఎలాగూ అనుమతి కోరామన్న ఉద్దేశంతో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జైలు వద్దకు చేరుకున్నారు. జగన్‌ను కలిసేందుకు జైలు అధికారులను ములాఖత్ కోరారు. ఒక కానిస్టేబుల్ ఆ సమాచారాన్ని జైలు సూపరింటెండెంట్‌కు చేరవేశారు. కాసేపటికి బయటకు వచ్చి.. ఇప్పుడు వీలు కాదని, 11 గంటల తర్వాత రావాలని సంగ్మాకు సూచించారు. చేసేది లేక మళ్లీ వస్తానంటూ మీడియాతో చెప్పి సంగ్మా వెనుదిరిగారు. సంగ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌మోహన్‌రెడ్డిని కలవకుండా చూడాలంటూ అత్యున్నత స్థాయి నుంచి జైళ్ల శాఖ అధికారులకు ఒత్తిళ్లు వచ్చినట్టు తెలిసింది. తర్వాత రావాలని ఆయనకు చెప్పినప్పటికీ, ఆ ఒత్తిళ్ల వల్లే ములాఖత్‌ను రద్దు చేసినట్టు చెబుతున్నారు. 11 గంటల సమయంలో రెండోసారి చంచల్‌గూడ జైలుకు బయల్దేరిన సంగ్మాకు జైళ్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు స్వయంగా ఫోన్ చేసి, ‘ఈ రోజు ములాఖత్ సాధ్యం కాదు’ అని స్పష్టం చేసినట్టు తెలిసింది. దాంతో ఆయన ఆశ్చర్యపోయారు. ముందుగానే అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పటికీ ములాఖత్‌కు నిరాకరించడం పట్ల విస్మయం చెందారు. జైలు దాకా రాకుండానే వెనుదిరిగారు.
నాకు బాధ కలిగించింది: సంగ్మా
జగన్‌ను కలుసుకోనివ్వకుండా జైలు అధికారులు వ్యవహరించిన తీరు తనకు బాధ కలిగించిందంటూ సంగ్మా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సోమవారం ఉదయం 9-9.30 మధ్య రావాలని ముందుగా వారు నాకు చెప్పారు. నేను 10.15కు వెళ్లాను. ఒక జూనియర్ జైలు అధికారి బయటికొచ్చి, జైలర్ ఇంకా రాలేదని చెప్పారు. 11 నుంచి 12 గంటల మధ్య వస్తే బాగుంటుందని చెప్పారు. సరేనని వారు చెప్పిన సమయానికి మళ్లీ బయల్దేరాను. దాదాపు జైలుకు సమీపానికి చేరుకున్న సమయంలో ములాఖత్ రద్దయిందని సమాచారమిచ్చారు’’ అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చిన వల్లే జగన్‌తో జైలు అధికారులు ఇలా వ్యవహరించి ఉండొచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జగన్‌ను కలుసుకోనీయవద్దని జైలర్‌కు ఆదేశాలిచ్చినట్టు స్పష్టంగా కనబడుతోందన్నారు. ‘‘నేను ఒక ఎమ్మెల్యేను. రిమాండ్ ఖైదీగా ఉన్న లోక్‌సభ సభ్యుడిని కలవడానికి అభ్యంతరమేమిటి? ఉప ఎన్నికల్లో విజయం సాధించినందుకు జగన్‌కు అభినందనలు తెలపాలనే ఉద్దేశంతో వారం క్రితమే నా కుమారుడు అధికారులను అడిగి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. కానీ మాది రాజకీయ కలయిక కనుక జగన్‌ను కలవడానికి అనుమతించబోమని అధికారులు చెప్పారు. మరి.. కొద్ది రోజుల కిందట మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇదే జైలులో జగన్‌ను కలుసుకున్నారు. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీకి మద్దతివ్వాల్సిందిగా ఆయనను కోరారు. జగన్ వద్దకు ఒవైసీని అనుమతించినప్పుడు నన్నెందుకు వెళ్లనీయరు? ఒవైసీ ఈ దేశ పౌరుడే, నేనూ ఈ దేశ పౌరుడినే. 31 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన నాపై ఈ విధమైన వివక్ష ఎందుకు’’ అంటూ సంగ్మా నిలదీశారు.
అధికార దుర్వినియోగానికి పరాకాష్ట: మైసూరా
జగన్‌ను జైల్లో కలిసేందుకు సంగ్మాను అనుమతించకపోవడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి ఘాటుగా విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ ఒక పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు. ఆయనను కలవటానికి ఉన్న అభ్యంతరమేమిటో తెలియడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ జగన్ కేసుల దర్యాప్తులో రిమోట్ కంట్రోల్ ద్వారా జోక్యం చేసుకుంటున్నాయనటానికి ఇది మరో నిదర్శనం’’ అంటూ ధ్వజమెత్తారు.
No comments:
Post a Comment